
నేపాల్ యువత చేపట్టిన భారీ నిరసనల నడుమ దేశ ప్రధాని కేపీ ఓలి రాజీనామా చేశారు. ఆ తర్వాత నెలకొన్న సంక్షోభానికి మూలమైన వాస్తవ పరిస్థితులను అతిగా సాధారణీకరించి, తప్పుగా చూపించే అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
సెప్టెంబర్ మొదట్లో నేపాల్‌లో సంక్షోభం తీవ్ర రూపం దాల్చి, మధ్యేవాద ప్రభుత్వం కూలిపోయింది. సెప్టెంబర్ 4న సోషల్ మీడియాను నియంత్రించడం, నిషేధించడం దీనికి ప్రత్యక్ష కారణం. ఇందుకుగాను నిరసనలు వ్యక్తం చేసిన ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. ఆ తర్వాత నిరసనలు మరింత బలంగా పెరిగి, రాజకీయ నాయకుల ఇళ్లపై, జాతీయ పార్లమెంట్ భవనంపై, అలాగే అధ్యక్ష భవనంపై దాడులు జరిగాయి.
ప్రస్తుత పరిస్థితి గురించి అనేక కథనాలు వినిపిస్తున్నా, రెండు ప్రధాన అభిప్రాయాలు ఉన్నాయి.
వ్యవస్థాపరమైన పాలనా వైఫల్యం: అనేక సంవత్సరాలుగా నెరవేరని హామీలు, అవినీతి, అవకాశవాద రాజకీయ కూటములు కలిసి వ్యవస్థ మొత్తం మీద ఒక చట్టబద్ధతా సంక్షోభాన్ని సృష్టించాయి. ఈ రోజు జరుగుతున్న తిరుగుబాటును ప్రజల అసంతృప్తి, వారి పట్ల కనబరచిన నిర్లక్ష్యానికి ప్రతిస్పందనగా అర్థం చేసుకోవాలి.
‘కలర్ రివల్యూషన్’ సిద్ధాంతం: ఈ నిరసనలను విదేశీ శక్తులు ప్రేరేపించాయి. ముఖ్యంగా అమెరికా, అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ‘నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ద్వారా 2015లో స్థాపించిన ‘హమీ నేపాల్’కు నిధులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ రెండు సిద్ధాంతాలు నేపాల్‌లోని రాజకీయ వర్గాలకు తమ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి సులువైన మార్గాన్ని ఏర్పరుస్తాయి– ఒకవేళ విదేశీ జోక్యాన్ని నిందించడం ద్వారా కానీ లేదా అస్పష్టమైన ‘రాజకీయ వర్గం’ అని చెప్పడం ద్వారా కానీ ఈ సిద్ధాంతాలు నేపాల్‌లోని వాస్తవ సమస్యలను(శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆధిపత్య ఆర్థిక వ్యవస్థను, భూమి, ఆర్థిక వనరులు, ప్రభుత్వ ఒప్పందాలు రాజ వంశానికి దగ్గరగా ఉన్న కొద్దిమంది చేతుల్లో ఉండటం, అలాగే వలస కూలీల ఎగుమతులు- ఐఎంఎఫ్ అప్పుపై ఆధారపడి నడిచే అభివృద్ధి నమూనాను) చర్చలోకి తీసుకు రావు. ప్రజల అసంతృప్తికి మూలమైన ఈ నిర్మాణ సమస్యలను ‘అవినీతి’, ‘కలర్ రివల్యూషన్’ అనే సులభమైన పదాలుగా మార్చి చూపిస్తారు.

ఈ సిద్ధాంతాలు పూర్తిగా సరైనవీ కావు, తప్పుడువీ కావు(అవి పాక్షికమైనవి. కానీ అవి తప్పుదారి పట్టించేలా ఉంటాయి). ఈ వ్యాసం ఆ అసమగ్రతను పూర్తిగా సరిచేయలేకపోయినా, కొన్ని ఆలోచనలను చర్చ కోసం మీ ముందుంచుతుంది. కింద ప్రస్తావించే ఐదు ప్రతిపాదనలు నేపాల్‌లో మాత్రమే కాకుండా, గ్లోబల్ సౌత్‌లోని అనేక దేశాల భవిష్యత్తుపై చర్చకు ఒక పునాది వేసేందుకు ఉపకరిస్తాయి.
అంచనా 1: అవకాశాన్ని వృథా చేసుకోవడం..
