
తెలంగాణ ముమ్మాటికీ మిగతా ప్రాంతాల కంటే భిన్నమైనది. చారిత్రక ప్రత్యేకతను సంతరించుకున్నది. జైనం, బౌద్దం, వీరశైవం రూపంలో మానవ వికాసోన్నతి కేంద్రంగా విలసిల్లినదీ తెలంగాణ. ప్రాచీన సాహిత్య గ్రంధాల్లో, పలువురు యాత్రికులు పేర్కొన్న అధారాలు ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. అంతేకాదు, నాటి రాజులు వేసిన శిలాశాసనాల్లో కూడా ఈ విషయాలున్నాయి. బౌద్ధ జాతక కథలు తెలంగాణ గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని వెయ్యేళ్లకు పైబడి కొన్ని రాజవంశాలు నిరంతరాయంగా పాలించాయి. అందువల్ల ఒకే రాజకీయ, సాంస్కృతిక సమ్మిళిత జీవితం ఈ ప్రజల జీవితాల్లో ముడిపడి ఉంది.
కాకతీయుల తర్వాత తెలంగాణలో చిన్నచిన్న రాజ్యాలు వచ్చినా ఆ తర్వాత ఆసఫ్ జాహీల సుదీర్ఘ పాలనా కాలంలో దక్కన్ పీఠభూమి ఒకే పరిపాలన కింద ఉన్నది. ఇన్నేళ్లుగా తనకంటూ ఓ ప్రత్యేక అస్థిత్వాన్ని ఈ నేల తన సొంతం చేసుకున్నది. ఇదే ఓ జీవన విధానంగా, నినాదంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రతిధ్వనించింది. కోట్లాది తెలంగాణ ప్రజలను ఏకోన్ముకం చేసింది. విజయం వైపు నడిపించింది. తమను తాము పాలించుకునే భారత రాజ్యాంగ స్పూర్తితో ప్రజాస్వామ్యపు ఉద్యమాన్ని విజయవంతం చేసుకున్నది. మరిప్పుడు ఇదంతా ఎందుకు? అనే సందేహం వస్తుంది.
2014 వరకు రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రత్యేకతను, దాని ఉనికిని, అస్థిత్వాన్ని ఎలుగెత్తి చాటాయి. తెలంగాణ ఎందుకు, ఎట్లా మిగతా ప్రాంతాల కంటే భిన్నమైందో చెప్పాయి. ఇట్లా చెప్పిన పార్టీల్లో తొలి వరుసలో ఉన్నది నాటి టీఆర్ఎస్, నేటి బిఆర్ఎస్. రెండో సారి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్- బీఆర్ఎస్గా మారింది. ఈ పార్టీ పేరు మార్చుతున్న సందర్భానికి కొంతకాలం ముందు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ తమది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పారు.
అస్థిత్వాన్ని మరువొద్దని ప్రజల కోరిక..
ఉద్యమాలు చేసిన పార్టీలు ఎప్పటికీ ఉద్యమాలు చేయవు. ఆ తర్వాత తమ లక్ష్యాల కోసం కార్యాచరణ తీసుకుంటాయి. అట్లా చేయాలి కూడా. బీఆర్ఎస్ తన లక్ష్యాల సాధనకు కార్యాచరణ తీసుకోవడంతో పాటు, తన ఉద్యమ పార్టీ పూర్వపునామాన్ని సమూలంగా మార్చుకున్నది. అంటే, తెలంగాణ ప్రజలు తాము అనుకుంటున్న పార్టీ పేరు మారింది.
‘‘పేరులో ఏమున్నది అంటే, అంతా అందులోనే ఉన్నది’’ అన్నట్లు ఆ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత ప్రజలకు దూరం అయింది. తమ ఆత్మకు, తమ ఉనికి, అస్థిత్వానికి ప్రతీక అనుకున్న పార్టీ పేరు మార్చుకోవడాన్ని తెలంగాణ ప్రజలు సమ్మతించినట్లు లేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఒటమిని చవి చూసింది. ఆ పార్టీ ఓటమికి గల కారణాల్లో పేరు మార్పు ఓ ప్రధానంగా అంశంగా ఉందని ఆ తర్వాత చాలా మంది మాట్లాడారు.
