
బంధీల విడుదల కోసం గాజా జనాభా ఆకలి సమస్యను సమర్ధించాలని సూచించిన తీవ్ర మితవాది స్మోట్రిచ్.
న్యూఢిల్లీ: తన కఠినమైన ప్రకటనలతో అనేక పశ్చిమ ప్రభుత్వాలతో పాటు– ఐరోపా యూనియన్ నుంచి ఖండనలు, ఆంక్షలను ఇజ్రాయిల్ తీవ్ర మితవాద ఆర్థికమంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ఎదుర్కొంటున్నారు. అయితే, మూడు రోజుల పర్యటనపై సెప్టెంబర్ 8న ఆయన భారత్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో స్మోట్రిచ్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాల(బీఐఏ)పై సంతకాలు చేశారు.
తన తీవ్రవాద అభిప్రాయాల వల్ల అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన ఈ పర్యటనను చేపట్టారు.
గత జూన్‌లో యూకే, కెనడా, న్యూజీలాండ్, అస్ట్రేలియా, నార్వేలు స్మోట్రిచ్తో పాటు ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్- గ్విర్‌లపై ఆంక్షలు విధించాయి. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుండడంతో పాటు రెచ్చగొట్టే ప్రకటనల కారణంగా వారిరువురిపై ఆంక్షలను విధించినట్టుగా ఈ దేశాలు తెలిపాయి. అవాంఛనీయమైన వ్యక్తులుగా జూలైలో స్లోవేనియా వారిని ప్రకటించింది. నెదర్లాండ్స్ కూడా వారి ప్రవేశంపై నిషేధం విధించింది. గాజాపై వారి అభిప్రాయాలు జాతిహననాన్ని సమర్థిస్తునట్టుగా ఉన్నాయని నెదర్లాండ్స్ కూడా నిషేధం విధించింది.
గత నెల స్మోట్రిచ్ వెస్ట్ బ్యాంక్‌లో వివాదాస్పద ఈ1 సెటిల్మెంట్ ప్రాజెక్టును పునరుద్ధరించారు. ఈ చర్య పాలస్తీనా రాజ్యస్థాపన అవకాశాలను ప్రభావవంతంగా విఘాతం కలిగిస్తుందని విమర్శకులు అభిప్రాయడ్డారు. వెస్ట్‌బ్యాంక్‌లోని 82% భూభాగాన్ని స్వాధీనం చేసుకొని, మ్యాప్ తయారు చేసినట్టు ఈ నెల మొదట్లో స్మోర్ట్రిచ్ వెల్లడించారు.
దీని ప్రకారం, కొన్ని పాలస్తీనా జనాభా కేంద్రాలను మాత్రమే వదిలేశారు. అయితే బంధీలను విడిచిపెట్టాలంటే, గాజా జనాభాను పస్తులతో అలమటించేలా చేయాలని కూడా ఆయన సూచించారు.
ఈ వ్యాఖ్యలను “భయంకరమైనవి”గా అభివర్ణిస్తూ ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఈయూలు ఖండించాయి.
భారత ప్రభుత్వ మౌనం..
దీని మీద ఇంత వరకు భారత ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి మద్దతునిస్తూ, గాజాలో మానవీయ సంక్షోభంపై భారత్ ఆవేదనను వ్యక్తం చేసింది. దీని తర్వాత కూడా వివాదాస్పద ఇజ్రాయిల్ మంత్రి రాకపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మోడీ ప్రభుత్వం టెల్అవీవ్తో సన్నిహితంగా ఉంటుంది. దీంతో గాజా ఆక్రమణపై ఇజ్రాయిల్‌ను నేరుగా విమర్శించడంలో సమన్వయాన్ని పాటిస్తుంది. చివరికి జర్నలిస్టుల హత్యలపై కూడా భారత్ స్పందించడం లేదు.పీఐబీ ప్రకారం నిర్మలా సీతారామన్, స్మోట్రిచ్ సంతకాలు చేసిన ఒప్పందంలో– జప్తుకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు రక్షణ, కనీస ప్రమాణాలను అందజేయడం, పారదర్శకతను పాటించడం, నిధుల బదలాయింపుపై విధివిధానాలు, నష్టాలు జరిగితే నష్టపరిహారం విషయంలో చర్చల ద్వారా వివాదాల పరిష్కారం కోసం ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటు వంటి విషయాలు ఉన్నాయి.
“వాణిజ్య– వ్యాపార పెరుగుదల, పరస్పరం పెట్టుబడులను” అంతేకాకకుండా ఫిన్‌టెక్, ఆర్థిక నియంత్రణ, మౌలిక వనరుల అభివృద్ధి, డిజిటల్ చెల్లింపుల అనుసంధానం వంటి విషయాలలో సహాకారానికి ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలియజేసింది.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఈ ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని ఇజ్రాయిల్ ఆర్థికమంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థికవేత్త సామ్యుల్ అబ్రంజోన్ ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు. “ఈ రెండు దేశాల మధ్య సంప్రదింపుల కంటే ముందు ఇప్పటికే కొంత చర్చలు జరిగాయని, అవి కార్యరూపం దాల్చగలవని విశ్వసిస్తున్నట్టు” ఆయన అన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.