గడిచిన కొద్ది కాలంగా కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై పదేపదే మాట్లాడుతున్నారు. దీనిపై అధికార పార్టీ నేటి వరకు సాధికారిక సమాధానమివ్వడం లేదనే భావన చాలా మందిలో ఉంది. జాతీయ ఎన్నికల కమిషన్ స్పందనపైన దేశ ప్రజలు ఆశ్చర్యాన్ని, ఇట్ల స్పందిస్తారానే భావాన్ని వ్యక్తం చేసినట్టుగా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇటీవలనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కార్ణాటకలోనూ ఓట్ల చోరీ జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. అనంతరం, దాని కొనసాగింపు వ్యాఖ్యలు లేవు. రాహుల్ గాంధీ ఆరోపణలు లేదా విమర్శలనే అంశాల గురించి తమదైన శైలిలో బీజేపీ నాయకులు, వారి అభిమానులు స్పందించలేకపోయారు. ఇప్పుడు మరోసారి బీహార్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఓట్లచోరి గురించి సంచలనాత్మక విషయాలు చెప్పారు.
ఇండియాలో కటక ఒత్తితే బ్రెజిల్లో వెలుగు..
హర్యానాలో భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఈ అంశంపైనే మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రెజిల్‌కు చెందిన మోడల్ ఫొటోతో 22 ఓట్లు సృష్టించినా ఈసీకి సోయి లేదాని రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు.
దీనిపై ఎన్నికల కమిషన్ కంటే ముందే బ్రెజిల్ మోడల్ లారిస్సా నెరీ స్పందించారు. భారతరాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధంలేదని వీడియో ద్వారా చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాను బ్రెజిల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్నని ఆ వీడియోలో ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో తాను వైరల్ అయ్యానని కూడా అన్నారు. చాలా మంది ఇంటర్వ్యూలో తనను అడుతున్నారని ఆమె చెప్పారు.
నిజానిజాల సంగతి తేల్చాల్సిన ఎన్నికల కమిషన్..
బీహార్ ఓటింగ్‌కు కొద్దిగంటల ముందు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించాయి. గత ఏడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓటర్లను సృష్టించారని కూడా ఆయన అన్నారు. భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఇంతకు ముందెన్నడూ లేని సరికొత్త వివాదం, ఆందోళన, ఆవేదన కలిగించే అంశం ఇప్పుడు ఓటర్ల ముందుకు వచ్చింది.
1952 నుంచి 2018 సాధారణ ఎన్నికల వరకు ఇలాంటి స్టేట్మెంట్లు ఏ విపక్షనాయకుడు ఇవ్వలేదు. ఏ అధికారపక్షమూ ఎదుర్కోలేదు. భారత ఎన్నికల నిర్వహణ తీరుపై సవాలక్ష సందేహాలకు తావిస్తున్నది ఈ చర్చ.
ప్రతీ సందర్భంలో రాహుల్ గాంధీపైన కాంగ్రెస్‌పైన విరుచుకుపడే బీజేపీ ముఖ్య నేతలు కూడా పెద్దగా స్పందిస్తున్నటుగా మీడియాలో వార్తలు లేవు. ఎన్నికల సందర్భంలో రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తే తమకు ఇబ్బందని భావించారో? లేకపోతే కాస్తాగి సమాధానం చెప్దామనుకున్నారో తెలియదు.
ఈ విషయంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలపట్ల ప్రజల్లో తాను చెప్పింది సరైందేనని ఆలోచన వచ్చేందుకు ఆస్కారం లేకపోలేదు. దీనిపై ఇప్పటికైనా ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరమున్నది. అంతకంటే అధికార పార్టీ అధినాయకత్వం స్పందించాల్సిన అనివార్యతా ఉన్నది. ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన చారిత్రాత్మక ఆవిష్యకత కూడా ఈ ప్రభుత్వం ముందున్నది.
వాచకంలో, హావాభావాలలో రాహుల్ గాంధి దిట్టకాకపోవచ్చు. కానీ ఆయన లేవనెత్తిన సందేహం సంచలనాత్మకమైనది. ప్రజాస్వామ్యవ్యవస్థ మరింత బలపడి ముందుకు సాగాలంటే పారదర్శకత అత్యంత ప్రధానం, అనివార్యం కూడా. ఈ విషయం పెద్దలకు తెలియంది కాదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
