చైనా మార్గాన్ని భారతదేశం అనుసరిస్తుందా లేదా అన్నది ప్రశ్న కాదు. తన దారి తాను ఎంచుకో గలుగుతుందా లేదా అన్నదే ప్రశ్న.
ప్రస్తుతమున్న పరిమితుల్లో పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరించుకోవడం, దేశ ఆర్థిక వ్యవస్థకున్న బలం ఆధారంగా ప్రత్యామ్నాయాలు రూపొందించడం జరగాలి. బలహీనతలను కప్పిపుచ్చుకోవడం కాదు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశీయ వస్తూత్పత్తి రంగానికి పెద్ద పీట వేసింది.
ప్రతికూలంగా మారుతోన్న ప్రాపంచిక పరిస్థితులల్లో ఆర్థికాభివృద్ధి రేటు కొనసాగించాలంటే, ఇదొక్కటే మార్గం.
బడ్జెట్‌కు ముందు రోజు విడుదల చేసిన ఆర్థిక సర్వే రానున్న కాలంలో స్వదేశీ నినాదాన్ని నెత్తికెత్తుకోవాలని, అదే సమయంలో ప్రపంచంతో పూర్తిగా తలుపులు మూసుకోరాదని ప్రతిపాదించింది.
దీన్నే క్రమశిక్షణతో కూడిన వ్యూహంగా సర్వే పేర్కొన్నది.
జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్, వియత్నాంవంటి తూర్పు ఆసియా దేశాల విజయగాథలను ఆర్థిక సర్వే ప్రముఖంగా ప్రస్తావించింది.
ఫలానా దేశం గురించి అని చెప్పకపోయినా ఉత్పత్తి రంగంలో అగ్రరాజ్యంగా ఎదిగిన చైనా గురించి విశ్లేషణ గణనీయంగానే ఉన్నది.
చైనా ఆర్థిక గమనం స్ఫూర్తిదాయకంగా ఉండడంతోపాటు హెచ్చరిక కూడా.
సర్వే ప్రతిపాదించిన పరిష్కారాలు ముక్కుసూటిగా ఉన్నాయి. దిగుమతులకు ప్రత్యామ్నాయంగానూ, వ్యూహాత్మకరంగాలలో స్వావలంబనతోనూ, తూర్పు ఆసియా దేశాల పారిశ్రామికీకరణ తరహాలో ‘రాజ్యం సామర్థ్యం’ పెంచుకోవాలని ఆర్థిక సర్వే ప్రతిపాదించింది.
సర్వే రూపకర్తలు చైనా మోడల్‌ను దృష్టిలో పెట్టుకున్నప్పటికీ, చైనా నమూనాను అనుసరించడానికి భారతదేశం ప్రయాణించాల్సిన దూరం చాలా ఎక్కువే.
చైనా పారిశ్రామిక పురోగతి: నాలుగు దశాబ్దాల వ్యూహం- ఫలితం
వెనుకబడిన వ్యవసాయక దేశంగా ఉన్న చైనా వస్తూత్పత్తి రంగంలో అగ్రరాజ్యంగా ఎదగడం వెనక మూడు పునాదులు ఉన్నాయి.
విస్త్రృత స్థాయిలో పెట్టుబడులు పెట్టడం; ఎడాపెడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం- వినియోగించుకోవడం; విధానాల రూపకల్పన అమలులో చైనా ప్రభుత్వం సంపూర్ణ ఆధిపత్యమే ఆ పునాదులు.
ఈ మూడు పునాదులు ఒకదానితో ఒకటి ఎలా సమన్వయం చేసుకుంటున్నాయన్నది అర్థం చేసుకోవడమే భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు అధిగమించడానికి, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి దారి చూపిస్తుంది.
1950 దశకంలో రష్యా నుంచి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అందిన సహకారం ఆధారంగా చైనా భారీ పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేసింది.
పౌర విమానాలు, వాహనాలు, పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు మొదలు- ఖండాంతర క్షిపణుల తయారీవంటి రంగాలలో చైనా పురోగమించింది.
ఈ క్రమంలో మేధోసంపత్తి హక్కుల గురించి పెద్దగా పట్టించుకోలేదు.
రష్యాతో వివాదం, మావో గ్రేట్ లీప్వంటి పరిణామాల నేపథ్యంలో డెంగ్జీయావో పింగ్ 1980 దశకంలో దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణల బాట పట్టించారు.
విదేశీ పెట్టుబడులకు, అనుభవాలకు తలుపులు తెరిచారు.
డెంగ్ నాయకత్వంలో అమలు జరిగిన నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్ఈజెడ్) కమ్యూనిస్టు వ్వవస్థలోనే మార్కెట్ ఆర్థిక విధానాల సమన్వయం సాధించే ప్రయోగ శాలలుగా మారాయి.
