2026- 27 బడ్జెట్లో సంక్షేమ వ్యయం పెరుగుదల కాగితాలలో కనిపిస్తున్న పరిమిత ఖర్చు, ద్రవ్య పరమైన ఆంక్షలు, లబ్ధిదారుల ఎంపికలో బలహీనతలు ఆశించిన ఫలితాలు సాధించడానికి ఆటంకంగా మారుతున్నాయి.
న్యూఢిల్లీ: 2026- 27 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, ప్రపంచ ఆర్థికరంగమనే సముద్రంలో భారత ఆర్థికవ్యవస్థ అనే నావ ఎటువంటి ఆటోపోటులకు గురికాకుండా ప్రయాణిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్నది.
ఈ ఏడాది 53.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని ప్రతిపాదించగా అందులో 12.2 లక్షల కోట్లు క్యాపిటల్ వ్యయం(మౌలిక అవసరాలపై పెట్టే ఖర్చు)గా ప్రతిపాదించింది.
అంకెలు ఎటు నుంచి ఎటు మార్చిన ప్రభుత్వ లక్ష్యం మాత్రం ద్రవ్యలోటు అదుపులో ఉన్నదని భరోసా ఇవ్వడమే.
ఈ సంవత్సరం ద్రవ్యలోటు జీడీపీలో 4.3శాతంగా ఉంటుందని అంచనా వేశారు. స్థూలజాతీయోత్పత్తిలో 55.5 శాతం విలువతో సమానమైన అప్పులున్నాయని తేల్చారు.
అయితే, మరో కీలకమైన ప్రశ్న అలాగే ఉంది. ప్రభుత్వం ఖర్చు పెట్టదల్చుకున్న ఈ భారీ మొత్తంలో నిజంగా అర్హులైన లబ్ధిదారులకు దక్కేది ఎంత? ఈ సంక్షేమ వ్యయంతో సాధించే సామాజిక ప్రగతి లక్ష్యాలేమిటి? అన్నదే ఆ కీలకమైన ప్రశ్న.
సంక్షేమ వ్యయ విస్తరణ- లోతుపాతులు
బడ్జెట్ సారాన్ని, లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే భారీ పద్దులు- కేటాయింపుల వెనక దాగి ఉన్న వాస్తవాలను గుర్తించాలి, అర్థం చేసుకోవాలి.
తాజా బడ్జెట్లో విద్యా రంగానికి 1.39 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి 1.05 లక్షల కోట్లు, వ్యవసాయం- అనుబంధ రంగాలకు 1.63 లక్షల కోట్లు, సామాజిక సంక్షేమానికి 62,326 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 2.73 లక్షల కోట్లు కేటాయించారు.
గత బడ్జెట్లో కేటాయింపులు, నిజంగా జరిగిన ఖర్చుల గురించి ప్రభుత్వం బడ్జెట్ పత్రాలలో ఇచ్చిన వివరాల నేపథ్యంలో తాజా కేటాయింపులను పరిశీలిస్తే; బడ్జెట్ పద్దులలో ప్రతీయేట ఎంతో కొంత పెరుగుదల కనిపిస్తూనే ఉంటుంది. కానీ, ఈ పెరుగుదల అసలు ఖర్చులలో కనిపించదు. ఆశించిన ఫలితాలు సాధించడంలో ప్రతిఫలించదు.
అన్ని శాఖలు, విభాగాలకు గత సంవత్సరం కేటాయించిన పద్దుల మొత్తానికి; పెట్టిన ఖర్చుకు మధ్య తేడా ఉన్నది. కేటాయింపులకంటే ఖర్చులు తక్కువగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని గమనించినప్పుడు బడ్జెట్ ప్రతిపాదకులు భారీ ఆశలతో ఉంటున్నారని; ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత, తదనుగుణంగా ఏ రంగానికి, ఏ పథకానికి ఎంత ఖర్చు పెట్టగలమో అన్న విషయంలో నేల విడిచి సాము చేస్తున్న తీరు కనిపిస్తుంది.
గత సంవత్సరం బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి శాఖకు 2.65 లక్షల కోట్లను కేటాయిస్తే, సవరించిన అంచనాల ప్రకారం ఖర్చు పెట్టగలిగేది 2.12 లక్షల కోట్లు మాత్రమే.
అంటే, నికర కేటాయింపులో 20శాతం తగ్గుదల. సామాజిక సంక్షేమానికి గత సంవత్సరం 60,052 కోట్లు కేటాయించగా- అందులో ఖర్చు పెట్టింది 55వేల కోట్లు మాత్రమే.
