వీబీ-జీ రామ్ జీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిచాలనే ప్రతిపక్షాల డిమాండ్ మూజువాణి ఓటుతో తిరస్కరించబడింది. ఈ పరిణామం తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసి పార్లమెంటు బయట నిరసనకు దిగారు.
న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల ముగింపు వేళ, ప్రపంచంలోనే అతి పెద్ద హమీ పథకమైన– గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా వంద రోజుల పాటు పని కల్పించే మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని(ఎంజీఎన్ఆర్ఈజీఏ) పార్లమెంటు రద్దు చేసింది. దీని స్థానంలో వికసిత్భారత్- గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవిక మిషన్(గ్రామీణ)(వీబీ-జీ రామ్ జీ) బిల్లును రాజ్యసభ ఆమోదించింది. దీంతో యునైటెడ్ ప్రొగ్రేసివ్ అలయన్స్ శకం(యూపీఏ శకం)నాటి చట్టానికి డిసెంబర్ 19న ముగింపు పలికినట్టైంది.
డిసెంబర్ 18న సాయంత్రం 6.40కు మొదలైన చర్చ సుమారు ఆరు గంటల పాటు రాజ్యసభలో సుదీర్ఘంగా కొనసాగిన తర్వాత, రాత్రి 12.32 గంటలకు ప్రతిపక్ష గైర్హాజరులో బిల్లు ఆమోదించబడింది.
ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ మూజువాణి ఓటుతో పరాజయం పొందింది. దీంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. అయితే, వాకౌట్ కంటే ముందు ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి; కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగిస్తుండగా– ప్రతిపక్షాల నిరసన దృష్యాలను సంసద్ టీవీలో ప్రసారం చేయలేదు. సంసద్ టీవీ కెమెరా మొత్తం మంత్రిపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది.
రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత; పార్లమెంటు బయట ధర్నాకు దిగిన ప్రతిపక్ష పార్టీలు గాంధీని కించపర్చారంటూ పేర్కొన్నాయి.
అయితే, బిల్లును ఎందుకు ఆలస్యంగా రాజ్యసభలో చర్చకు పెట్టారన్న దానిపై; బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజీజు ఎలాంటి సమాధానం చెప్పలేదు. పైగా శీతాకాల సమావేశాల చివరి రెండు రోజుల ముందు ఇంత అత్యవసరంగా బిల్లును ఆమోదించాల్సిన దానికి కారణాలే చెప్పకుండా రిజీజు ప్రతిపక్షాల తీరును ఖండించారు.
“సాయంత్రం 6 గంటలకు మేము ప్రతిపక్షంతో మాట్లాడి, బిల్లు మీద చర్చించడానికి నాలుగు గంటలు కేటాయించాము. కాదు, 8 గంటలు కావాలని ప్రతిపక్షం కోరగా; దీనికి కూడా మేము అంగీకరించాము. తర్వాత ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే మాట్లాడటానికి 25 నిమిషాలు ఇవ్వాలని కోరగా దానికి కూడా మేము అంగీకరించాము. సభాపతి ఖర్గేకు 37 నిమిషాలు ఇచ్చారు. ఆ తర్వాత వారు పేపర్లను చించివేస్తూ, నినాదాలు చేస్తూ నానా హంగామా చేస్తూ తప్పుగా ప్రవర్తించారని” రిజీజు ఆరోపించారు.
“మనం చర్చకు సిద్దంగా ఉండాలని ప్రధాని మోడీ ప్రతిసారి చెప్తుంటారు. వాయువు కాలుష్యంపై వారి కాల్అటెన్షను లోక్‌సభ జాబితాలొ చేర్చడం జరిగింది. కానీ, వారి ప్రవర్తన వల్ల ముందడుగు పడలేదు. వారి ప్రవర్తన ఎలా ఉందంటే, వారిని ఆయా రాష్ట్రాలు ఎన్నుకున్నాయి. తమ ప్రతినిధులు తమ గొంతుకను వినిపించక పోగా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని– వీళ్లను ఎన్నుకున్న ఆయా రాష్ట్రాల ఓటర్లకు నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రతిపక్షాల చర్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను” అని అన్నారు.
