ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో భారతీయ రైల్వే ఒకటి. సురక్షితమైన, ప్రయాణికులకు చౌకైన ప్రయాణాన్ని అందించడం రైల్వే ప్రధాన లక్ష్యంగా ఉండేది.
భారతదేశ ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషించింది. ఇది లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించింది.
13,198 ప్రయాణికుల రైళ్లను; 9,000లకు పైగా సరుకు రవాణా రైళ్లను భారతీయ రైల్వే నడుపుతూ- 7,000లకు పైగా స్టేషన్లను అనుసంధానిస్తోంది.
ప్రతిరోజూ సుమారు 2.3 కోట్ల మంది ప్రయాణికులు భారతీయ రైల్వేలో ప్రయాణిస్తున్నారు.
అంతేకాక 68,000 కిలోమీటర్ల నెట్వర్క్ ద్వారా ఏటా 1.6 బిలియన్ టన్నుల కంటే ఎక్కువ సరుకు రవాణా జరుగుతోంది.
రైల్వే వ్యవస్థ అంతటా దాదాపు 1,300 గూడ్స్ షెడ్లు పనిచేస్తున్నాయి. ఇక్కడ సుమారు 3,00,000 మంది లోడింగ్ కార్మికులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు.
రైల్వేను నీరుగార్చే చర్యలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు రైల్వే లక్ష్యాన్ని మార్చేశాయి. సాధారణ ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేసి, కొద్దిమంది అవసరాల కోసం మాత్రమే విలాసవంతమైన హైస్పీడ్, వందే భారత్, దురంతో, తేజస్, శతాబ్దిలాంటి ఖరీదైన రైళ్ల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు.
సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వాడే Linke-Hofmann-Busch(LHB)కోచ్‌ల ధర కంటే, వందే భారత్ కోచ్‌ల ధర దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
సామాన్యులకు అందుబాటులో ఉండే జనరల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను కుదించడం జరుగుతోంది.
సెకండ్ క్లాస్ కోచ్‌లను తొలగించి వాటి స్థానంలో ఏసీ స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 90% స్లీపర్ కోచ్‌ల స్థానంలో ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. అధిక టికెట్ ధరల వల్ల సామాన్య ప్రయాణికులకు రైలు ప్రయాణం భరించలేనంత భారంగా మారుతోంది.
ప్రజల ఆస్తి ప్రైవేట్ పరం..
గతంలో స్టేషన్లలో అందుబాటులో ఉన్న పార్శిల్ సేవలు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేవి.
ఇప్పుడు వాటిని కూడా లీజుకు ఇవ్వడం వల్ల ప్రైవేట్ బ్రోకర్ల అక్రమాలు, తునకల్లో మోసాలు జరుగుతున్నాయి.
వెయిటింగ్ హాళ్లు, పబ్లిక్ టాయిలెట్లు, మంచినీటితోపాటు పార్కింగ్ వంటి ఉచిత సౌకర్యాలను ప్రజాధనంతో ఆధునీకరించి, వాటిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు.
వారు ప్రజల జేబులు కొట్టి లాభాలు గడిస్తున్నారు. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే, ప్రజాధనంతో నిర్మించబడిన మౌలిక సదుపాయాలన్నీ బడా కాంట్రాక్టర్ల పరం చేయబడుతున్నాయి.
గతంలో రైల్వే క్యాటరింగ్ విభాగం దేశవ్యాప్తంగా బేస్ కిచెన్లను కలిగి ఉండి, సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది.
పైగా లక్ష మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పించేది. ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టిన తర్వాత ఈ వ్యవస్థ ధ్వంసమైంది.
ఇప్పుడు క్యాటరింగ్ లాభాలు ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరమవుతున్నాయి. ప్యాంట్రీ కార్లలోని కాంట్రాక్ట్ కార్మికులు రోజుల తరబడి పని చేయాల్సి వస్తోంది, ఇది కార్మిక చట్టాల ఉల్లంఘన.
ఐఆర్సీటీసీ ప్రతిరోజూ 15 లక్షల భోజనాల విక్రయం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తోంది.
సిబ్బంది కుదింపు- పని భారం పెంపు
రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నారు. సాధారణ రైళ్లను వందే భారత్ రైళ్లతో భర్తీ చేయడం వల్ల నిర్వహణ నిష్పత్తి అస్తవ్యస్తంగా మారింది.
దీంతో, విపరీతమైన పని భారంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.
సిబ్బందికి అత్యవసర సమయాల్లో కూడా ఒకరోజు సెలవు దొరకడం కష్టంగా మారింది. 2010లో రైల్వేలో మంజూరైన పోస్టులు 13,61,519 ఉండగా; 2024 నాటికి వాటిని 12,52,180కి కుదించారు.
2010 నుంచి 1,67,633 వర్క్‌షాప్ ఆర్టిజన్ పోస్టులు రద్దు చేయబడ్డాయి. ఇది మొత్తం మంజూరైన పోస్టులలో 57.7%. ఈ పనులన్నీ ఇప్పుడు అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా జరుగుతున్నాయి.
అదేవిధంగా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బంది సంఖ్య 53,151 నుంచి 27,808కి తగ్గింది. సిగ్నల్, ఆపరేటింగ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వంటి అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
లోకో పైలట్లు, ట్రాక్‌మెన్, ట్రైన్ మేనేజర్ల వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత వల్ల వారు నిరంతరం 12- 20 గంటల పాటు పని చేయాల్సి వస్తోంది.
తగినంత విశ్రాంతి లేకపోవడం, మానసిక ఒత్తిడి, అలసట కారణంగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. శాశ్వత ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులను తీసుకుంటున్నారు. కాగా, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చి ఉద్యోగుల జీతాల భారం ఎక్కువైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ప్రయాణికుల భద్రత
భద్రతను గాలికి వదిలేసి, సిబ్బందిని బలిపశువులను చేస్తున్నారు. సిబ్బందిని కుదిస్తూ, ఖాళీలను భర్తీ చేయడం లేదు.
కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్సీ) నివేదికల ప్రకారం- అలసట, పని ఒత్తిడి వల్లనే 43% రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రతకు సంబంధించిన పనుల్లో నియమిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సరైన రక్షణ పరికరాలు ఇవ్వడం లేదు, తగిన శిక్షణ కూడా లేదు. వీటన్నిటి ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.
మూలిగే నక్కపై తాటి పండు
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఎంతో కొంత భద్రత, సదుపాయాలు కల్పించే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 లేబర్ కోడ్లను తెచ్చింది. కార్మికుల హక్కులను హరించి బానిసలుగా తయారు చేయడమే ఈ లేబర్ కోడ్ల లక్ష్యం. ప్రయాణికుల భద్రత, కార్మిక హక్కుల రక్షణ కోసం ఈ విధానాలను ఓడించాలి.
కార్పొరేట్- ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజల ముందు, రైల్వే ఉద్యోగుల ముందు ఎండగట్టాలి. రైల్వేను మరియు దేశాన్ని రక్షించుకోవడానికి 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
వ్యాస రచయిత నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కన్వీనర్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
