ప్రజాస్వామిక పరిపాలన, పౌరహక్కులపై వివిధ ప్రజాసంఘాలు నిర్వహించిన జాతీయ సమ్మేళనంలో “భారతీయ ప్రతీ ఓటరుకు సందేశం” పేరుతో ఒక ప్రకటనను 2025 అక్టోబరు 25న విడుదల చేశారు. ఈ ప్రకటనలో భారత రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యత మీద కీలక అంశాలను ప్రస్థావించారు. ఎన్నికల సంఘం తన అస్తిత్వాన్ని కోల్పోయిందని అన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం, పారదర్శకమైన- నిష్పక్షపాతమైన ఎన్నిల కోసం ఆ ప్రకటన డిమాండ్ చేసింది.
హైదరాబాద్: దేశంలోని సమకాలీన అంశాల మీద 2025 అక్టోబరు 25న చైన్నైలో బహిరంగ చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు, ఆర్థికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణ కోసం వివిధ వేదికల ద్వారా పోరాటం చేస్తున్నవారు, ఎన్నికల సంస్కరణల కోసం ఉద్యమిస్తున్న ఉద్యమకారులు పాల్గొని ప్రసంగించారు. చర్చలనంతరం “చైన్నై ప్రతిజ్ఞ” పేరుతో ఓ తీర్మానాన్ని ఆమోదించారు.
“స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ద్వారా భారత ప్రజాస్వామ్యానికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది? ఎస్ఐఆర్ నుంచి ఎటువంటి సమాధానాల అవసరం ఉంది? ఎలాయితే వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయో; అలాఅలా ఎస్ఐఆర్ను దేశవ్యాప్తంగా మిగితా ప్రాంతాలలో(బీహార్ తర్వాత) ప్రవేశపెట్టనున్నారు. మన ప్రజాస్వామ్య రక్షణ కోసం మనం ఎలా సిద్ధంగా ఉండాలి?” అని భారతీయ ప్రజలనుద్దేశించి చర్చలో ప్రస్థావించినట్టుగా ప్రకటన తెలియజేసింది.
ఎస్ఐఆర్ వ్యతిరేక నినాదాలు
“ఎస్ఐఆర్ మాకొద్దు. ఎన్నికల నిజాయితీని నాశనం చేయొద్దు. అమ్ముడుపోయిన ఎన్నికల సంఘం మాకొద్దు. ఓటు చోరీతో ప్రజలను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం మాకొద్దు. పదండి గళం విప్పండి- ఉద్యమానికి సిద్ధంకండి” అనే నినాదాలతో ప్రజలమైన తాము పిలుపునిస్తున్నట్టుగా పేర్కొన్నది.
ఒకప్పుడు, ప్రస్తుతం ఎన్నికల సంఘం ఎలా ఉందో తెలియజేస్తూ, “గతంలో భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిజాయితీగా, నిస్పక్షపాతంగా పని చేసింది. మోసం, చట్టవిరుద్ధ జోక్యంతో తన అస్తిత్త్వాన్ని కోల్పోయిందని గడచిన రెండేళ్లలో స్పష్టంగా నిస్సందేహంగా రుజువు చేయబడింది. తన అస్తిత్వాన్ని ఎన్నికల సంఘం కోల్పోవడం వల్ల కేంద్రంలో ఒక అక్రమప్రభుత్వం ఉనికిలోకి వచ్చింది” అని దుయ్యబట్టింది.
జవాబుదారితనంలేని ప్రభుత్వం, పక్షపాత ఎన్నికల సంఘం, నకిలీ ఓటరు జాబితా, లెక్కింపు విధానం వల్ల, తన అస్తిత్వం కోల్పోయిన ఎన్నికల సంఘం ఆధారంగా ఏర్పాటైన లోక్‌సభను వెంటనే రద్దు చేయాలని ప్రకటన డిమాండ్ చేసింది.
“పౌరులు, వివిధ పౌరసమాజ సంఘాలు- వేదికలు, ప్రజా ఆందోళన సంఘాలు, ప్రతిపక్ష పార్టీలకు ప్రజలైన మేము కోరుకుంటున్నదేంటంటే, మన ప్రజాస్వామ్యయుత రాజ్యాంగ ఆత్మను స్వీకరించండి. ఇంకా దాని ప్రాథమిక మూలాల రక్షణ కోసం పోరాడండి. సమయం ఆసన్నమైంది. అందరం భుజంభుజం కలిసి నిలబడుదాం. మన ప్రజాస్వామ్యానికి నష్టం చేసే ప్రయత్నాలను ప్రతిఘటిద్దాం. మన రాజ్యాంగ రక్షణ కోసం దృఢమైన ఆశయంతో ముందుకు కదులుదాం” అని ప్రకటన తెలియజేసింది.
ప్రకటనలో “ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘాన్ని, అది అనుసరిస్తున్న విధానాలు- పనులు, రెండింటి వల్ల అవకతవకలకు పాలైన ఓటర్ల జాబితాను. బీహారు ఎస్ఐఆర్ నివేదికను. దేశవ్యాప్తంగా మిగితా ప్రాంతాలలో ఎస్ఐఆర్ను ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలను, మొత్తం మీద పూర్తి ఎస్ఐఆర్ ప్రక్రియను మేము తిరస్కరిస్తున్నాము”అని పేర్కొన్నది.
చైన్నై సంకల్ప్ ప్రకటన పలు డిమాండ్లను ముందుంచింది, “ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని రద్దుచేసి, దాని స్థానంలో నిష్పక్షపాతంగా వ్యవహరించే మరో కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయాలి”అని తెలియజేసింది.
“ఎస్ఐఆర్కు ముగింపు పలకాలి”అని, “అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్, ఓట్ ఫర్ డెమోక్రసీ రిపోర్ట్(జులై- 2024) ద్వారా లేవనెత్తిన ఆందోళన, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నల మీద, పౌర సమాజం ప్రతిపక్షాల నుంచి లేవనెత్తిన అంశాలు, ప్రశ్నలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి. వీవీప్యాట్‌ను వంద శాతం లెక్క పెట్టాలి. ఓటరుకు అందజేసే వీవీప్యాట్ ఓటరు స్లిప్ అతని వద్దే ఉండే విధంగా చూడాలి” అని ప్రకటనలోని డిమాండ్లు తెలియజేశాయి.
ఓటరుకు లేదా అతని కుటుంబ సభ్యులకు ఎటువంటి ముందస్తు సమాచారం అందించకుండా; అందులోని పేర్లను ఎన్నికల సంఘం చేర్చడం లేదా తొలగించడం చేయరాదని తెలియజేసింది. అంతేకాకుండా, వలస కార్మికుల కోసం పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది.
చెన్నై సంకల్పంలోని ఈ డిమాండ్లపై దేశవ్యాప్తంగా వివిధ పద్ధతుల్లో ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి పూనుకున్నట్టుగా ప్రకటన చెప్పుకొచ్చింది. 2025-26లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ఎస్ఐఆర్ రద్దు గురించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ప్రతిపక్షాలను కలుపుకొని వారి బాధ్యతలను గుర్తుచేసి, వారిని తమ ఉద్యమంలో భాగస్వామ్యం చేసేవిధంగా తమ కార్యాచరణనను “చైన్నై సంకల్ప్” ప్రకటించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
