మన దేశంలో విద్యను బహుజనులకు దూరం చేయడం చారిత్రకం. శూద్ర, అతిశూద్రులను(బహుజన సమాజం) బ్రాహ్మణీయ వర్ణవ్యవస్థ చదువు నుంచి దూరం చేసి, గురుకులాల ద్వారా ఆధిపత్యానికి సాధనంగా మలిచింది.
స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగం సమానత్వం, రిజర్వేషన్లు వాగ్దానం చేసినా; నియో-లిబరల్ ప్రైవేటీకరణ ద్వారా ఆ దమనం కొత్త రూపంలో వచ్చింది.
ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్(యూకే )వంటి సామ్రాజ్యవాద శక్తులు దీనిని తమ పెట్టుబడి లాభం కోసం ఉపయోగించుకుంటున్నాయి.
ఇది కుల దమనం, తరగతి దోపిడీ సమ్మేళనం– బ్రాహ్మణీయ-పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద ఆధునిక అవతారం.
2030 నాటికి విద్యా ఎగుమతులను £40 బిలియన్లు(సుమారు రూ 4,32,000 కోట్లు, ప్రస్తుత వినిమయ రేటు ~108 రూ/పౌండ్ ప్రకారం) చేయాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కేవలం “ఎగుమతి” కాదు – విద్యను వస్తువుగా మార్చి, గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్‌గా మలచడం.
దేశాన్ని “కేంద్రీకృత అభివృద్ధి మార్కెట్”గా చూడటం. అంటే, 140 కోట్ల జనాభాలో ఎక్కువమంది పేద-మధ్యతరగతి(మెజారిటీ శూద్ర-బహుజనులు)ను లక్ష్యంగా చేసుకోవడం.
ఇది వారి ఆర్థిక బలహీనతలు, కలలు, భవిష్యత్తును లూటీ చేసే వ్యూహం.
రాజ్యం రూపొందించిన దోపిడీ మార్గం
యూకే యూనివర్సిటీలు(లంకాస్టర్, సర్రే, సౌతాంప్టన్ వంటివి) భారతదేశంలో క్యాంపసులు ఏర్పాటు చేస్తున్నాయి –యూజీసీ- 2023 రెగ్యులేషన్స్ కింద టాప్ 500 గ్లోబల్ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారు. ఇది “అంతర్జాతీయ విద్య” కాదు; బ్రిటిష్ విద్యా బ్రాండ్‌ను స్థానికంగా అమ్మి లాభం పొందడం.
రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలు పబ్లిక్ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేసి; సీట్లను తగ్గించి, రిజర్వేషన్లను బలహీనపరచిన తర్వాత ఈ ఖాళీని విదేశీ క్యాపిటల్ భర్తీ చేస్తోంది.
రిజర్వేషన్లు లేని ఈ విదేశీ క్యాంపస్‌లు సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తూ, కేవలం ఎలైట్ వర్గాల ఆధిపత్యాన్ని శాశ్వతం చేస్తున్నాయి.
ఇది యాదృచ్ఛికం కాదు – నియో-లిబరల్ రాజ్యం రూపొందించిన దోపిడీ మార్గం.
సామ్రాజ్యవాద ఆధునిక రూపం
పరిశ్రమ-సంబంధిత కోర్సులు, ప్రాజెక్టులు, విమర్శనాత్మక ఆలోచన, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చే విద్యార్థుల సహకారం. కానీ ఈ నాణ్యత శూద్ర-బహుజన యువతకు అందుబాటులో ఉందా? లేదు. ఫీజులు అత్యధికం(యూజీ: £10,000–£20,000/సంవత్సరం, పీజీ మరింత ఎక్కువ), లివింగ్ కాస్ట్ £900–£1,400/నెల(లండన్‌లో ఎక్కువ).
భారతంలోని క్యాంపసుల్లో కొంత తగ్గినా, అవి టాప్ ప్రైవేటు ఇండియన్ కాలేజీల ఫీజులకు సమానంగా ఉంటాయి– పేద బహుజన యువతకు అందని స్థాయి.
భారీ విద్యా రుణాలు యువతను విప్లవ పంథా నుంచి మళ్ళించి, జీవితాంతం కార్పొరేట్ కొలువుల్లో “అప్పుల బానిసలుగా” మారుస్తున్నాయి. ఇది ఎలైట్- ఎగువ కులాలు, ధనిక తరగతుల మార్కెట్ విస్తరణ మాత్రమే.
పాత కాలంలో ముడి పదార్థాలు(పత్తి, టీ) దోచుకున్నారు. ఇప్పుడు యువత భవిష్యత్తు, కలలు, విద్యా అప్పులను దోచుకుంటున్నారు. విదేశీ విద్య బ్రెయిన్ డ్రెయిన్‌కు దారి తీస్తుంది– భారత్‌లోని నైపుణ్యం గ్లోబల్ క్యాపిటల్‌కు సేవ చేస్తుంది. ఇక్కడి ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాలు(జీఎటీఎస్/ డబ్ల్యూటీఓ ద్వారా విద్యను వాణిజ్యంగా మార్చడం) ఈ లూటీకి అంతర్జాతీయ ముద్ర వేస్తాయి.
నేటి అవసరమేంటంటే..!
పబ్లిక్ యూనివర్సిటీల విస్తరణ, ఉచిత-నాణ్యమైన విద్య(ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు). విద్యకు జీడీపీలో 15% నిధులు కేటాయించాలి. రిజర్వేషన్ల పూర్తిగా అమలు చేయాలి. కేవలం సీట్లలో కాదు– ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్‌లో కూడా సామాజిక న్యాయ సూత్రాలు వర్తించాలి.
ప్రైవేటీకరణ, విదేశీ క్యాంపసుల వ్యతిరేక సామూహిక సంఘర్షణ– విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, బహుజన సంఘాలు ఏకమవ్వాలి. విద్యను మార్కెట్ కాకుండా సామాజిక విముక్తి సాధనంగా చూడాలి.
కుల-వర్గ సంఘర్షణను గుర్తించి, శూద్ర-బహుజన యువతను విప్లవ శక్తిగా నిలబెట్టాలి. లేకపోతే, యువత శాశ్వత ఆధునిక బానిసలుగా, గ్లోబల్ క్యాపిల్ సేవకులుగా మిగిలిపోతారు. కనుక నిజమైన విముక్తి కోసం విద్యా విప్లవం– ప్రజల చేతుల్లోకి విద్య రావాలి. ప్రస్తుత రాజ్య నియో-లిబరల్ నమూనాను సవాలు చేయడం నేటి అవసరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
