పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలల నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు పెద్ద ఎత్తున చమురు, ఎల్పీజీ కొరతను ఎదుర్కొంటున్నాయి.
కొన్ని దేశాలలో ఈ కొరత సంక్షోభం స్థాయికి చేరుకుంటోంది.
దీనికి భిన్నంగా చైనా ముందస్తు ప్రణాళికతో తీసుకున్న చర్యల కారణంగా దేశీయ చమురు, సహజ వాయువు ఉత్పత్తిని పెంచుకుంటోంది.
తద్వారా గణనీయమైన స్థాయిలో దిగుమతులు చేసుకోవడం ద్వారా చమురు నిల్వలను విస్తారంగా పెంచుకుంది.
ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న చమురు, సహజ వాయువు కొరతను చైనా కొన్నేళ్ల క్రితమే గుర్తించిందా? అన్నది ప్రస్తుతం నడుస్తోన్న చర్చ.
పశ్చిమాసియా సంక్షోభం – అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ
2021లో చైనాలో భారీ చమురు బావులను సందర్శించిన సందర్భంగా చైనా అధినేత జీ జిన్‌పింగ్ “రానున్న కాలంలో మన ఇంధన వనరులను మనమే జాగ్రత్త చేసుకోవాలి” అని అన్నారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికాలు ప్రారంభించిన దురాక్రమణ దాడితో పశ్చిమాసియాలో రావణకాష్టం కాలుతోంది.
అంతర్జాతీయ చమురు వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో ప్రపంచంలో అనేక దేశాలు ఇంధన వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో, పశ్చిమాసియా దేశాల నుంచి జరిగే చమురు వనరుల ఎగుమతులు 61 శాతం పడిపోయాయని అంతర్జాతీయ చమురు, ఇంధన వనరుల అధ్యయన సంస్థ కెప్లెర్ అంచనా వేసింది.
ఆసియాలోని అనేక దేశాలు తమ దేశీయ చమురు, ఇంధన వనరుల అవసరాలు తీర్చుకోవడానికి పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపైనే ఆధారపడేవి.
ప్రస్తుతం, ఈ దేశాలన్నీ పరిమితంగా ఉన్న ఇంధన వనరులను పొదుపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
చైనా ముందస్తు సన్నద్ధత
దీనికి భిన్నంగా ఇంధన కొరత విషయంలో ఆసియాలోని ఇరుగుపొరుగు దేశాల కంటే, మెరుగైన స్థితిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ఉన్నది.
“చైనా వద్ద చమురు, సహజ వాయువు నిల్వలు గణనీయంగా ఉన్నాయి” అని ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ స్టడీస్‌లో చైనా ఇంధన వనరుల నిపుణులు మిచల్ మైదాన్ అభిప్రాయపడ్డారు.
ఈ మధ్యనే విడుదల చేసిన ఓ పరిశోధనా పత్రంలో దేశీయ అవసరాలను తీర్చుకోవడానికి సరిపోయినంత చమురు, ఎల్పీజీ నిల్వలు ఉన్నట్టుగా మిచల్ తెలియజేశారు.
దీంతో పాటు చైనా భారీ ఎత్తున ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేసుకున్నదని వివరించారు.
తన దేశీయ వినియోగానికి అవసరమైన ఇంధనంలో 50 శాతం పశ్చిమాసియా దేశాల నుంచే చైనా దిగుమతి చేసుకుంటుంది.
అయినప్పటికీ ఇదే మోతాదులో దిగుమతి చేసుకుంటున్న దేశాలతో పోల్చినప్పుడు తాజా యుద్ధం నేపథ్యంలో, ఎదురవుతోన్న అవాంతరాలు చైనా ఇంధన అవసరాలను పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి.
“జపాన్, కొరియా, భారత దేశాలు ఎదుర్కొన్నంత సంక్షోభాన్ని చైనా ఎదుర్కోవడం లేదు”అని మైదాన్ అంచనా వేశారు.
ఉదాహరణకు జపాన్ తన దేశీయ అవసరాలలో 95 శాతం అవసరాలను తీర్చుకోవడానికి పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకునే ఇంధన వనరులపైనే ఆధారపడుతోంది.
యుద్ధం తీవ్రత పెరుగుతున్నప్పటికీ, ఇరాన్ నుంచి చైనాకు ఎగుమతి అయ్యే చమురు, సహజ వాయువు నిల్వల్లో ఎటువంటి మార్పు రాలేదు.
యుద్ధం మొదలు కాక ముందు చైనా ఇరాన్ నుంచి 1.57 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంటే, యుద్ధ కాలంలో 1.47 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకున్నది.
ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
చైనా ప్రభుత్వ ఆధీనంలోని చమురు రవాణా సంస్థలు ఈ ప్రాంతంలో వివిధ ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టాయి.
ఎర్ర సముద్రం సమీపంలోనూ సౌదీ అరేబియాకు చెందిన ముడి చమురు వాణిజ్య కేంద్రం నుంచి చమురు సేకరించడానికి కై జింగ్ భారీ చమురు ట్యాంకర్లతో కూడిన పడవను దారి మళ్లించారని కైషిన్ మీడియా సంస్థ వెల్లడించింది.
