భిన్నమైన భారతీయ పారిశ్రామిక చిత్రం
భారతదేశం కూడా చైనాలాంటి ఆశలు, ఆశయాలు, లక్ష్యాలతోనే తన ప్రయాణం ప్రారంభించింది. కానీ పూర్తి భిన్నమైన ఫలితాలతో నిలిచింది.
భారతదేశాన్ని ప్రపంచం గుర్తించగల ఆర్థిక శక్తిగా నిలబెట్టడానికి వచ్చిన ఎన్నో అవకాశాలను కోల్పోయింది. వ్యవస్థాగత పరిమితులకులోనైంది.
1980లో మారుతి సుజుకితో కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందం భారతదేశంలో వాహన పరిశ్రమకు సంబంధించిన పునాదులను సమర్ధవంతంగా వేసింది.
చైనాలో అమలు జరిగిన భాగస్వామి ఒప్పందాలకు భిన్నమైనది మారుతి సుజుకి భాగస్వామ్య ఒప్పందం.
దేశీయంగా చెప్పుకోదగినంత వాహన ఉత్పత్తి రంగం విస్తరించడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేసింది. నేడు భారతదేశంలో ప్రధానమైన వాహన ఎగుమతిదారు.
కానీ ప్రపంచ మార్కెట్‌ను ఆవరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు ఆటోమొబైల్స్ రంగంలో భారతదేశం ఉన్న స్థానానికి ముప్పు తెచ్చి పెడుతున్నాయి.
చైనా అత్యంత ఆధునికమైన ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి వాటికి కావాల్సిన బ్యాటరీలను ఉత్పత్తి చేసి ప్రపంచానికి ఎగుమతి చేసే దశలో ఉంటే భారతదేశం మాత్రం కాలం చెల్లనున్న ఉత్పత్తులకే పరిమితం అవుతుంది.
హై స్పీడ్ రైల్ విషయంలో విదేశాల మధ్య ఉన్న వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
దక్షిణాసియాలోనే మొట్టమొదటిసారిగా రైలు ఇంజన్లు భోగీలు తయారు చేసిన దేశం భారతదేశం. కానీ నేటికీ వందే భారత్ రైళ్లను మాత్రమే చూడగలుగుతున్నాము.
సాంప్రదాయకంగా నడుస్తున్న రైళ్లకు వందే భారత్ రైళ్లకు మధ్య సాంకేతిక పరిజ్ఞానం, వేగం, రక్షణవంటి విషయాలలో చెప్పుకోదగ్గ వ్యత్యాసాలు ఏమీ లేవు.
ఇప్పటివరకు వినియోగంలో ఉన్న రైలు బోగీల డిజైన్లను కొద్దిగా అటూఇటూ మార్చి వందే భారత్ రైలు భోగీలు తయారు చేశాము.
జపాన్ సహకారంతో ముంబై అహ్మదాబాద్‌ల మధ్య నిర్మించబడుతున్న హై స్పీడ్ కారిడార్‌తో ఆధునిక రైళ్లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కొంత దేశానికి అందే అవకాశం ఉన్నది.
కానీ చైనా తరహాలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అన్వయించి అభివృద్ధి చేసి పునరుత్పత్తికి వినియోగించడానికి కావలసిన మార్గాలు అవకాశాలు కనిపించడం లేదు.
ఆదివారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి రానున్న కాలంలో ఆరు హై స్పీడ్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
బహుశా మనం ఆశిస్తున్న మార్పు ఇప్పుడేమైనా కనిపిస్తుందేమో చూడాలి.
భారత ప్రజాస్వామ్యం, అతుకుల బొంతగా మారిన ఫెడరలిజం, స్వయంప్రద్పత్తి కలిగిన న్యాయవ్యవస్థ, స్వేచ్ఛగా పనిచేసే మీడియాల కారణంగా చైనా తరహా వ్యవస్థలను ఇక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశాలు లేవు.