దీనికంటే ముందు, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని చేసిన డిమాండ్‌ను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో లోక్‌సభ హోరెత్తింది. నిరసనలో భాగంగా పేపర్లను ప్రతిపక్ష సభ్యులు చించేశారు. బిల్లుపై ఓటింగ్ పెట్టాలని బిర్లా అనుకున్న కొద్ది నిమిషాల్లోనే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదించబడింది. దీని తర్వాత సభను ఒక్కరోజుకు వాయిదా వేశారు.
ఈ సందర్భగా చౌహన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య నియమాలను ప్రతిపక్షాలు పాటించకుండా అధికారాన్ని చేజెక్కించుకోవాలనే విధంగా నానా రచ్చ చేశాయని, పార్లమెంటరీ గౌరవ ప్రతిష్ట “ముక్కలు ముక్కలుగా నలిగిపోయేలా’‘చేశాయని ఆరోపించారు.
ఈ బిల్లుపై రాజ్యసభలో 5 గంటలకు చర్చను మొదలుపెట్టారు. చర్చ కోసం మొత్తం 8 గంటలు కేటాయించారు. ఎవరైనా సవరణలు అందచేయాలనుకుంటే సాయంత్రం 5.45 గంటలలోగా అందజేయాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సభ్యులకు తెలియజేశారు.
ఈ క్రమంలోనే సభలో చర్చకు కావల్సినంత సమయాన్ని సభాసలహా కమిటి(బీఏసీ) కేటాయించలేదంటూ ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాలను లేవనెత్తారు. బీఏసీతో సంప్రదించకుండానే “సాంప్రదాయంగా” గత బిల్లులపై చర్చను చేపట్టిన విషయాన్ని రాధాకృష్ణన్ గుర్తుచేశారు: యాదృచ్చికంగా దీంతోపాటు 2014 కంటే ముందు మూడు బిల్లులు(రెండు 2008లో; ఒకటి 2012) మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం నాలుగు బిల్లులపై చర్చ జరిగింది.
సుమారు ఆరు గంటల పాటు జరిగిన చర్చ సందర్భంగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అతిగా కేంద్రీకరణ, రాష్ట్రాలపై ఆర్ధిక భారం గురించి ప్రస్తావిస్తూ; ఉపాధిహమీ పథకానికి గతంలో కేంద్రం వాటా 90% ఉండేది, ప్రస్తుత చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు 40% వాటా కల్పిస్తుందని పేర్కొన్నారు.
పథకం హత్య, మహత్మా బిల్లును మర్చిపోయినవైనం
ఈ బిల్లు భూస్వామ్య మనస్థత్త్వం నుంచి రూపుదాల్చిందని “ఎంజీఎన్ఆర్ఈజీఏను హత్య చేశారు, మహత్మా బిల్లును మర్చిపోయార”ని తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)ఎంపీ డెరిక్ ఓబ్రియన్ అన్నారు.
“ఈ బిల్లుకు భూస్వామ్య మనస్థత్వం పునాది. ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే ఒక హక్కు; వారికి కావల్సింది ఎన్నికల ముందు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నారు. అయితే ఇది బహుమతి కాదు– రాష్ట్ర ఉపకారంపై కార్మికులు ఆధారపడిలేరు” అని ఆయన చెప్పారు.
“కేంద్రమే అన్ని నిర్ణయాలు చేస్తుంది, ఈ పథకానికి రాష్ట్రం బడ్జెట్ ఇచ్చి అమలు చేసినప్పటికీ నిర్ణయించే హక్కు రాష్ట్రానికిలేదు. ఇది భూస్వామ్య మనస్థత్త్వం”
ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, “స్వాతంత్రం తర్వాత ఎంజీఎన్ఆర్ఈజీఏ చాలా కీలకమైన చట్టం– పేదల కోసం రెట్టింపు ఆస్తులను సృష్టించడానికి ఉపయోగపడింది. ప్రస్తుత బిల్లు పేదలను తిరిగి బానిసలను చేయాలనుకుంటుంది. కేంద్రంలో వికేంద్రీకరణ ప్రభుత్వ స్థానంలో కేంద్రీకరణకు ప్రోత్సాహం కల్పిస్తుంది. ఇందులో భాగంగానే ఎక్కడ, ఏ పథకంపై, ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో నిర్ణయిస్తున్నారు” అని అన్నారు.
