
ఉమర్ ఖాలిద్ జైలు జీవితానికి ఐదేళ్లు నిండాయి. అయినా సరే అతనికి బెయిల్ నికారించటం, నిరాకరించటానికి గల అర్థవంతమైన కారణాల పట్ల న్యాయస్థానం దృష్టి సారించకపోవటం, కనీసం తన నిర్ణయాన్ని సమర్ధించుకోవడానికి కూడా ప్రయత్నించకపోవటం దారుణం.
ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్‌తో పాటు మరో తొమ్మిది మందికి బెయిల్ నిరాకరిస్తూ సెప్టెంబరు రెండో తేదీన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యాఖ్యానం రాసే సమయానికి ఈ కేసులో నిందితుల ఎటువంటి విచారణ ప్రారంభం కాకుండానే, ఐదేళ్ల పాటుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు.
ఇంతకు పూర్వం రాసిన వ్యాఖ్యానాల్లో జిల్లా కోర్టు, హైకోర్టు ఖాలిద్‌తో పాటు మరో ఎనిమిది మందికి బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఆదేశాలను పరిశీలించాను. స్టెనోగ్రాఫర్ ఫర్ ది ప్రాసెక్యూషన్, ఫర్గెటింగ్ ది బేసిక్స్ పేర్లతో రాసిన వ్యాఖ్యానాల్లో ఈ రెండు కోర్టుల ఆదేశాలు నిందితులకు న్యాయం అందించేందుకు బదులుగా న్యాయాన్ని తప్పుదారిపట్టిస్తున్నాయని వ్యాఖ్యానించాను(మిస్ కారేజ్ ఆఫ్ జస్టిస్).
న్యాయస్థానం ముందుకొచ్చిన సాక్ష్యాధారాల బలాబలాలను అంచనా వేసి తీర్పు ఇవ్వడానికి బదులు ఈ రెండు న్యాయస్థానాలూ ప్రాసెక్యూషన్ వారి వాదనల్లో లోపాలను పూరించేందుకు పూనుకున్నాయి. ఈ ప్రయత్నంలో అనవసరమైన జోక్యానికి, అపోహలకు, కోర్టు ముందున్న సాక్ష్యాధారలను వక్రీకరించటం, తర్కానికీ, న్యాయానికి అంతుచిక్కని కారణాలను వెతకటం వంటి చర్యలకు పాల్పడటం విడ్డూరం.
ఉమర్ ఖాలిద్‌కు సంబంధించి తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పును ఈ వ్యాసంలో విశ్లేషిస్తున్నాను. (ప్రాథమిక వాదనలు పూర్తయిన మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ తీర్పు వచ్చింది. సత్వర న్యాయమన్న సూత్రానికి విలువ ఏమి ఉంటుంది?)
ముందుగా ప్రాథమిక వ్యాఖ్యానం. ఫిబ్రవరి 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన మతోన్మాద కలహాల నేపథ్యంలో నమోదైన కేసునే ఢిల్లీ అల్లర్ల కేసు అంటున్నారు. ఈ ఘర్షణల్లో 54 మంది ప్రజలు మరణించారు. మరెంతో మంది గాయపడ్డారు.
ఈ కేసుల్లో నిందితులైన వ్యక్తులు 2019 డిసెంబరు, 2020 జనవరిలో ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగిన మహోద్యమంలో భాగస్వాములుగా ఉన్నారు.