2015లో నేపాల్ కొత్త రాజ్యాంగాన్ని అమలు చేసిన తర్వాత, వామపక్షం ఆధ్వర్యంలో ప్రజల సామాజిక పరిస్థితులు మెరుగు పడతాయని భారీగా ఆశలు పెంచుకున్నారు. అందుకే 2017లో వివిధ కమ్యూనిస్టు పార్టీలు జాతీయ పార్లమెంట్లో 75 శాతం స్థానాలు గెలిచాయి. తర్వాతి సంవత్సరం, ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు కలిసి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశాయి. అయితే, ఈ ఐక్యతలోతైనది కాదు. ఎందుకంటే ప్రతి పార్టీకి తాము అనుసరించే ప్రత్యేక నిర్మాణాలు, కార్యక్రమాలు ఉండటంతో, నిజమైన ఏకీకృత పార్టీగా మారలేకపోయాయి. అది కేవలం ఎన్నికల కూటమిగా మాత్రమే మిగిలింది.
2021లో ఏకీకృత పార్టీ చీలిపోయింది. ఆ తర్వాత, వివిధ వామపక్ష పార్టీలు వరుసగా అధికారంలోకి వచ్చాయి. కానీ ప్రజలు దానిని అవకాశవాదంగా భావించారు. 2023-2024లో మావోయిస్టు సెంటర్‌కు చెందిన హోంమంత్రి నారాయణ కాజీ శ్రేష్ట, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తన సొంత పార్టీలోని అవినీతి కేసులను విచారించడానికి ప్రయత్నించగా, ఆయనను పదవి నుంచి తప్పించారు. కేపీ ఓలి నాయకత్వం లోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(యునైటెడ్ మార్క్సిస్టు లెనినిస్టు) ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు పార్టీతో తెగతెంపులు చేసుకుని నేపాల్ కాంగ్రెస్ పార్టీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సంకీర్ణ ప్రభుత్వమే కుప్పకూలిపోయింది.
1951 విప్లవంతో ప్రారంభమైన ప్రజాస్వామ్య పోరాటం, 1990 జనాందోళనతో మరింత బలపడింది. 2006లో లోక్తంత్ర ఆందోళనతో స్థిరపడినట్లు అనిపించింది. కానీ ఇప్పుడు అది పరాజయం పాలైనట్లు కనిపిస్తోంది. అయితే, వాస్తవానికి ఆ దీర్ఘకాల పోరాటం మరో రూపంలో పునరావృతం అవుతున్నది.
అంచనా 2: ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం
2015లో నేపాల్ కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించినప్పుడు, దేశం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోంది. గోర్ఖా ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం వల్ల పది వేల మందికి పైగా మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కనీసం నాలుగో వంతు నేపాలీలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. కులం, జాతి వివక్ష సమాజంలో తీవ్ర నిరాశను కలిగించింది.
ప్రత్యేకంగా అసమానతలతో బాధపడుతున్న మధేశ్ ప్రాంత ప్రజలు… 2015 రాజ్యాంగం తమను మరింత మూలకు నెట్టివేసిందని భావించారు. బలహీనంగా వున్న ప్రభుత్వ ఆరోగ్య, విద్యా వ్యవస్థలు కొత్త మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చలేక పోయాయి. వామపక్ష ప్రభుత్వాలు ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు కొన్ని విధానాలను తీసుకువచ్చాయి. వాటి ఫలితంగా, పేదరికం నుంచి అనేక వర్గాలు బయటపడ్డాయి. విద్యుత్ అందుబాటు 99 శాతానికి చేరింది. మానవాభివృద్ధి సూచికలో మెరుగుదల కనిపించింది.
అయినా, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, వాస్తవ పరిస్థితుల మధ్య భారీ అంతరం ఏర్పడింది. అసమానతలు తగ్గలేదు. వలసలు ఆందోళనకరంగా పెరిగాయి. అవినీతి స్థాయిలు అధికంగానే ఉన్నాయి (2024లో అవినీతి అవగాహన సూచికలో 107వ స్థానంలో వుంది). ఐఎమ్ఎఫ్ ఒప్పందాల కారణంగా ప్రభుత్వ ఆర్థిక స్వేచ్ఛ మరింత తగ్గింది.
అంచనా 3: హిందూ రాజరికానికి తిరిగి మళ్ళాలనే ఆకాంక్ష..
ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తమ పిల్లలను చదివించే, వెనుకబడిన కులాల పెటీ బూర్జువా వర్గం, ఉన్నత కులాల ఆధిపత్యంతో విసిగిపోయింది. వీరు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ హిందుత్వ రాజకీయాల నుంచి ప్రేరణ పొందారు. అందుకే, నిరసనల్లో యోగి ఆదిత్యనాథ్ ఫొటోలతో పోస్టర్లు కన్పించాయి.
