ప్రపంచ దేశాలన్నీ యుద్ధ వాతావరణంలో మునిగి తేలుతున్న సమయంలో- మూడవ ప్రపంచ యుద్ధం తప్పదని కొందరు పరిశీలకులు చెపుతున్నారు. ఈ తరుణంలో మానవ సమాజానికి యుద్ధం అవసరమా? పరిణతి సాధించిన మానవుడు సహృదయంతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోలేడా? అని అనిపిస్తుంది.
ఒక యుద్ధం కొన్ని తరాల మీద ప్రభావం చూపుతుంది కదా? కాలుష్యం పెరిగిపోయి ప్రగతి కుంటుపడుతుంది కదా? కుట్రలు, కుతంత్రాలతో వివేచనలేని నాయకులంతా అధికారం చేజిక్కించుకోవడం వల్ల, అహంభావంతో నిర్ణయాలు తీసుకుంటున్నందు వల్ల ప్రపంచం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఏదేమైనా యుద్ధం ఎప్పుడూ వాంఛనీయం కాదు. అది మానవ సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది.
మానవీయ విలువలకు విలువిచ్చేవారు ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు. ఉగ్రవాదాన్ని అసలే సమర్థించరు. అది ఏ మతానికి చెందిన ఉగ్రవాదమైనా!
ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది యుద్ధమా? బౌద్ధమా? అన్న ఆలోచన రాగానే అశోకుడి కళింగ యుద్ధం గుర్తుకొస్తుంది. పశ్చాత్తాపంతో చండాశోకుడు కరుణామయుడిగా మారడం, ఆయుధాలు వదిలేసి, బౌద్ధం స్వీకరించడం గుర్తుకొస్తుంది. అంతేకాదు, ఈ దేశాన్ని చుట్టు పక్కల దేశాలన్నింటినీ బౌద్ధ దేశాలుగా మార్చిన విషయం గుర్తుకొస్తుంది. తన స్వంత కొడుకును, కూతురినీ అందుకు వినియోగించడం గుర్తుకొస్తుంది.
ఆధునిక సాహిత్యంతో పరిచయం ఉన్నవారికి ప్రపంచ ప్రసిద్ధి రచయిత లియోటాల్‌స్టాయ్ నవల “వార్ అండ్ పీస్” గుర్తుకొస్తుంది.
మానవతా సందేశం
మహాశాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఏమన్నాడంటే, “ఈ ప్రపంచం నాశనమైతే అది తుపాలకుల వల్లనో, మిస్సైల్స్ వల్లనో, అణుబాంబుల వల్లనో కాదు- నైతిక విలువల పతనం వల్ల నాశనమౌతుంది”అని.
“శాంతిని నెలకొల్పే శక్తి ఒక్క బోధిసత్త్వుడికి మాత్రమే ఉంది. బుద్ధుడు ఏసుకు గురువు. కశ్మీర్లో పదమూడేళ్లు ఉండి, బౌద్ధసారాన్ని గ్రహించి- బౌద్ధ జీవన విధానాన్ని నేర్చుకుని ఏసు వెళ్లాడు. బుద్ధుడి బోధనలు యూరప్ దేశాలకు ఏసు ద్వారానే చేరాయి. జాలి, కరుణ, దయ గురించి మొదటి చెప్పింది బుద్ధుడే. ప్రకృతినీ, ప్రాణులన్నింటినీ ప్రేమించాలని చెప్పింది బుద్ధుడే. ప్రస్తుతం ఈ విషయాన్ని యూరోపియనులు ఒప్పుకోరు. మళ్లీ, అది వేరే విషయం. కానీ వాస్తవం ఇదే” అని ఐన్‌స్టీన్ రాసుకున్నాడు.
యుద్ధం అనగానే ఇతర దేశాలలో జరుగుతున్న యుద్ధాలతో పాటు- ఇటీవల పొరుగు దేశంతో మనకు జరిగిన ఆపరేషన్ సిందూర్ కూడా గుర్తుకు వస్తుంది కదా?