ఇవి మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారికి(ఇతర ప్రాంతాలకు చెందిన వారు) రాష్ట్రప్రభుత్వం గుర్తింపు, గౌరవాలనీయడం కూడా తెలంగాణ ప్రజలకు నచ్చినట్లు లేదు. ఈ విషయాల పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత కన్పించింది. అంటే తెలంగాణ సోయికి, ఆత్మకు భిన్నంగా వ్యవహరించింది గత ప్రభుత్వం అనే విషయం అర్థం అవుతున్నది.
*ప్రధాని మోడీ రాష్ట్ర విభజన అనంతరం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఇంకా మర్చి పోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతునీయడంలో ఆ పార్టీ పాత్ర పెద్దదే. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల తల్లి చనిపోయింది. బిడ్డ బతికిందనే పోలికే తీవ్ర వేదన కలిగించింది ఈ రాష్ట్ర ప్రజలకు.* తెలంగాణ ఆత్మను, ఈ ప్రాంతపు చారిత్రక, సాంస్కృతిక అంశాల గురించిన పట్టింపు వారికి అంతగా లేదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. తాము జాతీయ కోణంలోనే ఆలోచిస్తామని ఆ పార్టీ నాయకులు అంటూ ఉంటారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వారు ఎట్లా అర్థం చేసుకుంటారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఇక ‘‘తెలంగాణ తెచ్చింది మేమే… ఇచ్చింది మేమే’’ అని కాంగ్రెస్ నాయకులు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇచ్చిన, తెచ్చిన వారు ఎప్పుడూ జై తెలంగాణ అనే నినాదం ఇవ్వగా తాము చూడలేదని చాలా మంది అనుకుంటున్నారు. అంతేకాదు, నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారిని ఈ ప్రభుత్వం ఎందుకు భుజానికి ఎత్తుకుంటున్నదో అర్థం కావడం లేదని ప్రజలు చర్చించుకంటున్నారు.
సీమాంధ్ర నాయకుల స్పూర్తితో తెలంగాణలో పాలన సాగితే ఇక తెలంగాణ ఏర్పాటు లక్ష్యం ఎటు వైపు వెళ్లినట్లని చాలా మంది వేదన చెందుతున్నారు. రాజ్యసభలో అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వారు ఈ ప్రభుత్వానికి పెద్ద దిక్కులు ఎట్లా అయ్యారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.
ఉద్యమ సందర్భంలో విగ్రహాలు, నిగ్రహాలు అంటూ పెద్ద చర్చనే జరిగింది. మరో సారి విగ్రహాల గురించిన చర్చ మన రాష్ట్రంలో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావడం వలన తమకు పరిమితులుంటాయని కొందరు ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీమాంధ్ర నాయకుల గురించి ఇక్కడ ప్రస్తావించడం పార్టీ వ్యవహారంలో భాగంగా చూడాలని కూడా అంటున్నారు. తెలంగాణ ప్రజలు మెచ్చని విషయాలు కొన్ని నాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది. ఇది తమకు నచ్చడం లేదని తెలంగాణ సమాజం భావిస్తున్నది. తెలంగాణ ఉనికి, అస్థిత్వం ప్రత్యేకమైనదని రాష్ట్ర గేయాన్ని, చిహ్నాలను మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ ఆత్మను పట్టుకోలేక పోతున్నదనే ఆవేదనను చాలా తెలంగాణ వాదులు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పేదల కష్టసుఖాలను అర్థం చేసుకున్న నాయకునిగా ఆయనను తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇప్పటికీ ఆయనంటే అభిమానం ఉంది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు జలయజ్జం స్పూర్తి కొనసాగిస్తామని చెప్పడం సరైందేనా అని అంటున్నారు. పోతిరెడ్డి పాడు అంశం తెలంగాణ ఉద్యమం జరిగినన్నాళ్లు ప్రజల చర్చలో ఉన్నది. ఆ తర్వాత రాయలసీమ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాతి ఎన్నికల్లో ఫలితాల గురించి కాంగ్రెస్ నాయకులే మాట్లాడారు. మరిప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు జలయజ్జాన్ని ఎట్లా స్పూర్తిగా తీసుకుంటారనే ప్రశ్న వస్తున్నది.
