ప్రస్తుతం మనం ఫేక్ న్యూస్ వింటూ, చూస్తూ, చదువుతూ బతకాల్సి వస్తోంది.
పర్యావరణ కాలుష్యం, ఆహారపు కల్తీలా- కల్తీ వార్తలు, కల్తీ చరిత్ర, కల్తీ సైన్సు, కల్తీ జ్ఞానం తెలుసుకోవాల్సి వస్తోంది.
అది కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పని గట్టుకుని, అబద్ధపు వార్తలను సృష్టించి ప్రపంచం మీదికి వదులుతున్నారు.
ఫేక్ న్యూస్ అంటే అమాయకంగా తప్పులు దొర్లడం కాదు, కావాలనే తప్పుగా ప్రచారం చేసే వార్తలు.
అలాంటి వారికి భజన చేసే పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికలు ఎక్కువగానే ఉన్నాయి.
వారి ప్రకటనలకు, కార్యకలాపలాలకు ప్రాముఖ్యమిచ్చి ఊదరగొడుతున్నాయి.
మన చుట్టూ ఉన్న వారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో- ఏది తినాలో ఏది తినకూడదో అని అనుమానపడుతున్నాము.
అలానే- ఇప్పుడు ఏ వార్త నమ్మాలో ఏది నమ్మ కూడదో తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది.
సమకాలీన జీవితంలోని సంఘటనల గురించే కాదు, గతంలోని విషయాలను కూడా మార్చి ప్రచారం చేస్తున్నారు.
అది భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ గురించి కావొచ్చు, బ్రిటీష్ కాలం గురించి కావొచ్చు, మొఘల్ పాలకుల గురించి కావొచ్చు, అంతకు ముందు అశోకుడి గురించి కావొచ్చు.
లేదా అంతకంటే ముందు బుద్ధుడి కాలం గురించే కావొచ్చు- చెప్పలేం.
వెయ్యేళ్ల క్రితం వెలువడ్డ రచనలు నాలుగు వేల ఏళ్ల క్రితంవని ప్రచారం చెయ్యొచ్చు. రెండు వేల ఏళ్ల క్రితం వాటిని, సృష్టి ప్రారంభకాలం నాటివని కూడా చెప్పవచ్చు.
తార్కిబద్ధమైన ఆలోచనా సరళి అవసరం..
ఒక నిబద్ధత లేనివారు, నైతికంగా దిగజారిన వారు ఏది ఎలాగైనా చెప్పొచ్చు. అలాంటప్పుడు మరి ఎలా? అంటే సామాన్యులే అన్ని విషయాల్లో చైతన్యవంతులు కావాలి.
ఆరోగ్యం కాపాడుకోవడానికి సరైన ఆహారం వండుకున్నట్టు, నీరు కాచుకుని తాగినట్టు- మనం తెలుసుకుంటున్న విషయాలను కూడా జనం తమ వివేకంలోంచి వాటిని. వడబోసుకుంటూ ఉండాలి.
చెత్తా, చెదారం, మడ్డి తీసేసుకోగలగాలి. ఎవరో కల్పించి ప్రచారం చేసిన అబద్ధాలని ఏరి పారేస్తూ ఉండాలి. అది ఎలా సాధ్యం? అంటే- విజ్ఞతతో సాధ్యం. ఇంగిత జ్ఞానంతో సాధ్యం. హేతుబద్ధంగా ఆలోచించడంతో సాధ్యం!
ఇటీవల చారిత్రకాంశాల మీద ఎంత రభస జరిగిందో మనకు తెలుసు. చిత్తూరు రాణి పద్మిని, హల్దీఘాట్ యుద్ధం, భగత్ సింగ్‌ను ఫిబ్రవరి 14న ఉరితీయబడడం గురించి ఎన్ని అబద్ధాలు మనం వినలేదూ?
వీటిని మనం “ప్రత్యామ్నాయ సత్యాలు” అని అందాం. సత్యానికి ప్రత్యమ్నాయాలుంటాయా? అని ఆశ్చర్యపోవద్దు. మన కుహనా దేశభక్తుల ఫ్యాక్టరీ ఉంది కదా? అది దేన్నయినా సృష్టిస్తుంది.