అదేవిధంగా విద్యా రంగానికి కేటాయించిన 1.29 లక్షల కోట్లలో 1.22 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగామని; ఆరోగ్య రంగానికి కేటాయించిన 98,311 కోట్లలో కేవలం 94,625 కోట్లు ఖర్చు పెట్టగలిగామని; వ్యవసాయ రంగానికి కేటాయించిన 1.59 లక్షల కోట్లలో 1.51 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగామని తాజా బడ్జెట్ పత్రాల ద్వారా ప్రభుత్వం వెల్లడించింది.
ఈ ధోరణి 2024, 2025 సంవత్సరాల బడ్జెట్ల కంటే భిన్నంగా ఏమి లేదు.
గత కొంతకాలంగా ఆర్థిక సంవత్సరం మధ్యలోనే వివిధ శాఖలకు కేటాయించిన పద్దులను ప్రభుత్వం సవరించి తగ్గిస్తోంది.
ఈ ధోరణి కేటాయింపులలో కనిపించే ప్రభుత్వ ఆశలకు, ఖర్చులో వ్యక్తమయ్యే నిరాశకు మధ్య ఉన్న ఊగిసలాటను ముందుకు తెస్తున్నది.
ఊదాహరణకు ఉపాధి హామీ చట్టాన్నే పరిశీలిస్తే, 2024 బడ్జెట్లో 86వేల కోట్లు కేటాయించగా- ఈ కాలంలో పెరిగిన గ్రామీణ పేదరికం, తరిగిపోతున్న గ్రామీణ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం సక్రమంగా గమనించి ఉంటే(వాస్తవిక దృక్పథం) ఆర్థిక సంవత్సరం మధ్యలో చేసే సవరింపులలో భాగంగా ఈ పథకానికి మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం అందుకు పూనుకోలేదు.
2026-27 బడ్జెట్లో ఉపాధి హామీ పథకం కాస్త వికసిత భారత్ గ్రామీణ పథకంగా మారింది. కొత్త పథకానికి 95,692 కోట్లు కేటాయించారు.
పైకి చూస్తే, కేటాయింపులు భారీగా పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ, ఈ పథకం రూపు రేఖలు అమలు తీరు మార్చివేయడంతో గతంలో చేసిన కేటాయింపులు, సాధించిన ఫలితాల వెలుగులో తాజా కేటాయింపులను విశ్లేషించడం కష్టమే అవుతుంది.
ఈ పెరుగుదల గ్రామీణ ఉపాధి అవకాశాల పెరుగుదలలో కనిపిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకమే.
స్థూలఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా పై విశ్లేషణకు భిన్నంగా లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం, ధరల పెరుగుదల 1.7శాతం మాత్రమే.
2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ధరల పెరుగుదల రేటు 6.7శాతం ఉండగా- 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4శాతానికి, 2025 ఆర్థిక సంవత్సరంలో 4.8శాతానికి తగ్గినట్టు కనిపిస్తుంది.
కానీ, ఆయా ఆర్థిక సంవత్సరాలలో వివిధ పథకాలకు, శాఖలకు కేటాయించిన నిధులు పెరుగుతోన్న ధరల మేరకైనా పెరగలేదు.
దీంతో ప్రభుత్వం ప్రతిపాదించే ఖర్చుతో పెరిగిన ధరల ప్రకారం, ప్రజాప్రయోజన చర్యలు చేపట్టాలంటే చేతిలో మిగిలే నికర రొక్కం తగ్గిపోతుంది.
దీని పర్యవసానంగా ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం అందించే సొమ్ముతో లబ్ధిదారులు కొనుగోలు చేయగల వస్తువులు, సరుకుల పరిమాణం- నాణ్యత తగ్గిపోతుంది.
మరోవైపున ప్రభుత్వం ఏ ఏడాదికాఏడాది ప్రజా సంక్షేమంపై పెట్టే ఖర్చు తగ్గించుకుంటూ వస్తోంది. వడ్డీ చెల్లింపులలాంటి అనివార్యమైన ఖర్చులు పెరగడంతో సంక్షేమం కోసం మళ్లించగలిగిన నిధులు తగ్గిపోతున్నాయి.
ఉదాహరణకు 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్లో 11.37 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకే పోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపుల కోసం 12.76 లక్షల కోట్లు పక్కన పెట్టారు. అంటే సుమారు దేశ బడ్జెట్లో 25శాతం వడ్డీ చెల్లింపులకు వెళ్తోంది.
2026 ఆర్థిక సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ పన్నుల వసూళ్లు గతంలో ఎన్నడూ లేనంతగా 22.10 లక్షల కోట్లకు చేరింది.
కానీ, గత రెండేళ్లలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల దాదాపు 5శాతం పడిపోయి 2026 ఆర్థిక సంవత్సరంలో(ఏప్రిల్ నుంచి డిసెంబరు) 6.7శాతానికి తగ్గింది.