భారతదేశంలో రూపొందించే పారిశ్రామిక విధానం అనేక సంకీర్ణ రాజకీయాలు, పర్యావరణ వివాదాలు, భూసేకరణ సమస్యలు, బాండ్ మార్కెట్లు విధించే కట్టడులు, అధికార మార్పిడులు, వేరువేరు ఆర్థిక తాత్వికత కలిగిన పార్టీలు అధికారంలోనికి రావడం పోవడం వంటి వాటి మధ్య మధ్య ఒదగాల్సి ఉంటుంది.
ఈ పరిమితుల కారణంగానే భారతదేశం అనుసరించదగ్గ పారిశ్రామిక వ్యూహాలకు కళ్లెం పడుతుంది.
ఎగుమతి రంగంలో సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూనే దిగుమతులకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి విధానాన్ని రూపొందించాలన్న ఆర్థిక సర్వే ప్రతిపాదన పరస్పర వైరుధ్యంతో కూడుకున్నది.
ఇటువంటి వైరుధ్యాలను అధిగమించడంలో చైనా ఎంతో పరిణితి సాధించింది.
భారతదేశం అటువంటి పరిణితి సాధించడం సందేహాస్పదమే. భారీ పారిశ్రామిక వస్తు ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయటానికి దేశీయ రక్షణలను చైనా కవచంగా ఉపయోగించుకున్నది.
ఈ విధంగా నిర్మించిన ఆత్మ సామర్ధ్యాలను తరువాత అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశానికి సోపానాలుగా వాడుకున్నది.
చైనా నేడు ఉన్న దశకు చేరుకోవడానికి ముందు కొన్ని దశాబ్దాల పాటు దేశీయ ఉత్పాదిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి భారీ సబ్సిడీలు రాయితీలు ఇచ్చింది.
ఆ ప్రయోగం చైనాలో ఫలించింది. ఎందుకంటే అక్కడ వినియోగానికి కావలసినంత భారీ దేశీయ మార్కెట్ అందుబాటులో ఉంది.
చైనా కమిషనర్ పార్టీ నాయకత్వంలో అమలు జరిగే విధానాలకు నిలకడత్వం వచ్చింది.
మేధో సంపత్తి హక్కులకు కట్టుబడకపోవటంతో భారీ ఎత్తున మేధో సంపత్తితో ముడిపడిన పరిజ్ఞానాలను టెక్నాలజీని చైనా సొంతం చేసుకోగలిగింది.
భారతదేశంలో దేశీయ మార్కెట్ విస్తరిస్తున్నా చైనాతో పోల్చినప్పుడు పరిమితమైనది, బలహీనమైనది. మరి ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య నేపథ్యం మారింది. 1980-90లో దశకాల్లో సహజమైనవిగా భావించబడిన విధానాల అమలు నేడు ప్రతీకార చర్యలకు కారణమవుతున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ ఎంతగా బలహీనంగా ఉన్నప్పటికీ వివిధ దేశాలు ఒక పరిమితికి మించి ఆత్మరక్షణ విధానాలు అవలంబించకుండా అడ్డుకుంటుంది, నియంత్రిస్తోంది.
సెమీ కండక్టర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటానికి కావలసిన ముడి ఖనిజాలు, కృత్రిమ మేధా వంటి రంగాలలో ముందంజ వేయాలంటే అంతర్జాతీయంగా అనేక దేశాల నుండి తన మార్కెట్ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలి.
అత్యాధునికమైన పరిశోధన అభివృద్ధి రంగాలు పనిచేయాలి. అది జరగాలంటే కేవలం దిగుమతులకు ప్రత్యామ్నాయ విధానమని కూర్చుంటే సరిపోదు.
సామర్థ్యానికి సంబంధించిన విషయం కూడా ఉన్నది. దిగుమతులకు ప్రత్యామ్నాయం అనగానే కొన్ని కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం రక్షణ కల్పించాల్సి ఉంటుంది.