లార్డ్ మెకాలే ఉపన్యాసంలా చలామణి అవుతోన్న ఒక చిన్న భాగం..
“ఈ దేశం నలుమూలలా నేను విస్తృతంగా పర్యటించాను. ఎక్కడా నాకు ఒక్క బిచ్చగాడు కూడా కనిపించలేదు. ఒక్క దొంగ కూడా తారసపడలేదు. అంతటి మహోన్నతమైన, నైతిక విలువలు గల సమృద్ధిగల దేశం ఇది. ఇక్కడ ప్రజల ఆ స్థాయిగలవారు. అయితే, ఈ జాతి వెన్నెముకైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఘన వారసత్వాన్ని విరగ్గొడితే తప్ప, వీరి ప్రాచీన విద్యా విధానాన్ని మార్చితే తప్ప మనం ఇక్కడ జయించలేం. విదేశీ జ్ఞానం, ఇంగ్లీషు భాష తమ వాటి కన్నా గొప్పవనే అభిప్రాయం వీరిలో కలిగించితే తప్ప, వీరి ఆత్మ విశ్వాసాన్ని బలంగా దెబ్బ కొడితే తప్ప, ఈ దేశం మనకు స్వాధీనం కాదు. వీరి ప్రాంతీయ సంస్కృతులను దెబ్బతీసి, మనం కోరుకున్నట్టుగా, మార్చుకుంటే కానీ- మనకు వీరిపై ఆధిపత్యం సాగించడం కుదరదు” అని 1835 ఫిబ్రవరి 2న బ్రిటీష్ పార్లమెంట్లో లార్డ్ మెకాలే ప్రసంగించారని విస్తృతంగా చలామణి అవుతోంది.
థామస్ బేబింగ్‌టన్ మెకాలే(1800 అక్టోబర్ 26- 1859 డిసెంర్ 28) ఉపన్యాసంగా ప్రచారమైన ఇంగ్లీష్ ప్రసంగానికి నేను చేసిన సరళమైన అనువాదం ఇది.
ఈ మెకాలే మాటలను ఎల్కే అద్వాని, ఏపీజే అబ్దుల్ కలాం వారివారి ఉపన్యాసాల్లో ఉటంకించారు. టెలివిజన్ ఛానళ్లలో చాలామంది ప్రముఖులు దీన్ని “కోట్” చేస్తుంటారు.
ఇది మెకాలే వ్యక్తిగతంగా ఎవిరోతోనో మాట్లాడింది కాదు. కాబట్టి, బ్రిటన్ పార్లమెంటు రికార్డుల్లో తప్పకుండా ఉండాలి. దీన్ని చరిత్రకారులు, భాషా పండితులు లోతుగా అధ్యయన చేశారు. పూర్వాపరాలు చర్చించారు. చివరకు తేల్చిన విషయమేమంటే, అది కల్పించిన ఉపన్యాసం మాత్రమే అని! అందులో యధార్థం ఎంత మాత్రమూ లేదని!
అవాస్తవమని చెప్పడానికి కారణాలు..
1. బ్రిటన్ పార్లమెంట్లో మాట్లాడే తను ఇండియా గురించి మాట్లాడితే ఆ దేశం ఆ ప్రజలని అంటారు. దీనికి భిన్నంగా అందులో ఈ దేశం, ఈ ప్రజలని ఉంది. అంటే, ఇక్కడి వారే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కల్పించి రాసినట్టు ఉంది.
2. థామస్ పిన్నే సంపాదకత్వంలో మెకాలే ఉత్తరాలు, ఉపన్యాసాలు కొన్ని సంపుటాలుగా వెలువడ్డాయి. వాటిని కేంబ్రిడ్జీ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. అయితే, ఆ సంపుటాల్లో ఎందులోనూ ఈ ఉపన్యాసం లేదు.
3. ఈ ఉపన్యాసంలో ఉన్న భాష ఆధునికంగా ఉంది. మెకాలే కాలం నాటిది కాదు.
4. అందులో కొన్ని పదాలు చౌకబారుగా ఉన్నాయి(తెలుగు అనువాదంలో అవి కనబడవు) తప్పకుండా అవి ఆయన ఉపయోగించి ఉండరు. ఎందుకంటే టీబీ మెకాలే ఒక సాహితీ దిగ్గజం.
