బీహార్‌లో చట్టబద్ధత కంటే ఎస్ఐఆర్ అమలుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, లోపభూయిష్ట ఎన్నికల ప్రక్రియను సుప్రీంకోర్టు చట్టబద్ధం చేసే ప్రమాదం ఉంది.
కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన చట్టపరమైన సవాళ్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
కేసు ముఖ్యమైన అంశాలు వాటి సొంత పోస్ట్‌కు అర్హమైనప్పటికీ, 2025 జూలైలో ప్రారంభించబడిన సవాలును ముగించడానికి ఏడు నెలలు పట్టింది.
రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను చట్టబద్ధంగా ప్రశ్నార్థకమైన రీతిలో సవరించినప్పటికీ- బీహార్ ఎన్నికల ఫలితాలను సమర్థవంతంగా ఎలా పవిత్రం చేసిందో అడగడం విలువైనది, మంచిది.
ప్రస్తుతం ఎక్కువగా గుర్తించబడిన న్యాయపరమైన ఎగవేత వ్యూహానికి భిన్నంగా సుప్రీంకోర్టు ఆలస్యానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
ఎస్ఐఆర్ కేసు క్రమం తప్పకుండా, తరచుగా వారానికి చాలాసార్లు విచారణకు వచ్చింది. అయినా కానీ, ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉండే రాజ్యాంగ సవాళ్లను కోర్టులు వినడానికి నిరాకరిస్తున్నాయి.
బదులుగా ఈ పోస్ట్‌లో నేను వాదించినట్లుగా, ఎస్ఐఆర్ సవాలులో ఆలస్యం అనేది బీహార్‌లో ఎస్ఐఆర్ చట్టబద్ధతను; అమలు ఆందోళనల తీర్పును వేరు చేయడంలో, సముచితంగా క్రమం చేయడంలో విఫలమవడం వల్ల వచ్చింది. ఇది చాలా విస్తృతమైన పరిణామాలతో కూడిన వైఫల్యం.
రెండు రకాల న్యాయ సమీక్షలు
మొదటగా, భారతీయ న్యాయస్థానాలు చేపట్టే రెండు రకాల న్యాయ సమీక్షల మధ్య తేడాను గుర్తించడం అవసరం.
మొదటి రకం న్యాయ సమీక్షలో, కోర్టులు శాసన లేదా కార్యనిర్వాహక చర్య చట్టబద్ధతను నిర్ణయిస్తాయి.
ఈ వ్యాసం ప్రయోజనాల కోసం, దీనిని మనం ‘చట్టబద్ధత’ సమీక్ష అని పిలవవచ్చు.
సమీక్షకు గల కారణాలు(ఉదాహరణకు హక్కుల ఉల్లంఘన లేదా అల్ట్రా వైర్స్) చట్టబద్ధత సమీక్షను ఎప్పుడు ప్రారంభించవచ్చో నిర్ణయిస్తాయి.
సమీక్షా ప్రమాణాలు(ఉదాహరణకు అనుపాతత లేదా సహేతుకత) కోర్టు రాష్ట్ర చర్యను ఎలా పరీక్షించాలో నిర్ణయిస్తాయి.
ముఖ్యంగా, చట్టబద్ధత సమీక్ష ఫలితాలు స్పష్టంగా ఉంటాయి(నలుపు, తెలుపులాగా). అంటే, ఆ చర్య సమర్థించబడుతుంది లేదా చెల్లదని నిర్దిష్ట ఆదేశాల ద్వారా వెల్లడవుతుంది.
దీనిని ‘సంభాషణ’ సమీక్షకు విరుద్ధంగా చెప్పవచ్చు.
ప్రభుత్వం, కోర్టులు, వాటాదారుల మధ్య బహిరంగ సంభాషణను సులభతరం చేయడానికి ప్రభుత్వ చర్యను కోర్టులు పరిశీలించే విధానాన్నే ‘సంభాషణ’ సమీక్ష అంటారు.
ఇందులో గుర్తించినట్లుగా, సంభాషణ సమీక్ష సమయంలో- కోర్టులు సాధారణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు గల సమాచార ప్రాతిపదికను; పద్ధతి హేతుబద్ధతను బహిర్గతం చేయవలసి ఉంటుంది.
