గతవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ నిబంధనలు 2025పై ఎడిటర్స్ గిల్ద్, డిజిపబ్ న్యూస్ ఫౌండేషన్లు ఆందోళన వ్యక్తం చేశాయి.
తాజా నిబంధనలు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయటమే కాక పత్రికా స్వేచ్ఛకు తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయని మీడియా పర్యవేక్షణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిబంధనలు విలేకరులపై అనేక పరిమితులు విధిస్తున్నాయని, వృత్తిపరమైన పనికి అనేక అవాంతరాలు కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డాయి. రెండేళ్ల క్రితం రూపొందించిన ఈ నిబంధనలను నవంబరు 15న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఆన్లైన్లో భారతీయుల వ్యక్తిగత గోప్యతను కాపాడే మొదటి అడుగుగా వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ చట్టం కనపడుతుంది. ఈ నిబంధనల ప్రకారం ఆన్లైన్ కార్యకలాపాల్లో పాల్గొనే వారు ఎవరైనా వీక్షకుల అనుమతి పొందాలి. తేలిక పాటి భాషలో చెప్పాలంటే ఉదాహరణకు ప్రస్తుతం ఎవరైనా ఏ ఆన్లైన్ యాప్లోనో, యూట్యూబ్‌లోనో, వాట్సాప్‌లోనో లాగినై చూసినా విన్నా మెసేజ్ పెట్టినా అది డిజిటల్ రికార్డ్‌లో నమోదయి ఉంటుంది.
విడతలవారీగా అమలు..
తాజా చట్టం ద్వారా ఇక మీద ఎవరైనా ఆన్లైన్ వీక్షకుడు లేదా ఖాతాదారుడు తాను ఎపుడు ఏ వెబ్సైట్ చూశాడు. ఎపుడు ఎక్కడ ఐపీ అడ్రస్ ఉన్న కంప్యూటర్లో లాగిన్ అయ్యాడో అటువంటి వివరాలు తొలగించాలని కోరితే ఆ డిజిటల్ రికార్డ్ తొలగించాల్సి ఉంటుంది.
ఈ చట్టానికి అనుగుణంగా కంపెనీలు తమ విధి విధానాలు మార్చుకునేందుకు, 18 నెలల పాటు గడువు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తదనుగుణంగా ఆ చట్టం 18 నెలల్లో విడతలవారీగా అమలులోకి తీసుకురానున్నట్టు కేంద్రం ప్రకటించింది.
ఇందులో భాగంగా వివిధ ఆన్లైన్ వేదికలు, సంస్థల విధివిధానాలు అమలు చేయటానికి వీలుగా డిజిటల్ ప్రొటెక్షన్ బోర్డును ఏర్పాటు చేయటంతో పాటు; ఆ బోర్డు పని తీరును నిర్ధేశించే నియమాలు రూపొందించటంతో పాటు; ఆ నియమాలు ఉల్లంఘించినపుడు విధించే జరిమానాలను కూడా ఖరారు చేయనున్నారు.
అయితే ఈ చట్టం, నిబంధనలు దేశంలో పాత్రికేయవృత్తికి కొత్త ఇబ్బందులు తెచ్చి పెడుతుందని, దేశంలో ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి ఊదిన సమాచార హక్కు చట్టాన్ని సమాధి చేయనున్నాయని డిజిపబ్ ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
“ఇప్పటివరకు విలేకరులకు ఉన్న ప్రత్యేక అవకాశాలను ఈ చట్టం రద్దు చేస్తోంది. ఈ చట్టం కింద ఏర్పాటు బోర్డులు అమలు చేసే విషయాలు గమనిస్తే కొత్త తరహా సెన్సార్షిప్ అమలు కాబోతోంది. భావ ప్రకటన స్వేచ్ఛకు ఈ చట్టం, నిబంధనలు విపరీతమైన ఆంక్షలు విధించటమేకాక వార్తలు సేకరణ కోసం చేసే ప్రయత్నాలు మీద అంతులేని పర్యవేక్షణ పై నిఘా మరింత తీవ్రమవుతుంది. అవినీతి వ్యతిరేక వార్తల విషయంలో ఈ వార్తల సేకరణ మరింత క్లిష్టతరంగా మారుస్తుంది. ప్రజాస్వామిక వ్యవస్థ మనుగడకు కావాల్సిన సమాచార ప్రసార వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. తాజాగా ప్రకటించిన నిబంధనలు కూడా వార్తలు సంపాదకీయ నిర్ణయాల్లో తెరచాటు నిఘా పెంచేందుకు దారి తీస్తున్నాయి” అని డిజిపబ్ ప్రకటనలో తెలిపింది.
