సాయుధ దళాల ట్రిబ్యూనల్‌కు చెందిన 11 బెంచ్‌లలో సుమారు 38 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సామాజిక కార్యకర్త వెంకటేశ్ నాయక్‌కు ఆర్టీఐ ఇచ్చిన సమాధానం తెలియజేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనకంటే ముందు ఏఎఫ్‌టీ స్వయంగా వెల్లడించిన దానికి, ప్రస్తుత సమాధానానికి తీవ్రమైన వ్యత్యాసాలు ఉండడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ: సాయుధ దళాల ట్రిబ్యూనల్స్‌కు చెందిన 11 బెంచ్‌లలో దాదాపు 38 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సాయుధ దళాల ట్రిబ్యూనల్(ఏఎఫ్‌టీ) స్పందిస్తూ, సమాచార హక్కుపై ఆర్టీఐ కార్యకర్త వెంకటేశ్ నాయక్‌కు పంపించిన అంకెలు వెలుగులోకి తెచ్చాయి.
కేవలం 6,904 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు పార్లమెంటులో 2025 డిసెంబర్ 5న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కంటే ఈ అంకెలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
సర్వీసు అంశాలు, పింఛన్లు, వికలాంగుల వాదనలు, కోర్టు మార్షల్ విజ్ఞప్తులకు సంబంధించి వివాదాలపై ఏఎఫ్‌టీ తీర్పులు చెబుతుంది.
ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే- తమ పింఛను, ఇతర వివాదాల పరిష్కారానికి సైనికులు ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిందేనని దీని అర్థం.
కామన్వెల్త్ మానవ హక్కుల చొరవ(సీహెచ్ఆర్ఐ) డైరెక్టర్, ఆర్టీఐ కార్యకర్త వెంకటేశ్ నాయక్ ప్రశ్నలను సంధించారు.
ఈ ప్రశ్నలపై ఏఎఫ్‌టీ స్పందనను గమనిస్తే, అన్ని బ్రాంచీల వ్యాప్తంగా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఉన్న మొత్తం పెండింగ్ కేసులను కలపడంతో ఈ సంఖ్య 37,864కు చేరినట్టు కనుగొన్నారు.
ఏఎఫ్‌టీ సొంత అంకెలలోనే పొంతన లేదు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికంటే గణనీయంగా ఈ అంకెలు పెరగడమే కాకుండా, అంతకంటే ముందు కొన్ని నెలల క్రితం ఏఎఫ్‌టీ సొంతంగా ప్రకటించిన దానికంటే కూడా ఎంతో ఎక్కువని నాయక్‌కు పంపిన మరో ఆర్టీఐ సమాధానంలో తెలియజేయబడింది.
ఆర్టీఐ ద్వారా నాయక్ వేసిన ప్రశ్నకు ట్రిబ్యూనల్ కేంద్ర పౌర సమాచార అధికారి స్పందిస్తూ, 2025 సెప్టెంబర్ నాటికి 27,962 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అంకెలకు, ఏఎఫ్‌టీ అంకెలకు మధ్య ఉన్న ఈ అసమతుల్యత 2025 డిసెంబర్లో వెలుగులోకి వచ్చింది.
ఏఎఫ్‌టీ పెండింగ్ అంకెలలో అసమానతలతో పాటు, పార్లమెంటులో ప్రభుత్వ సమాధానంలో కనిపించిన అంకెల అసమతుల్యతను మొదటగా ‘ది వైర్’ కథనం బయటపెట్టింది.
2021 ఫిబ్రవరిలో 18,826 పెండింగ్ కేసులను పార్లమెంటు నమోదయినట్టు, ఈ తేదీ తర్వాత ఈ అంకెలు బాగా పెరిగినట్టు ఆ కథనం తెలియజేస్తుంది.
ఏఎఫ్టీలో 6,904 పెండింగ్ కేసులున్నట్టు 2025 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ధారణకు వచ్చిందో అస్పష్టంగానే ఉండిపోయింది.