కరువు జిల్లా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అట్లాగే ఉన్నది, ఆర్టీఎస్ గురించి చెప్పాల్సిన పని లేదు. జూరాల సాగు లెక్కల గురించి సరి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక గోదావరి విషయంలోనైతే ఇన్నాళ్లు పోలవరం గురించి మాట్లాడారు. తాజాగా బనకచర్ల అంటున్నారు. శ్రీరాంసాగర్లో నీటి నిల్వ ఎంతో తెలుసు. అక్కడి ప్రజలు బయటి దేశాల బతుకు దెరువు వెళ్తున్న విషయమూ తెలుసు. అలాంటప్పుడు మన ప్రజల. తమదైన కోణంలో పాలన సాగాలి కదా? తమదైన అభివృద్ధి నమునా ఉండాలికదా? ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రజలు వేస్తున్న ప్రశ్న.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమీ మారాలేదా? తెలంగాణ సోయే లేకుండా పోయిందా? అంటే అట్లా ఏమీ లేదు. కాకపోతే తెలంగాణదైన సిన్మా రంగం ఇంకా ఊపిరి పోసుకోలేదు. విద్యా వ్యవస్థలో ఇంకా మార్పులు రావాల్సి ఉంది. మన రాష్ట్రంలోని పేద, మధ్యతరగతికి చెందిన నిరుద్యోగులు చాలా మందే ఉన్నారు. వారు తమ బతుకు దెరువు కోసం ప్రైవేటు బడులు పెట్టుకుని బతికే స్థితి లేదు. మనదైన పారీశ్రామిక రంగం పురుడు పోసుకోలేదు. ఎన్నో సహజవనరులున్నాయి. వాటి పూర్తి వినియోగానికి ప్రణాళికలు ఆచరణలోకి రాలేదు. నీళ్లు, వనరులున్న ఆదిలాబాద్ వెనుకబడే ఉంది. కష్టంతో అయినా నీళ్లు తెచ్చుకుంటున్న ఉమ్మడి పాలమూరులో రావాల్సినంత మార్పు రాలేదు.
అంటే, మనదైన అస్థిత్వపు ఆలోచనాత్మక పరిపాలన, అందుకు తగిన అభివృద్ధి కార్యాచరణ తయారు కాలేదని స్పష్టంగా అర్ధమవుతోంది. వాస్తవానికి సోనియాగాంధీ చొరవ తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదికాదు. అదే సందర్భంలో రాజకీయ పార్టీగా టిఆర్ఎస్ లేకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆచరణలోకి వచ్చేదీ కాదు. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ ప్రాంత అస్థిత్వాన్ని మరువొద్దని ఈ ప్రాంత ప్రజల కోరిక. ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ విషయాన్ని విస్మరించిందాంటే లేదు. కానీ, ఆ సోయి రావాల్సినంతగా రావడం లేదు. ఉండాల్సినంతగా ఉండటం లేదు. తెలంగాణ అస్థిత్వపు ప్రణాళికలు తయారవుతున్నా అందులో తెలంగాణ ఆత్మ బలీయంగా ఉండాలన్నదే ఈ ప్రాంత ప్రజలు కోరుకునేది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.