ఈ తొమ్మిది మందిలో ఏ ఒక్కరూ బహిరంగ హింసాత్మక చర్యలకు పిలుపునిచ్చినవారూ, అటువంటి చర్యలకు పాల్పడినవారూ కాకపోవటం ప్రాసిక్యూషన్‌కు సమస్యగా మారింది. ఈ లోపాన్ని అధిగమించటానికి ప్రాసిక్యూషన్ కుట్రకోణాన్ని తెరమీదకు తెచ్చింది. ఈ తొమ్మిదిగురూ బయటికి ఏమి చెప్పినా లోగుట్టుగా మాత్రం హింసాత్మక చర్యలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నారన్నది ప్రాసిక్యూషన్ ఆరోపణ. ఈ వాదనను సమర్ధించుకునేందుకు ప్రభుత్వం రెండు అంశాలపై ఆధారపడింది. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలు. (ఇటువంటి సాక్ష్యులను విచారించేందుకు నిందితుల తరఫున వాదించే న్యాయవాదులకు అవకాశం, అనుమతి ఉండవు). ఈ తొమ్మండుగురు కొన్ని సందర్భాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడటం గురించి మాట్లాడుకోవటం విన్నామని ఈ రక్షిత సాక్షులు పోలీసువారికి నివేదించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.
ఢిల్లీ అల్లర్ల తర్వాత, అంతకు ముందు కొన్ని వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫోన్లల్లోనూ జరిగిన సంభాషణల్లో ద్వంద్వార్ధాలు వచ్చేలా ఉన్న మాటలను పోలీసులు తమ వాదనలకు సమర్ధనగా చూపిస్తున్నారు.
ఇటువంటి పరోక్ష సమాచారం, సాక్ష్యాలు ఆధారంగా విచారణ చేయాల్సి వచ్చినప్పుడు న్యాయస్థానం రెండు అంశాలు గమనంలోకి తీసుకోవచ్చు. మొదటిది బెయిల్ నిరాకరణ వలన కలిగే తీవ్ర పర్యవసానాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు, న్యాయస్థానం ఇటువంటి సాక్ష్యాలు పరిగణనలోకి తీసుకునేటప్పుడు కళ్లు తెరిచి వ్యవహరించటం(అప్రమత్తంగా వ్యవహరించటం) ఒకటి. ఇలా చేయాలంటే ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారాలు నిర్దిష్టంగానూ, ప్రత్యేకమైనవిగానూ ఆరోపణలకు రుజువుచేయటానికి వీలుగా ఉన్నాయా లేవా అన్నది చూడాలి. లేదా కళ్లుమూసుకుని గుడ్డిగా వ్యవహరించటం. ఈ కోణంలో న్యాయస్థానం కేవలం ప్రాసిక్యూషన్ ముందుకు తెచ్చిన సాక్ష్యాధారాలను యథాతథంగా స్వీకరించటమే కాక ఆయా సాక్ష్యాధారాలకు ప్రాసిక్యూషన్ చెప్పే తాత్పర్యాన్ని కూడా స్వీకరిస్తుంది.
సుదీర్ఘ జైలు జీవితం తర్వాత వెలువడిన తీర్పులు..
భారతీయ న్యాయ వ్యవస్థలో ఈ రెండూ ధోరణలూ కనిపిస్తాయి. దీనికి కారణం ఆయా కేసుల్లో ఆయా సందర్భాల్లో జోక్యం చేసుకున్న న్యాయమూర్తుల వ్యక్తిత విచక్షణలు కారణం. కొన్ని సందర్భాల్లో ఒకే న్యాయమూర్తిలో కొన్నినెలల వ్యవధిలోనే ఈ రకమైన రెండు ధోరణులూ వ్యక్తమవుతాయి. ఈ విషయం ఉమర్ ఖాలిద్ స్పష్టంగా గుర్తించే ఉంటారు. మనిషిలో ఉన్న ద్వంద్వాత్మకత అది.
ఇంతకు ముందు రాసిన రెండు వ్యాసాల్లో జిల్లా కోర్టు, హైకోర్టులు ఉమర్ ఖాలిద్ పట్ల అనుసరించిన వైఖరి కళ్లు మూసుకుని వ్యవహరించే ధోరణికి నిదర్శనం. పైగా రక్షిత సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఏళ్ల తరబడి ఆరోపితులు జైళ్లల్లో మగ్గటం ఓ విషాదం అయితే, అటువంటి రక్షిత సాక్షులు ఇచ్చిన ప్రకటనలు కూడా అంతే గందరగోళంగా ఉండటం మరో విషాదం. మరో వింతేమిటంటే ఈ రక్షిత సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జిల్లా న్యాయస్థానం ‘‘వేర్వేరు వ్యక్తులు ఎలా ఒకరితో ఒకరు సంప్రదించుకుని ఒకచోటికి చేరారో ఫోన్ కాల్స్ ద్వారా వెల్లడవుతుంది’’ అని తీర్పులో వ్యాఖ్యానించింది.
