చాతుర్వర్ణవ్యవస్థలో ఉన్నవి కేవలం నాలుగు వర్ణాలు మాత్రమే. మరీ అంటరాని వారు ఎట్లా పుట్టుకొచ్చారు? వీరి జీవితాల ధ్వంసానికి కారకులెవరు? వీరిని ఊరి చివరికి వెలేసిందెవరు? వీరి ఉనికినే ప్రశ్నార్థకం చేసిందెవరు? ఇలాంటి ప్రశ్నలకు కొందరి నుంచి నేరుగా సమాధానం రాదు. “ఇదంతా బ్రిటీషు వాళ్లు చేసిన పని. కాదంటే విదేశీ పాలకులు చేసిన పని” అని ఆరోపిస్తూ డొంకతిరుగుడు సమాధానాలు చెప్తారు.
ఏదిఏమైనప్పటికీ వాళ్లంతా పోయినా, మరి ఇప్పుడు దానిని కొనసాగిస్తున్నదెవరు? గ్రామ స్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు. అటెండర్ నుంచి ఐపీఎస్ స్థాయి వరకు ఈ కుల వివక్ష ఎందుకు కొనసాగుతోంది? ఇవన్నీ ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్నలు.
గ్రామాల్లో ఉన్న దళితులపై ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయో ఎన్సీఆర్బీ లెక్కలేచెప్తున్నాయి. ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు కూడా తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. కులంపైకి కన్పించదు. కానీ అది మనిషిని, వ్యక్తిత్వాన్ని, ఉనికిని తీవ్ర వేదనకు గురి చేస్తుంది. అధఃపాతాళానికి తొక్కేస్తుంది. ఇట్లాంటి హింసను అంబేద్కర్ నుంచి మొదలుకుంటే పూరన్ కుమార్ వరకు ఎదుర్కొన్నారు.
భౌతిక దాడులు- మానసిక హింసలు..
భారతీయ జీవన విధానంలో ఉన్న కుల మకిలి చేస్తున్న విధ్వంసపు విన్యాసాలు అన్ని ఇన్నీ కావు. రాష్ట్రాలు వేరైనా దళితులపై కొనసాగుతున్న వివక్షలు, వారిపై జరుగుతోన్న భౌతిక దాడులు దాదాపు ఒకే రీతిలో ఉంటున్నాయి.
1990ల్లో గోపాల్ గంజ్ జిల్లాలో కలెక్టర్ కృష్ణయ్య హత్యోదంతం ఒక రకమైన దాడికి సంకేతంగా ఉన్నది. ఆ తర్వాత పలు రూపాల్లో అలాంటి దాడులు కొనసాగుతున్నాయి. ఇవి భౌతిక దాడులు. మానసిక దాడుల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆ బాధలు చెప్తే అర్థం కావు. అనుభవించాల్సిందే.
దేశ అ్యతున్నతాధికారి పోస్టులో పూరన్ కుమార్ కొనసాగుతున్నారు. ఆయన పని తీరుకు ప్రభుత్వం అవార్డూ ఇచ్చింది. కానీ ఆయన నిజాయితీ, నిబద్ధతను కులం బలి తీసుకున్నది. ఉన్నతాధికారుల వేధింపులకు ఆయన బలవన్మరణం చెందారు. ఈ ఘటనపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతటి తీవ్ర మానసిక వేదనకు గురైతే అంతటి చర్యకు పూనుకుంటారో ఆలోచించొచ్చు.
దళితులు చిన్న ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారంటే వాళ్లు తీవ్ర ఇబ్బందుల మధ్య నెగ్గుకొచ్చారని అర్థం. అదే కలెక్టర్, ఎస్పీ స్థాయి అత్యున్నత అధికారి అయ్యాడంటే వారు పడిన కష్టం గురించి, వారు అధిగమించిన సవాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి వారు ప్రాణాలు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
లూప్‌లైన్లలో ఎస్సీ, ఎస్టీలు..
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై వివిధ రూపాల్లో వివక్ష ఉందని చాలా సందర్భాల్లో రుజువవుతూనే ఉంది. పోస్టింగ్‌ల విషయంలో వీరి పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రభుత్వాలే ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఉన్నత పోస్టులకు వీరిని పంపకుండా లూప్ లైన్లలో ఉంచుతారని చాలా మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆవేదన చెందుతారు. లేదంటే అప్రాధాన్య పోస్టులకు పంపిస్తారు.
ఉన్నత కులాల ఉద్యోగుల మధ్య ఎన్ని పొరపొచ్చలున్నా దళిత అధికారుల విషయం వచ్చే వరకు వారంతా ఏకమవుతారు. దళిత అధికారులపై పరోక్షంగా, ప్రత్యక్షంగా వివక్షను చూపిస్తారు. శాంతిభద్రతల విభాగాల్లో పనిచేసే ఎస్సీ, ఎస్టీ అధికారులను ఉద్యోగులను సమస్యాత్మక ప్రాంతాలకు బదిలీ చేస్తారు. మాటవినకపోయినా, నిక్కచ్చిగా వ్యవహరించిన బహుజన ఉద్యోగులకు బాధలు తప్పవనేది బహిరంగ రహస్యమే.
