తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ సారి ఎన్నికల్లపై మరింత దృష్టి పడేలా బీసీ రిజర్వేషన్ల అంశం చేసింది. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు ప్రజాప్రాతినిధ్యం ఉండాలనేది భారత రాజ్యాంగ నిర్దేశనం. దీంతో విస్మరణకు గురైన సామాజిక వర్గాల వారూ గ్రామ సర్పంచ్‌లుగా ఎన్నికవుతున్నారు. కొంతమంది వార్డు సభ్యులుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ సభ్యులుగా, ఛైర్మన్లుగా ఎన్నుకోబడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎన్నికల కోలాహలంలో కొట్టుకుపోతున్న మరి కొన్ని విషయలూ ఉన్నాయి. వీటి గురించి చాలా లోతుగా పరిశీలిన చేయాల్సిన అవసరం, అనివార్యత ఎంతైనా ఉంది.
ప్రస్తుత రోజుల్లో భారతదేశంలో ప్రతీ ఎన్నిక చాలా ఖరీదైన వ్యవహరంగా మారిపోతోంది. దేశవిదేశాల్లో వివిధ రకాల వ్యాపారాలు చేసుకునే వారు ఎన్నికల్లో పోటీపడటం ప్రారంభమైన తర్వాత పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి.
గ్రామ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కొన్ని గ్రామాల్లో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకీ ఖర్చు? ఏం సాధించాలని ఇట్లా పందేరాలు ఆడుతున్నారు? కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కూడా అవుతున్నాయి. మరి కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవిని వేలం వేస్తున్నారు. ఇదంతా ప్రజాస్వామ్య స్ఫూర్తేనా? ఇలాంటి చర్యలు రాజ్యాంగ బద్ధమేనా? తర్కించుకోవాల్సిన తరుణం ఇదే.
శిబిరాలుగా కాసులతో బహిరంగ జూదం..
అంతా బహిరంగంగానే జరుగుతూ ఉంటుంది. ఎవరూ ఏమీ అనరు. కొన్ని ప్రాంతాల్లో డబ్బులు తమకు ఇవ్వలేదని ప్రజలు ధర్నాలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటివి మీడియాలో ఆఫ్‌బీట్ వార్తలుగా ఓ రెండు బులిటెన్లకు పరిమితమవుతున్నాయి.
చాలా సున్నీతమైన విషయంపై వేదన చెందాల్సిన సమాజం దాని గురించి పట్టింపు లేనట్లుగా, చూసీచూడనట్లుగా, చూసినా తమకు సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఎన్నికల కమిషన్ ఇలాంటి వాటి గురించి క్షేత్రస్థాయి చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. కార్యోన్ముఖంగా కదలాలి. ఇవేవీ జరుగడం లేదని చాలా మంది అభిప్రాయం.
ఇంతకు పూర్వం, గ్రామాల్లో కొన్ని సామాజిక వర్గాల వారిదే పెత్తనం. వారు చెప్పినట్టుగా ప్రజలు ఓట్లు వేసే వారు. లేదంటే ఏకగ్రీవమని తేల్చేసేవారు. భూస్వామి, పట్వారి లేదా ప్రాభల్యమున్న వారి చేతిలో ఈ తతంగమంతా నడిచేది. ఇప్పుడు మరో రూపంలో పెద్ద కులం వారి పెత్తనాలే నడుస్తున్నాయి. అందులో కాసుల రూపంలో మరింత బలపడ్డాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.
రాబోయో రోజుల్లో ఎమ్మేల్యే కావాలని భావించే కోటీశ్వరులు ముందుగానే గ్రామాలపై పట్టు సాధించేందుకు ఇలాంటి ఎన్నికలను తొలి మెట్టుగా చేసుకుంటున్నారు. నియోజకవర్గ ఓటర్లకు దగ్గరవుతున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్ లేదా జిల్లా పరిషత్ సభ్యులకయ్యే ఎన్నికల ఖర్చును వారే భరిస్తున్నారు. ఇట్లా రెండు, మూడు శిబిరాలుగా పోటీ ఉంటుంది. అన్ని శిబిరాలను కాసులతో ఆదుకొని, కష్టకాలం నుంచి గట్టెక్కించేందుకు సదరు పెద్ద సామాజిక వర్గ పెద్దలే అండగా ఉంటూ- ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయిస్తుంటారనేది చాలా మంది అభిప్రాయం.