ఉమర్ ఖాలిద్ చేసిన నేరం ఏమిటి? ఆయన కొన్ని సమావేశాల్లో పాల్గొనటం, కొన్ని వాట్సప్ గ్రూపుల్లో భాగస్వామిగా ఉండటం, డొనాల్డ్ ట్రంప్ పర్యటన గురించి ఉపన్యాసానాల్లో ప్రస్తావించటం. స్థూలంగా చెప్పాలంటే ఖాలిద్ నేరస్తుడని నిర్ధారించటానికి న్యాయస్థానం పరిగణించిన విషయాలు: (అ) వాట్సప్ గ్రూపుల్లో సభ్యుడుగా ఉండటం, (ఆ) వివిధ సభలు, సమావేశాల్లో పాల్గొనటం. వీటి గురించి రక్షిత సాక్షులు ఇచ్చిన వివరాలు కూడా గందరగోళంగానే ఉన్నాయి. (ఇ) ఘర్షణలు జరిగిన తర్వాత వేర్వేరు వ్యక్తుల మధ్య జరిగిన ఫోను సంభాషణల్లో ఖాలిద్ పేరు ప్రస్తావనకు రావటం.
హైకోర్టు మరో అడుగు ముందుకేసింది. విప్లవాభినందనలు, విప్లవ శుభాకాంక్షలు అంటూ ఉమర్ ఖాలిద్ ఉపన్యాసాల్లో మాట్లాడటమే నేరం. ఎందుకంటే సాధించదల్చుకున్న విప్లవం రక్తరహిత విప్లవంగా ఉంటుందని స్పష్టం చేయలేదు. కాబట్టి, దాని అర్థం రక్తపాతానికి సిద్ధపడినట్లే కదా అన్న అంతరార్థం తీసుకున్నది హైకోర్టు(పదేపదే తన ఉపన్యాసంలో శాంతియుతమైన అహింసాత్మక నిరసనల అవసరం గురించి ప్రస్తావించిన విషయాలను న్యాయస్థానం పట్టించుకోలేదు). గతంలో రాసినట్లుగానే జిల్లా కోర్టు నిర్ధారణలకు అదనంగా హైకోర్టు తీర్పు ఉంది.
‘‘చక్కా జాంకు పిలుపునివ్వటం అంటే హింసాత్మక చర్యలకు పాల్పడమని జనాన్ని ప్రేరేపించటమే. వాట్సప్ గ్రూపుల్లో సభ్యుడుగా ఉండటం అంటే, కుట్రలో భాగస్వామిగా ఉండటమే. మత కలహాలు మొదలైన తర్వాత ఆందోళనల్లో పాల్గొంటున్న వారి మధ్య పెద్ద సంఖ్యలో ఫోన్ సంభాషణలు జరగటం కుట్ర జరిగిందని చెప్పటానికి ఆధారం. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఉమర్ ఖాలిద్ పాల్గొనటం, ఘర్షణలకు దారితీసిన కుట్రలో భాగస్వామ్యం కావటమే’’ అనే అంశాలపై ఆధారపడి ఇచ్చిన తీర్పు.