దీనివల్ల ప్రజా తీర్పుకు(రాజకీయ జవాబుదారీతనాన్ని సులభతరం చేయడం), న్యాయ పరిశీలనకు (చట్టబద్ధత సమీక్ష నిర్వహించడానికి వాస్తవ ఆధారాన్ని సృష్టించడం ద్వారా) రెండింటికీ లోబడి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.
సంభాషణ సమీక్ష పరిణామాలు కేవలం చర్యను చెల్లనివిగా ప్రకటించడం మాత్రమే కాదు- పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడం కూడా.
ఎస్ఐఆర్కు సవాళ్లు
భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) జారీ చేసిన ఎస్ఐఆర్ నోటిఫికేషన్‌ను 2025 జూలైలో సవాలు చేశారు. పిటిషన్‌దారులు అనేక సమీక్షా కారణాలను ప్రస్తావించారు. అయినప్పటికీ, ఈ కేసు ప్రధాన అంశం ఈసీఐ చర్యలు పరిమితికి మించి ఉన్నాయా లేదా ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 (RPA) అధికార పరిధిని మించి ఉన్నాయా అనే దానిపై కేంద్రీకృతమై ఉంది.
సెక్షన్ 21(3) ప్రకారం, ఈసీఐకి “ఏదైనా నియోజకవర్గం లేదా నియోజకవర్గంలోని ఏదైనా భాగానికి” ఓటర్ల జాబితాల “ప్రత్యేక సవరణ”ను “నమోదు చేయవలసిన కారణాల కోసం”, “అది సముచితమని భావించే విధంగా” నిర్వహించే అధికారాన్ని ఆర్పీఏ కల్పిస్తుంది.
ఈ భాషకు విరుద్ధంగా, ఈసీఐ చేపట్టిన ప్రక్రియ అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అందులో మొదటిది – సెక్షన్ 21(3)లోని భాష ఒక రాష్ట్రంలోని, వాస్తవానికి దేశంలోని అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక సవరణను అనుమతిస్తుందా?
రెండవది, తన కారణాలను ఈసీఐ నమోదు చేసిందా? ఒకవేళ చేస్తే అవి సరిపోతాయా? ఎస్ఐఆర్ చేపట్టే నిర్ణయానికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంటేషన్‌ను బహిర్గతం చేయడానికి ఈసీఐ నిరాకరించినందున ఇది అత్యంత సందర్భోచితంగా మారింది.
మూడవది, ముఖ్యంగా – “సముచితమని భావించే విధంగా” అనే పదబంధం, ప్రత్యేక సవరణను నిర్వహిస్తున్నప్పుడు తన సొంత విధానాన్ని నియంత్రించుకునే అధికారాన్ని ఈసీఐకి ఇస్తుందా? సెక్షన్ 21(3) కింద “ప్రత్యేక సవరణ” నిర్వహించేటప్పుడు అది ఆర్పీఏ లేదా ఓటర్ల రిజిస్ట్రేషన్ నియమాలు-1960 కి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఈసీఐ వాదించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లో పేర్కొన్న ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించిన తన విస్తృత అధికారాల ఆధారంగా, కమిషన్ తన సొంత విధానాన్ని నిర్దేశించే స్వేచ్ఛను కలిగి ఉందని పేర్కొంది.
ఈ వాదనను సాకుగా చూపిస్తూ ఆర్పీఏ, రిజిస్ట్రేషన్ నియమాల నుంచి అనేక వైరుధ్యాలకు పాల్పడింది. వాటిలో ముఖ్యంగా: ఆధార్ కార్డులను తిరస్కరించడం, చివరి ‘ఇంటెన్సివ్ రివిజన్’ (2003లో బీహార్‌లో జరిగింది) కంటే ముందు జాబితాలో చేర్చబడిన ఓటర్లకు; ఆ తర్వాత జాబితాలో చేర్చబడిన ఓటర్లకు మధ్య వ్యత్యాసాన్ని చూపడం.
ఇందులో రెండో సమూహంపై అదనపు డాక్యుమెంటరీ భారాలను మోపడం వంటివి ఉన్నాయి.
