స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులను సాంకేతిక సైన్యంగా తయారుచేసి, తరగతి గదేనే ఆయన ప్రాణంగా భావించారని కొనియాడారు.
వేలాదిమంది ఐఐటీ గ్రాడ్యూయేట్లను తయారుచేసి దేశానికి, ప్రపంచానికి అందించారని- రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి చుక్కా రామయ్య అని అన్నారు.
156వ గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖ గాంధేయవాది, రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రచించిన “గ్లోబల్ రోల్ మోడల్ మహాత్మా గాంధీ” అనే పుస్తకాన్ని చుక్కా రామయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ, అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తెలుగువారైన సాఫ్ట్వేర్ నిపుణులతో నిండిపోవడానికి కారకులు రామయ్యే అని చెప్పారు. దేశం ఆత్మ గ్రామమని గాంధీజీ చెప్పారని, తెలంగాణ గ్రామాల విముక్తి కోసం చుక్కారామయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, జైలు జీవితాన్ని అనుభవించారని గుర్తు చేశారు.
“గాంధీని విడదీసి భారతదేశాన్ని చూస్తే దేశం కొత్తగా, మనది కాదన్నట్లుగా కనిపిస్తుంది” అని పుస్తక రచయిత వేణుగోపాల్ అన్నారు. గాంధీ వ్యక్తిత్వం, ఆయన ఆలోచనలు ఆచరణ, తాత్వికత నేటి కాలానికి ఎంత అవసరమో “గ్లోబల్ రోల్ మోడల్ గాంధీ” పుస్తకంలో వివరించినట్టుగా ఆయన తెలిపారు.
తెలంగాణ పబ్లికేషన్స్ వ్యవస్థాపకులు, “గ్లోబల్ రోల్ మోడల్ గాంధీ” పుస్తక ప్రచురణకర్త కోయ చంద్రమోహన్ కార్యక్రమంలో మాట్లాడారు. “నేటి సమాజానికి గాంధీ ఎంత అవసరమో రచయిత నాగసూరి ఈ పుస్తకంలో వివరించారు” అని పేర్కొన్నారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రామానంద తీర్థ గ్రామీణ విద్యా సంస్థ చైర్మన్ నారా కిషోర్ రెడ్డి, రామయ్య కొడుకు శాస్త్రవేత్త చుక్కా శ్రీనివాస్, ఫస్ట్ రీల్ ఎం జూలూరు శివసాగర్, చేగోని, కోటి తదితరులు పాల్గొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
