♦ ఇరాన్ ఖార్గ్ దీవిపై అమెరికా బాంబు దాడులు
♦ కొచ్చి నుంచి బయలుదేరిన ఇరాన్ నావికులు
♦ తదుపరి దాడులు చమురు కేంద్రాలపైనే ఉండొచ్చని ట్రంప్ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ద్వయం ప్రారంభించిన దాడులు నేటితో 15వ రోజుకు చేరుకున్నాయి.
ఇరాన్ నైరుతి తీరంలో ఉన్న ఖార్గ్ దీవిలోని లక్ష్యాలను అమెరికా బలగాలు “నామరూపాల్లేకుండా” ధ్వంసం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఇరాన్ చమురు ఎగుమతులను నిర్వహించే ప్రధాన టెర్మినల్‌కు ఈ దీవే కేంద్రం. ఆ దీవిలోని చమురు మౌలిక సదుపాయాలపై తదుపరి దాడులు జరగవచ్చని కూడా ఆయన సూచించారు.
తమ చమురు కేంద్రాలపై దాడులు జరిగితే తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించిన ఒక్కరోజు వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.

కొచ్చి నుంచి ఇరాన్ నావికుల పయనం
మరోవైపు, ఇరాన్ నావికాదళ నౌక ‘ఐఆర్ఐఎస్ లావన్’కు చెందిన సుమారు 100 మంది నావికులు మార్చి 13న రాత్రి 7 గంటల ప్రాంతంలో కొచ్చి విమానాశ్రయం నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో స్వదేశానికి బయలుదేరారు.
శ్రీలంక దక్షిణ తీరంలో అమెరికా జలాంతర్గామి టార్పెడోతో దాడి చేసి ‘ఐఆర్ఐఎస్ దెనా’ యుద్ధనౌకను ముంచేసి 87 మందిని బలిగొన్న కొద్ది రోజులకే ఇరాన్ నుంచి ఈ అభ్యర్థన వచ్చింది.
లావన్‌లో ‘సాంకేతిక సమస్యలు’ తలెత్తాయంటూ ఫిబ్రవరి 28న ఇరాన్ అత్యవసరంగా ఆశ్రయం కోరినట్టు ప్రభుత్వ వర్గాలు గతంలోనే తెలిపాయి.
దీంతో మార్చి 1న కొచ్చిలో లంగరు వేయడానికి భారత్ అనుమతి ఇచ్చింది.
మార్చి 4న నౌక రేవుకు చేరుకున్నప్పటి నుంచి అందులోని మొత్తం 183 మంది సిబ్బంది అక్కడే బస చేశారని ఆ వర్గాలు వెల్లడించాయి.
కొనసాగుతున్న ప్రాణనష్టం
వివిధ వార్తా కథనాల ప్రకారం, ఇప్పటివరకు ఇజ్రాయెల్-అమెరికా దాడుల వల్ల ఇరాన్లో 1,400 మందికి పైగా, లెబనాన్‌లో కనీసం 773 మంది మరణించారు. ఇజ్రాయెల్‌లో కూడా కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