ఖాలిద్ ఎటువంటి విచారణ లేకుండా రెండేళ్లు జైల్లో మగ్గిన తర్వాత 2022లో పైన ప్రస్తావించిన జిల్లా న్యాయస్థానం, హైకోర్టు ఈ తీర్పులిచ్చాయి. మరో మూడేళ్ల తర్వాత అదే నిందితుడు విచారణ లేకుండా ఐదేళ్లు జైల్లో గడిపిన తర్వాత సమస్య న్యాయస్థానం ముందుకు వస్తే న్యాయస్థానం తీసుకున్న వైఖరిని సమర్ధించుకోవడానికైనా కనీసం కొన్ని వివరణలు ఇస్తుందని ఆశిస్తున్నారా? అటువంటిదేమీ లేదు. ఏ రూపంలో చూసినా నవీన్ చావ్లా, శైలేందర్ కుమార్‌లు ఇచ్చిన తీర్పుపై రెండు తీర్పులకంటే అధ్వాన్నంగా ఉంది.
మూడేళ్ల క్రితం వచ్చిన జిల్లా న్యాయస్థానం తీర్పు, హైకోర్టు తీర్పు కనీసం కోర్టు ముందు కొచ్చిన సాక్ష్యాధారాలపై వ్యాఖ్యానించేందుకు ప్రయత్నించాయి. అది కూడా వికృత వ్యాఖ్యానమే అనుకోండి. కానీ తాజాగా వచ్చిన తీర్పు కనీసం ఆ మాత్రం ప్రయత్నం కూడా చేయలేదు.
తాజాగా ఇచ్చిన తీర్పులో పేరా 133, 134లో హైకోర్టు, ‘‘అప్పీలు చేసుకున్న ఉమర్ ఖాలిద్ 2020 ఫిబ్రవరి 17న అమరావతిలో జరిగిన సభలో ఉపన్యసించాడు. అమెరికా అధ్యక్షుడు భారతదేశ పర్యటనకు వస్తున్న తరుణంలో 2020 ఫిబ్రవరి 24న నిరసనలకు పిలుపునిచ్చాడు. ప్రాసిక్యూషన్ అభియోగం ప్రకారం, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు 2020 ఫిబ్రవరి 23/24న అల్లర్లకు కుట్ర పన్నే ఉద్దేశ్యంతోనే ఈ నిరసనలకు పిలుపునిచ్చాడు. నిందితుడి పాత్ర గురించి ప్రాసిక్యూషన్ ముందుకు తెచ్చిన పై పరిశీలనను తేలిగ్గా తోసిపుచ్చటానికి అవకాశం లేదు’’ అని వ్యాఖ్యానించింది.
ఈ మొత్తంలో కనిపించనది ఏమిటంటే, ఉమర్ ఖాలిద్ అమరావతి సభలో ఏమి మాట్లాడాడన్న దాని గురించిన విశ్లేషణ. పైన ప్రస్తావించినట్లు హైకోర్టు ఖాలిద్ మాటలను హింసించి హింసించి వికృతార్థం చెప్పింది. అంటే కనీసం కొన్ని మాటలు, ఆ తర్వాత జరిగిన హింస, ఈ రెండింటి మధ్య సంబంధం ఏదో ఉందన్నంత వరకైనా 2022 నాటి తీర్పు చర్చించింది.
మంగళవారం ఇచ్చిన తీర్పులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ మాత్రం న్యాయపరమైన బాధ్యతల నుండి కూడా తనను తాను విముక్తి చేసుకుంది. హైకోర్టు మాటలు నెమరు వేసుకోవాలంటే ‘‘ఓ మనిషి ఏదో అన్నాడు. తర్వాత హింస జరిగింది. ఇదే కుట్ర జరిగిందని చెప్పటానికి సాక్ష్యమని ప్రాసిక్యూషన్ చెప్తోంది. అంటే అంతే జరిగి ఉంటుంది.’’
నిజానికి ఖాలిద్ చేసిన పనేమిటో చెప్పకుండా తీర్పులోని 136వ పేరాగ్రాఫ్‌లో హైకోర్టు ‘‘రెచ్చగొట్టే ఉపన్యాసాలుగా చెప్పబడుతున్న మాటలు’’ అని ప్రస్తావించి చేతులు దులిపేసుకుంది. హైకోర్టుకున్న ఈ అవగాహన గురించి తీర్పులో 135వ పేరాగ్రాఫ్లోనే కొంత సూచన కనిపిస్తోంది. ఈ పేరాగ్రాఫ్‌లో హైకోర్టు ‘‘పౌరసత్వ సవరణ చట్టం ముస్లిం వ్యతిరేక చట్టమని నమ్మించేందుకు ఖాలిద్ తప్పుడు విషయాలు ప్రచారం చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించారన్నది ప్రాసిక్యూషన్ అభియోగం.’’
ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వకుండా ఐదేళ్ల పాటు జైల్లో మగ్గేలా చేయటానికి ఇదే ప్రమాణమయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(అ)కు కాలం చెల్లిందని తొలగించాల్సి ఉంటుంది. హైకోర్టు అనుసరించిన పద్ధతి ఏ మాత్రం న్యాయప్రమాణం కాదు.
చివరకు హైకోర్టు కూడా తన తీర్పు సమర్ధించుకునేందుకు తిప్పలుపడుతోంది. తర్వాతి విశ్లేషణల్లో కొన్ని ప్రమాదకరమైన పదాలు కూడా వాడింది. షార్జిల్ ఇస్లాంతో కలిసి ఖాలిద్ ‘‘ఈ కుట్రకు అవసరమైన మేధో చట్రాన్ని సిద్ధం చేశారు’’ అని నిర్ధారించింది. అసలు మేధో చట్రం అంటే ఏమిటి? దాన్ని ఎవరు ఎలా తయారు చేస్తారు? దాన్ని నిర్వచించటం ఎలా? చట్టం అటువంటి భావన గురించి ఏమి చెప్తోంది?
ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న అంశం ఏమిటంటే 2022 నాటి తీర్పుల్లో లాగానే ఈ తీర్పులో కూడా ఖాలిద్‌కు సంబంధించిన స్పష్టమైన, తోసిపుచ్చ వీలులేని సాక్ష్యాధారాలేమీ దొరకలేదు. అందువల్లనే ఇటువంటి పదబంధాల మాటున న్యాయస్థానం తలదాచుకొంది. అసలు ఎవరినైనా మేధోచట్రం నిర్మాతలు అని వ్యాఖ్యానించి అసలు విషయాన్ని అక్కడితో వదిలేయాల్సిన అవసరం ఏమిటి? ఇటువంటి వైఖరిని అర్థంపర్ధంలేని న్యాయ తత్వమని వ్యాఖ్యానించాను.
న్యాయస్థానాలు తమకు ఇష్టం వచ్చిన పదాలు ఇష్టం వచ్చిన రీతిలో వ్యాఖ్యానించి ఆయా పదాల మూలార్థంతో నిమిత్తం లేకుండా వాడేసే పద్ధతి ఇది. ఎందుకంటే న్యాయస్థానాలకు పదాలు సృష్టించటం, ఆ పదాలకు అర్థాలు సమకూర్చటం వంటి రాజ్యం ద్వారా సంక్రమించిన అధికారాలు ఉన్నాయి కదా.
ఖాలిద్ తరఫున, ఆ మాటకొస్తే ముద్దాయిలు అందరి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఎటువంటి విచారణ లేకుండా ఐదేళ్లపాటు జైల్లో మగ్గుతున్న వారికి ఆర్టికల్ 21 కింద బెయిల్ ఇవ్వచ్చని తగిన వివరాలు, విశ్లేషణలు న్యాయస్థానం ముందుంచారు. కేజే నజీబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. ఖాలిద్ తరఫున న్యాయవాది వినిపించిన వాదనలను ప్రస్తావిస్తూ న్యామూర్తులు చావ్లా, కౌర్‌ల నిర్ధారణలు కొంతమంది న్యాయ నిపుణులు, విశ్లేషకుల మాటల్లో ‘న్యాయవ్యవస్థ రాక్షసత్వం’ అని చెప్పొచ్చు.
