“ఈ కాలంలో పిల్లలు అస్సలు మాట వినడం లేదు. మా కాలంలో అయితేనా..! అయినా అంత ఓపికతో ఎవరు చెప్తారని?” ఇట్లా చాలా మాటలు వింటూ ఉంటాం. నేటి సమాజపు పోకడ అట్లాంటిది మరి.
సమాజం అంటే మనమేకదా. మన అంచనాలకు మించి కొందరు మంచి పనులు చేస్తూ ఉంటారు. ఎట్లా సాధ్యమైంది వీళ్లకని మనలో మనమే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. సరిగ్గా అట్లాంటిదే ఈ సారి 38వ హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌లో జరిగింది.
ఈ తరంలో ‘‘బుక్స్ లేవు.. అంతా లుక్సే’’ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అంతే కాదు, “పిల్లలు మాట వింటేనా..?” అని బలంగా చెప్తూంటారు కూడా. పిల్లలకు ఎట్లా చెప్పాలో, వారి ఇష్టాయిష్టాలేమిటో వారికి అర్థమయ్యేలా వివరిస్తే చాలు. అద్భుతమని పెద్దలనక తప్పదు.
హైద్రాబాద్ బుక్ ఫెయిర్- 2025 సరి కొత్త రికార్డును సృష్టించింది. ఈ రికార్డు క్రియేట్ చేసిన వారు ‘‘తెలంగాణ బాలోతవ్సం’’ కార్యక్రమ సంస్థకు కార్యదర్శి ఎన్ సోమయ్య, ఉపాధ్యక్షులు సుజావతి. వీరిద్దరూ సమాజానికి ఏదో మంచి చేయాలనే తలంపుతో ఉన్న వారే. అట్లా పిల్లల్లో ఉన్న ఆసక్తిని గుర్తించారు. వారిని సమాజ హితులుగా చేయాలనే తలంచారు వారి బృందం, వారు. ఇలాంటి ఆలోచనలకు కార్యరూపే బుక్ ఫెయిర్ వేదికపై సామాజిక చైతన్య నృత్యాలు.
బుక్ ఫెయిర్ అనగానే పుస్తక ప్రదర్శన పండుగని అనుకుంటాం. అంతే కాదు, దానికి మించి కూడా సమాజానికి మంచి చేయోచ్చని ఈ సారి తెలంగాణ బాలోత్సవం నిరూపించింది.
సెల్‌ఫోన్ యుగంలోనూ తగ్గని ఆదరణ
“పాఠకులు తగ్గుతున్నారు. సెల్ ఫోన్లు చెలరేగిపోతున్నాయి. కాలం మారిపోయింది. ఆ రోజుల్లో..”అని చెప్పుంటున్న సందర్భంలో, రోజూ వేలాది మంది పుస్తక ప్రేమికులు ఇందిరాపార్కు సమీపంలోని తెలంగాణ కళాభారతిలో ఏర్పాటు చేసి బుక్ ఫెయిర్‌కు హాజరైయ్యారు. ఈ పుస్తక ప్రదర్శన జరిగే అన్ని రోజుల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సెలవురోజుల్లో అయితే తీర్థంలా పాఠకులతో బుక్ ఫెయిర్ ప్రాంగణం నిండిపోయింది.
ప్రాంగణంలోకి వచ్చీరావడంతోనే అనిశెట్టి రజిత పేరుతో ఏర్పాటు చేసిన వేదిక కనిపిస్తుంది. ఆ వేదికపై వందలాది మంది విద్యార్థిని, విద్యార్థులు తమ డ్యాన్సులతో అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నారు. ఒకరిద్దరని కాదు ఏకంగా పదిహేను వందల నుంచి రెండు వేల మంది విద్యార్థులు ఈ వేదికపై తమ ప్రతిభను చాటుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియో డ్యాన్సులు కాదు సామాజిక బాధ్యత కలిగిన నృత్యాలు చేశారు.
భేష్ అన్పించుకున్న ప్రతిభ
విద్య, వైద్యం, ఉపాధి, మాద్యపానం దుష్ప్రభావాలు; మాదకద్రవ్య సేవనం వల్ల వచ్చే ప్రమాదాలు తదితర సామాజిక ప్రయోజిత అంశాల ఆధారంగా పాటలకు తగిన నృత్యం చేసి చూపరులను ఆకట్టుకున్నారు.
తమ వయస్సు చిన్నారులు చేస్తున్న డ్యాన్స్‌లను చూసి ప్రేక్షకులుగా వచ్చిన సుమారు యాభైమంది వరకు విద్యార్థులు ఏకపాత్రిభినయాలు చేశారు. చూపరులతో భేష్ అన్పించుకున్నారు. తమ వయస్సున్న వారు సమాజహితాన్ని కోరి చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమంలో తామూ భాగస్వాములు కావాలని భావించారు. వారట్లా స్పందించేలా విద్యార్థులు వేదికపై డ్యాన్సులు చేశారు. సామాజికహిత సందేశాన్ని విన్పించారు. దాని ద్వారా పలువురు స్పూర్తి పొందారు.
