జర్నలిస్టు, ప్రగతిశీల సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ హత్య జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా విచారణ పూర్తి కాలేదు కానీ, ఈ కేసులో నిందితుడు మాత్రం రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.
న్యూఢిల్లీ: శ్రీకాంత్ పంగార్కర్- కర్ణాటకలో పది సంవత్సరాల క్రితం జరిగిన గౌరీ లంకేశ్ హత్య కేసులోని 17 మంది నిందితులలో ఒకరు; మహారాష్ట్రలోని జల్నా మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి అభ్యర్థిత్వమైతే వివాదాస్పదంగా మారిందో- తను 2,621 ఓట్లతో గెలిచాడు.
తన సమీప బీజేపీ అభ్యర్థిపై 144 ఓట్ల తేడాతో పంగార్కర్ విజయం సాధించాడు.
ఈ ఎన్నికల బరిలో, శ్రీకాంత్ పోటీ చేసిన వార్డు 13లో తన అభ్యర్థిని శివసేన నిలబెట్టలేదు.
ఈ నేపథ్యంలో, జల్నా ఎన్నికల్లో పంగార్కర్ విజయానికి తన పూర్వ పార్టీ శివసేన సహకరించినట్టు సమాచారం.
ఏదేమైనా ఎన్నికల సమయంలో, ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే పార్టీలో చేరట్లేదని మీడియా ఇంటర్వ్యూలో తను స్పష్టం చేశాడు.
జల్నా నుంచి సాధించిన విజయమంటే, జల్నా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో వార్డ్ 13-డీకి ప్రాతినిధ్యం వహిస్తూ కార్పొరేటర్‌గా(సభ్యునిగా) సేవలందిస్తాడు.
శివసేనతో పంగార్కర్‌కు ఉన్న పాత సంబంధం అందరికీ తెలిసిందే. 2001 నుంచి 2006 వరకు, అంటే ఆ పార్టీ రెండుగా చీలిపోవడానికి చాలా కాలం ముందే- ఆ పార్టీ తరఫున తను కార్పొరేటర్‌గా పనిచేశాడు. 2024లో షిండే నేతృత్వంలోని శివసేనలో తిరిగి చేరడానికి ప్రయత్నించాడు.
అయితే, 2017 సెప్టెంబర్ 5న తన ఇంటి బయట నిరాయుధురాలిగా ఉన్న గౌరీ లంకేష్‌ను కాల్చి చంపిన తీవ్రమైన హత్యారోపణపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవడంతో ఆ ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చింది.
తను సాధించిన ప్రస్తుత విజయంలో షిండే పార్టీ తరఫున ఎవరూ అభ్యర్థిని నిలబెట్టకపోవడం తోడ్పడిందని సమాచారం, దీని తర్వాత తన మద్దతుదారులతో కలిసి సంబరాలు చేసుకుంటూ కనిపించాడు.
గౌరీ లంకేష్ హత్య విచారణ
గౌరీ లంకేశ్ హత్య జరిగిన దాదాపు దశాబ్దం తర్వాత కూడా, పంగార్కర్(తనతోపాటు ఇతర నిందితులందరి)పై ఉన్న కేసు, హత్య జరిగిన కర్ణాటకలోని బెంగళూరులో ఇంకా విచారణ దశలోనే పెండింగ్‌లో ఉంది.
బైక్‌పై వచ్చిన వ్యక్తులు పట్టపగలు చేసిన ఈ హత్యను దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(ఎస్ఐటీ) ఏర్పాటు చేసింది. 2018లో హత్యకు ఉపయోగించిన వాహనాన్ని ఎస్ఐటీ స్వాధీనం చేసుకుంది. నేరం జరిగిన సమయంలో నిందితులు పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
లంకేష్ హత్య జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత, 2021 నవంబర్‌లో ఎస్ఐటీ మొదట 650 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసి, నిందితులపై అభియోగాలు మోపింది.
అయినప్పటికీ, నేటికీ కేసు తేలలేదు.
ఈ కేసు విచారణ కోసం బెంగళూరులోని సిటీ అండ్ సెషన్స్ కోర్టులో ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు.
నిందితులపై కర్ణాటక వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం(కేసీఓసీఏ), ఆయుధ చట్టంతో పాటు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్-302 కింద అభియోగాలు మోపారు.
ఈ కేసులోని అనుబంధ ఛార్జ్షీట్లు ప్రాసిక్యూషన్ పత్రాలను 9,000 పేజీలకు పైగా తీసుకువెళ్లాయి.
ఇందులో ‘సనాతన్ సంస్థ’ వంటి సంస్థల పేర్లను పేర్కొన్నారు. వీరి హిట్ లిస్టులో 26 మంది ‘మేధావులు’ ఉన్నారని, వారు ఈ గ్రూపుల ప్రణాళికాబద్ధమైన లక్ష్యాలని ఛార్జ్‌షీట్‌లో ఆరోపించారు.
2024 సెప్టెంబర్‌లో కర్ణాటక హైకోర్టు బెయిల్‌పై పంగార్కర్‌ను విడుదల చేసింది.
విచారణ ముగియకుండానే, 2018 నుంచి ఆరు సంవత్సరాలపాటు తను జైలులో ఉన్నాడనే కారణంతో బెయిల్ మంజూరు అయ్యింది.
అభియోగాలు మోపబడిన ఒక సంవత్సరం తర్వాత, 2022లో విచారణ ప్రారంభమైంది.
