ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలోని ఒక నగల దుకాణంలో దొంగతనం కేసులో అరెస్టయిన 19 ఏళ్ల వ్యక్తి పోలీసు కస్టడీలో మరణించాడు. పోలీసులు తనను దారుణంగా హింసించడం వల్ల చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనారోగ్యం వల్ల చనిపోయాడని పేర్కొంటూ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు.
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలోని ఒక ఆభరణాల దుకాణంలో జరిగిన దొంగతనానికి సంబంధించి అరెస్టయిన 19 ఏళ్ల నిందితుడు మరణించాడు. ఆ వ్యక్తి పోలీసు కస్టడీలో మరణించాడని ఆరోపణలు రావడంతో అధికారులు న్యాయ విచారణకు ఆదేశించారు.
వార్తా సంస్థ పీటీఐప్రకారం, కస్టడీ మరణ కేసు నేపథ్యంలో నలుగురు పోలీసులను క్రియాశీల పనుల నుంచి తొలగించినట్టుగా అధికారులు తెలిపారు. అంతేకాకుండా, జిల్లా ప్రధాన కార్యాలయంలోని పోలీసు రిజర్వ్ సెంటర్‌కు బదిలీ చేసినట్టుగా పేర్కొన్నారు.
పోలీసులు దారుణంగా హింసించడం వల్లే తను మరణించాడని ఆరోపిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ యువకుడి కుటుంబం డిమాండ్ చేసింది.
మరోవైపు పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. నిందితుడు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నాడని, తన ఆరోగ్యం బాగాలేదని పేర్కొన్నారు.
పొరుగున ఉన్న సుర్గుజా జిల్లాలోని సీతాపూర్ పోలీసు అధికార పరిధిలోని నక్నా గ్రామానికి చెందిన ఉమేష్ సింగ్; అక్టోబర్ 30- 31 రాత్రి చందో రోడ్‌లోని ఒక ఆభరణాల దుకాణంలో జరిగిన దొంగతనం తర్వాత అరెస్టయిన తొమ్మిది మందిలో ఉన్నాడని ఒక పోలీసు అధికారి తెలియజేశారు.
అరెస్టయిన మరో ఎనిమిది మందిలో దొంగిలించబడిన విలువైన వస్తువులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా ఉన్నారు. దాదాపు రూ 5 మిలియన్ల విలువైన దొంగిలించబడిన ఆభరణాలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పోలీసు అధికారి చెప్పారు.
“నవంబర్ 9న సింగ్‌ను సుర్గుజా నుంచి బల్రామ్పూర్ పోలీసు స్టేషన్‌కు విచారణ కోసం తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తన పరిస్థితి మరింత దిగజారింది. తనను ఇక్కడి జిల్లా ఆసుపత్రిలో చేర్చారు, కానీ చికిత్స సమయంలో అదే రోజు మరణించాడు” అని ఆయన అన్నారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపామని, పోస్ట్‌మార్టం నివేదికలో సింగ్ మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని ఆయన చెప్పారు.
“ఈ సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాము. పోస్టుమార్టం, దర్యాప్తు నివేదికలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము”అని బలరాంపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ విశ్వదీపక్ త్రిపాఠి హామీ ఇచ్చారు.
కస్టడీ మరణం తరువాత, సుర్గుజా రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు దీపక్ ఝా నలుగురు పోలీసులను తక్షణమే బలరాంపూర్ పోలీసు స్టేషన్‌కు అనుసంధానించారు.
పోలీసులను బలరాంపూర్ సైబర్ సెల్‌కు చెందిన ఇన్స్పెక్టర్ హిమ్మత్ సింగ్ షెకావత్, కానిస్టేబుల్ ఆకాష్ తివారీ, బలరాంపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ రాధేశ్యామ్ విశ్వకర్మ, కానిస్టేబుల్ మాధురి కుజుర్గా గుర్తించారు.
హింసించారని కుటుంబ ఆరోపణ..
సింగ్ కుటుంబ సభ్యులు సోమ- మంగళవారం బలరాంపూర్ జిల్లా ఆసుపత్రి వెలుపల బైఠాయించి, నిరసనవ్యక్తం చేశారు. కఠినమైన చర్య తీసుకునే వరకు తన మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు.
నవంబర్ 7న సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని బలరామ్‌పూర్‌కు తీసుకువచ్చే ముందు రెండు రోజుల పాటు దారుణంగా కొట్టారని వాళ్లు పేర్కొన్నారు.
దోషులైన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, రెండవ పోస్ట్‌మార్టం నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వారు పోలీసు స్టేషన్ ముందు రోడ్డుపై ధర్నా చేయడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని తరిమారు.
సికిల్ సెల్ వ్యాధితో సింగ్ బాధపడుతున్నాడని, గత సంవత్సరంలో కనీసం 10 సార్లు ఆసుపత్రిలో చేరాడని, రెండుసార్లు రక్త మార్పిడి చేయించుకున్నాడని పేర్కొంటూ పోలీసులు ఆరోపణలను ఖండించారు. నవంబర్ 9 ఉదయం తన పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించిందని, వెంటనే తనను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చనిపోయాడని వారు చెప్పారు.
అయితే, మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. అతనికి ఎటువంటి అనారోగ్యం లేదన్నారు.
పోలీసు రికార్డులను ఉటంకిస్తూ, ఉమేష్ సింగ్- అతని తండ్రి హీరు అలియాస్ ఫేకు సింగ్‌లపై సుర్గుజా డివిజన్లో నమోదైన అనేక దొంగతనం, దోపిడీ కేసుల్లో పేర్లు ఉన్నాయని అధికారి తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