అందువల్ల రిట్ పిటిషన్లు చట్టబద్ధత సమీక్ష నిర్వహించి ఎస్ఐఆర్ నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరాయి.
అయితే, 2025 నవంబర్‌లో జరగనున్న బీహార్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు ఇంత భారీ పరిపాలనా ప్రక్రియను నిర్వహించడంలో ఉన్న అనేక ఆచరణాత్మక ఆందోళనలను కూడా పిటిషన్లు లేవనెత్తాయి.
సుప్రీం కోర్టు ముందు వాదనలు..
2025 జూలై 10న తన మొదటి ఉత్తర్వులో, ఎస్ఐఆర్ నిర్వహించడానికి ఈసీఐకి ఉన్న అధికారం గురించి పిటిషన్లు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయని కోర్టు అంగీకరించింది.
ఈ విచారణ సమయంలో, తదుపరి విచారణ తేదీ(జూలై 28) 2025 ఆగస్టు 1న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితా కంటే ముందే ఉన్నందున, ఎస్ఐఆర్పై స్టే కోసం పిటిషనర్లు అప్పుడు ఒత్తిడి చేయలేదు.
అయితే, జూలై 28న కోర్టు ఎస్ఐఆర్ ప్రక్రియపై స్టే ఇవ్వడానికి స్పష్టంగా నిరాకరించింది. బదులుగా ఎస్ఐఆర్ చట్టబద్ధతను నిర్ణయించడానికి మౌఖిక వాదనల కోసం కాలపరిమితిని కేటాయించాలని న్యాయవాదులను కోరింది.
ఈ దశలో, బీహార్ తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ఇంకా రెండు నెలల సమయం(సెప్టెంబర్ 30) ఉంది. అంతేకాకుండా, బీహార్ ఎన్నికలు మూడు నెలల దూరంలో ఉన్నాయి.
కానీ ఆగస్టు 1న బీహార్‌లో ముసాయిదా జాబితా ప్రచురించబడిన తర్వాత, సుమారు 6.5 మిలియన్ల (65 లక్షల) మందిని జాబితా నుంచి మినహాయించినట్లు వెల్లడైంది.
ఆ తర్వాత సుప్రీంకోర్టులోని చర్యలన్నీ ఈ తీవ్రమైన పరిస్థితిని పరిష్కరించడం చుట్టూనే కేంద్రీకృతమయ్యాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి, పర్యవేక్షించడానికి కోర్టు అనేక ఆదేశాలు జారీ చేసింది. వాటిలో ముఖ్యమైనవి: ఆగస్టు 14న, తొలగించబడిన ఓటర్ల జాబితాను ‘సెర్చబుల్’ (శోధించదగిన) ఫార్మాట్లో ప్రచురించాలని ఈసీఐని ఆదేశించడం; ఆగస్టు 22న, ఈసీఐ ఆన్లైన్లో ఫారమ్‌లను తప్పనిసరిగా అంగీకరించాలని పునరుద్ఘాటించడం; సెప్టెంబర్ 8న, ఓటరు జాబితాలో చేర్చడానికి ఆధార్ కార్డులను ఆమోదించాలని ఆదేశించడం.
సెప్టెంబర్ 15న, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నందున, ఎస్ఐఆర్ చట్టబద్ధతను విచారించి నిర్ణయించాల్సిన అవసరాన్ని పిటిషనర్లు మరోసారి నొక్కి చెప్పారు.
దీనికి ప్రతిస్పందనగా, ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలు ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.
అక్టోబర్ 9న, జాబితా నుంచి మినహాయించబడిన వ్యక్తులకు సహాయం చేయడానికి బీహార్ న్యాయ సేవల కమిటీని సమీకరించాలని కోర్టు ఆదేశించింది.
నవంబర్ 11న బీహార్‌లో ఓటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి మాట్లాడుతూ, ఈ కేసు రెండు మార్గాల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు – ఒకటి ఎస్ఐఆర్ చట్టబద్ధతకు సంబంధించినది కాగా, మరొకటి దాని అమలులో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించినది.