ఈ కేసులో 100 మందికి పైగా సాక్షుల వాదనలు ఇంకా వినాల్సి ఉందని స్వతంత్ర సంస్థలు పేర్కొన్నాయి.
విచారణ ప్రారంభమైనప్పటి నుంచి సాక్షుల వాదనలు వినిపిస్తున్నప్పటికీ, పురోగతి నెమ్మదిగా ఉంది.
ఒక్క కేసు మాత్రమే కాదు
పంగార్కర్ రెండు ప్రాథమిక ఆరోపణలపై పోలీస్-జ్యుడీషియల్ కస్టడీలో గడిపాడు.
ఒకటి హత్య, రెండోది ‘ఆయుధాల వ్యాపారం’. కర్ణాటక ఎస్ఐటీ విచారించిన సాక్షుల ప్రకారం, 2018లో పంగార్కర్ లంకేష్ హంతకులకు ఆయుధాలు సేకరించడానికి ఆర్థిక సహాయం అందించాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం వెల్లడయ్యే సమయానికి పంగార్కర్ ముంబైలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ముడి బాంబులు, మందుగుండు సామగ్రిని విక్రయించడం వంటి ఆరోపణలపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) 2018 ఆగస్టులో తనను అరెస్టు చేసింది.
తను ఎదుర్కొన్న అభియోగాలలో ఒకటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(యూఏపీఏ) కింద ఉంది. ఆయుధ అక్రమ రవాణా కేసులో, మహారాష్ట్ర హైకోర్టు పంగార్కర్తో పాటు మరో నలుగురు సహనిందితులకు 2024 ఆగస్టులో బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత తన కస్టడీ మహారాష్ట్ర పోలీసుల నుంచి కర్ణాటక ఎస్ఐటీకి బదిలీ అయింది.
మహారాష్ట్ర పోలీసుల నుంచి కర్ణాటక ఎస్ఐటీకి తన కస్టడీ మార్చబడిందని, 2024లో తనకు బెయిల్ మంజూరయ్యిందని దక్కన్ హెరాల్డ్ పేర్కొన్నది.
ఒకే ఆయుధంతో మరిన్ని హత్యలు..!
ముఖ్యంగా, లంకేష్‌ను కాల్చడానికి ఉపయోగించిన ఆయుధాన్నే ఇతర హత్యలలో కూడా ఉపయోగించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2015 ఆగస్టులో జరిగిన ప్రముఖ హేతువాది ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గి హత్య కూడా ఇందులో ఒకటి.
పంగార్కర్ ఆరు సంవత్సరాలు జైలులో గడిపినప్పటికీ, ప్రాసిక్యూషన్ విచారణను ముగించలేకపోయింది. అప్పటి నుంచి అనేక మంది న్యాయమూర్తులు ఈ కేసును విచారించారు.
ప్రతి సంవత్సరం గౌరీ లంకేష్ వర్ధంతి సందర్భంగా, ఆమె సోదరి కవిత- అనేక మంది ఇతరులు కేసు ఆలస్యం అవుతుండటంపై ఆవేదనను వ్యక్తం చేశారు.
సాక్షుల విచారణను వేగవంతం చేయాలని, వారం రోజుల పాటు నిరంతర విచారణ జరగాలని 2022 మేలో సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
లైవ్‌లా(హిందీ) కథనం ప్రకారం, 2022 మేలో సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఈ విధంగా పేర్కొన్నారు:
కేసుకు సంబంధించిన వాదోపవాదనలు విన్న తర్వాత- ఇరు పక్షాల అంగీకారంతో, ఒక నెలలో రోజువారీ ప్రాతిపదికన ఒక వారం పాటు విచారణ నిరంతరం జరుగుతుంది. పక్షాల సౌలభ్యం ప్రకారమే నిర్ణయించబడుతుంది. వారం రోజుల పాటు జరిగే విచారణలో విచారించబోయే సాక్షులకు సంబంధించిన విషయాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెమోరాండంగా దాఖలు చేయాల్సి ఉంటుంది.
కోర్టులో విచారణ కోసం సమర్పించిన సాక్షుల జాబితాలను తిరిగి పిలవరాదని- ఇది హై ప్రొఫైల్ లేదా సున్నితమైన కేసులలో సాధారణ సంఘటన- అంతేకాకుండా అలా చేయడం వల్ల జరిమానా విధించబడుతుందని న్యాయమూర్తి సూచించారు. ఆ సమయంలో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో లేదా బెంగళూరు జైలులో నిందితులందరూ ఉన్నారు. కొందరు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రోజువారీ విచారణలకు(2022 జూలై నుంచి) హాజరు కావాలని ఆదేశించారు.
బెంగుళూరు మిరర్ ప్రచురించిన కథనంలో, 2018 నుంచి లంకేష్ కేసును చేపట్టిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ బాలన్, “ఈ కేసులో నెలకు రెండు లేదా మూడు విచారణలు మాత్రమే జరుగుతుండటంతో, తీర్పు రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంద”ని పేర్కొన్నారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత జనవరి 16న, “ప్రజా న్యాయస్థానంలో నేను న్యాయాన్ని పొందాను. గౌరి లంకేష్ కేసు విచారణలో ఉంది. నేను అమాయకుడిని. నా మీద మోపబడిన ఆరోపణలు నిరూపించబడలేదు”అని పంగార్కర్ తెలియజేశారు.
ఈ కేసులో పోలీసులు మొత్తం 18 మంది నిందితులను గుర్తించగా, 17 మందిని అరెస్టు చేశారు. ఒకరు ఏళ్ల తరపడి పరారీలో ఉన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
