‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లిహుడ్ మిషన్(గ్రామీణ)’ అంటే ‘వీబీ-జీ రామ్ జీ’ బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. ఎంఎన్ఆర్ఈజీఏను బుల్డోజర్తో మోడీ ప్రభుత్వం నాశనం చేసి కోట్లాది మంది రైతులు, కార్మికులు, భూమిలేని గ్రామీణ పేదల ప్రయోజనాలపై దాడి చేసిందని అన్నారు.
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లిహుడ్ మిషన్(గ్రామీణ)- ‘వీబీ-జీ రామ్ జీ’ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు.
ఎంఎన్ఆర్ఈజీఏను మోడీ ప్రభుత్వం అణగదొక్కిందని; కోట్లాది మంది రైతులు, కార్మికులు, భూమిలేని గ్రామీణ పేదల ప్రయోజనాలపై దాడి చేసిందని తను ఆరోపించారు.
ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య వీబీ-జీ రాంజీ బిల్లును పార్లమెంటు ఆమోదించింది.
యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) ప్రభుత్వం అమలు చేసిన- 20 ఏళ్ల ఎంఎన్ఆర్ఈజీఏ(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం)చట్టాన్ని ప్రతిపాదిత చట్టం భర్తీ చేస్తుంది. ఇందులో 100 రోజులకు బదులుగా 125 రోజుల తప్పనిసరి వేతన ఉపాధికి హామీ ఇవ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “20 సంవత్సరాల క్రితం డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఎంఎన్ఆర్ఈజీఏ చట్టం పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఇది లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విప్లవాత్మక చర్య. జీవనోపాధికి, ముఖ్యంగా అణగారిన, దోపిడీకి గురైన, పేదలకు- నిరుపేదలకు ఎంతో సహాయకారిగా మారింది” అని గుర్తు చేశారు.
“దీని వల్ల తమ స్వస్థలం, గ్రామం, ఇల్లు, కుటుంబం వదిలి ఉపాధి కోసం వలస వెళ్లడం ఆగిపోయింది. ఉపాధికి చట్టపరమైన హక్కులు మంజూరు చేయబడ్డాయి. గ్రామ పంచాయతీలకు అధికారం ఇవ్వబడింది. ఎంఎన్ఆర్ఈజీఏ ద్వారా, మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య భారతదేశంవైపు ఒక నిర్దిష్ట అడుగు వేయబడింది”అని అన్నారు.
గత 11 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు, పేదలు, అణగారిన ప్రజల ప్రయోజనాలను విస్మరించడం ద్వారా ఎంఎన్ఆర్ఈజీఏను బలహీనపరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేసిందని, అయితే కోవిడ్ సమయంలో, ఇది పేద వర్గానికి జీవనాధారంగా నిరూపించబడిందని సోనియా గాంధీ పేర్కొన్నారు.
“ఎంఎన్ఆర్ఈజీఏను బుల్డోజర్తో కేంద్ర ప్రభుత్వం నాశనం చేయడం చాలా విచారకరం. ఇది కేవలం మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాకుండా; ఎటువంటి చర్చలు- సంప్రదింపులు లేకుండా; ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా ఎంఎన్ఆర్ఈజీఏ మార్చారు” అని సోనియా గాంధీ ధ్వజమెత్తారు.
‘ప్రస్తుతం- ఎవరికి ఉపాధి లభిస్తుంది, ఎంత, ఎక్కడ, ఏ విధంగా, దీనిని ఢిల్లీలో కూర్చొని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇదంతా వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంటుంది’ అని సోనియా గాంధీ అన్నారు.
“ఎంఎన్ఆర్ఈజీఏ ప్రవేశపెట్టడం, అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించింది. కానీ అది ఎప్పుడూ పార్టీతో ముడిపడిన సమస్యగా లేదు. ఇది దేశ, ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన ఒక పథకం. ఈ చట్టాన్ని బలహీనపరచడం ద్వారా, మోడీ ప్రభుత్వం లక్షలాది మంది రైతులు, కార్మికులు, భూమిలేని గ్రామీణ పేదల ప్రయోజనాలపై దాడి చేసింది” అని సోనియా గాంధీ తెలియజేశారు.
అంతేకాకుండా, “ఈ దాడిని ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఇరవై సంవత్సరాల క్రితం నా పేద సోదరులు, సోదరీమణులకు ఉపాధి హక్కులను కల్పించడానికి నేను కూడా పోరాడాను. ప్రస్తుతం, ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా పోరాడటానికి నేను కట్టుబడి ఉన్నాను” అని సోనియా గాంధీ అన్నారు.
‘నాలాంటి కాంగ్రెస్ నాయకులందరూ, లక్షలాది మంది కార్మికులు మీకోసం నిలబడ్డారు’ అని చెప్పుకొచ్చారు.
గమనించాల్సిందేంటే, ఈ ప్రతిపాదిత చట్టం రాష్ట్రాల కంటే కేంద్ర ప్రభుత్వానికి “ఎక్కువ అధికారం” ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలు మునుపటి కంటే “ఎక్కువ డబ్బు” ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, ఈ పథకం ఎంఎన్ఆర్ఈజీఏకంటే మెరుగైనదని, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందిస్తుందని ప్రభుత్వం పేర్కొన్నది.
ఎంఎన్ఆర్ఈజీఏ స్థానంలో ప్రతిపాదించబడిన కొత్త చట్టాన్ని ఆర్థికవేత్తలు, సామాజిక హక్కుల సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి . “డెవలప్మెంట్ ఇండియా – ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లిహుడ్ గ్యారంటీ మిషన్” ఇప్పుడు ప్రతి ఒక్కరికీ పని చేసే హక్కును నిర్ధారించకుండా, ఎంపిక చేసిన లబ్ధిదారులకు రోజువారీ వేతనాలను విరాళంగా ఇవ్వాలని ఆలోచిస్తోందని వారు ఆరోపించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
