
బషీర్‌బాగ్ కాల్పులకు నేటితో 25 ఏళ్లు నిండాయి. సరిగా ఇదే రోజు, 2000 ఆగస్టు 28న బషీర్ బాగ్ వద్ద జరిగిన కాల్పులలో ముగ్గురు ఉద్యమకారులు చనిపోయారు.
విద్యుత్ ఉద్యమం తారాస్థాయికి చేరుకొని “ఛలో అసెంబ్లీ” పిలుపుతో అసెంబ్లీ వైపు వెళ్లడానికి పిలుపునిచ్చిన ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ముగ్గురు ఉద్యమకారులు సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలకు తుపాకి గుళ్లు తగిలి అసువులు బాసారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచబ్యాంకు షరతుల మేరకు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా విద్యుత్ ఛార్జీలను గణనీయంగా పెంచారు.
ఛార్జీలకు వ్యతిరేకంగా ఐదు నెలలపాటు ఉద్యమం..
చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, ఉభయ వామపక్ష పార్టీలు, ఇతర వామపక్ష పార్టీల నాయకత్వాన దాదాపు ఐదు నెలలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలు జరిగాయి.
ఈ కార్యక్రమాలలో రైతులు, రైతు కూలీలు, కార్మికులు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. పెంచిన గృహ అవసరాల విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఉద్యమకారులందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రధాన ప్రతిపక్షం..
విద్యుత్ ఉద్యమానికి అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. 90 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు, ప్రతిపక్ష నేత రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వాటర్స్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో విద్యుత్ ఉద్యమం మరింత ఉద్ధృతంగా మారి, చివరికి “ఛలో అసెంబ్లీ” పిలుపుకు దారి తీసింది. ఈ పిలుపు మేరకు వేలాది సంఖ్యలో ఉద్యమకారులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరుకున్నారు. టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అణిచివేతలను, నిర్బంధాలకు పాల్పడింది.
ఉద్యమకారుల రక్తంతో తడిసిన బషీర్‌బాగ్ రోడ్డు..
“ఛలో అసెంబ్లీ” పిలుపుతో నగరమంతా నిషేధాజ్ఞులు విధించడంతో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. అయినప్పటికీ, ఇందిర పార్క్ ధర్నా చౌక్ నుంచి వేలాదిగా అసెంబ్లీ వైపు ఉద్యమకారులు తరలి వచ్చారు. అసెంబ్లీ చుట్టూ ఉన్న దారులను బారికేడ్లతో మూసి వేశారు. రాకపోకలను నిషేధించారు.
ఇందిరా పార్క్ నుంచి మొదలైన “ఛలో అసెంబ్లీ” శాంతియుతంగా కొనసాగుతూ, బషీర్‌బాగ్ చౌరస్తాకు చేరుకోగానే గుంపులు గుంపులుగా అసెంబ్లీ వైపు పరిగెత్తడానికి ఉద్యమకారులు ప్రయత్నించారు.
ఫ్లైఓవర్ కింద వేచి ఉన్న వేలాది మంది పోలీసులు ముందుగా ఉద్యమకారులను తరిమికొట్టడానికి ప్రయత్నించారు. పరిస్థితులు అదుపుతప్పడంతో లాఠీఛార్జి చేశారు. భాష్పావాయును ప్రయోగించారు. అయినప్పటికీ, ఉద్యమకారులు వీటన్నింటిని ఎదుర్కొని అసెంబ్లీ వైపు పరుగులు తీశారు. దీంతో పోలీసులు చివరికి కాల్పులు జరిపారు. ఈ ఉద్యమానికి- బషీర్‌బాగ్ కాల్పులకు ఈ రోజుతో 25 సంవత్సరాలు నిండాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.