ఇటీవల పెరిగిన కేసుల దృష్ట్యా పెద్ద ఎత్తున ఒక ప్రజా చైతన్య ప్రచారాన్ని చేపట్టడంతో పాటు, వైద్య సహాయాన్ని సిద్ధం చేయాలని ఆల్ ఇండియా ఆప్తాల్మోలాజికల్ సొసైటీ పిలుపునిచ్చింది.
న్యూఢిల్లీ: దీపావళీ సందర్భంగా చాలా మంది ప్రజల, ముఖ్యంగా పిల్లల కళ్లు “కార్బైడ్ తుపాకీ”ల వల్ల దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితి దృష్ట్యా దేశవ్యాప్తంగా పేలుడు పదార్ధాలను, పరికరాలను నిషేధించడంతో పాటు; ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని ఆల్ ఇండియా ఆప్తాల్మోలాజికల్ సొసైటీ కోరింది. అంతేకాకుండా వైద్య సహయాన్ని సిద్ధం చేయాలని తెలియజేసింది.
అఖిల భారత ఆప్తాల్మోలాజికల్ సోసైటీ ఈ నెల 24న ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో నీరు, కాల్షియం కార్బైడ్‌ను కలిపి పైపులతో తయారు చేసే కార్బైడ్ తుపాకులు విస్ఫోటనాన్ని సృష్టిస్తున్నాయని తెలియజేసింది. “అవి టపాసులు కావని రసాయన బాంబులని”; అంధత్వానికి, కళ్ల మంటలకు, వికారానికి ఈ బాంబులు కారణమవుతున్నాయని పేర్కొన్నది. తక్షణమే దేశవ్యాప్తంగా వీటిని నిషేధించాలని పిలుపునిచ్చింది.
నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలంటే ఎఫ్ఐఆర్లను నమోదు చేయాలని, అలాగే పిల్లలు ఇలాంటి పరికరాలతో ప్రయోగాలు చేయడాన్ని నివారించడానికి ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టి, కంటి గాయాల కేసులకు చికిత్సను అందించేందుకు 24 గంటల పాటు ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని అసోసియేషన్ సూచించింది.
“ఛత్‌పూజ, ఇతర పండుగలు కూడా సమీపిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన పరికరాలను నిరంతరం వాడడం వల్ల నివారించలేని మరో అంధత్వ సంక్షోభానికి, ముఖానికి తీవ్రగాయాలు ఏర్పడే పరిస్థితులకు దారి తీసే అవకాశాలు ఉంటాయి”అని సోసైటీ హెచ్చరించింది.
దీపావళీ పండుగను పురస్కరించుకొని చాలా మంది కార్బైడ్ తుపాకులను వాడారు. ఈ తుపాకులను పేల్చడం వల్ల పిల్లలు చూపును కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కేసులు ఎక్కువగా వెలుగుచూశాయి.
ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా కంటి గాయాల కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని భూపాల్ ప్రధాన వైద్య– ఆరోగ్య అధికారి ఏఎన్ఐకి తెలియజేశారు. గురువారంనాటికి రాజధాని నగరం దాని చుట్టూ 186 కేసులు నమోదైనట్లు ఆయన చెప్పారు. కార్బైడ్ తుపాకులు కలిగించిన నష్టాల కారణంగా రాష్ట్రంలో సుమారు 300 మంది ప్రజలు కంటి మంట, చీదర, చూపు కోల్పోవడం వంటి ఇబ్బందులతో బాధపడుతున్నారని తన పేరు వెల్లడించని ఒక ఆరోగ్య శాఖ అధికారి ఎన్డీటీవీకి తెలియజేశారు.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పేర్కొన్నట్లు ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనలో, కంటి గాయాల కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన పేలుడు పరికరాల ఉత్పత్తి, అమ్మకాలు, ఉపయోగాన్ని రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టుగా తెలియజేశారు. దీనిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
“కార్బైడ్ తుపాకులు, నిషేధిత పరికరాలలాంటి వాటికి వ్యతిరేకంగా ఆయుధాలచట్టం–1959,పేలుడు చట్టం– 1884, పేలుడు పదార్థాల చట్టం– 1908” కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వముఖ్య కార్యదర్శి అనురాగ్ జైన్ ఆదేశించినట్లు మరో ప్రకటన పేర్కొన్నది.
“గడచిన సంవత్సరాలలో కార్బైడ్ తుపాకుల వల్ల ప్రమాదాలు తక్కువ నమోదు అయ్యాయి. దీంతో వీటిపై ప్రజా చైతన్య కార్యక్రమాలను అసలే చేపట్టలేదు” అని ఒక ప్రభుత్వ అధికారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు.
“అప్రమత్తంగా లేకపోవడం వల్ల, సోషల్ మీడియా ద్వారా ఈ పరికరం(తుపాకీ) గురించి పిల్లలు తెలుసుకొని; ఎలా వీటిని వాడుతున్నారో, ఇది ఆరోగ్య సంక్షోభానికి ఎలా దారి తీసిందో అర్ధం చేసుకోవడంలో విఫలమైయ్యాము” అని ఆ అధికారి అంగీకరించారు.
కార్బైడ్ తుపాకుల ఉపయోగం వల్ల బీహర్, ఢిల్లీ ప్రజలు కూడా గాయపడినట్టుగా పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
“నివారించగల ఈ అంధత్వ గాయాలు పెరగడం ఆందోళన కలిగించే, అంగీకరించరాని విషయం. ప్రజల చూపును, వారి జీవితాలను రక్షించడానికి వెంటనే కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి” అని ఏఐఓఎస్ అధ్యక్షులు డాక్టర్ పార్థ బిస్వాస్ తెలియజేశారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