వ్యవసాయ సీజన్లో నాట్లు నాటడంవంటి ఇతర పనుల ఉంటాయని, అయినప్పటికీ 60 రోజులు కూడా పని కల్పించబోమన్న నిబంధనను తొలగించాలని, ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టం కింద డిమాండ్ మేరకు పని కల్పించడం జరిగిందని ఈ బిల్లులో అలాంటి ప్రస్థావన లేదని ఖర్గే నొక్కి చెప్పారు.
“అమలవుతున్న పథకాన్ని ఎలాంటి కారణం లేకుండా నిలిపివేస్తున్నారు. ఏమాత్రం ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం పని చేయడంలేదు. చట్టపరమైన బాధ్యత రాష్ట్రాలపై ఉంది, దానికి మీరు రాంరాం(బైబై) చెప్పాలనుకుంటున్నారు” అని ఖర్గే పేర్కొన్నారు.
బిల్లును వెంటనే ఉపసంహరించుకొని ఒక కమిటీకి పంపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయి సింగ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం “చారిత్రక తప్పిదం” చేస్తుందని హెచ్చరించారు.
“మీరు చారత్రక తప్పిదం చేయబోతున్నారు. నల్లచట్టం ఆమోదం పొందిన తర్వాత దేశంలోని రైతులు, కార్మికులు వీధుల్లోకి వస్తారు. వారి పొట్టపై, వారి వీపు మీద ప్రభుత్వం కత్తి పెట్టింది. జీ రామ్ జీ అని ఈ బిల్లును పిలుస్తున్నారు. ప్రభువు రాముని పేరు మీద ఇంకెన్ని తప్పిదాలను దాచుతారు?”అని నిలదీశారు.
ఉద్యమం నుంచి ఈ చట్టం పుట్టుకొచ్చిందని, ఎంజీఎన్ఆర్ఈజీఏ స్పూర్తి “ప్రతి ఒక్కరి చేతిలో పని, పనికి తగ్గట్టుగా విలువ”అనే నినాదంతో ఉపాధిహామీని కల్పించే అధికరణ 41కు చాలా దగ్గరగా ఈ చట్టం ఉందని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) ఎంపీ మనోజ్ కుమార్‌ఝా పేర్కొన్నారు.
“పేరు ఏదైనా ఉండొచ్చు. కానీ స్ఫూర్తి మాత్రం ఓడిపోకూడదు. ఇది రాచరిక వ్యవస్థ కాదు, ఆనాటి కాలం కూడా కాదు, ఒకరు సరే అని చెపితే దాన్ని దాన ధర్మంగా చూడటానికి. అన్నింటి మాదిరిగానే ఈ చట్టం కూడా సంప్రదింపుల దారులను పూర్తిగా విస్మరించింది. ప్రజాస్వామ్య అభ్యాసం గురించి ఇలా మాట్లాడటం మంచిది కాదు, సంఖ్యాధిక్యత రాజకీయాల వల్లనే ఒక రకమైన అహంకారాన్ని తెలియజేస్తుంది. ఇది భారత్ అనే ఆలోచనకు పరస్పర విరుద్ధంగా ఉంది” అని అన్నారు.
రాష్ట్రాలపై ఈ బిల్లు భారం మోపుతుందని, అందుకే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా దీనికి అంతగా ప్రాధాన్యత ఇవ్వదని శివసేనా(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) (శివసేనా(యూబీటీ)ఎంపీ ప్రియాంక ఛతుర్వేది చెప్పారు.
“హక్కుతో కూడుకున్న ఉపాధి హమీ పథకాన్ని సమర్ధవంతంగా హత్య చేశారు”అని ఆమె ధ్వజమెత్తారు.
“గాంధీ పేరును తొలగించడానికి ఒక బిల్లును తీసుకువస్తున్నట్టుగా మొదట మీడియాలో ప్రచురించబడింది. దానిని ఆమోదింపజేసుకోవడానికి వారు ప్రయత్నించారు. రామ రాజ్యమనే ఆలోచన రైతులకు వ్యతిరేకమా? ప్రభు రాముడు పేదల వ్యతిరేకినా? లేకా “హే రాం”? అంటూ చనిపోయిన గాంధీకి వ్యతిరేకమా?” అని చతుర్వేది ప్రశ్నించారు.
“పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టక ముందు సంప్రదింపులు జరగాలి, ఆ తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం” అని ఆమె తెలియజేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