జపాన్ కూడా కీలక పాత్ర పోషించిన విషయాన్ని పాశ్చాత్య దేశాలు తరచూ విస్మరిస్తూ ఉంటాయి. 1977-88 వరకు చైనాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా జపాన్ ఉన్నది.
తదుపరి మూడు దశాబ్దాలలో ఏటా 1.50 బిలియన్ డాలర్ల చొప్పున జపాన్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెంన్స్ రూపంలో జపాన్ నుంచి విదేశీ పెట్టుబడులు చైనాలో ప్రవేశించాయి.
ఈ సహకారంతో పాటు జపాన్ నుంచి వచ్చిన ప్రైవేటు పెట్టుబడులు కూడా చైనా ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో, వస్తూత్పత్తి రంగానికి కావాల్సిన వనరులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాయి.
2005 నాటికి జాతీయ మధ్యంతర, దీర్ఘకాలిక శాస్త్ర- సాంకేతిక రంగ ప్రణాళిక ద్వారా చైనా ఆధునిక కాలానికి సంబంధించిన శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞానాలను సమకూర్చుకోవడానికి నడుంబిగించింది. ఈ వ్యూహం బాహాటంగా అమలు జరిగిందే.
విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఙానాన్ని సమకూర్చుకోవడం; దాన్ని ప్రభుత్వం, పరిశోధనా కేంద్రాల ద్వారా విస్తృతంగా వినియోగంలోకి తేవడం; ఈ క్రమంలోనే అత్యాధునికత(రీ-ఇన్నోవేషన్) ద్వారా దేశీయంగా శాస్త్ర- సాంకేతిక స్వావలంబన సాధించడం ఈ దీర్ఘకాలిక ప్రణాళికలో కీలకమైన దశలు.
సరిగా ఇదే సమయంలో పెట్టుబడిదారీ పశ్చిమ దేశాల ఆర్థికవ్యవస్థలు స్తబ్ధతకులోనయ్యాయి. 2008లో తలెత్తిన ప్రపంచ ద్రవ్యపెట్టుబడి సంక్షోభం- ఈ దారిలో సాగుతోన్న చైనా ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసింది.
ప్రత్యామ్నాయ ఇంధనం ఆధారంగా నడిచే కార్లు(ఎలక్ట్రీక్ వెహికల్స్), ఉన్నత స్థాయి వినిమయ సరుకులు తయారు చేయడానికి కావాల్సిన ఖనిజ వనరులు సమీకరణ, బయోటెక్నాలజీ, 21వ శతాబ్దానికి కావాల్సిన ఐటీ రంగం, స్వచ్ఛమైన ఇంధన వనరులను వినయోగంలోకి తీసుకురాగలిగిన సాంకేతిక పరిజ్ఞానం(గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీస్)వంటి వ్యూహాత్మక రంగాలలో చైనా తిష్ట వేయడానికి ఈ కాలాన్ని ఉపయోగించుకున్నది.
సాంకేతిక వనరుల వినియోగం వెనక..
ఒక రకంగా చెప్పాలంటే, అనుసరించిన పారిశ్రామిక విధానం బుగ్గ గిల్లి జోల పాడినట్టు ఉండేది. ఆ దేశంలో ఉన్న భారీ మార్కెట్‌ను ఆశ చూపించి విదేశీ పెట్టుబడులు శాస్త్ర-సాంకేతిక పరిజ్ఙానాలను దేశానికి ఆహ్వానించేది.
చైనాలో విదేశీ పెట్టుబడితో నడిచే ఏ కంపెనీనైనా అమ్ముకోవాలంటే, నేరుగా మార్కెట్లో అమ్ముకోవడానికి వీలు లేదు. ఏదో ఒక చైనా ప్రభుత్వ రంగ సంస్థతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడాలి.
మెజారిటీ నిర్ణయాధికారం ప్రభుత్వ రంగ కంపెనీకి బదిలీ చేయాలి. స్థానికతను తూచా తప్పకుండా పాటించాలి. సదరు పరిశ్రమ వినయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా చైనా ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేయాలి. ఈ షరతులను అంగీకరించకపోతే, ఆయా కంపెనీలకు వారి ఉత్పత్తులకు చైనా మార్కెట్లో స్థానం లేదు.
ఇన్ని కఠిన షరతులు ఉన్నప్పటికీ మెజారిటీ విదేశీ కంపెనీలు చైనాలో తమ కార్యకలాపాలు కొనసాగించేందుకే సిద్ధపడ్డాయి.