దళితులు ఏ స్థాయిలో ఉన్నా వివక్ష ఎదుర్కొవడం సర్వసాధారణమనే విషయం పలు సందర్భాల్లో రూఢీ అవుతూనే ఉన్నది. సీఎంఓల నుంచి, పీఎంఓల వరకు ద్విజులు లేదంటే శూద్రగ్రావర్ణానికి చెందిన ఉన్నతాధికారులే ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఒకటి అరా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అవకాశం ఇచ్చినా వారిని ఎక్కువ కాలం ఆ పోస్టుల్లో ఉండనీయరనే అభిప్రాయం కూడా బలంగా ఉంది.
ఇక ఏసీబీ దాడుల రూపంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై మరో రకమైన దాడి జరుగుతోందనే అభిప్రాయం కూడా సమాజంలో ఉన్నది. అతి చిన్న మొత్తాలే వీరి వద్ద దొరుకుతున్నాయి. కానీ వీరి గురించి ప్రచారం మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంటోంది. ఎంతమంది అవినీతి అధికారులు దొరికారనే నెంబర్ గేమ్ మీడియాలో బాగా నడుస్తూ ఉంటుంది. “అబ్బర పులి అంటే జబ్బెడు తోక” అని విషయం తీవ్రతను పెంచి చూపిస్తారు. ఇక్కడ దీనిని ప్రస్థావించేది అవినీతిని సమర్థించాలనే ఉద్దేశ్యంతో కాదు. ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన వారు లంచాలు తీసుకోవడం లేదా? మరి అలాంటి వారి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? అనేది అసలైన ప్రశ్న.
పెద్ద కులాల వారికి రాజకీయ పలుకుబడి ఉంటుంది. అంటరాని వారికి ఆ అవకాశం ఉండదు. కాబట్టి వారు వెంటనే బలైపోతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. అంతేకాదు, కొందరు పని గట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులను ఏసీబీ కేసుల్లో ఇరికిస్తున్నారనే చాలామంది నమ్ముతున్నట్టు అన్పిస్తోంది. ఈరోజు కొత్తగా జరుగుతున్న విషయాలు కావివి. ఎప్పటి నుంచో ఎన్నో తీర్ల జరుగుతూ వస్తూన్న విషయాలు.

ఇన్నాళ్లు రిజర్వేషన్ అభ్యర్థులని ప్రచారం చేశారు. ప్రతిభ గురించి మాట్లాడారు. ఇప్పుడు అందరూ రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. వాటి గురించి మాట్లాడటం లేదు. మనుషులన్నాక తప్పులు అందరూ చేస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలవే ఎక్కువగా కన్పిస్తాయి. ఎందుకీ వక్రదృష్టి అనేదే పెద్ద ప్రశ్న.
దళితుల మీద పెరిగిన దాడులు- హత్యలు..
గడిచిన నాలుగేళ్లుగా ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులపై దాడులు ఎక్కువయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఎన్సీఆర్బీ లెక్కలే ఈ విషయాన్నీ రూఢీ చేస్తున్నాయి.
గ్రామ స్థాయిలో ఒక రకమైన వివక్ష ఉంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరో రూపంలో వివక్ష కొనసాగుతోంది. ఇంతకు ముందు దళితులపై దాడులు జరగలేదా? దళిత అధికారులపై వివక్ష లేదా? అంటే ఉంది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత మరింత పెరిగాయని లెక్కలు చెప్తున్నాయి. అంతెందుకు ఈ వారంలోనే దేశ అత్యున్నత న్యాయమూర్తిపై కోర్టులోనే తీరని అవమానం జరిగింది. ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే దళిత పోలీసు ఉన్నతాధికారి బలవన్మరణం పాలయ్యారు.
ఇక ఐఐటీలు, ఉన్నత విద్య సంస్థల్లో కొనసాగుతున్న కుల దారుణాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా బహిరంగంగా జరుగుతున్న చర్చలే. వీటి గురించి ఇవ్వాళ దేశం మాట్లాడుకోవాల్సి ఉంది. వీటి లోతుపాతులను తవ్వి తీయాల్సి ఉంది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పదబంధాలు సరికొత్తగా విన్పిస్తున్నాయి. “సనాతనం నుంచి సమానత్వం వైపు అంటున్నారు. అంతేకాదు హిందువులంతా ఒక్కటే- భారతీయులంతా ఒక్కటే” ఇలాంటి మాటలు కూడా పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయి.
పరిపాలనా సంస్కరణల గురించీ మాట్లాడుతున్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక అంటున్నారు. ఒకే దేశం- ఒకే చట్టమనే పురోగామి విషయాల గురించి మాట్లాడుతున్నారు. కానీ కులాన్ని రద్దు చేస్తామని ఎందుకు చెప్పడం లేదని ఈ దేశ దళితులు ప్రశ్నిస్తున్నారు. కులం లేని హిందూ సమాజం, కులం లేని భారతీయ సమాజానికి పూచీ పడటం లేదు. అసలైన ఈ విషయం గురించి చెప్పడం లేదు. లేదా చెప్పేందుకు సహాసించడం లేదు.
యావత్ ప్రపంచం మారుతున్నది. మారేందుకు సిద్ధంగా ఉన్నది. కానీ భారతీయుల మస్తీష్కాల్లో ఉన్న కులభావన మాత్రం పోవడం లేదు.
అధికారంలో ఉన్న వారి ఆలోచనలే పాలసీలను ప్రభావితం చేస్తాయని చాలా మంది అంటూ ఉంటారు. భారత రాజ్యాంగాన్ని రక్షించకుంటూ రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల పీఠాలపై కూర్చోకుంటే ఇలాంటి దురాగాతాలకు అంతం ఉండదని పూలే, అంబేద్కర్ వాదుల మాట.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