జీఎస్టీ వసూళ్లు, స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు కుడిఎడంగా ఒకదాన్ని అనుసరించి మరొకటి నడుస్తున్నాయి.
భారీగా చెప్పుకోదగ్గ వృద్ధి రేటు లేదు. అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా ఉందో జీఎస్టీ వసూళ్లను బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు.
ఆర్థిక వ్యవస్థ పెరగడం లేదు. జీఎస్టీ వసూళ్లు పెరగడం లేదు.
వెరసి ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదు. పర్యవసానంగా తన ఆశలకు అనుగుణంగా ఖర్చు పెట్టే వెసులుబాటు ప్రభుత్వానికి లేదు.
తాజాగా జీఎస్టీ రేట్లను సవరించడంతో ఎక్కువమంది జీఎస్టీ రిటర్న్స్ వేయవచ్చు. కానీ, అది వెంటనే ఖర్చు పెట్టగలిగిన ఆదాయ రూపంలో ఉంటుందని ఆశించలేము.
ఖర్చు సరే ఫలితాలేవి..
ఈ నేపథ్యంలో చూసినప్పుడు, 2026- 27 బడ్జెట్ గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ల కంటే పెద్ద భిన్నంగా ఏమి లేదు. అంటే, సంక్షేమ వ్యయం ద్వారా ప్రభుత్వం భారీ ఫలితాలను ఆశించడం లేదు. ప్రతిపథకానికి పదో పరకో పెంచడానికి ప్రభుత్వం పరిమితమవ్వడమంటే, దేశ ఆర్థిక పరిస్థితి ప్రచారం చేస్తున్నంత ఆశాజనకంగా లేదు. ఆర్థిక వ్యవస్థ నడక ఆశాజనకంగా లేకపోవడం అంటే, సంక్షేమానికి వనరుల కొరత ఎదురు కావడమే.
ఉదాహరణకు, పీఎం పోషణ్ పథకానికి 2024- 25 బడ్జెట్లో 10వేల కోట్లను కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్లో ఈ కేటాయింపులు 12500 కోట్లకు మాత్రమే పెరిగింది.
దేశంలో 8 కోట్ల మంది పిల్లలకు, కోటిమంది బాలింతలకు, 20 లక్షల మంది వయోజనులు కాబోతున్న యువతులకు పోషక ఆహారం అందించే సక్షం అంగన్వాడీ మరియు పోషణ 2.0 పథకానికి జరిగిన కేటాయింపులు 20,949 కోట్లు మాత్రమే.
ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై పథకానికి 9వేల కోట్లు(గత బడ్జెట్ కంటే 24శాతం పెరుగుదల), పీఎం కిసాన్‌కు 63,500 కోట్లు కేటాయించారు.
ఇటువంటి నామమాత్రపు కేటాయింపులతో మానవాభివృద్ధి సూచికలను గణనీయంగా మెరుగుపరచే మాట అటుంచి పతనాన్ని నిలువరించలేము.
దేశ ఆర్థిక వ్యవస్థ ఈ స్థితిలో ఉంటే సంపద పంపిణీ, ఆదాయ సహకారం, పోషణల విషయంలో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించలేము.
ఈ వ్యత్యాసాన్ని పోషకాహార పథకల ఫలితాలు మరింత స్పష్టంగా ఎత్తి చూపుతున్నాయి.
2021- 2025 మధ్య కాలంలో పీఎం పోషణ్ పథకానికి నికర కేటాయింపులు మొత్తంగా 56,801 కోట్లు(ఐదేళ్లకు కలిపి). అందులోను ఖర్చు పెట్టింది- 54,158 కోట్లు.
2024, 2025 ఆర్థిక సంవత్సరాలలో పోషక సూచికలు స్థంభించిపోయాయి. అయినప్పటికీ, ప్రభుత్వ కేటాయించిన 11,600 కోట్లు కూడా ఖర్చు కాలేదు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 5 నివేదక ప్రకారం, 2019-21 మధ్య కాలంలో వయసుకు తగ్గట్టు ఆరోగ్యంగా లేని పిల్లల శాతం 38 నుంచి 36 శాతానికే తగ్గింది. రక్తహీనత కలిగిన పిల్లల మోతాదు 59శాతం 67శాతానికి పెరిగింది. 15- 49 సంవత్సరాల మధ్యనున్న మహిళలలో రక్తహీనతకు గురవుతున్న వారు 57శాతం మంది ఉన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రస్తుత విధానంలో మరిన్ని సమస్యలున్నాయి. మహిళ- శిశు సంక్షేమ శాఖకు కేటాయించే మొత్తం పద్దులో 80శాతం అంగన్వాడీ పథకంతో ముడిపడి ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాలు, వనరుల కొరత కారణంగా ఈ పథకం ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నది. దీంతో 2022 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు(అంటే మూడేళ్లు) ఈ పథకానికి కేంద్రం 52,444 కోట్లు కేటాయించినప్పటికీ వివిధ రాష్ట్రాలలో సాధించిన ఫలితాలలో ఆశాజనకంగా లేవు.
