ఫిబ్రవరి 23న విడుదల చేసిన కొత్త 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో “అవినీతి”, “పెండింగ్‌లో ఉన్న కేసులు” న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లుగా ఎన్సీఈఆర్టీ పేర్కొన్నది.
న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు లేదా అణగదొక్కేందుకు ఎవరినీ అనుమతించబోమని, తగిన చర్యలు తీసుకుంటామని ఈ విషయం మీద స్పందించిన సీజేఐ(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) ఇటీవల విడుదల చేసిన కొత్త 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని అమ్మకం నుంచి ఉపసంహరించుకుంది.
పుస్తకంలోని “న్యాయవ్యవస్థలో అవినీతి” అనే అధ్యాయంపై అభ్యంతరాలు వ్యక్తమైన ఒక రోజు తర్వాత, విద్యా మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారం దీనిని ధృవీకరించాయి.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం,మంగళవారం ఆ పుస్తకాన్ని ఎన్సీఈఆర్టీ అమ్మకం నుంచి ఉపసంహరించుకుంది.
అంతేకాకుండా సోమవారం వరకు అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈ పుస్తకం ఇకపై అందుబాటులో లేదని- బుధవారంనాడు ఢిల్లీలోని ఎన్సీఈఆర్టీ క్యాంపస్‌లోని ప్రచురణ విభాగం పుస్తక కౌంటర్లోని సిబ్బంది తెలిపారు.
సీజేఐ తీవ్ర అభ్యంతరం – కపిల్ సిబల్ వాదనలు
ఫిబ్రవరి 25నాడు, 8వ తరగతికి సంబంధించిన “న్యాయవ్యవస్థలో అవినీతి” అనే కొత్త ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలోని భాగాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
న్యాయవ్యవస్థ ప్రతిష్టను కించపరచడానికి లేదా అణగదొక్కడానికి ఎవరినీ అనుమతించబోమని; తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
లైవ్ లా కథనం ప్రకారం, బుధవారం సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీలతో కలిసి కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ అంశాన్ని లేవనెత్తారు.
“ఈ సంస్థ సభ్యులుగా, 8వ తరగతి విద్యార్థులకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధిస్తున్నారని మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఇది ఎన్సీఈఆర్టీలో భాగం. ఈ సంస్థతో మాకు లోతైన సంబంధం ఉంది. అంతేకాకుండా ఇది పూర్తిగా దిగ్భ్రాంతికరమైనది. మా వద్ద పుస్తకం కాపీలు ఉన్నాయి” అని సిబల్ అన్నారు.
కోర్టు ప్రతిస్పందన
ఈ విషయం తనకు పూర్తిగా తెలుసని, దీనికి సంబంధించి అనేక ఫోన్ కాల్స్, మెసేజులు వచ్చాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
పుస్తకంలోని విషయాల గురించి చాలా మంది న్యాయమూర్తులు కూడా “ఆందోళన చెందుతున్నారని” ఆయన చెప్పారు.
‘ఈ విషయం గురించి నాకు పూర్తిగా తెలుసునని మీ అందరికీ హామీ ఇస్తున్నాను’ అని ఆయన అన్నారు.
కోర్టు ఈ విషయాన్ని స్వయంగా పరిశీలిస్తుందని సిబల్ ఆశాభావం వ్యక్తం చేసినప్పుడు, “ఒక్క రోజు ఆగండి. ఇది మొత్తం సంస్థకు సంబంధించిన విషయం. బార్ & బెంచ్ రెండూ ఆందోళన చెందుతున్నాయి. వ్యవస్థలోని ప్రతి వాటాదారుడు ఆందోళన చెందుతున్నారు. నాకు నిరంతరం కాల్స్, సందేశాలు వస్తున్నాయి. హైకోర్టుల న్యాయమూర్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. మీరు ఈ అంశాన్ని లేవనెత్తినందున, నేను ఇప్పటికే ఒక ఉత్తర్వు జారీ చేశానని; ఈ విషయాన్ని స్వయంగా పరిశీలిస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను”అని ప్రధాన న్యాయమూర్తి సమాధానమిచ్చారు.
“ఈ సంస్థ గౌరవాన్ని దెబ్బతీయడానికి లేదా అప్రతిష్టపాలు చేయడానికి నేను ప్రపంచంలో ఎవరినీ అనుమతించను. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించను. ఎవరైనా ఎంత ప్రభావవంతమైన వారైనా, చట్టం తన పని తాను చేసుకుంటుంది. దానిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు” అని ఆయన అన్నారు.
