దాదాపు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ‘ది వైర్’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను, ఒక వ్యంగ్య వీడియో కార్టూన్‌ను సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం నిరోధించింది. అనంతరం ఈ కార్టూన్‌ను ‘ఎక్స్'(ట్విట్టర్) ఖాతాలో కూడా నిలిపివేశారు.
న్యూఢిల్లీ: భారత్‌లో ఫిబ్రవరి 9 సాయంత్రం ‘ది వైర్’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను దాదాపు రెండు గంటల పాటు నిరోధించారు.
సుమారు 1.3 మిలియన్ల మంది అనుసరిస్తున్న ఈ అకౌంట్- ఆన్లైన్లో వార్తలు, అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యంగ్య చిత్రాలతో అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమ వేదికలలో ఒకటిగా ఉంది.
నిరోధానికి కారణం- కేంద్ర ప్రభుత్వ వివరణ
ఫిబ్రవరి 9న సాయంత్రం ‘ది వైర్’ ప్రధాన ఇన్స్టాగ్రామ్ పేజీని తెరిచిన పాఠకులకు- “ఈ అకౌంట్ భారతదేశంలో అందుబాటులో లేదు” అనే సందేశం కనిపించింది.
న్యాయపరమైన విన్నపం మేరకు ఈ ఖాతాను పరిమితం చేసినట్టు సందేశంలో పేర్కొన్నారు.
అయితే, వీపీఎన్ ఉపయోగిస్తున్న వారు లేదా భారత సరిహద్దులకు వెలుపల ఉన్న వారు మాత్రం ఈ అకౌంట్‌ను చూడగలిగారు.
ఈ విషయం మీద సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులను ది వైర్ సంప్రదించగా, “మేము మీ అకౌంట్‌ను నిరోధించలేదు” అని సమాధానమిచ్చారు.
మెటా చర్యలు – సాంకేతిక తప్పిదాలు?
ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక 52 సెకన్ల వ్యంగ్య కార్టూన్‌ను నిరోధించాలని మంత్రిత్వ శాఖ మెటా సంస్థను కోరినట్లు ‘ది వైర్’కు తెలిసింది.
అయితే, ఆ ఒక్క వీడియోను తొలగించే క్రమంలో సామాజిక మాధ్యమ దిగ్గజం ‘తప్పిదం’ వల్ల ‘ది వైర్’కు చెందిన మొత్తం ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌నే నిరోధించింది.
రాత్రి సుమారు 8:30 గంటలకు ప్రధాన అకౌంట్‌ను పునరుద్ధరించినప్పటికీ, వివాదాస్పద కార్టూన్‌ను మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు.
ఫేస్బుక్లో కూడా పోస్టు చేసిన ఈ ప్రత్యేక కార్టూన్‌ను భారత్‌లో నిరోధించారు.
ఐటీ చట్టం, నోటీసుల నిబంధన..
భారత ఐటీ చట్టం ప్రకారం, ఏదైనా కథనాన్ని లేదా పేజీని నిరోధించే ముందు ఆ ప్రచురణకర్తలకు మంత్రిత్వ శాఖ ముందస్తు సమాచారం అందించాలి.
ఫిబ్రవరి 7న సాయంత్రం 6:30 గంటలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఖాతాలలో ఈ కార్టూన్‌ను పోస్టు చేశారు. అయినప్పటికీ, ఇప్పటివరకు తమకు ఎలాంటి లిఖితపూర్వక సమాచారం అందలేదని ‘ది వైర్’ తెలిపింది.
ఫిబ్రవరి 10న, “న్యాయపరమైన డిమాండ్ మేరకు ఈ పోస్టును భారత్‌లో నిలిపివేస్తున్నట్లు” సందేశం కనిపిస్తూ ఎక్స్ ఖాతాలో కూడా ఆ కార్టూన్‌ను నిరోధించారు.
అయితే ఈ వీడియో ఇప్పటికీ యూట్యూబ్, బ్లూస్కై వంటి వేదికలపై అందుబాటులో ఉంది.
గత అనుభవాలు – ‘ఆపరేషన్ సంధూర్’ సందర్భం
2025 మేలో కూడా ‘ది వైర్’ వెబ్‌సైట్‌ను ఏకపక్షంగా ఒక రోజంతా నిరోధించారు. ‘ఆపరేషన్ సంధూర్’ సమయంలో భారత రాఫేల్ జెట్‌ను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసిన వాదనపై సీఎన్ఎన్ ఇచ్చిన కథనాన్ని తొలగించాలని మంత్రిత్వ శాఖ అప్పట్లో ఆదేశించింది. ఆ కథనాన్ని తొలగిస్తేనే వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని షరతు విధించింది.
2025 మే 9నాడు రాత్రి 9:41 గంటలకు మంత్రిత్వ శాఖ నుంచి అందిన ఈమెయిల్ ప్రకారం, వెబ్సైట్ బ్లాకింగ్‌కు సంబంధించి సాంకేతిక పరిమితుల వల్ల సబ్-పేజీలను కాకుండా పూర్తి స్థాయి డొమైన్‌నే నిరోధించినట్లు పేర్కొన్నారు.
తగిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఇస్తే వెబ్‌సైట్‌ను నిరోధించకుండా వెసులుబాటు ఉంటుందని వారు సూచించారు.
విచారణకు డిమాండ్
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, అత్యంత ప్రజాదరణ, గౌరవం పొందిన వార్తా సంస్థపై ఇలాంటి ఆకస్మిక చర్యలు తీసుకోవడం పట్ల విచారణ జరిపించాలని కోరుతూ సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకు, మెటా సంస్థకు ‘ది వైర్’ లేఖ రాసింది.
అనువాదం:గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.