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలు ఇద్దరు మహిళా ఆర్మీ ఆఫీసర్లు ప్రపంచానికి వెల్లడించారు(బ్రీఫింగ్).
అది దేశ ప్రజలకు ఎంతో గర్వకారణమైన సందర్భం. ఇద్దరు మహిళలు రెండు వేర్వేరు యూనిఫాంలు. వారివి భిన్నమైన మత విశ్వాసాలు. భిన్నమైన నేపథ్యం గల కటుంబాల నుంచి వచ్చినవారు. కానీ, దేశానికి సేవలందంచడమే వారి లక్ష్యం.
ఆ ఇద్దరు మహిళా ఆర్మీ అధికారుల్లో ఒకరు సోఫియా ఖురేషి అయితే, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్.
భారతదేశానికి ఉన్న శక్తి ఇదే- వివిధ మతాల, వివిధ ప్రాంతాల సమైక్యతతోనే దేశం పురోగమించింది. దేశమంతటా ప్రతిరంగంలో ప్రతిరోజూ మనం ఇలాంటి ఐక్యతను సాధిస్తూ వస్తున్నాం. “హం ఏక్ హై” అనే నినాదమే మనల్ని బలంగా, స్థిరంగా ఉంచుతుంది.
సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్లవలెనె సావిత్రిబాయి ఫూలే, ఫాతిమా షేక్‌లు కూడా ఒకరు హిందు, మరొకరు ముస్లిం.
జ్యోతిబాఫూలే నేతృత్వంలో దేశంలో బాలికలకు విద్య అత్యవసరమని వీరిద్దరు 1848లో పాఠశాలలు ప్రారంబించి నిర్వహిచారు. దాని ఫలితం 177 ఏళ్ల తర్వాత, తొలిసారిగా దేశంలో ఇప్పుడు మళ్లీ కనిపించింది.
మిలట్రీ ఆపరేషన్‌లో ఇద్దరు మహిళలు ముందుండి నాయకత్వం వహించడ దేశం గర్వించదగ్గ అంశం. ఆనాడు అవమానాలకు, అవహేళనలకు గురైన ఫూలే దంపతుల కృషి- ఫాతిమా షేక్తోడ్పాటు వృధా పోలేదని అనిపించింది.
“మా ప్రాధాన్యత మొదట దేశానికి! తరువాతే మతమైన, మరేదైనా”అని అన్నారు తాజుద్దీన్. ఈయన కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి. తాజుద్దీనే కాదు, ఆయన తండ్రి కూడా భారత సైన్యంలో పని చేసిన వారే. ఇప్పుడు తాజుద్దీన్ కూతురు కల్నల్ సోఫియా ఖురేషి “ఆపరేషన్ సిందూర్”కు నాయకత్వం వహించింది.
సోఫియా భర్త కల్నల్ తాజుద్దీన్ బాగేవాడి కూడా ఆర్మీ ఆఫీసరే. బరోడాకు(గుజరాత్) చెందిన సోఫియా, బెలగావి- బెల్గామ్(కర్నాటక)కు చెందిన బాగేవాడిని 2015లోపెండ్లి చేసుకుంది.
ఒక స్త్రీ ఎక్కడా మసీదులో మౌలానా కాలేదు. గుళ్లో పూజారి కాలేదు. చర్చ్‌లో ఫాదర్(పోప్) కాలేదు. కానీ, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, ప్రధానివంటి ఏ పదవికైనా ఎదగొచ్చు. ఈరోజు ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించే అవకాశం రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి బీఆర్ అంబేడ్కర్ ఈ దేశ ప్రజలకు ఎంత విలువైనది సమకూర్చాడో అర్థం చేసుకోవాలి.
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది ఎందుకంటే, రాజ్యాంగం ప్రకారం దేశరక్షణకు ఏర్పాటైన త్రివిధ దళాల భారత సేన అంకితభావం, నైపుణ్యం మాత్రమే- మతతత్వంతో దశాబ్దకాలంగా దేశంలో ఊగిపోతున్న “జై శ్రీరామ్ సేన” ప్రమేయం ఇందులో ఏమీ లేదు.