5. మరొక ముఖ్యమైన విషయమేమంటే, 1835 ఫిబ్రవరి 2న లార్డ్ మెకాలే భారతదేశంలోనే కలకత్తాలో ఉన్నారు. ఆ రోజుల్లో బ్రిటీష్ ఇండియాకు కలకత్తా రాజధానిగా ఉండేది. అందువల్ల ఆ కాలంలో ఆయన కలకత్తాలో ఉన్నారు. బ్రటీష్ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం లేదు.
6. ఆయన పేరుతో ఎవరో ఈ కాలం వారు కల్పించి రాశారని తేలింది.
7. అది కూడా 1835 నాటి భారతదేశపు స్థితిగతులను గూర్చి అవగాహన చేసుకోకుండా ఆ ఉపన్యాసం అల్లారు. ఇలా ఎందుకు అనాల్సి వస్తోందంటే, దేశం నలువైపులా విస్తృతంగా పర్యటించానని చెప్పుకునే వారికి- దేశం నిండా ఉన్న సాధువులు, సన్యాసులు, ఫకీర్లు కనబడకుండా ఎలా ఉన్నారూ? బిచ్చగాళ్లు కనబడలేదనడం అబద్ధం.
8. ఆ కాలానికి అటుఇటుగా థగ్గులు దేశాన్ని దోచుకుపోవడం ఆయన దృష్టికి ఎందుకు రాలేదూ? దొంగలు లేరనడం అబద్ధమే కదా? ఉత్తర- మధ్య భారతదేశపు ప్రాంతాలన్నీ థగ్గులతో బాగా దెబ్బతిన్నాయి. పైగా ఈ దేశ సంపదను బ్రిటీష్ వారు కూడా తరలించడం అప్పుడే ప్రారంభించారు. మరి దోపిళ్లు, దొంగతనాలు లేవనడం సరైనది కాదు.
9. ఆ ఉపన్యాసం కల్పించి రాసిన వారికి మెకాలే గురించి ఏమీ తెలియదని అనుకోవాలి. ఎందుకంటే, “సంస్కృతి- నాగరికత అనేవి యూరోప్‌లో తప్ప, ప్రపంచంలో మరెక్కడా లేవు” అనే గట్టి అభిప్రాయంతో ఉన్నవారు మెకాలే! అలాంటి వ్యక్తి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రశంసిస్తూ మాట్లాడతారా? విషయం హాస్యాస్పదంగా లేదూ?
సాహితీ దిగ్గజం మెకాలే ఆలోచనలు భిన్నమైనవి..
“యూరప్ దేశాలు మహోన్నత సాహిత్య స్థాయిని ఇక్కడి సంస్కృతం, అరబ్బీ కవిత్వాలతో పోల్చి గుణగణాలను ఎత్తి చూపిన భాషా పండితులని నేనెవరినో కలవ లేదు. కానీ, నాకు తెలిసినంత వరకు ఉచ్ఛస్థితికి చేరిన యూరప్ దేశాల కవిత్వం అందులోని ఊహాశక్తి, శైలి ముమ్మాటికీ ఎంతో ఉన్నతంగా ఉంటుంది. సందేహం లేదు. అందువల్ల నేను సగ్రహించిన భారత చరిత్ర ఆధారాలను బట్టి, ఇక్కడి సంస్కృత గ్రంథాల అనువాదాలను బట్టి చూస్తే- ఇవి ఇంగ్లాండ్‌లోని ప్రాథమిక పాఠశాలల స్థాయిని మించవు. ఇందులో అతిశయోక్తి లేదు” అని ఘంటాపథంగా చెప్పిన మెకాలేనే, తన స్వంత అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతారు?
బారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ఎందుకు పొగుడుతారు? ఎవరికి భయపడి, ఎవిరిని మెప్పించడానికి మాట్లాడుతూ? అదయ్యే పని కాదు.
మెకాలే ఉపన్యసించినట్టు ఓ కట్టు ఉపన్యాసం అల్లుకుని, ఆత్మద్రోహం చేసుకుంటూ, తమ తెలివి తక్కువ తనాన్ని జనానికి కూడా అంటగట్టాలని చేసిన వ్యర్థ ప్రయత్నం అది.