పార్లమెంటు సమాధానాల్లో మొత్తం పేరుకుపోయినవి కాకుండా, కేవలం సంవత్సరాల వారీగా ఏఎఫ్‌టీ వద్ద ఉన్న పెండింగ్‌లను మాత్రమే అందజేశారు.
ఏఎఫ్‌టీ పంపించిన ఆర్టీఐ సమాధానాల ఆధారంగా ఆర్టీఐ కార్యకర్త నాయక్ సొంతంగా ఈ లెక్కలు తీశారు.
పెండింగ్ కేసుల వివరాలు- ఏళ్ల వారీగా వర్గీకరణ
నాయక్ వేసిన ఆర్టీఐ ప్రశ్నలకు ఏఎఫ్‌టీ తాజాగా ధారావాహికంగా స్పందిస్తూ, కేటగిరీల వారీగా పెండింగ్ కేసుల వివరాలను అందజేసింది.
15 సంవత్సరాలకు మించి పెండింగ్‌లో ఉన్న కేసులు, 10-15 సంవత్సరాలు, 5 నుంచి 9 సంవత్సరాలు, 5 సంవత్సరాలలోపు అంటూ 11 బ్రాంచ్‌లలో పెండింగ్ కేసులను తెలియజేసింది.
ఏఎఫ్‌టీ స్థాపించిన నాటి నుంచి “15 సంవత్సరాలకు మించి” 1,099 (2.90 శాతం) కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు పాతిక సంవత్సరాలుగా ఉన్న 37,864 కేసుల్లోంచి “10-15 సంవత్సరాల మధ్య” 9,302 (24.57 శాతం) కేసులు, “5-9 సంవత్సరాల మధ్య” 4,944 (13.06 శాతం), మిగిలినవి “ఐదు సంవత్సరాలలోపు” 22,519 (58.52 శాతం) కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు డేటా వెల్లడించింది.
ఢిల్లీ ప్రధాన బెంచ్, లక్నో, చండీగఢ్ ప్రాంతీయ బెంచ్‌లలోనే ముప్పావు వంతు(78.76 శాతం) పెండింగ్ కేసులు అలా పేరుకుపోయినట్టు కూడా ఆర్టీఐ తెలియజేసింది.
అంతేకాకుండా, ఏఎఫ్‌టీ 2009లో స్థాపించిన వెంటనే ఢిల్లీ హైకోర్టు నుంచి 1,204 కేసులను ఏఎఫ్‌టీ ఢిల్లీ ప్రధాన బెంచ్‌కు బదిలీ చేసినట్టు ఏఎఫ్‌టీ పేర్కొంది.
అయోమయం సృష్టిస్తున్న డేటా వ్యత్యాసాలు
“ఇతర అనేక వ్యత్యాసాలు కూడా ఉన్నాయి” అని ‘ది వైర్’తో మాట్లాడుతూ నాయక్ అన్నారు. దాదాపు 15 సంవత్సరాలకు మించి ప్రధాన బెంచ్ ముందు 1,000 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు ఆర్టీఐ తాజా సమాధానంలో తెలియజేసిందని ఆయన ఉదాహరణగా చెప్పారు.
కానీ, 2009లో కేవలం 992 కేసులను మాత్రమే తనకు సీపీఐఓ 2025 సెప్టెంబర్‌లో అందజేసిన డేటా పేర్కొంది. ఈ డేటా వ్యత్యాసాలపై ఏఎఫ్‌టీ, కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.
మరో మాటలో చెప్పాలంటే, ఒకవేళ 1000లోపు కేసులను విచారణకు ముందుగా అంగీకరించినట్లయితే, వాటికంటే ఎక్కువ కేసులు 15 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఎలా పెండింగ్‌లో ఉంటాయి? ఏఎఫ్‌టీ సొంత అంకెలలో ఉన్న ఇలాంటి అసమానతలు, కేంద్ర ప్రభుత్వం లెక్కల్లోని అసమతుల్యతను చూస్తే అసలు ఏ డేటా సరైనదన్న ప్రశ్న తలెత్తుతుంది.
