మానవ సమాజం ఆధునిక టెక్నాలజీతో ఊహకాందని విధంగా ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంలో దేశ, రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ ఆదర్శాలకు, సామాజిక వాస్తవికతకు విరుద్ధంగా దళితుల పరిస్థితి ఉంది.
సమానత్వం, గౌరవం, న్యాయాన్ని భారత రాజ్యాంగం వాగ్దానం చేస్తున్నప్పటికీ- కుల హింస, బహిష్కరణల నుంచి తరతరాలుగా దళితులు బయటపడలేకపోతున్నారు. అంతేకాకుండా, సంస్థాగత నిర్లక్ష్యం కిందనే వారు జీవిస్తున్నారు.
దళితులపై మానవ హక్కుల ఉల్లంఘనలు యాదృచ్ఛికం కాదు. ఇది నిర్మాణాత్మకమైనది, క్రమబద్ధమైనది. దీంతోపాటు సామాజిక, రాజకీయ, ప్రభుత్వ అధికారాల ద్వారా కొనసాగుతున్నదనేది వాస్తవం.
నెలరోజుల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు దారుణమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
అందులో ఒకటి, మహబూబ్నగర్ జిల్లాలో తన తమ్ముడి ప్రేమ వివాహాన్ని జరిపినందుకు అన్నను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. రెండవది కర్ల రాజేష్ లాక్అప్డెత్. మూడవది కులం కారణాన్ని చూపి పెళ్ళికి నిరాకరించడంతో వైద్య విద్య విద్యార్థిని లావణ్య ఆత్మహత్య చేసుకుంది. నాల్గవ ఘటన, పిరియడ్స్ కారణంగా కళాశాలకు ఆలస్యంగా వెళ్ళడంతో తన తోటి విద్యార్థులందరి ముందు అవమానించేలా అధ్యాపకురాలు మాట్లాడడంతో ఒక ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది.
ఈ నాలుగు మరణాలకు వేర్వేరు కారణాలున్నప్పటికీ, ఇవన్నీ వ్యవస్థగత కుల హత్యలు. వీటితో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యమున్న ప్రభుత్వ హత్యలు.
అంతేకాకుండా దళిత సమాజ బాధ్యతరహిత రాజకీయాలు, బలహీనపడ్డ పౌర సమాజ ఉద్యమాల వలన జరుగుతున్న హత్యలు. ప్రభుత్వ పాలనా నిర్లక్ష్య విధానాల వలన జరుగుతున్న హత్యలు.
బలహీనపడ్డ దళిత ఉద్యమాలు
శతాబ్దాలుగా కొనసాగుతున్న కఠినమైన సామాజిక శ్రేణి నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో దళితులపై అణచివేత పాతుకుపోయి ఉంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రూపాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను దళితులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కులాధారిత హింస, మూక హత్యలు, లైంగిక వేధింపులు- అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి.
గతంలో అణచివేతను సవాలు చేయడంలో, హక్కులను నిర్ధారించడంలో దళిత ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయి.
కానీ ప్రస్తుతం దళితుల్లో పెరిగిన విభజన వల్ల ఒకరికొకరు తోడుగా నిలబడి, సమిష్టిగా ఉద్యమించే పరిస్థితులు లేవు.
కులమేంటో తెలిస్తే తప్ప బాధితుల పక్షాన నిలబడే దౌర్భాగ్యపు పరిస్థితులు కూడా ప్రస్తుత దళిత సమాజంలో ఉన్నాయి.
గౌరవం, సమానత్వం, ప్రాతినిధ్యాన్ని డిమాండ్ చేయడంలో కూడా అంబేద్కర్ సామాజిక న్యాయ దార్శనికతతో ప్రేరణ పొందిన దళిత సంస్థలు, రచయితలు, విద్యార్థులు, కార్యకర్తలు విఫలమయ్యారు.
ఈ హింసల వెనక ఉన్న నిర్మాణత్మక భావజాలం మీద ఉద్యమించకుండా మతోన్మాద పార్టీలతో కలిసి దళితులు పనిచేస్తున్నారు.
ప్రస్తుతం దళితులు ఎదుర్కొంటున్న వివక్షలు, సంక్షోభం- కేవలం పేదరికం లేదా వివిక్త వివక్ష సమస్య కాదు. ఇది శతాబ్దాల బహిష్కరణలో పాతుకుపోయిన నిర్మాణాత్మక మానవ-హక్కుల సంక్షోభం.
రాజ్యాంగ హామీలు, ప్రగతిశీల చట్టాలు, అభివృద్ధి పథకాలు అవసరమే; కానీ పరివర్తన కలిగించే సామాజిక మార్పు లేదు.
అయితే, ఇరవై ఒకటో శతాబ్దంలో కులవ్యవస్థ ఆధునిక పోకడతో సవాలు చేస్తున్నప్పుడు; దళితుల మధ్య పెరిగిన వైష్యమ్యాలను తగ్గించుకొని ఉమ్మడిగా ఉద్యమించకపోతే, దళిత సమాజం భవిష్యత్తులో మరింత నష్టపోయే ప్రమాదం ఉంది.
పౌర సమాజ పాత్ర..
భారతదేశంలో సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలలో పౌర సమాజ సంస్థలు చారిత్రాత్మకంగా ముందంజలో ఉన్నాయి.
వారు దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు, వికలాంగులు, వలస కార్మికులు వంటి అణగారిన వర్గాలతో కలిసి పనిచేస్తున్నారు.
చట్టపరమైన వాదన, అవగాహన ప్రచారాలు చేస్తూ అట్టడుగు స్థాయిలో ప్రజలను పౌర సమాజ కార్యకర్తలు సమీకరిస్తున్నారు.