హైకోర్టు చెప్పిన విషయాలు ఇవి: ‘‘ఆలస్యం, నిరవధికంగా జైల్లో మగ్గటానికి సంబంధించినంత వరకూ తాజా కేసులో అత్యంత సంక్లిష్టమైన సమస్యలు ఇమిడి ఉన్నాయి. విచారణ తనదైన సహజ వేగంతో పురోగమిస్తోంది’’అని వ్యాఖ్యానించి చేతులు దులిపేసుకుంది.
ఒక్కోసారి మనుషులు ఇలా ఎందుకు మాట్లాడామాని తమను తామే నిందించుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఎమర్జెన్సీ సమయంలో న్యాయస్థానం కొన్నికొన్ని సందర్భాల్లో జైల్లో ఉన్న ఖైదీల హక్కుల గురించి మాట్లాడుతూ, ప్రభుత్వం వాళ్లను అల్లుళ్ల రూపంలో చూసుకుంటుందని వ్యాఖ్యానించింది. ఇలాంటి కొన్ని పదాలు యావత్ వ్యవస్థనూ భ్రష్టుపట్టిస్తాయి. ఇటువంటి పదాలు వ్యవస్థకు ఎంతటి అపకీర్తిని మూట కట్టాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
చరిత్ర పుస్తకాల్లో జోసెఫ్ స్టాలిన్ నడిపిన మాస్కో విచారణలు(1936– 1938) గురించి చదువుకున్నాము. ఈ నామ్‌కే వాస్తే విచారణల్లో పాత తరానికి చెందిన బోల్షివిక్కులు, స్టాలిన్ సహచరులను ఎంతో మందిని కుట్ర సిద్ధాంతాన్ని సాకుగా చూపించి హతమార్చారు. ఈ విచారణలకు ఆధారం చెప్పుడు తప్పుడు సాక్ష్యాలు.
తర్వాతి కాలంలో జరిగిన పరిశీలనలు, పరిశోధనలు ఈ సాక్ష్యాలన్నీ న్యాయ ప్రమాణాలను పూర్తిగా ఉల్లంఘించాయని, సాక్ష్యాలను న్యాయస్థానంలో నిరూపించే విధి విధానాలు, ఉరిక్షలు వేయటానికి లేదా దీర్ఘకాలం జైలు శిక్ష విధించటానికి కావల్సిన సమర్థనలు, మహాకుట్ర జరిగిందన్న ఆరోపణలు(ట్రాట్స్కీని కుట్రకు పెద్ద తలకాయ అన్నారు అప్పట్లో)వంటి వన్నీ ఉన్నాయి.
ఆధునిక సమాజం చట్టపరమైన పాలన నుంచి వైదొలగే దిశగా పడిన అడుగుల గురించిన కథనాలు మాస్కో ట్రయల్స్ పేరుతో జరిగిన విచారణలతో పునాదులు వేసిన సందర్భంగా చరిత్ర పుటలకెక్కింది. ఇటువంటి పునాదలపై ఆధారపడి నిర్మితమైన సమాజం నైతికంగా అధఃపాతాళానికి చేరుతుంది. ఇక్కడ చరిత్ర నుంచి పోల్చాల్సిన పనేమీ లేదు. చరిత్ర యధాతథంగా పునరావృతం కాదు. కానీ దానికంటూ ఓ యతి ప్రాసలున్నాయి. చరిత్ర అంతిమ తీర్పునిస్తుందనటంలో సందేహం లేదు. కానీ ఇది బాగా ఆలస్యంగా వస్తుంది. పరిమితంగానూ ఉంటుంది.
ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న తొమ్మిది మంది విషయంలో కూడా చరిత్ర ఇచ్చే తీర్పు ఆలస్యం కాబోదని ఆశిద్దాం. వాళ్లు జైల్లో నెలలు, ఏళ్ల పాటు మగ్గిన జీవితానికి వెలకట్టాల్సిన సందర్భం రాబోదని ఆశిద్దాం.
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత న్యాయవాది. ఈ వ్యాసం మొదట తన సొంత బ్లాగ్‌లో ప్రచురించబడింది. శైలికోసం కొద్దిపాటి సవరణలతో ది వైర్లో ప్రచురితమైంది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.