వివాదాల పరిష్కారంలో ఏఎఫ్‌టీ పని తీరును కొలమానం చేయడానికి ఈ అంకెల్లోంచి ఏ అంకెలను పరిగణనలోకి తీసుకోవాలి?
సిబ్బంది కొరత.. ఖాళీగా ఉన్న పోస్టులు
ఏఎఫ్టీలో ఎక్కువ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండటానికి ప్రధాన కారణం, ట్రిబ్యూనల్‌లో ఉన్న ఎక్కువ సంఖ్యలోని ఖాళీలే కావచ్చు.
ఏఎఫ్‌టీ మొత్తంగా 11 బెంచ్‌లలో చైర్పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్స్, సభ్యులకు కలిపి 34 పోస్టులు మంజూరు కాగా, దాదాపు మూడవ వంతు అంటే 11 మాత్రమే భర్తీ అయ్యాయని రాజ్యసభ ముందు 2025 డిసెంబర్లో ఉంచిన డేటా వెల్లడించింది.
రాజస్థాన్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్(మాజీ) 2021 మార్చిలో వేసిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయమంత్రి సమాధానమిస్తూ, ఏఎఫ్టీకి చెందిన 11 బెంచ్‌లలో 34 పోస్టుల్లోంచి 23 ఖాళీగా ఉన్నాయని, 18,829 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు చూపించారు.
అయితే, వివిధ ఏఎఫ్‌టీ బెంచ్‌లలో కేవలం 11 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని 2025 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసింది.
ఏఎఫ్‌టీ బెంచ్‌ల నిర్మాణం, పనితీరు
కేంద్ర చట్టాల ద్వారా స్థాపించిన అన్ని పరిపాలన ట్రిబ్యూనళ్లలో(ఏఎఫ్టీతో సహా) పెండింగ్ కేసుల సమాచారాన్ని ఇద్దరు పార్లమెంటు సభ్యులు, డీఎంకేకి చెందిన అరుణ్ నెహ్రూ, తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన డెరిక్ ఓబ్రెయిన్ కోరారు.
అంతకుముందే, 2025 ఆగస్టులో ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా ఏఎఫ్టీలో పెండింగ్ కేసుల గురించి నాయక్ అడిగారు.
పార్లమెంటులో వేసిన ప్రశ్నలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ఏఎఫ్టీలో 2020 నుంచి 2025 వరకు 6,904 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రకటించింది.
ఏఎఫ్‌టీ ఆర్టీఐ సమాధానాల ద్వారా 2025 సెప్టెంబర్‌లో నాయక్‌కు ఇచ్చిన సమాచారంలోని అంకెలతో పోలిస్తే కచ్చితంగా ఇవి చాలా తక్కువ.
ఇప్పుడు ఇక మూడవ సెట్ డేటా(ఏఎఫ్‌టీ నుంచి రెండవది)లో మరిన్ని ఎక్కువ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.
ఏఎఫ్‌టీని ప్రధాన బెంచ్ ఢిల్లీతో 2009 ఆగస్టులో స్థాపించగా, 10 ఇతర బెంచ్‌లు చండీగఢ్, లక్నో, ముంబై, చెన్నై, కోల్‌కతా, జైపూర్, గౌహతి, కొచ్చి, జబల్పూర్, జమ్మూలలో పని చేస్తున్నాయి.
ప్రధాన బెంచ్, చండీగఢ్, లక్నో ప్రాంతీయ బెంచ్‌లలో ముగ్గురు న్యాయ, ముగ్గురు పరిపాలన చొప్పున సభ్యులున్నారు.
ఇతర ప్రాంతీయ బెంచ్‌లలో ఒక్కొక్క న్యాయ, పరిపాలన సభ్యులున్నారు. చైర్పర్సన్ ఎప్పటికీ న్యాయ సభ్యులే ఉంటారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