ఈ సూపర్ ట్యాంకర్ ఏప్రిల్ మొదటి వారంలో చైనా రేవు పట్టణానికి చేరనున్నది.
ఒకవేళ దిగుమతుల సంక్షోభం ఎదురైనప్పటికీ, దాన్ని అధిగమించడానికి కావాల్సిన వ్యవస్థలను చైనా సిద్ధం చేసుకున్నది.
తన వద్ద ఎంత చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయో చైనా ఇప్పటి వరకు వెల్లడించలేదు.
వివరాలు ఎలా ఉన్నా చైనా వద్ద భారీ చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయన్న విషయంలో పరిశీలకుల మధ్య ఏకాభిప్రాయం ఉన్నది.
కొలంబియా యూనివర్సిటీ గ్లోబల్ ఎనర్జీ పాలసీ సెంటర్ అంచనా ప్రకారం, ప్రస్తుతం చైనా వద్ద 1.4 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి.
యుద్ధం మొదలైన తర్వాత దేశీయ చమురు శుద్ధి కర్మాగారాలు తమ వద్ద ఉన్న నిల్వలను ఎగుమతి చేయరాదంటూ చైనా ప్రభుత్వం ఆదేశించింది.
హరిత ఇంధనం వైపు వేగంగా అడుగులు
అదే సమయంలో చమురు, బొగ్గు, ఎల్పీజీ వంటి సంప్రదాయక ఇంధన వనరుల వినియోగం స్థానంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఇంధన వినియోగంతో నడిచే వాహనాల ఉత్పత్తి ఈ కాలంలో గణనీయంగా పెరిగిన విషయాన్ని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ – ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ) ప్రస్తావించింది.
ఈ కాలంలోనే చైనా ప్రత్యామ్నాయ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకున్నది.
దీంతో చమురు, బొగ్గు, ఎల్పీజీ వంటి సంప్రదాయక ఇంధన వనరులపై ఆధారపడే స్థితి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తోంది.
చైనా 2024లో వినియోగించిన విద్యుత్‌లో 31 శాతం సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ద్వారా అభివృద్ధి చేసినదే.
దీర్ఘకాలిక సవాళ్లు – భవిష్యత్ ఆందోళనలు
అయితే పశ్చిమాసియా సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే పరిణామాలు, పర్యవసానాలు బాధాకరంగా ఉండనున్నాయి. అటువంటి పరిణామాల నుంచి ఏ దేశమూ మినహాయింపు కాదు.
చైనాలోని ఇంధన నిల్వలను అంచనా వేయడం అంత తేలిక కాదని మిచల్ మైదాన్ అన్నారు.
చైనా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను మదింపు చేసే ప్రయత్నం ఇప్పటికీ ఒకసారి మాత్రమే జరిగిందన్నారు.
“మరింత విస్తృతమైన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించిన నివేదికలను రూపొందించడం సాధ్యం కాదు. అయినప్పటికీ, తాజా పరిణామాలు సరఫరా కొరతలకు, ధరల పెరుగుదలకు దారి తీసే అవకాశం ఉన్నది” అని మైదాన్ అభిప్రాయపడ్డారు.
చైనాలోని చమురు శుద్ధి కర్మాగారాలలో స్వయంప్రతిపత్తి కలిగిన కంపెనీలు చమురు దిగుమతి కోసం రష్యాను ఆశ్రయిస్తున్న పరిస్థితి సానుకూలంగా ఏమీ లేదు.
లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్(సహజ వాయువు)పై ఆధారపడిన పారిశ్రామిక, రసాయన పరిశ్రమలు భవిష్యత్తులో గ్యాస్ కొరతను, అధిక ధరలను ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు.
“గ్యాస్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలను తట్టుకుని ఈ పరిశ్రమలు నిలబడవచ్చు. కానీ ఈ సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగితే, దాంతోపాటు పెరగబోయే ధరలు, వాటి పర్యవసానాల గురించి బీజింగ్‌లో పెద్ద ఆందోళనలు మొదలయ్యాయి” అని మైదాన్ వ్యాఖ్యానించారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికాలు ప్రారంభించిన యుద్ధం ప్రభావం నేపథ్యంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంలో మిగిలిన దేశాల కంటే చైనా మెరుగైన స్థితిలో ఉన్నది.
కానీ జీ జిన్‌పింగ్ ఆశించినట్టు చమురు, సహజ వాయువు వంటి ఇంధన వనరుల విషయంలో ఆ దేశం పూర్తి స్థాయి స్వయంప్రతిపత్తిని ఇంకా సాధించలేదు.
ఈ యుద్ధం వారాల లెక్క నుంచి నెలల లెక్కకు మారితే, అంతర్జాతీయ చమురు సరఫరా మార్కెట్లలో వచ్చే అవాంతరాలు చేయి దాటిపోతే చైనా కూడా మిగిలిన దేశాలలా ఇబ్బంది పడడం తప్పదు.
అనువాదం: కొండూరి వీరయ్య
ది గార్డియన్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
