తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్టుగా పలు గణంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో 2015 సంవత్సరంలో 40,177 కేసులు నమోదు కాగా 2024 వచ్చే సరికి కేసులు 52,334కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే దశాబ్ద కాలంలో 12,000 కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలిపారు.
లోక్సభలో డీఎంకే సభ్యురాలు కనిమొళి వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ డేటాను సమర్పించారు. క్యాన్సర్ కేసుల విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 13వ స్థానంలో ఉందని మంత్రి చెప్పారు.
జీవనశైలిలో మార్పులు, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, కాలుష్యం, వాతావరణంలో మార్పులు, అధిక మద్యపానం, రసాయనాలు కలిపిన పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడంలాంటి కారణాల వల్ల కేసులు పెరుగుతున్నాయని మంత్రి వివరించారు.
ప్రపంచంలో భారతదేశ స్థానం
ఇదిలా ఉండగా దేశ పరిస్థితి గమనిస్తే క్యాన్సర్ కేసుల విషయంలో చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే భారత దేశం మూడవ స్థానంలో ఉంది. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చి ఆన్ క్యాన్సర్ ప్రకారం ప్రస్తుతం చైనాలో 48,24,703లో అంటే ప్రతి లక్ష జనాభాలో సగటున 201.6 మంది బాధితులు ఉన్నారు.
అదే అమెరికాలో 23,80,189లో ప్రతి లక్ష జనాభాలో 367 మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక భారతదేశ పరిస్థితిని గమనిస్తే ప్రస్తుతం 14,13,316 కేసులు అంటే ప్రతి లక్ష జనాభాలో సగటున 98.5మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టుగా ఏజెన్సీ తెలియజేసింది.
కాగా తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం 50 వేల నుంచి 55 వేల వరకు కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ సహయ మంత్రి వెల్లడించారు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు యువతుల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు కూడా దేశంలో పెరుగుతున్నయని మంత్రి జాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలో గడచిన దశాబ్దకాలంగా కేసుల డేటాను పరిశీలిస్తే 2015లో 40,177; 2016-41,939; 2017లో 43,784; 2018-45,713; 2019-46,464; 2020లో 47,620; 2021-48,775; 2022-49,983; 2023లో 51,418; 2024లో 52,334 కేసులు నమోదైనట్టు కేంద్ర డేటాలో పేర్కొన్నారు.
మరో పక్క హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ఏటా దాదాపు 12 వేల కొత్త కేసులను నమోదు చేసుకొని చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఆసుపత్రిలో ప్రతి రోజు 500 మందికి రేడియోథెరపి, మరో 500మంది భాధితులకు కీమో థెరపి చికిత్సను పొందుతున్నారని చెప్పారు.
ఇవి కాకుండా ఎంఎన్జే ఆసుపత్రి సుమారు 1.5 లక్షల మందికి క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు కూడా చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఇక బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రోజుకు 450 నుంచి 500 మందికి చికిత్స చేస్తుండగా అందులో కనీసం 60 మంది ఔట్ పేషంట్లు ఉంటారని తెలియజేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