పైగా ఆయన తన కింది అధికారులకు ఇలా ఆదేశాలిచ్చారు- “మనం భారతీయులకు వారివారి మాతృ భాషల్లో పూర్తిగా విద్యనందించలేం. వారికి తప్పకుండా ఒక విదేశీ భాష నేర్పించాలి. ముఖ్యంగా ఇంగ్లీషు నేర్పించాలి. ఇంగ్లీషు నేర్చిన భారతీయులుంటేనే మనమిక్కడ వ్యవహారాలు చక్కదిద్దగలం. భాష ఒక అడ్డుగోడ కాగూడదు అందుకే, సత్వరం మనం ఇంగ్లీషు ప్రవేశపెట్టాలి” అని లార్డ్ బెంటింగ్, డేవిడ్ హోరెలలా కాకుండా మెకాలే ఆలోచనలు భిన్నంగా ఉండేవి.
విజ్ఞతతో సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
మెకాలే కూడా బ్రిటీష్ వ్యక్తినన్న పొగరు ఉన్న వ్యక్తే. కానీ, యూరోప్ పరిజ్ఞానం భారతీయులకు అందాలని తహతహలాడిన వారిలో ఒకరు. ఇంగ్లీషు, సైన్సు, లెక్కలు, సాంఘీక, సామాన్య శాస్త్రాలు, మాతృభాషవంటి విషయాలు మొదటిసారి భారతీయ విద్యావిధానంలో చేర్చిన వ్యక్తి.
అందుకే చూడండి భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహానుభావులంతా ఇంగ్లీషు విద్యను అభ్యసించినవారే. ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్లై వచ్చినవారే.
దేశంలో ఇంగ్లీషు బోధన ఉండడం వల్లే- స్వాతంత్ర్యం రాక పూర్వమే ఒకరు సాహిత్యంలో, మరొకరు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు సాధించారు.
మెకాలే సెక్యులర్ విద్యా బోధన ప్రవేశపెట్టడంతో పాటు- హిందువుల మనుస్మృతిని, ముస్లింల షరియా చట్టాన్ని పక్కకు నెట్టి- భారత శిక్షాస్మృతి(ఐపీసీ)ని అమలు చేసింది కూడా తనే.
ఈరోజు ప్రపంచ పౌరులతో సమానంగా ప్రతి భారతీయుడు స్వతంత్రంగా తలెత్తుకుని ఆత్మగౌరవంతో నిలబడగలుగుతున్నాడంటే అందుకు మెకాలేనే కారణం.
లేకపోతే ఈ దేశంలో హిందువులు వేదపాఠశాలలు, మిషనరీ కాన్వెంటులు, ముస్లిం మదరసాలు మాత్రమే ఉండేవి. అవి ఆయా మతాల సారాంశం బోధిస్తూ ఉండేవి. విద్యకు, చట్టానికి సంబంధించిన మార్పులు ఆనాడు మెకాలే చేసి ఉండకపోతే, ఇప్పటికీ భారతీయులు ఎంతటి దుర్భరమైన స్థితిలో ఉండేవారో ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది.
భారతీయ విద్యావిధానాన్ని ధ్వంసం చేసిన వ్యక్తనీ, తెల్లవారి కింద క్లర్కులుగా పనిచేయడానికి మాత్రమే భారతీయులని తయారు చేశారని విమర్శించారు. నిజమే! కానీ, కాస్త వివేకంతో ఆలోచిస్తే నిజానిజాలు అవగతమౌతాయి!
ఆ ఇంగ్లీషూ, ఆ ఐపీసీ లేకపోతే మనకు ఒక అంబేద్కర్ ఎలా ఉద్భవించేవారు? బహుజనులు, స్త్రీలూ ఎలా చైతన్యవంతులయ్యే వారూ? భారతీయులు ప్రపంచంలో అత్యున్నత స్థానాలకు ఎలా చేరుకునే వారూ?
మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్-అని బీజ గణితంలో ఒక సూత్రం ఉంది. తప్పుడు కథనాలు ప్రచారం చేసి, మనువాదాన్ని మళ్లీ వెలుగులోకి తేవాలని ప్రయత్నం చేసేవారి ఆగడాలు అడ్డుకోక తప్పదు.
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