ఆదాయ భరోసా పథకాలలో కూడా పైపైన చూస్తే స్థిరంగా ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ, ప్రజల నికర ఆదాయాలు పడిపోతున్నాయి. పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ కాలంలో 3.24 లక్షల కోట్లు రైతులకు అందించినా; ఎప్పుడు డబ్బులు వస్తాయో, ఎప్పుడు రావో అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో వచ్చిన డబ్బులు రైతుల శాశ్వత అవసరాలు తీర్చడానికి బదులు ఉప్పుకు, పప్పుకే ఖర్చయిపోతున్నాయి.
ఏటా సగటున 28శాతం చొప్పున పెరుగుతున్న ధరల పెరుగుదలతో పీఎం కిసాన్ పథకం ద్వారా వచ్చిన సొమ్ము కూడా తిరిగి ప్రభుత్వానికీ, మార్కెట్ శక్తులకు చేరుతుంది.
ఆరోగ్య శాఖ సాధించాల్సిన ఫలితాల విషయంలో కూడా ఇటువంటి వ్యవస్థాగత పరిమితులు ఎన్నో ఉన్నాయి. 2025 అక్టోబరు నాటికి కేంద్ర ప్రభుత్వం 42కోట్ల ఆరోగ్య కార్డులను జారీ చేసింది. ఈ కార్డులను వినియోగించడం ద్వారా 1.52 లక్షల కోట్లు ఆదా చేయగలిగామని చెప్పింది. అయినప్పటికీ, ఈ కార్డుల వినియోగం ప్రత్యేకించి పేద రాష్ట్రాలలో బలహీనంగా ఉన్నది.
2025 జనవరి- ఏప్రిల్ మధ్య కాలంలో ఈ పథకం కింద చేరటానికి 443 ఆసుపత్రులు మాత్రమే ఒప్పించగలిగితే, మే నెలలో ఈ పథకంలో చేరింది కేవలం 20 ఆసుపత్రులు మాత్రమే.
ప్రభుత్వం ఒక్కో చికిత్సకు నిర్థారించిన రేట్లు, ప్రభుత్వ చెల్లింపులలో జాప్యం కారణంగా ఎక్కువ ఆసుపత్రులు ఈ పథకం ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలందించడానికి సుముఖంగా ఉండటం లేదు.
2026- 27 బడ్జెట్లో ప్రభుత్వం సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నట్టు కన్పించే ప్రయత్నం చేసినప్పటికీ కీలక సమస్యలైన వనరుల కేటాయింపు, వనరుల కొరత నిధుల విడుదలవంటి అంశాలలో మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలుగా ఏర్పాటు చేయాల్సిన విధానాలు, వ్యవస్థలు, కార్యాచరణలపై పెట్టిన శ్రద్ధ నామమాత్రమే.
ప్రభుత్వ నిధులు గణనీయంగా పెరగడంతో పాటు నిరంతరాయంగ నిధులు అందుబాటులో ఉంటాయన్న భరోసా కల్పించలేకపోతే, సంక్షేమ సమస్యలు మరింత పెరుగుతాయి. ఆయా పద్దుల కింద ప్రభుత్వం పెట్టే ఖర్చులు ఆశించిన ఫలితాలను సాధించలేవు. స్థూలంగా ప్రజల స్థితిగతులు మెరుగుపడవు.
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత దీపాంశు మోహన్ ఓపీ జిందల్ విశ్వవిద్యాలయంలో ఆర్థశాస్త్ర శాఖలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్‌లో డైరెక్టర్‌గాను, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విజిటిగ్ ప్రొఫెసర్‌గాను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అకడమిక్ రిసర్చ్ ఫెలోగానూ ఉన్నారు.
ఈ వ్యాసానికి కావాల్సిన వివరాలను సమీకరించడంలో సీఎన్ఈఎస్లో రిసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ జిందల్ స్కూల్ ఆఫ్ గవర్న్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీలో ఆర్థశాస్త్ర విద్యార్థిగా ఉన్న అంకుర్ సింగ్, సీఎన్ఈఎస్లో రిసెర్చ్ అనలిస్టులుగా పనిచేస్తున అదితి లాజరస్, సక్షం రాజ్, సిమార్ కౌర్‌లు రచయితకు సహకరించారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.


