♦ బెదిరింపుల నుంచి వెనక్కి తగ్గిన ట్రంప్
♦ లెబనాన్‌పై దాడులు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై వినాశకరమైన దాడులు చేస్తామన్న తన హెచ్చరికల నుంచి వెనక్కి తగ్గారు.
టెహ్రాన్ లొంగిపోవాలి లేదా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాలి అంటూ తాను విధించిన గడువు ముగియడానికి రెండు గంటల ముందు ఆయన యుద్ధ తీవ్రతను తగ్గించేలా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
కాల్పుల విరమణకు షరతులు
శాంతికాలంలో ప్రపంచ చమురులో ఐదవ వంతు రవాణా అయ్యే జలమార్గం ‘హోర్ముజ్ జలసంధి’ని తిరిగి తెరవడంతో పాటు, రెండు వారాల కాల్పుల విరమణకు టెహ్రాన్ అంగీకరిస్తే- ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర పౌర లక్ష్యాలపై దాడులు నిలిపివేస్తానని ట్రంప్ చెప్పారు.
ఇరాన్ ఆచరణయోగ్యమైన 10-సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించిందని కూడా ఆయన వెల్లడించారు.
శాంతి చర్చలకు ఇరాన్ సన్నద్ధం
రెండు వారాల కాల్పుల విరమణకు తాము అంగీకరించామని, శుక్రవారం నుంచి ఇస్లామాబాద్‌లో అమెరికాతో చర్చలు జరుపుతామని ఇరాన్ సర్వోన్నత జాతీయ భద్రతా మండలి తెలిపింది.

రాబోయే రెండు వారాల పాటు ఇరాన్ సైనిక పర్యవేక్షణలో హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలకు అనుమతి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు.
ఇరు పక్షాలు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాయి.
కొనసాగుతున్న రక్షణ చర్యలు..
కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, దౌత్యపరమైన చర్యల చుట్టూ ఇంకా గందరగోళం నెలకొంది.
బుధవారం తెల్లవారుజామున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్లలో క్షిపణి దాడుల హెచ్చరికలు కొనసాగాయి.
సున్నితమైన సైనిక కార్యకలాపాలను వివరించడానికి పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అమెరికా ఉన్నతాధికారి మాట్లాడుతూ- ఇరాన్‌పై సైన్యం అన్ని రకాల దాడి కార్యకలాపాలను నిలిపివేసిందని, అయితే అవసరమైన రక్షణ చర్యలను మాత్రం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
