ఇరాన్ యుద్ధంలో రెండు వారాల పాటు ప్రకటించిన విరామం పట్ల తీవ్ర ఆందోళనలో ఉన్న ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.
ఇరాన్ ఒకవైపు, అమెరికా- ఇజ్రాయెల్ మరోవైపు ఆరు వారాల పాటు సాగించిన ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే దానిపై అంతులేని విశ్లేషణలు, ఊహాగానాలు సాగుతాయి.
ఇది యుద్ధానికి ముగింపు కాదు, కేవలం ముగింపు గురించిన ఒక ఆశ మాత్రమే కాబట్టి ఆ విశ్లేషణలకు ఇది సరైన సమయం కాదు.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ ప్రతిపాదించిన 10 డిమాండ్ల ఆధారంగా మరింత శాశ్వతమైన శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు.
అయితే ఇవన్నీ ఇరాన్ అడిగినవే తప్ప అమెరికా పెట్టిన షరతులు కావు. అమెరికా ఇంతకుముందు ముందుకు తెచ్చిన 15 అంశాల ప్రస్తావన ఇక్కడ లేదు.
ఏ చర్చల్లోనైనా ఇలా ఏకపక్షంగా ఉండటం అసాధారణం, ఇది ఇరాన్‌ను ప్రయోజనకరమైన స్థితిలో ఉంచుతుంది. యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ వైపు ఉన్న అత్యవసరాన్ని ఇది సూచిస్తుంది.
బహుశా పెరుగుతున్న యుద్ధ వ్యయం, కీలకమైన మధ్యంతర ఎన్నికలు జరగాల్సిన సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు ఇరాన్ ఊహించిన దానికంటే ఎక్కువ శక్తివంతంగా పోరాడుతోందని గుర్తించడం దీనికి కారణాలు కావచ్చు.
ఈ విరామాన్ని మరింత సుదీర్ఘ కాలం పాటు పొడిగించాలని అమెరికా కోరుకుంటుందని భావించవచ్చు. కానీ ట్రంప్ అనూహ్యమైన, ఆవేశపూరితమైన నిర్ణయాలు ఏ హేతుబద్ధమైన లెక్కలనైనా తలకిందులు చేయగలవు.
తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఇరాన్ నాగరికతను “తుడిచిపెడతాను” అని ఈ కాల్పుల విరమణకు కేవలం కొద్ది గంటల ముందే ఆయన బెదిరించారు.
మధ్యవర్తిగా పాకిస్థాన్ – వ్యూహాత్మక మౌనంలో భారత్..
ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో జరగనున్న ప్రతిపాదిత చర్చల్లో పాకిస్థాన్ నిస్సందేహంగా ఒక కీలక మధ్యవర్తిగా అవతరించింది.
ఇరాన్ పార్లమెంటు(మజ్లిస్) స్పీకర్ ఎంబీ గాలిబాఫ్ ఇరాన్ బృందానికి నాయకత్వం వహిస్తారని సమాచారం.
అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహించవచ్చు. ఇందులో చైనా నేరుగా కనిపించకపోయినా దాని ప్రభావం బలంగా ఉంటుంది.
కాల్పుల విరమణకు చైనా చేసిన కృషికి ట్రంప్ బహిరంగంగానే ప్రశంసలు ఇచ్చారు.
పాకిస్థాన్ మాత్రం విచ్ఛిన్నకారిగా కాకుండా నమ్మకమైన మధ్యవర్తిగా భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యతను తిరిగి పొందినందుకు సంబరాలు చేసుకుంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
1971లో హెన్రీ కిస్సింజర్ చైనాలో రహస్య పర్యటన చేయడానికి పాకిస్థాన్ మార్గం సుగమం చేసినప్పటి రోజులను ఇది గుర్తుచేస్తోంది.
గల్ఫ్, పశ్చిమాసియాలో భారత్ ఒక ప్రధాన భాగస్వామి అయినప్పటికీ- ఇప్పుడు కేవలం బయటి నుంచి చూసే పరిస్థితి రావడం ఇస్లామాబాద్‌కు ఆనందాన్ని ఇస్తుంది.