ఆధునిక ఆవిష్కరణల కోసం ప్రయత్నం చేయాలన్న ఒత్తిడి ఎక్కువగా ఉండదు.
గతంలో అనుసరించినటువంటి విధానాల ఫలితంగా అంబాసిడర్ ప్రీమియర్ పద్మిని వంటి వాహనాలు మాత్రమే మనం తయారు చేయగలిగాము.
భారతదేశం ఎదుర్కొంటున్న సాంకేతిక అభివృద్ధి స్తబ్దతకు ఇవి నిదర్శనాలు. వర్తమానంలో కూడా ఇటువంటి ప్రయోగాలు పునరావృతమయ్యే అవకాశం బలంగానే ఉంది.
ఆశల పల్లకి అవతల
భారత పారిశ్రామిక రంగం క్రమశిక్షణ కలిగిన స్వదేశీ స్వభావాన్ని సంప్రదించుకోవాలని ఆర్థిక సర్వే పిలుపునివ్వటం ఆహ్వానించదగినవే.
అడ్డగోలు రక్షణ వాదానికి, అదుపులేని ప్రపంచీకరణ మోజు కంటే ఇది మెరుగైనదే. కాకపోతే క్రమశిక్షణకు కేవలం ఉద్దేశ్యం మంచిది అయితే సరిపోదు.
ఇలాంటి క్రమశిక్షణతో కూడిన స్వదేశీ స్వభావానికి సంస్థాగత సామర్ధ్యం, రాజకీయ నిలకడతనం, వ్యూహాత్మక స్పష్టత ఉండాలి. ఈ విషయాల్లో భారతదేశం ఎంతో వెనకబడి అన్నది.
చైనా అనుభవాలు సాధ్యమైనవే కానీ అంత తేలికగా వాటిని అనుకరించలేము. ఆ తరహా విధానాలు అమలు జరగాలంటే కొన్ని మౌలిక ప్రాతిపదికలు ఉండాలి: ఓ తరహా నిర్ణయాత్మకణా వ్యవహరించగల ప్రభుత్వం, పెట్టుబడులు భారీగా సమీకరించగల సామర్ధ్యం, కీలక ఆర్థిక రంగాల్లో ప్రభుత్వ యాజమాన్యం, నియంత్రణ, అసమర్ధత, పర్యావరణ నష్టాలను భరించగల సామర్ధ్యం, చైనా సాధించిన పారిశ్రామిక అభివృద్ధి, ఆధునీకరణ లో కీలక పాత్ర పోషించింది.
చైనాలోని పాలనా యంత్రాంగం, రాజకీయ నాయకత్వం. దీర్ఘ కాలిక వ్యూహాలు రూపొందించగలగడం, ఆ వ్యూహాలు అమలు చేసేలా స్థానిక పాలనా యంత్రాంగాన్ని సన్నద్ధం చేయటం ద్వారానే ఆ స్థాయి అభివృద్ధి సాధ్యం.
చైనా అభివృద్ధి నమూనాను భారతదేశం అనుకరించగలదా అన్నది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న కాదు. మన ఈషా ప్రత్యేకతలకు తగ్గట్టు సరికొత్త అభివృద్ధి వ్యూహ రచన చేయగలదా అన్నది ప్రశ్న. భారతదేశానికి ఉన్న సంస్థాగత పరిమితులు, బలాలు బలహీనతల్ని ఉపయోగించుకుని దేశీయ పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరించగలమా అన్నది ప్రశ్న.
ఇప్పటివరకు వచ్చిన ఆర్థిక సర్వేలన్నీ భారీ ఆశల పల్లకీలు మోసుకొస్తున్నాయి కానీ ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలను ముందుకు తీసుకురావడం లేదు. క్రమ శిక్షణను పాటించడమంటే ముందు ఏమి సాధించగలం, ఏమి సాధించలేము అన్న వాస్తవాలను గుర్తించడంలో క్రమశిక్షణ ఉండాలి.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