గ్రామ స్థాయిలో కులాల వారిగా ఓటర్లను ప్రభావితం చేయడంలో కుల సంఘాలు చాలా బీజీగా ఉంటాయి. అంతేకాదు కుల సంఘాల నాయకుల పాత్రా గణనీయంగానే ఉంటుంది.
“ఫలనా గ్రామంలో ఫలనా వ్యక్తి మద్దతు వల్ల ఫలానా వ్యక్తి సర్పంచ్ అయ్యాడు” అనే మాటలను చాలా తరచుగా వింటూ ఉంటాం. అంటే ఇప్పటికీ గ్రామాల్లో కొన్ని సామాజిక వర్గాల వారిదే పెత్తనం నడుస్తోందనే విషయం చాలా సులభంగా అర్థమవుతుంది.
కొందరు ఎవరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తున్న వారూ ఉన్నారు. వారు అప్పులు చేసి మరీ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు.
పేరు, పలుకుబడిలాంటి విషయాలు బహుషా బాగా ప్రభావితం చేయడం వల్లనే ఇట్లా జరుగుతుందేమో పరిశోధన చేయాలి.
కొంతమంది కొంత మెరుగైన జీవితం అనుభవిస్తూ ఉండి, ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల పేదరికంలోకి పోయిన వారూ ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవితం వెళ్లదీస్తున్న వారూ ఉన్నారు. అప్పులపాలైన జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీల గురించిన వార్తలు మీడియాలో వస్తూ ఉంటాయి. వీరంతాకూడా బహుజన వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో తాము చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర వేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన ఆనందం వారికి కొద్ది నెలలు కూడా ఉండటం లేదు.
ప్రభుత్వాలు గ్రామ పంచాయితీలకు ఇస్తున్న నిధుల గురించి ఎంత వక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎన్నో ఆశలతో గెలిచిన వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చేసిన అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేస్తున్న వారూ ఉన్నారు.
పెద్దల అండదండలున్నవారు, ఆర్థికంగా స్థితిమంతులైన వారు అప్పులైనా భరించి ముందుకు సాగే అవకాశం ఉంటుంది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి చెప్పాల్సిన పని లేదు. కొందరు మితిమీరిన ఖర్చులను అలవాటు చేయడం వలన అర్హులైన వారు, నిజాయితీగా ప్రజలకు సేవ చేద్దామని భావించే వారికి ఈ ఎన్నికలు పెనుభారంగా మారుతున్నాయి.
కేవలం సర్పంచ్ ఎన్నికలు మాత్రమేకాదు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీసం డబుల్ డిజిట్ కోట్లు ఖర్చు పెట్టందే గెలవడం కష్టమనే మాటలు చాలా తరచుగా వింటూ ఉంటాం.
గ్రామాలకు ప్రభుత్వాలు విడుదల చేసే నిధుల శాతం చాలా తక్కువ.
కొన్ని చిన్న గ్రామ పంచాయతీలుంటాయి. అలాంటి వాటికి కూడా లక్షల్లో అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. ఇది మరో రూపంలో అధికారం కొందరి చేతుల్లో కేంద్రీకృతం చేసే వ్యూహామా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.
పెళ్లిళ్లలో ఆడంబరాలకు పోయి చాలా మంది అప్పులు పాలవుతున్నారనేది అందరి అనుభవంలో ఉన్నదే. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి అవాంఛనీయ ఖర్చులను గ్రామస్తులే కట్టడి చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో మద్యాన్ని నిషేధించుకున్నారు. అట్లాగే ఎన్నికల్లో కూడా ఆవాంచనీయ ఖర్చులను కట్టడి చేయాల్సిందే. నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే వారికి సామాజిక వర్గాలకు అతీతంగా అవకాశం రావాల్సిందే.
ముఖ్యంగా బీసీలకు ఈ సారి రిజర్వేషన్లు అమలు చేస్తామని అంటున్నారు. కాబట్టి అనివార్య ఖర్చులను బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులు అప్పుల పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఈ విషయాలపై దృష్టి పెట్టాలనేది జనసమూహాపు మూకుమ్మడి మాటగా గుర్తిస్తే మంచిది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
