
“రాజ్యాధికారం లేని జాతులు అంతరిస్తాయి” – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత సార్వజనీనమైన సహజ న్యాయ సూత్రాలు అమలవుతున్నాయి. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ ఇది మన రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన సర్వసమానత్వపు హక్కు, బాధ్యత కూడా. స్వాతంత్య్రోద్యమం తర్వాత జాతీయ కాంగ్రెస్ రాజకీయ పార్టీగా అవతరించింది. 1970ల నాటికి నిర్వీరామంగా ఈ పార్టీనే అధికారంలో ఉన్నది.
దీనికి ఇంకాస్త వెనక్కు వెళ్తే, అదే స్వాతంత్య్రోదమ కాలంలో అంబేడ్కర్ రాజకీయ పార్టీ స్థాపన ద్వారా ఉనికిని, అస్తిత్వాన్ని భవిష్యత్తును ఆకాంక్షించి ఓట్ల పోరాటాన్ని ప్రారంభించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక ప్రధానమైన మైలు రాయి. అనంతరం, తాను స్థాపించిన రాజకీయ వేదికల నుంచే అశేష ప్రజానికాన్ని చైతన్యవంతం చేసేందుకు నిరంతరం కృషి చేసిన మహానియుడు అంబేడ్కర్.
మేమెంతో మాకంత..
అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచిన వారిలో తొలి వరుసలో ఉన్నది మాన్యవర్ కాన్షీరాం. 1977లో జనతా ప్రభుత్వం- అది వివిధ పార్టీల సమ్మేళనం. ఆ తర్వాత వచ్చినది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత ఈ దేశంలో అడుగుపెట్టింది కమ్యూనిస్టు పార్టీ. ఈ రాజకీయ వేదికలు అట్టడగు వర్గాల ప్రజలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం లేదనే ఉద్దేశంతో అంబేడ్కర్ రాజకీయ పార్టీని స్థాపించారు. బహుజన వర్గాలకు మార్గదర్శిగా నిలిచాడు.
1952 సాధారణ ఎన్నికల్లో బాబా సాహెబ్ స్థాపించిన పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ఘన విజయాలను సాధించారు. అది కూడా తెలంగాణ గడ్డ నుంచే. ఇందులో ఎమ్మార్ కృష్ణ, రాజమణి దేవి చెప్పుకోదగిన వారు. ఇక ఉత్తరాది విషయానికి వస్తే, అంబేడ్కర్ ఆశయాలకు కొనసాగింపుగా వచ్చిన మహానాయకుడు కాన్షీరాం. భారతదేశ పార్లమెంటరీ రాజకీయాలలో ఆయన ప్రయోగాలు, ఆచరణలు చారిత్రాత్మకమైనవి. “మేమెంతో మాకంత, అగ్రవర్ణ ఆధిపత్యం చెల్లదు” వంటి నినాదాలతో బహుజన వర్గాలకు రాజ్యాంగ స్ఫూర్తితో ఓట్ల నినాదాలను అందించారు.
ప్రాంతీయ పార్టీల ఆవర్భావం..
1980ల్లోనే దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. అందులో తెలుగునాట తెలుగుదేశం, ఉత్తరాదిన ఆర్జేడీ, సమాజ్‌వాద్ పార్టీ, లోక్‌జన్‌శక్తి తదితరాలు ఉన్నాయి. అనంతరం, మరికొన్ని పార్టీలు వచ్చాయి. ఈ పార్టీలేవి సాధించలేని విజయాలను బహుజన సమాజ్ వాదీ పార్టీ ఆచరించి చూపించింది. ఆ తర్వాత కాన్షీరాం అంతటి ప్రభావం చూపించిన దళిత- బహుజన నాయకుల్లో లాలూ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కనిపిస్తారు. అంబేడ్కర్ రాజకీయ, ఆర్థిక, సామాజిక సూత్రీకరణలను అర్దం చేసుకోవడంలో వైఫల్యం చెందిన కారణంగా ఆయా పార్టీలు స్తబ్ధతకు లోనయ్యాయి( బీఎస్పీతో సహా).
దక్షిణాదిన డీఎంకే, తెలుగునాట టీడీపీ, శూద్ర అగ్రవర్ణల చేతిలో ఉన్నాయి. అంతకు పూర్వం వచ్చిన జస్టిస్ పార్టీ, రెడ్డీ కాంగ్రెస్ నిలబడలేకపోయాయి. ఈ పార్టీల నాయకత్వం శూద్ర, శూద్రాగ్రవర్ణం చేతిలోనే ఉంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా కొన్ని అవకాశాలను 1982- 83లో ఎన్టీ రామారావు తెలుగుదేశం ఇచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా చట్టసభల్లోకి బహుజన ప్రజాప్రతినిధులు వెళ్లారు. ఇదంతా ఆనాటి రాజకీయ వాతావరణంలో సంచలనాత్మక విషయాలు.