దీంతో ఆయా ప్రజలు ఎదుర్కొంటున్న కుల వివక్ష, లింగ ఆధారిత హింస, మత ద్వేషం, మానవ హక్కుల ఉల్లంఘనలను సవాలు చేస్తు ఉద్యమిస్తున్నారు.
ఇప్పటికీ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, మానవ గౌరవానికి శక్తివంతమైన సాధనంగా పౌర సమాజం ఉంది. పరిమితుల మధ్య కూడా అణగారిన గొంతులను విస్తృతం చేయడానికి, అన్యాయాన్ని సవాలు చేయడానికి; ప్రజా సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి దాని ప్రయత్నాలు- దాని అనివార్య పాత్రను నొక్కి చెబుతున్నాయి.
దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు పౌర సమాజ భుజస్కందాలపై ఆధారపడి ఉంది. కానీ దళితులపై జరుగుతున్న కుల ఆధారిత హింసల పట్ల కూడా పౌర సమాజ సమూహాలు, మానవ హక్కుల పరిరక్షకులు, కమ్యూనిస్ట్ శిబిరాల ఉద్యమాలు బలహీనపడ్డాయి.
ప్రజా జీవితంలో ప్రజలను పాల్గొనేలా చేయడానికి, అన్యాయాన్ని ప్రశ్నించడానికి, రాజ్యాంగపరమైన ప్రజా హక్కులను వినియోగించుకోవడానికి వారి ఉద్యమాలు ఉపయోగపడటం లేదనేది వాస్తవం. దీని వల్ల దళితులు మరింత అసమానంగా బాధితులవుతున్నారు.
వాటిలో భౌతిక దాడులు, తరచుగా దళిత మహిళలపై లైంగిక హింస, హత్యలు, మూక దాడులు జరుగుతున్నాయి.
అంతేకాకుండా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో దళితులు పోటీ చేసినందుకు ఎన్నికల తర్వాత అనేక చోట్ల రాష్ట్రంలో దళితులపై ఉద్దేశపూర్వకమైన దాడులు జరిగాయి. వీటిని అడ్రెస్స్, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసిన పౌరసమాజం లేదు.
వాస్తవానికి ప్రజాస్వామ్యబద్ధంగా- న్యాయపరంగా దళితులవైపు పౌర సమాజం నిలబడటం లేదని ప్రస్తుత అనుభవాలు హెచ్చరిస్తున్నాయి.
పౌర హక్కులను విస్మరిస్తున్న ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో పాలనా కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల హక్కుల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా?
ప్రపంచ వ్యాప్తంగా హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమలాన్నీ వ్యవస్తీకృత హింసకు వ్యతిరేకంగా జరుగుతున్నవే.
ఆ హక్కుల ఉద్యమకారులను ఎన్నో తప్పుడు పేర్లతో ప్రభుత్వాలు పిలవడం. వారి మీద తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించడం ఆనవాయితీగా వస్తున్నది.
ఇటీవల గాదె ఇన్నయ్యని నేషనల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలం లేకుండా జరిగింది కాదు. ఒక పథకం ప్రకారం ప్రశ్నించే గొంతులను కక్ష్యపూరితంగా అణచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి.
అయితే రాష్ట్రంలో జరుగుతున్న అట్రాసిటీలలో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి అనేక ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే కానీ కేసు ఫైల్ అయ్యే పరిస్థితి లేదు.
ఎవరైనా ఒక బాధితుడు కేసు ఫైల్ చేస్తే, ప్రత్యర్థి వర్గాన్ని పోలీసులే పిలిచి సెటిల్మెంట్ చేయిస్తున్నారు. ఈ విధమైన ధోరణితో కోర్టులను కూడా ఉల్లంఘిస్తున్నారు తప్ప బాధితులకు న్యాయం చేయలేకపోతున్నారు. ఇది ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుత దళితుల పరిస్థితి.
తన దృఢమైన అధికారాల ద్వారా దేశంలో మానవ హక్కులను రాజ్యాంగం రక్షిస్తుంది. ఇది స్వతంత్ర న్యాయవ్యవస్థ ద్వారా అమలు చేయబడిన ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తుంది.
అయితే, చుండూరు- కారంచేడు సంఘటనల తర్వాత జరిగిన అట్రాసిటీల తర్వాత మానవ హక్కుల రక్షణ చట్టం; జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ); మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాల కోసం ఇతర ప్రత్యేక కమిషన్లు వంటి అనేక చట్టబద్ధమైన సంస్థలు పుట్టుకొచ్చాయి.
జాతీయ మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్ ప్రకారం, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 66,492 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అంటే, దేశంలో క్రైమ్ రేట్ దళితుల మీద ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హక్కులు కేవలం చట్టపరమైన నిబంధనలు మాత్రమే కాదు. మానవ గౌరవం, సమానత్వాన్ని నిలబెట్టడానికి నైతిక కట్టుబాట్లు కూడా.
మెడిసిన్ చదువుతున్న లావణ్య, కర్ల రాజేష్ లాకప్డెత్ల విషయంలో దళితులు సంఘటితంగా లేకపోవడం వల్లనే న్యాయ పోరాటాలు పరిమితంగా నడుస్తున్నాయి. రోహిత్ వేముల చనిపోయి పదేళ్లు గడుస్తున్నా ఇంకా న్యాయం అందలేదు.
ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండటానికి- తమ హక్కుల కోసం పోరాటాల మీద అవగాహన, నిరంతరం చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలి. మానవ హక్కులను గౌరవించే సమాజం కోసం ప్రజలతో కలిసి అవగాహనా కల్పించి ఒక విశాలమైన హక్కుల ఉద్యమాలను నిర్మించడం పౌర సమాజం, ప్రజాస్వామికవాదుల బాధ్యతనే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
