బరేలీలో బర్త్‌డే పార్టీపై మితవాద మూక దాడి చేసి, కార్యక్రమంలో పాల్గొన్న వారిని చితకబాదింది. ఈ విషయం మీద స్పందించిన పోలీసులు “శాంతికి భంగం కలిగించారని” బాధితులపైనే ముందుగా చర్యలు తీసుకున్నారు.
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బరేలీ జిల్లాలోని ఒక కేఫ్‌లో మహిళా నర్సింగ్ విద్యార్థి(20) బర్త్‌డే పార్టీపై మితవాద బృంద సభ్యులు దాడి చేశారు. జిల్లాలోని ప్రేమ్‌నగర్ ప్రాంత కేఫ్‌లో 2025 డిసెంబరు 27న ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు డజను మంది “జై శ్రీరాం” అంటూ నినాదాలిస్తూ దాడిలో పాల్గొన్నారు. సంఘటనకు సంబంధించిన సమాచారం సామాజిక మాధ్యమాలలో వైరలైన అనేక వీడియోలు ద్వారా వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో వైరలయిన వీడియోల ఆధారంగా, పోలీసులు జోక్యం చేసుకోక ముందు బర్త్‌డే పార్టీలో పాల్గొన్నవారు ఎవరిని రెచ్చగొట్టలేదు. అయినా వారిని మూక చితకబాదింది.
క్రమశిక్షణ చర్యల కింద కొద్ది రోజుల క్రితం బహిష్కరించబడిన బజరంగ్ దళ్ సభ్యులు రిషబ్ ఠాకూర్ ఈ మూకకు నాయకత్వం వహించినట్టుగా గుర్తించారు.
బర్త్‌డే పార్టీలో పాల్గొన్న బాధితులు, నర్సింగ్ విద్యార్థులైన ఇద్దరు ముస్లిం స్నేహితులకు వ్యతిరేకంగా పోలీసులు చర్యలకు దిగారు. దీంతోపాటు ప్రేమ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శాంతికి భంగం కలిగించారని పేర్కొంటూ కేఫ్ సిబ్బందిపై చలాన్ విధించారు.
బాధితులకు వ్యతిరేకంగా, దాడి చేసిన వారికి అనుకూలంగా వ్యవహరించిన పోలీసుల వ్యవహారానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో దుమారం చెలరేగగానే– బర్త్‌డే పార్టీని భగ్నం చేసి, పార్టీలో పాల్గొన్న వారిపై దాడికి దిగిన నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.
“కేఫ్ లోపల పార్టీలో పాల్గొన్న వారిపై దాడి చేసిన వారిని గుర్తించాము. వారి మీద ఎఫ్ఐఆర్ను నమోదు చేశాము. నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే విషయం గురించి సంబంధిత ఎస్హెచ్ఓ నుంచి సమాధానం కోరడమైంది. సంఘటన స్థలం నుంచి నిందితులు పారిపోయినట్టుగా ఆయన చెప్పారు. నిజమైన దోషులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది”అని ది వైర్‌కు బరేలీ పోలీసు సూపరింటెండెంట్ మనుష్ పారీక్ చెప్పారు.
కేఫ్ యజమాని శైలేంద్ర గాంగ్వార్ 2025 డిసెంబర్ 28న చేసిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహితలోని దాడి– భౌతిక దాడి, నేరపూరితమైన అతిక్రమణ సెక్షన్ల కింద రిషబ్ ఠాకూర్, దీపక్ పాఠక్‌తోపాటు మరో 20 మంది గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.
“నా జన్మదినోత్సవం సందర్భంగా స్నేహితులతో కలిసి నేను కేఫ్‌కు వెళ్లాను. అప్పటికే మూక లోపలికి ప్రవేశించింది. మేము పార్టీని మొదలు పెట్టిన వెంటనే అకస్మాత్తుగా నా స్నేహితులపై దాడి చేస్తూ, లవ్‌జిహాద్ అంటూ ఆరోపించారు”అని బడౌన్ జిల్లా నివాసి నర్సింగ్ విద్యార్థిని తెలియజేశారు.
బాధితురాలు ఇంకా మాట్లాడుతూ– “ఇద్దరు ముస్లిం స్నేహితులు తప్పా, అతిథులందరు హిందువులే. ముసుగులు వేసుకున్న దుండగులు విచక్షణారహితంగా దాడి చేయడంతో నా స్నేహితుల ఎముకలు విరిగాయి”అని ఆమె చెప్పుకొచ్చారు.
సంఘటన స్థలంలో బజరంగ్దళ్ సభ్యులు ఉన్నప్పటికీ, బర్త్‌డే పార్టీలో పాల్గొన్న వారిపై దాడి చేసిన బృందంలో తాము భాగం కామని బరేలీ బజరంగ్ దళ్ నగర గో రక్షక్ ప్రముఖ్ ఆశిష్ శర్మ తెలియజేశారు.
“హిందూ అమ్మాయి బర్త్‌డే పార్టీలో పది నుంచి పన్నెండు మంది ముస్లిం అబ్బాయిలు ఉన్నట్టుగా తమకు సమాచారం అందింది. బజరంగ్దళ్ కార్యకర్తలు కేఫ్ వద్దకు వెళ్లి పోలీసులను అప్రమతం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేఫ్‌కు వెళ్లి ఇద్దరు ముస్లిం అబ్బాయిలను నిర్బంధించారు”అని శర్మ తెలియజేశారు.
“హిందూ అమ్మాయిపై దాడి చేయలేదు. కానీ ముస్లిం అబ్బాయిలను మాత్రం రెండు మూడు సార్లు కొట్టడం జరిగింది. ఈ దాడిలో బజరంగ్ దళ్ సభ్యుల పాత్ర ఏమీలేదు”అని దాడిపై స్పందిస్తూ శర్మ పేర్కొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