అందుకే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఏమన్నాడు? “మేం భారత సైన్యానికి వెన్నుదన్నుగా ఉంటాం. ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో దేశవ్యాప్తంగా మా క్యాడర్ అంతా సైన్యం వెంటే ఉంది!”అని అన్నారు. పాలకుల పేర్లు ఎవరివీ తీసుకోలేదు.
జాతీయవాదం ఇదేనా?
మరోవైపు కొన్నికొన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా? పహల్గాం ఉగ్రదాడిలో అమరుడైన నేవీ ఆఫీసర్ వినయ్ సతీమణిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం చాలా దారుణమైన విషయంగా పరిగణించాలి.
ఆ సోషల్ మీడియా ఖాతాలలో అధికార బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులవే అధికంగా ఉన్నాయని తేలింది. అలాంటి ఖాతాలను ఎందుకు బ్లాక్ చెయ్యలేదూ? అధికారంలో ఉన్న నాయకుల జాతీయవాదం ఇదేనా?
కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి”గా అభివర్ణించాడొ అధికార పార్టీ నేత. పాకిస్తాన్‌కు దేశ రహస్యాలు అందించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అధికార పార్టీకి సంబంధాలున్న వ్యక్తి. మరో అధికార పార్టీ నేత తప్పంతా పహల్గాం దాడిలో భర్తలని కోల్పోయిన మహిళలదని అన్నాడు. భర్తల్ని కాల్చి చంపుతుంటే,ఈ మహిళలు ఉగ్రవాదులపై ఎందుకు తిరగబడలేదని ప్రశ్నించాడు.
టూరిస్ట్‌లకు భద్రత కల్పించలేని కేంద్ర ప్రభత్వం, ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, పౌరులదే తప్పు- అన్నట్టు మాట్లాడొచ్చా?
మరో అధికార పార్టీ నేత హైవే మీదనే ఒక మహిళతో లైంగికంగా కలిశాడు. నైతికతలేని, విద్యలేని, దార్శనికులుకాని వారంతా అధికారంలో ఉంటే- దేశం ఎలా ఉంటుందో దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు.
నీతి, నిజాయితీ వదిలేసి మనువాదానికి భజనలు చేసే వారంతా ఎన్ని కుట్రలు చేసైనా- అధికారం చేజిక్కించుకుంటున్నారు. అందుకే దేశం ఇంత ప్రమాదకరంగా తయారయ్యింది. రాజ్యాంగం స్థానంలో “మనస్మృతి”ని తేవాలని- పన్నుతున్న కుట్రలు దేశ ప్రజలకు సృష్టంగ తెలిసిపోతున్నాయి.
ఈ దేశం శతాబ్దాలుగా మనువాదానికి బలైపోతూ, చివరకు ఇలా తయారైంది. భారతదేశ చరిత్ర అంతా బౌద్ధానికీ బ్రాహ్మణిజానికి జరిగిన సంఘర్షణే అని అన్నారు అంబేడ్కర్. నిజమే కదా? ఈ దేశం బయటి ఉగ్రవాదం కంటే అంతర్గత ఉగ్రవాదానికి ఎక్కువగా బలైపోతూ ఉంది.
ఒకప్పుడు మహోన్నతమైన విలువలతో బౌద్ధ దేశంగా, విశ్వ గురువుగా ప్రపంచానికి వెలుగులు పంచిన దేశాన్ని- మనువాదులు వారి ఆధిపత్యం కోసం నాశనం చేసుకుంటూ వచ్చారు. ప్రపంచంలోనే తొలి బౌద్ధ విశ్వవిద్యాయాలు ఏర్పరిచి దేశదేశాల విద్యార్థులకు విద్యనందించిన దేశం ఇది. వీటిని ఎవరు నాశనం చేశారు? ఎందుకు నాశనం చేశారు? చరిత్ర పుటల్లోకి పరిశీలనగా చూస్తే తెలుస్తుంది.
వాస్తవాల్ని మరిపించి, భ్రమల్లో ముంచేశారు
మనం చిన్నప్పుడు తరగతి గది గోడల మీద రాసిపెట్టిన వాక్యాలు చదువుతూ పెరిగాం.
