
భారతదేశంలో కమ్యూనిస్టులు చరిత్రను పునరావలోకనం చేయాలని ఫ్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 15న ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సుర్జిత్ భవన్లో కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ స్మారకోపన్యాసం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) కేంద్ర కమిటీ నిర్వహించింది. స్మారకోపన్యాసంలో ఇర్ఫాన్ హబీబ్ ప్రసంగించారు. సీతారాం ఏచూరి మరణంతో భారత కమ్యూనిస్టు ఉద్యమం బహుముఖ ప్రజ్ఞాశాలిని, కమ్యూనిస్టు మేధావిని, ఆలోచనాపరుడిని కోల్పోయిందని హబీబ్ అన్నారు.
భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం 1920 దశకంలో మొదలైందనీ తెలియజేశారు. కానీ, భారతదేశం గురించిన మార్క్సిస్టు విశ్లేషణ 1840 దశకంలోనే ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, దానికి ముందు మార్క్స్ ఇంగ్లాండ్లో అందుబాటులో ఉన్న సమాచార వనరుల ఆధారంగా న్యూయార్క్ ట్రిబ్యూన్కు రాసిన వ్యాసాలు భారతదేశ చరిత్ర, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ గురించిన తొలి రచనలను ఆయన పేర్కొన్నారు.
మార్క్స్ అనంతరం 1880 దశకంలో దాదాబాయి నౌరోజి, 1900ల్లో రమేష్ చంద్రదత్, తర్వాతి కాలంలో వచ్చిన అనేక రచనలు, పరిశోధనలు, విశ్లేషణల్లో భారతదేశం గురించి మార్క్సిస్టు అవగాహన మూలాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. మీరట్ కుట్రకేసు భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ ఆవిర్భావం, దేశం గురించిన తొలితరం కమ్యూనిస్టుల దృక్ఫథం, అవగాహనలు వ్యక్తం చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఆ రచలు చదవకుండా భారతదేశంలో దేశం గురించిన కమ్యూనిస్టు దృక్ఫథాన్ని పెంపొందించుకోవటం అంత తేలిగ్గా కుదిరేపని కాదని ఆయన గుర్తు చేశారు.
చారిత్రక అవగాహన విషయంలో కమ్యూనిస్టు పార్టీలు సరిదిద్దుకోవాల్సిన అంశాలను ప్రస్తావించారు. దేశ విభజన సమయంలో పార్టీ నిర్మాణ ప్రాధాన్యతల్లో నాయకత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ, ముస్లింలు అయినంత మాత్రాన పాకిస్తాన్ వెళ్లి అక్కడ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించాలని పురమాయించటం వలన, ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో ఎక్కువమంది శక్తివంతమైన కార్యకర్తల శక్తి వృధా అయ్యిందని ఆయన గుర్తు చేశారు.
ప్రతి ఏటా స్మారకోపన్యాసం..
సభ ముగింపులో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మాట్లాడారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి పేరుతో ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఆ సంస్థకు మార్క్సిస్టు ఆర్థికవేత్త ప్రొఫేసర్ ప్రభాత్ పట్నాయక్ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఈ సంస్థ తరఫున దేశవ్యాప్తంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి స్మారకోపన్యాసాలు, స్మారక కార్యక్రమాలు జరపనున్నామని బేబీ తెలిపారు. ఇందులో తొలి అడుగుగా ఆసియా దేశాల కమ్యూనిస్టు చరిత్ర, వారసత్వం గురించిన సమాచారాన్ని, పరిశోధనలను డిజిటలైజ్ చేయటం ద్వారా ఆసక్తి కలిగిన పరిశోధకులకు, భవిష్యత్ కమ్యూనిస్టు కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన తెలిపారు.
స్మారకోపన్యాసం కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అధ్యక్షత వహించగా, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్, పొలిట్బ్యురో సభ్యులు వాసుకి వేదిక మీద ఉన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.