2025-26 సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ కింద ఏ రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి నిధులు కేటాయించలేదని పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
నిధులు విడుదల చేసే ముందు రాష్ట్రాలు కొన్ని షరతులను పాటించాలని, అందిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించాలని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాలకు కుళాయి నీటిని అందించే కీలక పథకం ‘జల్ జీవన్ మిషన్’కు కేంద్ర ప్రభుత్వం నిధులను నిలిపివేసింది.
మిగిలిపోయిన పనులను రాష్ట్రాలు తమ స్వంత వనరులతో పూర్తి చేయాలని సూచించింది.
ఫిబ్రవరి 2న రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ప్రభుత్వం ఈ సమాచారాన్ని వెల్లడించింది.
2019లో ప్రారంభించబడిన ఈ ప్రతిష్టాత్మక పథకం, 2024 చివరి నాటికి 19.35 కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి నీటి కనెక్షన్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
గత సంవత్సరం, ఈ గడువును 2028 డిసెంబర్ వరకు పొడిగించారు.
ఈ పథకం డాష్‌బోర్డ్ ప్రకారం, ప్రస్తుతం 15.79 కోట్ల గృహాలకు(అంటే 81.5% లబ్ధిదారులకు) ఇంటి వద్దకే ట్యాప్ వాటర్ కనెక్షన్లు అందించబడ్డాయని హిందూస్తాన్ టైమ్స్ కథనం పేర్కొన్నది.
ఈ పథకం ప్రారంభమైన నాటికే ఏదో ఒక రకమైన ట్యాప్ వాటర్ సౌకర్యం ఉన్న 16.72% గృహాలు కూడా ఇందులో ఉన్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి వీ సోమన్న సమాధానమిస్తూ, ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రభుత్వం దీని కోసం రూ 2.08 లక్షల కోట్ల కేంద్ర కేటాయింపును ఆమోదించిందని, ఆ నిధులు దాదాపుగా ఖర్చయ్యాయని తెలిపారు.
“కాబట్టి, 2025-26లో అస్సాంతో సహా ఏ రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి నిధులు కేటాయించలేదు. నీరు అనేది రాష్ట్ర అంశం కాబట్టి, రాష్ట్రాలు తమ స్వంత వనరులతో కొనసాగుతున్న పనులను పూర్తి చేయాలని సూచించాం” అని మంత్రి వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఏ రాష్ట్రానికి నిధులు విడుదల చేయలేదని మంత్రి చెప్పినప్పటికీ, 2028 డిసెంబర్ వరకు ఈ పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర బడ్జెట్లో నిబంధన ఉందని ఆయన అన్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2026-27 బడ్జెట్లో జల్ జీవన్ మిషన్ ‘కార్యక్రమ భాగం’ కోసం రూ 67,363 కోట్లు కేటాయించారు.
అయితే 2025-26 సంవత్సరానికి సవరించిన కేటాయింపు రూ 16,944 కోట్లు మాత్రమే. ఇది ఆ సంవత్సరపు ప్రారంభ బడ్జెట్ అంచనా రూ 66,770 కోట్ల(ఆర్థిక సంవత్సరం 2026) కంటే 74% తక్కువ.
గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రెండేళ్లలో చేసిన నిబంధనలు కేవలం జీతాలు, నిర్వహణ వంటి ‘ఆదాయ వ్యయాల’ కోసం మాత్రమే.
మూలధన వ్యయం లేదా కొత్త ఆస్తుల నిర్మాణం కోసం ఎటువంటి నిధులు కేటాయించలేదు.
రాష్ట్రాల లోపాలను ఎత్తిచూపిన కేంద్రం
ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం, ఈ పథకం కింద నిధుల కేటాయింపులో భారీ కోత విధించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమాధానమిచ్చారు.
రాష్ట్రాలు కొన్ని షరతులను నెరవేర్చి, ఫిర్యాదులను పరిష్కరిస్తేనే నిధులు విడుదల అవుతాయని స్పష్టం చేశారు.
2024లో ముగియాల్సిన ఈ పథకాన్ని మరో నాలుగేళ్లు పొడిగించామని, ఎందుకంటే ఇంకా చాలా గృహాలకు పైపుల ద్వారా నీరు అందడం లేదని పాటిల్ తెలిపారు.
గతంలో పథకం అమలుపై వచ్చిన ఫిర్యాదులను దర్యాప్తు చేయడానికి వివిధ జిల్లాలకు బృందాలను పంపాలని మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది.
ఈ బృందాల పరిశీలనలో నీటి వనరుల కొరత, పగిలిన పైపులైన్లు, సరఫరా అంతరాయాలు వంటి అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
“మరిన్ని నిధులు విడుదల చేయడానికి ముందు ఈ లోపాలను పరిష్కరించాలి. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్ష సమయంలో, గణనీయమైన మొత్తంలో నిధులు ఖర్చు కాకుండా మిగిలి ఉన్నాయని గుర్తించాం. అందుకే కేటాయింపులను దాదాపు రూ 17,000 కోట్లకు తగ్గించాం” అని పాటిల్ పేర్కొన్నారు.
“రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. దీనిపై మేము అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశాం. గుజరాత్ ఇప్పటికే స్పందించి చర్యలు చేపట్టింది. కానీ ఇతర రాష్ట్రాలు బృందాలు గుర్తించిన లోపాలను ఇంకా పరిష్కరించలేదు. అవి సరిదిద్దే వరకు నిధులు అందించే ప్రసక్తే లేదు” అని మంత్రి తేల్చి చెప్పారు.
ఇండోర్‌లోని భగీరత్‌పుర ప్రాంతంలో మురుగునీటితో కలుషితమైన తాగునీరు సరఫరా అవుతున్న అంశాన్ని సభ దృష్టికి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ తెచ్చారు.
దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పాటిల్ బదులిచ్చారు.
ఇండోర్‌లోని భగీరత్‌పురాలో నర్మదా నది పైప్లైన్లోకి డ్రైనేజీ నీరు చేరడం వల్ల నీరు కలుషితమైంది. దీనివల్ల చాలా మంది చనిపోయారు.
ఇండోర్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు సభ్యుల ఆడిట్ కమిటీ నివేదిక ప్రకారం, 23 మరణాలలో 16 మరణాలు కలుషిత నీటి ద్వారా సంక్రమించిన అంటువ్యాధుల వల్లే జరిగాయని కోర్టులో వెల్లడైంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