కోర్టు పాత్రను అంచనా వేయడం
గమనించదగ్గ ప్రాథమిక విషయం ఏమిటంటే, బీహార్‌లో ముసాయిదా జాబితాలను ప్రచురించడానికి ముందు (జూలై 10 లేదా 28 తేదీలలో), ఎస్ఐఆర్పై స్టే విధించడానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్మాణాత్మక వాదనలను వినలేదు.
అలాగే, స్టే ఎందుకు మంజూరు చేయకూడదనే దానిపై కోర్టు ఆదేశాలు ఎటువంటి స్పష్టమైన కారణాలను తెలియజేయలేదు.
స్టే ఎప్పుడు మంజూరు చేయాలో చట్టపరంగా కొన్ని నియమ/నిబంధనలు ఉన్నప్పటికీ, కోర్టు ఈ ప్రమాణాలను పట్టించుకోవడానికి నిరాకరించినట్లు కనిపిస్తోంది.
దీని ఫలితంగా, ఇటీవలి యూజీసీ మార్గదర్శకాల విషయంలో స్టే ఎందుకు ఇచ్చారో మనకు తెలుసు కానీ, ఎస్ఐఆర్ విషయంలో ఎందుకు ఇవ్వలేదో స్పష్టత లేదు.
అయినప్పటికీ, 2025 జూలై 28 నాటికి, సెప్టెంబర్ 30న బీహార్ తుది ఓటర్ల జాబితా ప్రచురించడానికి ముందు కేసును పరిశీలించడానికి కోర్టుకు ఇంకా రెండు నెలల సమయం ఉంది.
ఈ సమయాన్ని కోర్టు ప్రధానంగా ‘సంభాషణ సమీక్ష’లో పాల్గొనడానికి; బీహార్‌లో ఎస్ఐఆర్ అమలును పర్యవేక్షించడానికి ఉపయోగించుకుంది.
కోర్టు చర్యలను సమర్థించుకోవడానికి రెండు సమర్థనలను ముందుకు తీసుకురావచ్చు. మొదటిది, బీహార్‌లో ఎస్ఐఆర్ అమలు స్వతంత్రంగా సంభాషణాత్మక న్యాయ సమీక్షకు హామీ ఇచ్చింది.
ఎస్ఐఆర్ చట్టబద్ధపై వాదనలు
అన్నింటికంటే, కోర్టు జోక్యం చాలా అవసరమైన పారదర్శకతకు దారితీసింది- మినహాయించబడిన ఓటర్ల జాబితాను ఈసీఐ ప్రచురించడంతో సహా. రెండవది, బీహార్‌లో సంభాషణాత్మక సమీక్ష కోసం తక్షణ అవసరాలను ఎస్ఐఆర్ చట్టబద్ధత అనే పెద్ద ప్రశ్నతో కోర్టు సమతుల్యం చేస్తోంది.
అన్నింటికంటే ముఖ్యంగా, కోర్టు చివరికి ఎస్ఐఆర్ చట్టబద్ధతపై వాదనలను విన్నది.
అయితే, ఈ రెండు వాదనలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఎస్ఐఆర్ వంటి సందర్భాల్లో చట్టబద్ధత, సంభాషణ సమీక్ష రెండింటి డిమాండ్లు ఉన్న చోట, చట్టబద్ధత నిర్ణయాలు మొదట రావాలని నేను వాదిస్తాను.
చర్య తీసుకునే రాష్ట్ర అధికారం – ఈ సందర్భంలో ఈసీఐ – స్వయంగా సవాలు చేయబడినప్పుడు సంభాషణ సమీక్షలో పాల్గొనడం పూర్తిగా తగనిది.
రెండవ ముఖ్యమైన విషయం- రాష్ట్రం చట్టపరమైన అనుమతి లేకుండా వ్యవహరిస్తుందనే ఆరోపణ ద్వారా లేవనెత్తబడిన ‘చట్ట పాలన’ ప్రశ్నకు పారదర్శకత, జవాబుదారీతనం తర్వాతి స్థానంలోనే ఉంటాయి.
