ఆంక్షలను తొలగించాలంటే రాజకీయ ఖైదీలను విడుదల చేసి ఆర్థిక, రాజకీయ సరళీకరణ వైపు వెళ్లాలని క్యూబాకు ట్రంప్ యంత్రాంగం డిమాండ్ చేస్తోంది.
హవానా: ఈ నెలలో మూడవ సారి దేశవ్యాప్తంగా గ్రిడ్ కుప్పకూలిపోయి లక్షలాది మంది ప్రజలను చీకటిలోకి నెట్టివేసిన ఒక రోజు తర్వాత- క్యూబా మార్చి 22 ఆదివారం నాడు తన విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణను చేపట్టింది.
మార్చి 22 ఉదయానికల్లా రాజధానిలో ఐదు ఆసుపత్రులతో సహా సుమారు 72,000 మంది కస్టమర్లకు తిరిగి విద్యుత్ సరఫరా జరిగినట్టు ప్రభుత్వ విద్యుత్ సంఘం, ఇంధన, గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించాయి.
అయితే, హవానా మొత్తం రెండు మిలియన్ల జనాభాలో ఇది అతిచిన్న భాగం మాత్రమే.
హవానాలో, అలాగే పశ్చిమ మటాంజాస్, తూర్పు హోల్గుయిన్ వంటి ప్రావిన్సులలో కీలక కేంద్రాలకు విద్యుత్ సరఫరా కోసం స్థానికంగా విద్యుత్ మైక్రోసిస్టమ్లను ఏర్పాటు చేశారు.
తెల్లవారుజామున విద్యుత్ తిరిగి వచ్చిందని రాజధానిలోని కొన్ని ప్రాంతాల నివాసితులు అసోసియేటెడ్ ప్రెస్‌కు(ఏపీ) చెప్పారు.
సంక్షోభానికి కారణాలు: అమెరికా ఆంక్షలు
క్యూబా ప్రస్తుతం అసాధారణ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గడచిన కొద్ది సంవత్సరాలుగా దాని పాత గ్రిడ్ పూర్తిగా క్షీణించింది.
అయితే, క్యూబాకు ఏ దేశమైనా చమురు విక్రయించినా లేదా సరఫరా చేసినా ఆ దేశంపై సుంకాలు తప్పవని జనవరిలో డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన తర్వాత, అమెరికా విద్యుత్ దిగ్బంధనం కూడా ఈ అంతరాయాలకు కారణమని ప్రభుత్వం నిందిస్తోంది.
ఆంక్షలను ఎత్తివేయాలంటే రాజకీయ ఖైదీలను విడుదల చేసి రాజకీయ, ఆర్థిక సరళీకరణ వైపు వెళ్లాలని ఆయన యంత్రాంగం డిమాండ్ చేస్తోంది.
“క్యూబాను స్నేహపూర్వకంగా స్వాధీనం” చేసుకునే అవకాశాన్ని కూడా ట్రంప్ లేవనెత్తారు.
ఇంధన కొరత – విదేశీ సరఫరాల నిలిపివేత
క్యూబా చమురు కొరతతో ఇబ్బంది పడటానికి మరో కారణం, వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా పదవి నుంచి తొలగించడం.
దీనివల్ల హవానాకు నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న ఆ దేశం నుంచి కీలకమైన పెట్రోలియం సరఫరాలు నిలిచిపోయాయి.
గత మూడు నెలలుగా ఈ ద్వీప దేశానికి విదేశీ సరఫరాదారుల నుంచి చమురు అందలేదని అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ చెప్పారు.
తన ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఇంధనంలో క్యూబా కేవలం 40% మాత్రమే ఉత్పత్తి చేస్తోంది.

సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం
రోజువారీ విద్యుత్ అంతరాయాలు ప్రజలపైన భారీగా ప్రభావం చూపుతున్నాయి. పని గంటలు తగ్గించడంతో వారి జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి.
వంటకు కావాల్సిన విద్యుత్ లేకపోవడం, గృహోపకరణాలు చెడిపోవడం వంటి అనేక ఇతర పరిణామాలు సంభవిస్తున్నాయి.
“విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, లో వోల్టేజ్ కారణంగా ఈ రోజు మా రిఫ్రిజిరేటర్ చెడిపోయింది. నిన్నకాక మొన్న రాత్రి సుమారు 10 గంటలకు వోల్టేజ్ పూర్తిగా పడిపోయింది” అని ఇద్దరు పిల్లలున్న 33 సంవత్సరాల మహిళ సులేడి క్రెస్పో ఏపీకి చెప్పారు. “రేపు విద్యుత్ లేకపోతే మాకు నీళ్లు కూడా రావు” అని ఆమె అన్నారు.
దేశవ్యాప్తంగా లేదా పాక్షికంగా తరచుగా జరుగుతున్న విద్యుత్ అంతరాయాలతో నివాసితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పదేపదే కుప్పకూలుతున్న గ్రిడ్
కామగుయ్ ప్రావిన్స్‌లోని న్యూవిటాస్ థర్మోవిద్యుత్ కేంద్రంలో ఊహించని విధంగా ఒక ఉత్పత్తి యూనిట్ నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా జాతీయ విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కట్ అయ్యిందని ఇంధన, గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే క్యూబన్ విద్యుత్ సంఘం తెలియజేసింది.
అయితే ఈ వైఫల్యానికి గల నిర్దిష్ట కారణాల వివరాలను వెల్లడించలేదు.
చివరి సారిగా సోమవారం నాడు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణకు అనేక రోజులు పట్టింది.
శనివారం నాటి విద్యుత్ అంతరాయం గత వారం రోజుల్లో రెండోది కాగా, మార్చి నెలలో మూడవది.
“మనం మన పనులను అలవాటుగా సాగించాల్సిందే, అంతకు మించి మనం ఏం చేయగలం? ఎలాగోలా బతకడానికి ప్రయత్నించాలి. కరెంటు ఉన్నా లేకపోయినా ఇలాంటి పరిస్థితులకు అలవాటు పడక తప్పదు,” అని 35 ఏళ్ల వ్యాపారి డాగ్నే అలార్కాన్ అన్నారు.
తీవ్రతను అంగీకరించిన ప్రభుత్వం
ప్రస్తుత ఇంధన పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అధికారులతో పాటు స్వయంగా డియాజ్-కానెల్ కూడా అంగీకరించారు.
ఇంధన, గనుల శాఖ వైస్ మినిస్టర్ అర్జెలియో అబాద్ విగో మాట్లాడుతూ- దేశ ఆర్థిక వ్యవస్థకు, విద్యుత్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన డీజిల్, ఫ్యూయల్ ఆయిల్, గ్యాసోలిన్, ఏవియేషన్ ఫ్యూయల్ లేదా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి ఏ ఒక్క సరఫరా కూడా గత మూడు నెలలుగా దేశానికి అందలేదని వివరించారు.
వాహనాలకు ఇచ్చే ఇంధనాన్ని రేషన్ పద్ధతిలో విక్రయిస్తున్నారు. విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేయడమో లేదా తగ్గించడమో చేశాయి. చాలా పని ప్రదేశాలలో పని గంటలను తగ్గించారు.
ట్రంప్ వ్యాఖ్యలు – ప్రజల నిస్సహాయత
క్యూబా ప్రభుత్వం కూలిపోయే అంచున ఉందని ట్రంప్ గత కొన్ని నెలలుగా సూచిస్తున్నారు. అంతకుముందు ఒకసారి క్యూబా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలినప్పుడు, త్వరలోనే తనకు “క్యూబాను దక్కించుకునే గౌరవం” దక్కుతుందని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ విలేకరులతో చెప్పారు.
హవానాలో నివసించే గృహిణి మరియా రెగ్లా కార్డోసో మాట్లాడుతూ, తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని, క్యూబన్లు ఎలాగోలా బతుకును సాగించాల్సిందేనని అన్నారు.
“నేను అంతా దేవుడికే వదిలేశాను. పరిస్థితి ఎలా ఉన్నా, మేము దానిని ఎదుర్కోక తప్పదు.”
అనువాద: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