అటు వాషింగ్టన్, ఇటు బీజింగ్ రెండు దేశాల అండ ఉందని భావించి, పాకిస్థాన్ మరోసారి భారత్‌పై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే ఉత్సాహం చూపవచ్చు.
గల్ఫ్ దేశాలతో రక్షణ, వాణిజ్య బంధాలు..
ఈ కొత్త పరిస్థితిని ఎదుర్కోవడంలో, తీవ్రమైన ప్రకటనలు చేయడం లేదా దూకుడుగా దౌత్యం నెరపడం వికటించవచ్చు.
చర్చల పురోగతిని పర్యవేక్షించడం, మన గల్ఫ్- పశ్చిమాసియా భాగస్వాములకు మన చిత్తశుద్ధిని, మద్దతును తెలియజేయడం వివేకం.
విధ్వంసకర యుద్ధ పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో వారు బలమైన, నమ్మకమైన భాగస్వాములకు ప్రాధాన్యత ఇస్తారు.
ఈ ప్రాంతం తమ భద్రతా వ్యవస్థను పునఃసమీక్షించుకుంటుంది, ఇది ఇప్పటివరకు అమెరికా ఏర్పాటు చేసిన సైనిక స్థావరాలపై ఆధారపడి ఉంది.
కానీ ఇవి ఇరాన్ నిరంతర క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి వారిని రక్షించడంలో విఫలమయ్యాయి.
అమెరికన్లకు తమ భద్రతా అవసరాల కంటే ఇజ్రాయెల్ రక్షణే ఎప్పుడూ ప్రాధాన్యత అని కూడా వారికి స్పష్టమైంది.
అమెరికాపై ఆధారపడటానికి తక్షణ ప్రత్యామ్నాయం లేనప్పటికీ, వైవిధ్యీకరణ ప్రక్రియ అనివార్యంగా జరుగుతుంది.
ఈ దేశాలతో రక్షణ సహకారాన్ని పెంచుకోవడం ద్వారా భారత్ ఈ ప్రక్రియలో ముందువరుసలో నిలవాలి.
భారత్‌కు అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో, మారిపోయిన భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత స్థాయి చర్చల ద్వారా ఇది జరగాలి.
యుద్ధంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం, పునరావాస కార్యక్రమాలు కూడా భారతీయ కంపెనీలకు నిర్మాణత్మక పాత్ర పోషించడానికి అవకాశాలను అందిస్తాయి.
మన కంపెనీలు ఇప్పటికే ఈ ప్రాంతంలో బాగా స్థిరపడి మంచి భాగస్వామ్యాలను అభివృద్ధి చేసుకున్నాయి.
ఇరాన్, ఇజ్రాయెల్‌తో సంబంధాల పునఃసమీక్ష..
పశ్చిమ సరిహద్దులో స్థిరమైన భద్రతా వ్యవస్థకు భారత్ గణనీయమైన సహకారం అందించాలంటే, ఇజ్రాయెల్- ఇరాన్‌లతో తన సంబంధాలను పునఃసమీక్షించుకోవాలి. ఇజ్రాయెల్ మనకు విలువైన భద్రతా భాగస్వామిగానే ఉంటుంది, కానీ అది మన ప్రయోజనాలకు అనుగుణంగా ఆ ప్రాంతంలోని ఇతర దేశాలతో మన సంబంధాలను కొనసాగించడాన్ని నిరోధించకూడదు.
ఇరాన్, టర్కీలను మినహాయించి I2U2(ఇజ్రాయెల్, ఇండియా, యూఏఈ, యూఎస్); ఐఎంఈసీ(ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్) వంటి చొరవలను అనుసరిస్తున్నప్పుడు మనం ఇరాన్‌తో మన సంబంధాలను పక్కనపెట్టామని అంగీకరించాలి.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, ఆ ప్రాంతంలో అమెరికా పాత్ర సమస్యాత్మకంగా మారింది. అలాగే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల మధ్య సహకార నెట్వర్క్ ఏర్పడే అవకాశం కూడా సంక్లిష్టంగా మారింది.