చెల్లనిదిగా మారే అవకాశం
మరో మాటలో చెప్పాలంటే, తన రాజ్యాంగ- చట్టబద్ధమైన అధికారాలతో ఈసీఐ పనిచేస్తుంటేనే- అది పారదర్శకంగా; ఏకపక్షంగా వ్యవహరిస్తుందా అనే ప్రశ్నలు సంబంధితంగా ఉంటాయి. అలా కాకపోతే, పర్యవసానంగా ఆ చర్యే చెల్లనిదిగా మారుతుంది.
అప్పుడు పారదర్శకత; జవాబుదారీతనం ప్రశ్నలు కేవలం చర్చనీయాంశాలుగా మిగిలిపోతాయి.
ఈ సూత్రం ప్రాతిపదికన మాత్రమే, ఏదైనా అమలు ఆందోళనల కంటే ముందు ఎస్ఐఆర్ చట్టబద్ధతను మాత్రమే నిర్ణయించాలి.
పూర్తిగా ఆచరణాత్మక పరంగా కూడా, మొదట చట్టబద్ధతను నిర్ణయించడం మరింత అర్థవంతంగా ఉంటుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ చెల్లదని భావించినా, అమలు గురించి ఎటువంటి ప్రశ్నలు నిర్ణయించాల్సిన అవసరం ఉండదు.
ఎస్ఐఆర్ పాక్షికంగా చెల్లనిదిగా పరిగణించబడినా, అమలుపై కోర్టు తదుపరి సంభాషణ జోక్యాన్ని ఇది ఇప్పటికీ తగ్గిస్తుంది. ఎస్ఐఆర్ చెల్లుబాటు అయితేనే, కోర్టు నిరభ్యంతరంగా సంభాషణ సమీక్షలో పాల్గొనవచ్చు.
చట్టబద్ధత ప్రశ్నకు కోర్టు మొదట తీర్పు ఇచ్చి ఉంటే, బీహార్‌లో జోక్యం చేసుకోవడానికి చాలా ఆలస్యం అయి ఉండవచ్చని ఒకరు వాదించవచ్చు. కానీ కోర్టుకు అనుకూలంగా (దాతృత్వంగా) ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి.
మొదటిది, ఎస్ఐఆర్ చట్టబద్ధతను నిర్ణయించడానికి అవసరమైన వాస్తవాలు దానికి అందుబాటులో ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి లేదా చట్టవిరుద్ధ కూల్చివేతలకు సంబంధించిన కేసుల మాదిరిగా కాకుండా, కార్యనిర్వాహక నిర్ణయం తీసుకోవడం ఇక్కడ రహస్యంగా ఏమీ లేదు. ఎస్ఐఆర్ నోటిఫికేషన్ అప్పటికే ప్రచురించబడింది. అది కోర్టు పరిశీలనకు సిద్ధంగా ఉంది.
రెండవది జూలై 28, సెప్టెంబర్ 30 (తుది జాబితా ప్రచురించబడినప్పుడు) మధ్య కోర్టుకు రెండు స్పష్టమైన నెలల సమయం ఉంది. ఈ సమయంలో కేసును పదమూడు సార్లు విచారించింది.
చట్టబద్ధతను నిర్ణయించడానికి, అమలుకు సంబంధించిన ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి ఇది ఖచ్చితంగా తగినంత సమయం. మూడవది, ఇది తగినంత సమయం కాదని కోర్టు అభిప్రాయపడితే, దానికి తగిన ప్రతిస్పందన స్టే ఇవ్వడమే.
చట్టపరమైన హక్కులను సమీక్షించడానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాల వల్ల అవి ఆక్రమించబడకుండా చూసుకోవడానికి సమయాన్ని సృష్టించడమే స్టే ఆర్డర్ ప్రధాన ఉద్దేశ్యం.
కోర్టును ఆశ్రయించే పక్షానికి స్టే ఇవ్వకుండా నిరాకరించి, ఆ తర్వాత సమయం లేకపోవడాన్ని కారణంగా చూపిస్తూ వారి హక్కులను నిష్ఫలం చేయడం సమంజసం కాదు.
నాల్గవది, కోర్టుకు ఎల్లప్పుడూ విచారణను విభజించి, అమలు, చట్టబద్ధతకు సంబంధించిన సమస్యలను రెండు వేర్వేరు బెంచ్‌ల ద్వారా సమాంతరంగా విచారించే అవకాశం ఉండేది.