సత్యమునే పలుకుము/ అబద్ధమాడరాదు/ జీవహింస చేయరాదు/ మంచి అన్నది పెంచుము/ ప్రేమ, కరుణ, జాలి ముఖ్యము వంటివి. చదివీ చదివీ అవి మనకు కంఠతా వచ్చేశాయి. కానీ, వాటిని ప్రపంచానికి మొదటగా చెప్పిన మహానీయుడెవరన్న విషయం మన ఉపాధ్యాయులు మనకు చెప్పలేదు.
తరువాత్తరువాత సత్యాన్నీ, అహింసని ఆయుధాలుగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు ఎన్నో ఉద్యమాలు చేపట్టారని తెలుసుకున్నాం. కానీ వాటిని మొట్టమొదటగా చెప్పి, ప్రపంచం కళ్లు తెరిపించిన పరిపూర్ణుడు బుద్ధుడన్న విషం మనం చర్చించుకోలేదు. కారణం- మనువాదుల కుట్రలు.
బుద్ధుణ్ణి మరిపించి, కల్పించిన దేవీదేవతల ఆరాధన వైపు, మూఢభక్తి వైపు మనల్ని మనువాదులు మళ్లించారు.
సుమారు 2,500 ఏళ్ల క్రితం ప్రపంచం ఎక్కడా, ఏ జ్ఞానం అందుబాటులో లేని రోజల్లో “కార్యకారణ సిద్ధాంతాన్ని” చెప్పి ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలకు దారి వేసింది బుద్ధుడు.
బుద్దుణ్ణి, బుద్ధుడి బోధనల్ని అర్థం చేసకున్న వారెవరైనా అసలు యుద్ధాన్ని సమర్థిస్తారా? మా”నవ”వాదమన్న పదం ఆ ప్రాచీన యుగంలో లేదు. కానీ బుద్ధుడు బోధించిది, అశోకుడు ప్రచారం చేసింది-మా”నవ”వాదమే కదా?
పశ్చిమ దేశాలకు బౌద్ధాన్ని పరిచయం చేసిన జర్మన్- అమెరికన్ రచయిత పాల్కారస్(18 జూలై 1852- 11 ఫిబ్రవరి 1919) ది గాస్పెల్ ఆఫ్ బుద్ధ(1894)అనే గ్రంథం ప్రకటించాడు. రాజగృహంలో బుద్ధుడు చెప్పిన మాటలు కొన్నింటిని అందులో పొందుపరిచాడు.
“ఒకరినొకరు మోసగించుకోకండి. ఒకరినొకరు తక్కువ చేసుకోకండి. మీ ఆధిక్యతను ప్రదర్శించకండి. అది క్షణికం! కోపాన్ని, ద్వేషాన్ని, పగను వదిలేయండి. తన బిడ్డను తల్లి వేయి కళ్లతో ఎలా రక్షిచుకుంటుందో, ప్రాణమివ్వడానికి ఎలా సిద్ధపడుతుందో- అలాంటి ప్రేమను మీతోటి వారికి మీరు పంచండి. ప్రేమకు హద్దులుండవని నిరూపించండి. జాలి, కరుణలతో కరిగిపోయే మృదువైన వ్యక్తిత్వాన్ని పెంచుకోండి! ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. అసూయాద్వేషాలను పారద్రోలి- ఏ స్థితిలో ఉన్నా, అందరినీ ప్రేమిస్తూ, అన్యోన్యంగా ఉండడమే ఉత్తమ జీవిత మార్గం!” అన్నది బుద్ధుడు చెప్పిన జీవన సూత్రం!
ఇది జీర్ణించకున్న వారెవరైనా యుద్ధాలకు పూనుకుంటారా? ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించిన కల్నల్ సోఫియా ఖురేష వ్యక్తిగతంగ బౌద్ధ అనుయాయి. అందువల్ల, ఈ దేశ ప్రజల ఉద్యమించాలి, విజ్ఞత లేని నాయకత్వాన్ని గద్దె దించాలి!!
కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