సెలెక్టివ్ కంటెంట్‌పై విమర్శలు
సమస్య కేవలం కంటెంట్ మాత్రమే కాదు, దాని ఎంపిక కూడా అని సింఘ్వీ అన్నారు. ఇతర రంగాలలో అవినీతి లేనట్లుగా కేవలం న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు.
పుస్తకంలో అధికార యంత్రాంగం, రాజకీయాలు, ప్రజా జీవితం లేదా ఇతర సంస్థలలో అవినీతి గురించి ప్రస్తావించలేదని ఆయన అన్నారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, ‘ఇది చాలా బాగా ఆలోచించి, లోతుగా పాతుకుపోయిన చర్యగా కనిపిస్తోంది. మేము ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పదలచుకోలేదు. నాకు తెలుసు, నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను’ అని అన్నారు.
విచారణ సందర్భంగా, జస్టిస్ దీపాంకర్ దత్తా కూడా పుస్తక నిర్మాణం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి సంబంధించిన రాజ్యాంగ సమగ్రతను కలిగి లేనట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
వివాదాస్పద అధ్యాయంలో ఏముంది?
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, సోమవారం(ఫిబ్రవరి 23) ఎన్సీఈఆర్టీ విడుదల చేసిన కొత్త 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో ‘మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే పాఠం కింద ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే కొత్త అధ్యాయం చేర్చారు.
ఈ అధ్యాయం ‘న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో అవినీతి’, ‘తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం, సంక్లిష్టమైన చట్టపరమైన విధానాలు, పేలవమైన మౌలిక సదుపాయాల వల్ల కేసులు భారీగా పెండింగ్‌లో ఉండటం’ వంటి అంశాలను న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లుగా పేర్కొంది.
పాత పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థ పాత్ర, స్వతంత్ర న్యాయవ్యవస్థ భావన, కోర్టుల నిర్మాణం అంతేకాకుండా న్యాయం పొందడం వంటి అంశాలు మాత్రమే ఉన్నాయి.
అవినీతి గురించి అందులో ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే, కేసుల విచారణలో సంవత్సరాల తరబడి జాప్యం సాధారణ పౌరుడికి న్యాయం లభించడంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. “న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించబడడమే” అని అందులో పేర్కొంది.
కొత్త పుస్తకం కోర్టు పెండింగ్ గణాంకాలను కూడా అంచనా వేసింది. దీని ప్రకారం, సుప్రీంకోర్టులో సుమారు 81,000 కేసులు, హైకోర్టులలో సుమారు 62.4 లక్షల కేసులు, జిల్లా, సబార్డినేట్ కోర్టులలో సుమారు 4.7 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది.
జవాబుదారీతనం, ఫిర్యాదుల విధానం
“న్యాయవ్యవస్థలో అవినీతి” అనే అధ్యాయం, న్యాయమూర్తులు కోర్టు లోపల మాత్రమే కాకుండా బయట కూడా ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని వివరిస్తుంది.
ఇది న్యాయవ్యవస్థ అంతర్గత జవాబుదారీ యంత్రాంగాలను, కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థతో సహా ఇతర ఫిర్యాదుల విధానాలను వివరిస్తుంది.
పుస్తకం ప్రకారం, 2017 నుంచి 2021 మధ్య 1,600 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.
తీవ్రమైన ఆరోపణలు ఎదురైనప్పుడు, పార్లమెంటు అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించవచ్చని కూడా పుస్తకం వివరిస్తుంది.
సరైన దర్యాప్తు తర్వాత, సంబంధిత న్యాయమూర్తికి తన వాదనను వినిపించడానికి పూర్తి అవకాశం ఇచ్చిన తర్వాత మాత్రమే అటువంటి ప్రతిపాదనను పరిశీలిస్తారని పేర్కొంది.
“అయినప్పటికీ, న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో ప్రజలు అవినీతిని అనుభవిస్తున్నారు” అని పుస్తకం చెబుతుంది. “ఇది పేదలు, అణగారిన వర్గాలకు న్యాయం పొందడంలో సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
అందువల్ల, అవినీతి కేసుల్లో పారదర్శకతను పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం సహా వివిధ చర్యలను వేగవంతం చేయడానికి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.”
ఈ పుస్తకం జూలై 2025లో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన ప్రకటనను కూడా ఉదహరించింది.
న్యాయవ్యవస్థలో కొన్ని అవినీతి, దుష్ప్రవర్తన కేసులు వెలుగులోకి వస్తున్నాయని, ఇవి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, పారదర్శకమైన చర్యల ద్వారానే ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