ఎస్ఐఆర్ సవాలు- అంతకు మించి ప్రభావం
న్యాయ సమీక్ష క్రమం మొదట్లో న్యాయం తప్పుదోవ పట్టినట్లు అనిపించవచ్చు. అయితే, కోర్టు విధానం చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంది. మొదట, బీహార్ ఎన్నికలు ముగిసినందున, ఆ రాష్ట్ర ఓటర్లకు సంబంధించి ఎస్ఐఆర్ చట్టబద్ధతపై తలెత్తే ఏవైనా ప్రశ్నలు కోర్టు అనుసరించిన తీరు వల్ల నిష్ఫలంగా మారాయి.
రెండవది, చట్టపరమైన వాస్తవికత కోణంలో చూస్తే, కోర్టు అనుసరించిన విధానం ఎస్ఐఆర్ను చెల్లనిదిగా చేయకుండా ఉండటానికి ఒక బలమైన సంస్థాగత ప్రోత్సాహాన్ని ఎలా సృష్టించిందో మనం చూడవచ్చు.
ఎందుకంటే, కోర్టు ఇప్పుడు ఎస్ఐఆర్ను కొట్టివేసినా అది బీహార్ ఎన్నికల ఫలితాలను మార్చలేదు, కానీ అది ప్రాథమికంగా ప్రజల దృష్టిలో ఎన్నికల చట్టబద్ధతను దెబ్బతీస్తుంది. ఇది కోర్టు సంస్థాగత చట్టబద్ధతకు, భారత ప్రజాస్వామ్యానికి మరింత హాని కలిగిస్తుంది.
కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో అంచనా వేయకుండా, న్యాయ సమీక్ష ఆదేశం పిటిషనర్లను ప్రతికూలంగా ప్రభావితం చేసిందని మనం గమనించవచ్చు.
చట్టబద్ధత, సంభాషణ సమీక్ష రెండూ ఒకేసారి అవసరమైన సంక్లిష్ట సామాజిక సమస్యల్లోకి వెళ్లే భారతీయ న్యాయస్థానాల ధోరణిని దృష్టిలో ఉంచుకుని, ఎస్ఐఆర్ సవాలు వంటి అంశాలను కోర్టులు సూత్రప్రాయంగా, ఆచరణాత్మకంగా ఎలా పరిష్కరించగలవనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
ఈ ఆలోచనలో కొంత భాగం అటువంటి సవాళ్లను వ్యూహాత్మకంగా రూపొందించే న్యాయవాదుల నుంచి కూడా రావాలి.
ఎస్ఐఆర్ ఛాలెంజ్ సమయంలో ఈసీఐ వ్యూహం స్పష్టంగా విచారణలను పొడిగించడమే; కోర్టు ఈ ప్రయత్నంలో భాగస్వామిగా ఉంది- కానీ భవిష్యత్తులో వచ్చే సవాళ్లు కోర్టును నిర్ణయాత్మక చర్యలు తీసుకునేలా ఎలా ప్రేరేపించాలో ఆలోచించాలి.
ఉదాహరణకు, చట్టబద్ధతపై నిర్ణయం తర్వాత మాత్రమే అమలుపై పర్యవేక్షణ కోరడం లేదా పిటిషన్లను వ్యూహాత్మకంగా ఉపసంహరించుకోవడం వంటివి చేయవచ్చు.
సవాళ్లను నిర్ణీత సమయంలో వినడానికి తగినంత సమయం లేదని తేల్చడానికి న్యాయస్థానాలు సుదీర్ఘమైన మౌఖిక వాదనలకు మొగ్గు చూపడాన్ని న్యాయవాదుల సంఘం అనుమతించకూడదు.
దీనికి కొన్ని త్యాగాలు అవసరం కావచ్చు, కానీ ఎస్ఐఆర్ సవాలు ప్రదర్శించినట్టుగా, ఒకే సమయంలో రెండు పడవల మీద కాళ్లు వేయడం సాధ్యం కాదు. కేక్ తినాలి కానీ కేక్ అలానే ఉండాలి అంటే కుదరదు.
అనువాదం: సుబ్రమణ్యం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