ఎంత అపురూపమైన విషయం ఇది. పిల్లలకు అర్థమయ్యేలా చెప్తే వారన్ని అర్థం చేసుకుంటారనే విషయం చాలా సులభంగా అర్థమవుతున్నది.
పిల్లలు వేదికపై చూపించిన ప్రతిభాపాటవాలు సాదాసీదా అయినవి కావు. నేటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్య అందులో ఉన్నది. అంతే కాదు స్త్రీపురుష సమానత్వం, ప్రకృతి పరిక్షణ, వ్యవసాయ రంగం- రైతుల సమస్యలు, భూమిని కాపాడుకోవడం ఎలా- ఇట్లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా విద్యార్థులు తమ నృత్యాల ద్వారా బుక్ ఫెయిర్‌కు అదనపు విజ్జాన్నిజోడించారు.
వివిధ పాఠశాలల నుంచి విద్యార్థుల రాక
తెలంగాణ బాలోత్సవం కార్యక్రమంలో సుమారు ఇరవై పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో పన్నెండు డ్యాన్స్ స్కూళ్ల విద్యార్థులున్నారని నిర్వాహకుల్లో ఒకరైన సుజావతి చెప్పారు.
నేటి తరానికి పరీక్షలు అంటే భయం పోగొట్టేందుకు నలుగురు సైకాలజిస్టుల చేత ప్రత్యేక కార్యక్రమాలు ఇదే వేదికపై నిర్వహించారు.”ఈ తరం ఎదుర్కొంటున్న సమస్యలు. వాటికి పరిష్కారాలు చూపించేందుకు ఈ బుక్ ఫెయిర్ కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నాము”అని బాలోత్సవం కమిటీ సభ్యులు కాంచన చెప్పారు. “టీం వర్క్ ద్వారా ఇంత మంది విద్యార్థులను ఒక వేదికపై తేగలిగామ”ని కమిటీ మరో సభ్యులు బ్రాహ్మణి వివరించారు. బుక్ ఫెయిర్ ప్రధాన నిర్వాహకులు కవి యాకూబ్ ప్రోత్సాహం కూడా తమకు ఉత్సాహాన్నిచ్చిందని ఈ కార్యక్రమ నిర్వాహకులు అన్నారు.
విద్యార్థుల మానసిక స్థితి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సైకాలజిస్టు మమత చాలా విలువైన సూచనలు చేశారని సుజాతి తన అనుభవాన్ని వ్యక్తీకరించారు.
వందలాది మంది విద్యార్థులను ఒకే ఆలోచనా స్రవంతిలోకి తీసుకురావడం అషామాషి విషయం కాదు. ఈ రోజుల్లో అస్సలే కాదు. ‘‘పుస్తకం హస్తభూషణం’’ పాత కాలపు మాట. ఆండ్రాయిడ్ ఆధునికపు పోకడ. ఇలాంటి సందర్భంలో బుక్ ఫెయిర్‌కు వేలాది మంది పాఠకులు ప్రతీరోజూ వచ్చారు. గడిచిన కొన్నాళ్లుగా బుక్ ఫెయిర్ నిర్వాహకులు చేసిన ప్రయత్నాల వల్ల కొత్త, పాత తరానికి చెందిన పాఠకులు భారీ సంఖ్యలో తెలంగాణ కళా భారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌కు హాజరైయ్యారు. ఇంకా పుస్తకాలు చదివేవారు ఉన్నారనే నమ్మకాన్ని ఈ ప్రదర్శన ఇస్తున్నది.
అంతే కాదు కొత్త తరానికి సరి కొత్త ఆలోచనలు, ఆచరణ ఎట్లా ఇవ్వాలో మంచి మార్గదర్శకత్వాన్ని ఇచ్చింది ‘‘తెలంగాణ బాలోత్సవం’’ సంస్థ.
సెల్ పట్టుకొనందే తమ పిల్లలు పుస్తకం ముట్టరని చాలా మంది తల్లిదండ్రులు- ఆనందంతో కొందరు, ఆవేదనతో మరికొందరు చెప్తూ ఉంటారు. ఇలాంటి రోజుల్లో కూడా బాలల చేత అద్భుతం చేయించిన తెలంగాణ బాలోత్సవం సంస్థకు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాల్సిందే.
ఇంతకు ముందు జరిగిన బుక్ ఫెయిర్లలో ఇలాంటి ప్రయోగం చేయలేదు. ఇప్పుడు వీరు చేశారు. మంచిపనికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి మంచి కార్యక్రమ ఉద్దేశ్యాన్ని మరింత ముందు తీసుకెళ్లేందుకు చొరవ కలిగిన సమాజ మార్పు కాంక్షించే వారికి మార్గదర్శనం చేశారు తెలంగాణ బాలోత్సవం నిర్వాహకులు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