ఈ వర్గం మళ్లీ రాజరికానికి, హిందూ రాజ్యానికి తిరిగి వెళ్లాలని కోరుకుంటోంది. ఆర్పీపీ, శివసేన నేపాల్, విశ్వ హిందూ మహాసభ వంటి శక్తులు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. 1990ల నుండి హెచ్ఎస్ఎస్(హిందూ స్వయంసేవక్ సంఘ్) నేపాల్‌లో నిశ్శబ్దంగా తన శక్తిని పెంచుకుంది.
ఇవన్నీ కలిసి, లౌకిక విధానాలకు వ్యతిరేకంగా, హిందూ రాజ్య పునరుద్ధరణ కోసం ఉద్యమిస్తున్నాయి. అవినీతి వ్యతిరేకత, దాతృత్వమనే డొల్ల వాదనలతో ఇవి అణగారిన కులాల వారికి చేరువ అవుతున్నాయి.
యువత బలహీనంగా ఉన్న సమయంలో, ఈ బలమైన శక్తులు హిందూ రాజ్యం పేరుతో అధికారాన్ని స్వాధీనం చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
అంచనా 4: వలసలు పోవాల్సి రావడంపై విసుగు..
ఉద్యోగాల కోసం అత్యధికంగా వలస వెళ్తున్న దేశాల్లో నేపాల్ ఒకటి. ప్రస్తుతం 5,34,500 మంది విదేశాల్లో పని చేస్తున్నారు. 2000 సంవత్సరంలో వలస వెళ్లేవారు 55,000 మాత్రమే ఉండగా, ఇప్పుడు పది రెట్లు పెరిగారు. 2022-23లో 7,71,327 అనుమతులు జారీ అయ్యాయి.
యువతకు దేశంలో ఉద్యోగాలు దొరకక, అమానుషమైన పనుల కోసం సైతం విదేశాలకు వెళ్ళాల్సి వస్తోంది. 2025లో దక్షిణ కొరియాలో తుల్సీ పున్ మాగర్ ఆత్మహత్య ప్రజలలో ఆగ్రహాన్ని రేపింది. గత ఐదేళ్లలో అక్కడ 85 మంది నేపాలీలు మరణించగా, వారిలో సగం మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ తరహా ఘటనలు ప్రభుత్వంపై అసహనాన్ని పెంచాయి. ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారుల పట్ల చూపుతున్న శ్రద్ధ, వలస కూలీల పట్ల చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి, వలస కూలీలు పంపే డబ్బు దేశానికి వచ్చే ఏ విదేశీ పెట్టుబడి కంటే కూడా ఎక్కువే వుంటుంది.
అంచనా 5: అమెరికా, భారతదేశ ప్రభావాలు..
కేపీ ఓలి ప్రభుత్వం అమెరికాతో దగ్గరగా వ్యవహరిస్తూ వచ్చింది. నేపాల్ 2017లో అమెరికా ప్రభుత్వ మిలీనియమ్ చాలెంజ్ కార్పొరేషన్ (ఎమ్‌సీసీ)లో చేరింది. ఒత్తిడి కారణంగా నేపాల్ ప్రభుత్వం దీనికి కొంత కాలం దూరంగా ఉన్నప్పటికీ, 2025లో అమెరికా సహాయం పునఃప్రారంభమై, మౌలిక వసతులపై చర్చలు జరిగాయి.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నేపాల్‌లో హిందూ జాతీయవాద పార్టీకి బలం చేకూర్చడానికి ప్రయత్నించింది. 2025 నిరసనల్లో బాహ్య ప్రభావం ఉందంటే, అది అమెరికా కంటే భారతదేశం తరఫు నుండే జరిగే అవకాశం ఎక్కువ. ఆర్పీపీ కార్యాలయాలు దాడికి గురికాలేదు. కానీ, కమ్యూనిస్టు కార్యాలయంపై దాడి జరిగింది. ఇది సెప్టెంబర్ పరిణామాలకు సంకేతం.
సైన్యం కొంత మేరకు శాంతిని పునరుద్ధరించినా, అది అశాంతితో కూడిన శాంతి మాత్రమే. తర్వాత ఏం జరుగుతుందోననే అనిశ్చితి ఉంది. (వ్యాసం రాసే సమయానికి) తాత్కాలిక నాయకులుగా బలేంద్ర షా, సుశీలా కర్కీ పేర్లు వినిపిస్తున్నాయి(వ్యాసం ది వైర్లో ప్రచురితమైయ్యే నాటికి సుశీలా కర్కి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు). కానీ ఇవి ప్రజాస్వామ్యంపై నిరాశ పెంచే తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. కొత్త ప్రధానమంత్రి రావడం నేపాల్ సమస్యలను పరిష్కరించదు.
‘పీపుల్స్ డిస్పాచ్’ సౌజన్యంతో ప్రజాశక్తిలో ప్రచురితమైన వ్యాసాన్ని ది వైర్ పాఠకుల కోసం అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.