ప్రజా ప్రయోజనం గంగలోకి..
వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ చట్టంలో జర్నలిస్టులకు ఉండే రక్షణలను తొలగించటం పట్ల గతంలోనే ప్రభుత్వానికి సవివరంగా తమ అభ్యంతరం తెలియచేసింది.
ప్రత్యేకించి ఈ చట్టంలోని సెక్షన్ 44(3) సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ (జె)(1)ని నీరుగారుస్తుంది. సమాచార హక్కు చట్టంలోని ఈ సెక్షన్ కింద ప్రజా ప్రయోజనం రీత్యా ఎటువంటి సమాచారాన్ని అయినా సేకరించే స్వేచ్ఛ సాధారణ ప్రజలకు, జర్నలిస్టులకు ఉంటుంది. కానీ తాజాగా అమల్లోకి తెస్తున్న కొత్త చట్టంతో ప్రజా ప్రయోజనం గంగలో కలిసిపోతుంది. కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన సంప్రదింపుల్లో భాగంగా ఈ విషయాలు వెల్లడించినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. డిజిపబ్ లేవనెత్తిన ఆందోళనలకు ప్రభుత్వం సమాధానాలు కూడా చెప్పలేదు.
“ఆగస్టు 8న ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రచురించిన వార్తా ప్రకారం జర్నలిస్టులు, సమాచార హక్కు ఉద్యమకారులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు స్పందనగా తాజా చట్టం కింద కనీసం తెలుసుకోవాల్సిన విషయాలను బహిరంగపరుస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ అధికారులు ప్రకటించినట్టు తెలిసింది. అయినా డిజిపబ్తో సహా అనేక మీడియా సంస్థలు పలు అభ్యంతరాలు లేవనెత్తినా ఈ చట్టం గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన కనీస విషయాలు వివరాలు ఏమిటో కూడా బహిరంగ పరచలేదు. ఈ చర్య ప్రజాస్వామిక వ్యవస్థలో కనీస సంప్రదింపులు సూత్రాన్ని కూడా పాటించని పరిస్థితికి ఉదాహరణ. అంతేకాదు. సమాచార హక్కుకు సంబంధించిన రాజ్యాంగ హక్కును పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రక్రియ” అని డిజిపబ్ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం రాజ్యాంగం ఖాయం చేసిన భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ప్రకటించింది.
ఇదిలా ఉండగా జర్నలిజం స్ఫూర్తి కి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం నియమ నిబంధనల్లో అవరమైన మార్పులు చేయాలని కావల్సిన వివరణలు ఇవ్వాలని ఎడిటర్స్ గిల్డ్ కూడా కేంద్ర సమాచార సాంకేతిక శాఖను కోరింది. ఈ మేరకు ఓ 35 ప్రశ్నలతో కూడిన లేఖ రాసింది. అయినా ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన కరువైంది.
” కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నియమ నిబంధనలు మేము లేవనెత్తిన ఆందోళనను సమాధాన పర్చేవిగా లేవు. ఇందులో పేర్కొన్న పద్ధతులు అనుమతులు ముందస్తుగానే తీసుకోవడం ఆంటీ రోజువారీ వార్తా సేకరణ వంటి వృత్తిపరమైన పనుల్లో అనేక అవరోధాలు తెచ్చి పెడుతుంది. స్పష్టమైన వివరణ లేకుండా కేవలం జర్నలిస్టు వృత్తిపరమైన అంశాలను కూడా చట్టపరమైన అనుమతులు తీసుకోవాలి అన్న షరతు విధించటం జర్నలిజం స్వతంత్రతను స్వేచ్ఛను హరిస్తుంది” అని ఎడిటర్స్ గిల్డ్ రాసిన లేఖలో వివరించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం రోజువారీ జర్నలిస్టుల పనులకు ఎలా వరిస్తుందో స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది.
ఇటువంటి స్పష్టమైన వివరణ లేని నేపథ్యంలో రోజువారీ జర్నలిజం నీరుగారి పోతుంది. ప్రజాస్వామిక వ్యవస్థలో మీడియా పోషించాల్సిన పాత్రను కుదిస్తుంది. డేటా రక్షణ వ్యక్తిగత గోప్యత కీలకమైన అంశాలనీ, అదే సమయంలో వీటికి ఇచ్చే ప్రాధాన్యత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన కనీస రక్షణలకు భంగం కలిగించేదిగా ఉండరాదని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