అమెరికన్ మోటార్ కార్పోరేషన్‌తో బీజింగ్ జీప్స్ కంపెనీ భాగస్వామ్యం, షాంగై ఓక్స్ వ్యాగన్ చైనా కార్యకలాపాలు కొన్ని ఉదాహరణలు.
చైనాలో అడుగుపెట్టిన విదేశీ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయడం ఎలాగో చైనీయులకు దగ్గరుండి నేర్పారు. ఈ ప్రమాణాలు సాధించడంలో ఒకసారి ప్రభుత్వం ఆశించిన స్థాయికి చేరుకున్న తర్వాత గీలి, బీవైడీ, చెరీవంటి ఆధునిక వాహనాల తయారి మొదలైంది.
ఇంధన ఆధారిత రంగాలలో పశ్చిమ దేశాలను అధిగమించలేమన్న వాస్తవాన్ని గుర్తించిన చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది. చైనాలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌పై పెత్తనం సాధించేంత వరకు చైనా ఈ రంగానికి పెద్ద ఎత్తున రాయితీలు కూడా ఇచ్చింది.
2023నాటికి ప్రపంచంలో వాహనాల ఎగుమతి మార్కెట్లో చైనా ప్రథమ స్థానానికి చేరుకుంది. 2024నాటికి మొత్తంగా విదేశాలకు అమ్మే వాహనాల విషయంలో జపాన్ను కూడా అధిగమించింది.
హైస్పీడ్ రైళ్ల నిర్మాణంలో కూడా చైనా ఇదే తర్కాన్ని పాటించింది. రైల్వే సాంకేతిక పరిజ్ఞానం విషయంలో 2004నాటికి భారతదేశం కంటే చైనా వెనకబడి ఉన్నది. సీమెన్స్, ఆల్స్టోమ్, బంబార్డియర్, కవసాకిలకు భారీ రైల్వే కాంట్రాక్టులను అప్పగించింది.
అయితే, ఈ కంపెనీలు తాము వినియోగించే శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞానాన్ని అరమరికలు లేకుండా చైనాతో పంచుకోవాలన్నిది ప్రధానమైన షరతు. చైనా మార్కెట్ ఇచ్చే అవకాశాలు తిరస్కరించలేనివి కావడంతో ఈ కంపెనీలు చైనాలో రైల్వే రంగంలో అడుగుపెట్టాయి.
ఆయా కంపెనీలు తీసుకొచ్చిన శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాలోని ప్రభుత్వ పరిశోధనా ప్రయోగశాలలు సొంతం చేసుకున్నాయి. అటువంటి పరిజ్ఞానం ఆధారంగానే 2008నాటికి దేశీయంగా తయారైన మొదటి బుల్లెట్ రైలును చైనా పట్టాలెక్కించింది.
ప్రస్తుతానికి చైనాలో 50 వేల కిలోమీటర్ల నిడివిలో హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలలో హైస్పీడ్ రైలు నెట్వర్క్ కంటే చైనాలో ఉన్న హైస్పీడ్ రైలు నెట్వర్క్ ఎక్కువ.
విమానయాన రంగంలో చైనా పూర్తి స్థాయిలో తన ఆశలు నెరవేర్చుకోలేక పోతుంది. దేశియంగా తయారైన వై10 జెట్ విమానం 1980లో వాడుకంలోకి వచ్చిన 82నాటికి దాన్ని నిలిపి వేశారు. తగినంత ఉత్పాదక సామర్థ్యం లేకపోవడమే దీనికి కారణం.
1990లో విదేశాలలో తయారైన విమానాలను దిగుమతి చేసుకోవడానికి చైనా మొగ్గు చూపడంతో మెక్డొన్నెల్తో కుదుర్చుకున్న ఒప్పందం కూడా రద్దయింది. సాంకేతి పరిజ్ఞానం బదిలి నిలిచిపోయింది.
చైనా నిర్మించిన కోమ్యాక్ సీ919 విమానాన్ని వినియోగానికి వీలైనదని ఎట్టకేలకు 2022లో ధృవీకరించబడింది. ఈ విమానం కూడా విదేశాలలో తయారైన ఇంజన్‌తో మాత్రమే నడుస్తోంది.
2030నాటికి సీ929 భారీ భారీ విమానాన్ని నిర్మించడానికి చైనా సిద్ధమవుతున్నప్పటికీ, చైనా విమానయాన సామర్థ్యం ఇంకా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నది.
ప్రస్తుతం సెమీ కండెక్టర్లు, రోబోటిక్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, మానవ రహిత వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాలు, స్వచ్ఛమైన ఇంధనం, బయోటెక్నాలజీ, అంతరిక్ష రంగాలలో ప్రపంచస్థాయి శక్తిగా చైనా ఎదిగింది.
అనువాదం: కొండూరి వీరయ్య
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
