
సంతోషంతో పిల్లల మనసులు ఆకాశంలో గాలిపటంలా ఎగిరిపోవాలంటే, రచయిత్రి జొన్నలగడ్డ శ్యామల రాసిన “సంతోషాల గాలిపటం” బాలల కథల పుస్తకాన్ని చదవాల్సిందే. ఈ పుస్తకం అందమైన బొమ్మలతో ఆకర్షణీయంగా ఉండి పిల్లలను ఇట్టే ఆకట్టుకుంటుంది.
ఇక పుస్తకంలోకి వెళ్తే, ఇందులో మొత్తం 30 కథలు ఉన్నాయి. అన్నీ ఆణిముత్యాలే. విజ్ఞానాన్ని సున్నితంగా తెలియచెప్పేవే. సమాజంలో పిల్లలు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను ఓ మాల చేసి సరస్వతీ దేవి మెడలో వేసిన అనుభూతి కలుగుతుంది.
బంధాల విలువలు, బాలబాలికల సమానత్వం, బడి పిల్లల సమస్యలు, హోలీలో హాని చేసే రంగుల బదులు ప్రకృతి సిద్ధమైన రంగులు ఎలా తయారు చేసుకోవచ్చు, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, ఉగాది వైశిష్యం, వినాయకుడి గుణగుణాల విశదీకరణ, చెట్లకు పుట్టినరోజు జరుపటం, ఇలా ఎన్నో.. ఎన్నో.. ఎన్నెన్నో…
కుటుంబ సభ్యులు, మన చుట్టూ సమాజంలో ఉన్న వ్యక్తులు, ఉపాధ్యాయుల, బడి పిల్లల పాత్రల మధ్య జరిపే సంభాషణలతో అన్నీ కథలు అలరారాయి. మధ్యమధ్యలో జంతువుల కథలు, సరదా సంబరాలతో ఈ సంతోషాల గాలిపటం ఆకట్టుకుంటుంది.
కాకపోతే, పిల్లల పుస్తకం కాబట్టి రవ్వంత అక్షరాలు పెద్దవిగా ముద్రించి ఉంటే బాగుండేదేమో అనిపించింది.
రచయిత్రి మరిన్ని బాలల కథల పుస్తకాలను ముద్రణలోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, అందరూ చదవండి. అందరితో చదివించండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.