లింగ పక్షపాతాన్ని పరిష్కరించడంపై మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ రాసిన హ్యాండ్‌బుక్ “హార్వర్డ్లాంటి ఆలోచనల ద్వారా ప్రభావితమైంది”అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అభివర్ణించారు.
దీనిని మరింత “సరళమైనదిగా”, “ఆచరణాత్మకమైనదిగా” మార్చడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 11న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడుతూ, మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రూపొందించిన “లింగ వివక్షలను ఎదుర్కోవడంపై హ్యాండ్‌బుక్” అత్యాచార బాధితులకు, సాధారణ ప్రజలకు పెద్దగా ఉపయోగపడదని అన్నారు.
ఈ పుస్తకం “చాలా సాంకేతికమైనది”, “హార్వర్డ్ ఆలోచనల ద్వారా ప్రభావితమైనట్టు కనిపిస్తోంది” అని పేర్కొన్నారు.
ఆచరణాత్మక శిక్షణ అవసరం..
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ఈ బుక్‌లెట్‌ను మరింత ఆచరణాత్మకంగా, ప్రభావవంతంగా మార్చడానికి అవసరమైన సవరణలను సూచించడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేయబడుతుందని ఆయన సూచించారు.
మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రాసిన 2023 హ్యాండ్‌బుక్, న్యాయమూర్తులకు పితృస్వామ్య భాషను గుర్తించడంలో, నివారించడంలో సహాయపడటానికి రూపొందించబడింది.
అయితే, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇది అతిగా విద్యాసంబంధమైనదని; న్యాయవాదుల వాస్తవ పరిస్థితులకు సంబంధం లేనిదని అభిప్రాయపడ్డారు.
ఈ అంశంపై ఆచరణాత్మక శిక్షణ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
2025 మార్చి 17 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పుకు సంబంధించిన సుమోటో కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
“రొమ్ములను పట్టుకోవడం”, మహిళా బాధితురాలి పైజామా నడుము పట్టీని లాగడం అనేది అత్యాచారానికి “ప్రయత్నం” కాదని; కేవలం అత్యాచారానికి “తయారీ” మాత్రమే అని హైకోర్టు పేర్కొంది.
తయారీ, ప్రయత్నం మధ్య ఈ వ్యత్యాసం సరికాదని విస్తృతంగా విమర్శలు వచ్చాయి.
గతంలో ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని, దానిపై స్టే విధించి, న్యాయపరమైన విధానంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని మంగళవారం అధికారికంగా పక్కన పెట్టి; అత్యాచారయత్నం ఆరోపణల నిందితుడిపై విచారణను కొనసాగించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
బుక్లెట్పై బెంచ్ అభిప్రాయం..
30 పేజీల బుక్లెట్ లైంగిక వేధింపులకు సంబంధించిన వివిధ అంశాలను అత్యంత ఫోరెన్సిక్, సాంకేతిక దృక్కోణం నుంచి వివరిస్తుందని; ఇది బాధితురాలు, ఆమె కుటుంబం లేదా సాధారణ ప్రజలకు సులభంగా అర్థం కాదని ధర్మాసనం పేర్కొంది.
“ఇది చాలా హార్వర్డ్ కేంద్రీకృతమై ఉంది” అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు.
మొత్తం సమస్యను సమీక్షించి, కొత్త మార్గదర్శకాలను రూపొందించి, నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడానికి విషయ నిపుణులు, విద్యావేత్తలు, న్యాయవాదులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని భోపాల్‌కు చెందిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ(ఎన్‌జేఏ)ని ధర్మాసనం ఆదేశించింది.
ఈ ప్రక్రియలో అమికస్ క్యూరీ శోభా గుప్తా, సీనియర్ న్యాయవాది హెచ్ఎస్ ఫూల్కా వంటి వారు పాల్గొంటారని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
బుక్లెట్ ఖరారు అయిన తర్వాత, ఎన్‌జేఏ దానిని హైకోర్టు న్యాయమూర్తులకు అధ్యయన సామగ్రిగా సిద్ధం చేయాలని; లైంగిక వేధింపుల కేసులను విచారించేటప్పుడు అవసరమైన సున్నితత్వంపై న్యాయమూర్తులకు దశలవారీగా శిక్షణ ఇవ్వాలని కోరడం జరిగింది.
“సుప్రీంకోర్టులో కూర్చుని హైకోర్టు న్యాయమూర్తులకు ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. వారికి నేషనల్ జ్యుడీషియల్ అకాడమీలో ఆచరణాత్మక శిక్షణ ఇవ్వాలి” అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
గత సంవత్సరం మార్చి 26న, అప్పటి ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు, ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి హైకోర్టు నిర్ణయాన్ని నిలిపివేసింది.
ఆ తీర్పులో ప్రతిబింబించిన అంశాల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆగస్టు 16న విడుదలైన ఈ బుక్‌లెట్‌లో మహిళలపై పక్షపాతం లేదా లింగ వివక్షలను బలపరిచే అనేక పదాలు, పదబంధాలను జాబితా చేశారు.
వీటిని మరింత సమతుల్యమైన, తటస్థ భాషతో భర్తీ చేయాలని ఇది సిఫార్సు చేస్తుంది.
ఉదాహరణకు, “వ్యభిచారి” అనే పదానికి బదులుగా “స్త్రీకి వివాహేతర సంబంధం ఉంది”వంటి వివరణాత్మక పదాలను వాడాలని సూచించింది.
అదేవిధంగా, “ప్రేమ వ్యవహారా”నికి బదులుగా “వివాహేతర సంబంధం” అనే పదాన్ని సిఫార్సు చేశారు.
భాషలో ఉన్న పక్షపాతాన్ని తగ్గించడానికి, ‘కెరీర్-ఓరియెంటెడ్ ఉమెన్’, ‘పవిత్రమైన స్త్రీ’, ‘చరిత్రలేని స్త్రీ’, ‘వేశ్య’, ‘చెడు వ్యక్తిత్వం కలిగిన స్త్రీ’ వంటి అవమానకరమైన లేదా ప్రతికూల అర్థాలు కలిగిన పదాలకు బదులుగా కేవలం ‘స్త్రీ’ అనే పదాన్ని ఉపయోగించాలని ఈ బుక్లెట్ సూచిస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