ఇజ్రాయెల్‌ను కీలక మూలస్తంభంగా చేసుకుని అమెరికా నేతృత్వంలో ఆ ప్రాంతంలో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
ఇలాంటి ఏర్పాట్లలో భారత్ చేరడం గతంలో కొంత సమంజసంగానే ఉన్నప్పటికీ, ఇప్పుడు దాని ప్రాసంగికతను కోల్పోయి ఉండవచ్చు. రాబోయే చర్చల్లో ఏమి జరిగినప్పటికీ, యుద్ధం ద్వారా ఉత్పన్నమైన ఈ విస్తృత పోకడలను జాగ్రత్తగా అంచనా వేసి తదనుగుణంగా వ్యవహరించాలి. ఎల్లప్పుడూ మారుతున్న పరిస్థితుల కంటే ముందుండటం మంచిది.
పడిపోయిన అమెరికా ప్రతిష్ట – పెరిగిన చైనా ప్రాబల్యం..
మరి విస్తృతమైన భౌగోళిక రాజకీయ సమీకరణాల మాటేమిటి? అదుపులేని హింసకు పాల్పడటం; విశ్వసనీయమైన ఫలితాలతో కూడిన మెరుగైన వ్యూహాన్ని అనుసరించలేకపోవడం వల్ల అమెరికా తన ప్రతిష్టకు తీవ్రమైన నష్టాన్ని చవిచూసింది. వ్యూహాల్లో గెలిచినా, అమెరికా యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నాటో, యూరోపియన్ మిత్రదేశాల మద్దతు కూడగట్టడంలో అమెరికా విఫలం కావడం ఇదే తొలిసారి. స్పష్టమైన గుర్తింపు, ఉమ్మడి విలువలు కలిగిన “పశ్చిమ దేశాలు” అనే కూటమి ఇక లేదనే భావనను ఇది నిర్ధారిస్తోంది. అనుకోకుండానే చైనా ప్రతిష్ట పెరిగింది, కొంతవరకు రష్యాది కూడా.
ఇండో-పసిఫిక్ ప్రాంతంపై అమెరికా దృష్టి తగ్గుతుందని భావించాలి. ఇరాన్ యుద్ధం కారణంగా దాని సైనిక సంపద హరించుకుపోయింది. వాటిని తిరిగి సమకూర్చుకోవడానికి సమయం పడుతుంది.
ఈ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలు, భాగస్వాములు ఇప్పటికే తమ భద్రతను అమెరికాకు అప్పగించడం పట్ల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా తమ భద్రతపై ఆందోళన చెందుతున్నాయి.
తూర్పున తలెత్తుతున్న కొత్త సవాళ్లు..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు తైవాన్ ప్రతిపక్ష నేత, కేఎంటీ పార్టీ అధినేత బీజింగ్‌లో పర్యటించడాన్ని కూడా గమనించాలి.
తైవాన్ నాయకులు, ప్రజలు తమ రక్షణ కోసం ఇక అమెరికాపై ఆధారపడలేరని నమ్మించడం ద్వారా తైవాన్ను ప్రధాన భూభాగంతో ఏకీకృతం చేయడానికి చైనా దీన్ని ఒక అవకాశంగా భావిస్తోంది.
వచ్చే నెలలో ట్రంప్ చైనా పర్యటన, అమెరికా-చైనా సమీకరణాలు చైనా వైపు ఎంతలా వొరిగాయో స్పష్టం చేయవచ్చు. పశ్చిమ సరిహద్దులో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే, మన తూర్పు సరిహద్దులో వస్తున్న ఈ మార్పులు భారత దౌత్యానికి అదనపు సవాళ్లను విసురుతాయి. వాటిపై ప్రత్యేకమైన అధ్యయనం అవసరం.
(రచయిత మాజీ విదేశాంగ కార్యదర్శి)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
