బీహార్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ప్రకటించిన తాత్కాలిక వివరాల ప్రకారం రాష్ట్రంలో ఎన్నికల సమయానికి 7,41,92,357 మంది ఓటర్లు ఓటర్ల లెక్కింపు తర్వాత 7,45,26,858 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. సెప్టెంబరు 30 నాటికి వివాదాస్పదమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పూర్తి అయ్యింది. అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ పరిస్థితుల్లో అదనంగా లెక్కలోకి వచ్చిన మూడులక్షల పైచిలుకు ఓట్లు ఓటర్ల జాబితాలోకి ఎలా స్మగులయ్యాయి అన్నది దేశం సమాధానం తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న.
అయితే, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సందర్భంలోనే; ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ క్రమంలో ఎవరి పేర్లయినా నమోదుకాలేదని భావిస్తే, వాళ్లు పోలింగ్‌కు పది రోజుల ముందు లోపు ఓటు నమోదు చేయించుకోవచ్చని తెలియజేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఓటర్ల జాబితా ఫ్రీజ్ అవుతుంది. ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ ఇలా పోలింగ్‌కు పది రోజుల వరకూ ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగలేదు. ఈ సారి బీహార్‌కు మాత్రం ఎన్నికల సంఘం ఆ వరం ఇచ్చింది. దీనిపై చట్టబద్ధమైన ప్రశ్నలు, సాధారణ ప్రజల సందేహాలు ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలి కూడా 2024 లోక్‌సభ ఎన్నికల నాటి వ్యవహారశైలినే పోలి ఉంది. ఓటింగ్ పూర్తి అయిన తర్వాత ఓ గంట వ్యవధిలో మొత్తం పోలైన ఓట్లు ఎన్నో రిటర్నింగ్ అధికారి ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, తద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి చేరే అవకాశం ఉంది. కానీ ఎన్నికల సంఘం మాత్రం పోలైన ఓట్ల సంఖ్యను చెప్పకుండా ఎంత శాతం పోలింగ్ జరిగిందో చెప్పి ఊరుకుంటుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్క తేలే అవకాశం లేదు కాబట్టి, ఈ పోలైన ఓట్ల సంఖ్యలో మార్పులకు అవకాశం ఉంటుంది. ఈ వ్యవహారశైలి పైనే పౌర సమాజం చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.
అలా ఎలా సాధ్యం?
పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో 66.91 శాతం ఓట్లు పోలయ్యాయని, 1951 ఎన్నికల తర్వాత ఇదే అత్యధిక పోలింగ్ శాతమని ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రకటనలో తెలిపింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రెండు దశల పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్రంలో 37513302 మంది మహిళా ఓటర్లు; 37013556 మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే మొత్తం 74526858 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి 7,41,92,357 మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారని ప్రకటించిన విషయాన్ని ఎన్నికల సంఘం మర్చిపోయిందా?
లేక ఎన్నికల సంఘం ప్రకటించినట్లుగా ఓటర్ల జాబితాలో తమ పేరు కనిపించకపోతే; వారు పోలింగ్‌కు పది రోజుల ముందు వరకూ తమ పేరును జాబితాలో చేర్చుకునేందుకు వీలు కల్పించారు కాబట్టి, కనీసం పోలింగ్‌కు పదిరోజుల ముందు ఓ ప్రకటన జారీ చేసి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని, ఎంత మంది అదనపు ఓటర్లు తమ ఓటు హక్కు తిరిగి పొందారో వివరించి ఉండాల్సింది. కానీ అటువంటి ప్రకటన ఎక్కడా జారీ కాలేదు. కానీ పోలింగ్ పూర్తయ్యే సరికి మూడులక్షల పై చిలుకు అదనపు ఓటర్లు పుట్టుకొచ్చారు. ఇది ఎలా సాధ్యం? అంటే ఎన్నికల సంఘమే దొంగ ఓటర్ల కసరత్తులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వామిగా మారిందానే సందేశాలు ఈ వ్యవహారశైలిని బట్టే తలెత్తుతాయి.
ది క్వింట్ వార్త సంస్థ అందించిన కథనం ప్రకారం ఈ పెరిగిన ఓట్లు అత్యధికంగా గయ జిల్లాలో ఉన్నాయి. తర్వాత రోహతస్ జిల్లా ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచింది. గయలో 20456 మంది అదనపు ఓటర్లు తోడుకాగా, రోహతాస్ జిల్లాలో 20030 మంది, బోజ్‌పూర్‌లో 17930 మంది, పశ్చిమ చంపారన్‌లో 16649 మంది, పునియా జిల్లాలో 15639 మంది ఓటర్లు అదనంగా లెక్కకొచ్చారు. ఈ ఐదు జిల్లాల్లో 40 నియోజకవర్గాలు ఉంటే, అందులో 35 నియోజకవర్గాల్లో ఎన్డీయే గెలిచింది. స్థూలంగా చూసినప్పుడు మొత్తం రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్ధికి, ఓడిన అభ్యర్ధికి మధ్య ఉన్న తేడా కంటే కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో అకస్మాత్తుగా పెరిగిన ఓటర్ల సంఖ్యకు, పాలకపక్షం గెలుపుకు మధ్య సంబంధం ఉందా లేదానే ప్రశ్న పరిశీలకులకు తలెత్తటం సహజం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
