అక్టోబర్ 16న జేడీయూ తన రెండవ, చివరి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో ఒక్క ముస్లిం అభ్యర్థి లేకపోయినా, రెండవ జాబితాలో అరారియా, జోకిహాట్, అమౌర్, చైన్పూర్ నుంచి ముస్లిం అభ్యర్థులను ఆ పార్టీ నిలబెట్టింది.
న్యూఢిల్లీ: రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జనతాదళ్- యునైటెడ్(జేడీయూ) అక్టోబర్ 16న తన రెండవ, చివరి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార పార్టీ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలలో మిగిలిన 44 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీనికంటే ముందు బుధవారంనాడు 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది.
జేడీయూ తొలి జాబితాలో ఒక్క ముస్లిం అభ్యర్థి లేకపోయినా, రెండవ జాబితాలో ఆ పార్టీ నలుగురు ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. అరారియా నుంచి షబ్నమ్ అక్తర్ , జోకిహాట్ నుంచి మంజార్ ఆలం, అమౌర్ నుంచి సబా జాఫర్, చైన్పూర్ నుంచి ప్రస్తుత బీహార్ మైనారిటీ వ్యవహారాల మంత్రి మహ్మద్ జామా ఖాన్ పోటీ చేయనున్నారు.
ఈ జాబితాలో రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో షీలా మండల్, విజేంద్ర ప్రసాద్ యాదవ్, లేషి సింగ్, జయంత్ రాజ్‌తో పాటు మరికొంతమంది ఉన్నారు.
నితీష్ కుమార్ గురువారం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా తెలిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను 2025 అక్టోబర్ 6న ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటింగ్ రెండు దశల్లో జరుగుతుంది: మొదటి దశ 2025 నవంబర్ 6న, రెండవ దశ 2025 నవంబర్ 11న. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన 2025 నవంబర్ 14న జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో, బీహార్‌లో మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
బీహార్ శాసనసభలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. వీటిలో 203 జనరల్ కేటగిరీ సీట్లు, 38 షెడ్యూల్డ్ కులాలకు, 2 షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. మొదటి దశలో 121 సీట్లకు పోలింగ్ జరుగుతుండగా, రెండవ దశలో 122 సీట్లకు పోలింగ్ జరుగుతుంది.
బీహార్‌లో మొత్తం 74.3 మిలియన్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 39.2 మిలియన్ల మంది పురుషులు, 35.0 మిలియన్ల మంది మహిళలు, 1,725 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
నమోదు తేదీలు..
మొదటి దశకు సంబంధించిన నోటిఫికేషన్ 2025 అక్టోబర్ 10న విడుదలైంది. పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 17.
రెండవ దశకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 13న విడుదలైంది. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే చివరి తేదీ 2025 అక్టోబర్ 20.
ప్రధాన రాజకీయ కూటములు..
ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు ప్రధాన కూటములు పోటీ చేస్తున్నాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ)లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), జనతాదళ్(యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), హిందుస్తానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి.
తన సీట్ల భాగస్వామ్యాన్ని ఖరారు చేసిన ఎన్డీఏ..
బీజేపీ, జేడీయూ ఒక్కొక్కటి 101 సీట్లలో పోటీ చేస్తాయి. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) 29 సీట్లలో పోటీ చేస్తుంది. రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందూస్తానీ అవామ్ మోర్చా పార్టీలు ఒక్కొక్కటిగా ఆరు సీట్లలో పోటీ చేస్తున్నాయి.
ప్రతిపక్ష మహా కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్), వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా ఉన్నాయి. అయితే, సీట్ల భాగస్వామ్యంపై ఈ కూటమి ఇంకా ఒక ఒప్పందానికి రాలేదు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జాన్ సూరజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) కూడా 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
గత ఐదు సంవత్సరాలు..
ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2025 నవంబర్ 22న ముగియనుంది. చివరిసారి ఎన్నికలు 2020 అక్టోబర్- నవంబర్లలో జరిగాయి. ఆ తర్వాత నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అప్పటి నుంచి పొత్తులు చాలాసార్లు మారాయి. 2022లో బీజేపీతో తన పొత్తును జేడీయూ తెంచుకుని, మహా కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ జనవరి 2024లో అది బీజేపీతో ఎన్డీఏలోకి తిరిగి వచ్చింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