శూద్ర, అతిశూద్ర నాయకత్వాల వైఫల్యం..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్షేత్ర స్థాయిలో ఉద్యమించింది బహుజనులు. కళాకారులుగా, రచయితలుగా, మేధావులుగా తొలి వరుసలో ఉన్నది బహుజనులే. అయితే, ఈ బహుజనులకు రాజకీయ నాయత్వాన్ని అందించే పాత్రలోకి దేవేంద్ర గౌడ్ రూపంలో నవ తెలంగాణ ప్రజాపార్టీ వచ్చింది. అది నిలబడలేకపోయింది. ఆల నరేంద్ర ఒక రాజకీయ ప్రయోగం చేసినా అదీ విజయవంతం కాలేదు. కాసాని జ్ఞానేశ్వర్ ఆయనో రాజకీయ ప్రయోగం చేశారు, ఆయానా అంతే. విజయశాంతి స్థాపించిన పార్టీ కూడా నిలబడలేదు. మధర్ థెరిస్సా, ఫూలే, అంబేడ్కర్ ఆలోచన విధానంతో వచ్చిన ప్రజారాజ్యం పార్టీ నిలబడలేదు.
అంటే, దశాబ్దాలుగా శూద్ర, అతిశూద్ర నాయకత్వాలలో వచ్చిన పార్టీలు రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలను అర్ధం చేసుకోవడంలో పదేపదే వైఫల్యం చెందాయి. దీని వల్ల శూద్ర సమూహం నుంచి నాయకత్వ రావడం లేదు. రావడానికి సాహసించడమూ లేదు.
ఓటుకున్న బలాన్ని వివరిస్తున్న విశారదన్..
అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని అర్ధం చేసుకొని ఆచరిస్తున్నామని చెప్తున్న వారిలో నేడు తొలి వరుసలో ఉన్నది ధర్మసమాజ్ పార్టీ. ఈ పార్టీ భారతరాజ్యాంగాన్ని, దాని విశిష్టతను, రాజ్యాంగం ద్వారా లభించే ఉజ్వల భవిష్యత్తును సోదాహరణంగా వివరిస్తున్నామని ఆ పార్టీ అధినాయకుడు విశారదన్ అంటున్నారు.
అయితే, ఇప్పటి వరకు చట్టసభలకు(అసెంబ్లీ- పార్లమెంట్) తన పార్టీ ప్రతినిధులను పంపలేకపోయింది. కానీ, ఆ ప్రయత్నంలో ఉన్నామని ఆ పార్టీ అంటున్నది. ఆ మేరకు ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెడుతున్నది. ఓటుకున్న బలాన్ని జనానికి వివరిస్తున్నది. ఇప్పటికిప్పుడే ఈ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఇదేనని నిర్దిష్టంగా చెప్పలేము. కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ సమూహాల ప్రతినిధిగా తాను ఉంటానని అంటున్నది.
తాజాగా తెలంగాణలో బీసీ నినాదం లేదా బహుజన వాదం పేరుతో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీర్పీ). తన లక్ష్యాలైన ఆత్మగౌరవం, అధికారం, వాటాని చెప్పుకుంటున్నది. “ఆచరణకు పనికి రాని సిద్ధాంతం- సిద్ధాంతాన్ని ఆచరించలేని నాయకత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.” అంబేడ్కర్ బోధనానుసారమే “బోధించు, సమీకరించు, పోరాడు” ఆధారం చేసుకొని తెలంగాణ ఉద్యమం తన లక్ష్యాన్ని చేరుకున్నది. ఈ విజయం వెనుక పటిష్టమైన నాయకత్వం, అశేష ప్రజానికం మద్దతు పట్టు వదలకుండా స్థిరంగా కొనసాగింది. తలబడింది, కలబడింది. అంతిమ విజయాన్ని అందుకున్నది.
బహుజన నాయకత్వాలకు అంబేడ్కర్ అర్ధంకాకున్నా, కులమే అధికారం- కులమే ఆస్తి- కులమే సర్వస్వమైన ఈ దేశంలో బీసీ పార్టీలు నిలబడగలవా? ఇప్పుడు కొత్తగా వచ్చిన, వస్తున్న రాజకీయ పార్టీల ముందున్న అతిపెద్ద సవాలు ఇదే. రాజకీయార్థశాస్త్రాన్ని నిజజీవిత సామాజిక సమీకరణకు సంపూర్ణంగా అన్వయించగలిగే, ఆచరించగలిగే బహుజన నాయకత్వం ఉంటే తప్పా ఫూలే, అంబేడ్కర్ ఆశయాల సాధన, బీసీ పార్టీల మనుగడ సాధ్యం కాదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.