90% కేసుల పరిష్కారమైనట్టుగా డేటా చూపిస్తోంది. అయితే ఎస్సీ/ఎస్టీ సెల్స్‌లో పరిపాలనాపరమైన నియంత్రణను విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష పెను సవాలుగా మారుతోందని, గడచిన ఐదు సంవత్సరాలలో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో కులాధారిత వివక్షత కేసులు ఏకంగా 118.4% పెరిగినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) వెల్లడించింది.
ఈ మేరకు పార్లమెంటరీ ప్యానల్‌కు, సుప్రీంకోర్టుకు యూజీసీ సమర్పించిన తాజా గణాంకాలు ఆందోళనకరమైన వాస్తవాలను బయటపెట్టాయి.
గణనీయంగా పెరిగిన ఫిర్యాదుల సంఖ్య
యూజీసీ నివేదిక ప్రకారం, 2019-20 విద్యాసంవత్సరంలో కేవలం 173 కుల వివక్ష కేసులు నమోదు కాగా; 2023-24 నాటికి ఆ సంఖ్య 378కి చేరింది.
దీనివల్ల గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 704 విశ్వవిద్యాలయాలు; 1,553 కళాశాలల నుంచి మొత్తం 1,160 ఫిర్యాదులు అందినట్లు స్పష్టమవుతోంది. ఈ ఫిర్యాదులు ప్రధానంగా సమాన అవకాశాల సెల్స్(ఈఓసీ), షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగల(ఎస్సీ/ఎస్టీ) సెల్స్ ద్వారా అందాయి.
అంతేకాకుండా, ఈ కేసుల పరిష్కారానికి సంబంధించి యూజీసీ ఆశాజనకమైన గణాంకాలను చూపింది. అందిన మొత్తం ఫిర్యాదుల్లో 1,052 కేసులు- అంటే, దాదాపు 90.68% పరిష్కరించబడినట్లు నివేదిక పేర్కొంది.
అయితే, మరోవైపు పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటం గమనార్హం. 2019- 20లో కేవలం 18గా ఉన్న పెండింగ్ కేసులు, 2023-24 నాటికి 182కు చేరుకున్నాయి.
అవగాహన పెరిగిందా? వివక్ష పెరిగిందా?
వార్షిక గణాంకాలను పరిశీలిస్తే, 2020-21లో 182; 2021-22లో 186; 2022-23లో 241 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో, ఫిర్యాదుల సంఖ్య పెరగడాన్ని యూజీసీ సానుకూల కోణంలో విశ్లేషిస్తోంది. విద్యార్థుల్లో ఎస్సీ/ఎస్టీ సెల్స్, సమాన అవకాశాల సెల్స్ పనితీరు పట్ల అవగాహన పెరిగిందని; అందుకే ఎక్కువ మంది ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారని ఒక సీనియర్ యూజీసీ అధికారి అభిప్రాయపడ్డారు.
విద్యావేత్తల అభ్యంతరాలు- వాస్తవ పరిస్థితి
ఏది ఏమైనప్పటికీ, యూజీసీ చెబుతున్న పరిష్కార రేటును విద్యావేత్తలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఎన్ సుకుమార్ మాట్లాడుతూ, “అనేక ఎస్సీ/ఎస్టీ విభాగాలు నేరుగా యూనివర్సిటీ పరిపాలన కింద పనిచేస్తాయి. వాటికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. సభ్యులను కూడా యాజమాన్యమే నియమిస్తుంది కాబట్టి, తీవ్రమైన కేసుల్లో నిష్పాక్షికత లోపిస్తోంది”అని ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) మాజీ ఎస్సీ/ఎస్టీ విభాగం సభ్యులు డీకే లోబోయాల్ కూడా ఇవే ఆందోళనలను పంచుకున్నారు. ఈ విభాగాల స్వయంప్రతిపత్తి కాలక్రమేణా క్షీణించిందని, ఫిర్యాదుల పెరుగుదల అనేది వ్యవస్థలో ఇంకా వివక్ష బలంగా ఉందనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, యూజీసీ మాజీ చైర్పర్సన్ సుఖదేవ్ థోరత్ ఈ విభాగాల ఏర్పాటులో ఉన్న అస్పష్టతను ఎత్తిచూపారు. 2012 నిబంధనల ప్రకారం సమాన అవకాశాల విభాగాలను ఏర్పాటు చేసినప్పటికీ, అంతకుముందే ఉన్న ఎస్సీ/ఎస్టీ సెల్స్‌తో వీటి బాధ్యతలు క్లాష్ అవుతున్నాయని, ఫలితంగా ఫిర్యాదుల నిర్వహణలో గందరగోళం నెలకొందని ఆయన వివరించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు – నేపథ్యం
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల మరణం తర్వాత దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ, సుప్రీంకోర్టు 2025 జనవరి నుంచి కుల వివక్ష డేటాను సేకరించాలని యూజీసీని ఆదేశించింది. ఫలితంగా, ఉన్నత విద్యా సంస్థల నుంచి వచ్చిన 3,522 స్పందనలను క్రోడీకరించి యూజీసీ అఫిడవిట్ దాఖలు చేసింది.
కాగా, గతంలో యూజీసీ ప్రతిపాదించిన కొన్ని నిబంధనలు వివక్ష వ్యతిరేక పోరాటాన్ని నీరుగార్చేలా ఉన్నాయని రోహిత్ వేముల తల్లితోపాటు సామాజిక కార్యకర్తలు విమర్శించారు.
ఈ విమర్శల నేపథ్యంలో, తాజాగా యూజీసీ కొత్త ముసాయిదా నియంత్రణలను జారీ చేసింది. దీనిలో భాగంగా, ప్రతి ఉన్నత విద్యా సంస్థలో తప్పనిసరిగా సమానత్వ కమిటీలు, 24/7 హెల్ప్లైన్లు- పటిష్టమైన ఆన్లైన్ ఫిర్యాదుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఈ వ్యాసాన్ని హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
