ఎన్కే బాబు, విజయనగరం వారి సంపాదకత్వంలో “గోరుముద్దలు” బాలల కథల సంచిక వెలువడింది. అందమైన ముఖచిత్రంతో సహజత్వం ఉట్టిపడుతూ పిల్లలను ఈ పుస్తకం తప్పక ఆకర్షిస్తుందని చెప్పాలి. పెద్దలు, పిల్లలు కలిసి రాసిన 23 కథలను ఇందులో పొందుపరిచారు.
విజ్ఞానదాయకమైన విషయాలను ఈ పుస్తకంలోని కథలు తెలియజేస్తాయి. పిల్లలు రాసిన కథలు పర్వాలేదనిపించాయి. చిన్న వయసులో అసలు ప్రయత్నించటమే గొప్ప విషయం.
కథలలో మంచి, మానవత్వం, కుల-మత రహిత సమాజాన్ని కోరుకోవడం; అత్యాశ పర్యవసానాలు, చదువు గొప్పతనం గురించి చెప్పాలనుకోవడం పిల్లల మేధస్సును తెలియజేస్తుంది. దీనికి వారినందరిని మెచ్చుకోవాల్సిందే.
వారికి కాస్త ప్రత్యేక శిక్షణ ఇస్తే మంచిగా అభివృద్ధి చెందుతారని కూడా అనిపించింది. వారికి నా ప్రత్యేక అభినందనలు.
రైలు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు; బ్యాక్టీరియా మంచి చెడులు, నీటి వినియోగం, ప్రకృతి ఋణము, ఏ ఏ పనులు చేయాలి- ఏ ఏ పనులు చేయకూడదో ఇందులో రచయితలు, రచయిత్రులు తెలియజేస్తారు.
అంతేకాకుండా చదువుతో పాటు ఈతలాంటి విద్యలు నేర్చుకోవాలని, మనం చేసిన మంచే మనల్ని కాపాడుతుందని, సోలార్ ప్లాంట్, సహాయతత్వం, మానవత్వం గురించి వివరించిన కథలు బాగున్నాయి.
ముఖ్యంగా “జున్నుగడ్డ” కథలో జున్నుపాలను ఎలా దాచి ఉంచుకోవచ్చు, కావలసినప్పుడు ఎలా వాడుకోవచ్చన్న విషయాన్ని కథలో తెలియపరిచిన విధానం ప్రశంసనీయం.
పిల్లలకు కథలను చేరవేయాలని దృక్పథంతో ఇలా సంచికలు వేయాలని కథలు సేకరించి ప్రచురించటం విషయంలో తీసుకున్న చొరవకు సంపాదక వర్గాన్ని అభినందించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
