మిగిలినవారితో పోల్చినప్పుడు ఉమర్ ఖాలీద్, షర్జీల్ ఇమామ్‌లు పూర్తిగా భిన్నమైనవారని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఒకసారి రక్షిత సాక్షుల విచారణ పూర్తయి, ఏడాది గడిచిన తర్వాతనే వాళ్లు బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
న్యూఢిల్లీ: అయిదేళ్లకుపైగా జైలులో మగ్గుతున్న ఉమర్ ఖాలీద్, షర్జీల్ ఇమామ్‌లకు మరోసారి బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2020లో జరిగిన మత కలహాల వెనుక జరిగిన కుట్రకు వీరిద్దరికీ సంబంధం ఉందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.
ఇదే కేసులో నిందితులైన గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, షాదాబ్ అహ్మద్, మహమ్మద్ సలీం ఖాన్లకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బార్ అండ్ బెంచ్ వెబ్సైట్ వెలువరించిన కథనం ప్రకారం, “కొందరు పోషించిన కీలకమైన పాత్రకు, మరికొందరు పోషించిన సహాయక పాత్రకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకపోవడం వివక్షాపూరిత వైఖరి అవుతుంది” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
తక్షణమే రక్షిత సాక్షుల నుంచి సాక్ష్యాలను రికార్డు చేయాలని ట్రైయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను సుదీర్ఘకాలం పొడిగించరాదని కూడా సూచించింది.
కేసు పూర్వాపరాలలోకి వెళ్లక ముందు తమ ఆదేశాలు సవివరమైనవని జస్టీస్ అరవింద్ కుమార్, ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
“ఎవరెవరు ఏ ఏ స్థాయిలో పాల్గొన్నారో దానికి అనుగుణంగా ఈ మొత్తం వ్యవహారంలో వారి పాత్రను నిర్ధారించాల్సి ఉంది”అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు బార్ అండ్ బెంచ్ వెల్లడించింది.
మిగిలినవారికంటే ఉమర్ ఖాలీద్, షర్జీల్ ఇమామ్‌లు పూర్తిగా భిన్నమైన పాత్ర పోషించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
“ఉమర్ ఖాలీద్, షర్జీల్ ఇమామ్‌లకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ప్రాథమిక ఆధారాలను సమర్పించిందని ధర్మాసనం భావిస్తుంది. చట్టం నిర్ధారించిన(బెయిల్ తిరస్కరణకు) ప్రమాణాలకు లోబడే ఉన్నారు. విచారణ ఈ దశలో ఉన్న సమయంలో వీరికి బెయిల్ ఇవ్వడం సబబు కాదు”అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఒకసారి రక్షిత సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత కానీ; లేదా నేటి నుంచి ఏడాది గడిచిన తర్వాత కానీ వాళ్లు బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
ఉమర్ ఖాలీద్‌ను 2020 సెప్టెంబరులో అరెస్టు చేశారు. ఢిల్లీ అల్లర్లు జరిగేనాటికి షర్జీల్ జైలులోనే ఉన్నారు.
2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. అయితే, ఈ అలర్ల వెనుక మరింత లోతైన కుట్రకోణం ఉందని గత అయిదేళ్లుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పౌరసత్వం చట్ట సవరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల వెనుకున్న నిర్వాహకులు, విద్యార్థి నాయకులు, స్థానిక రాజకీయ నాయకులను కేంద్రంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుగుతుంది. పోలీసులు ఈ చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించింది.
ఎటువంటి విచారణ లేకుండా ఉమర్ ఖాలీద్‌ను జైలులో బంధించడం పట్ల అమెరికాలోని కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ, గతవారం వాషింగ్టన్‌లోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాకు ఓ లేఖ రాశారు.
ఆర్టికల్ 21
ఎక్స్‌లో పోస్టైన లైవ్ లా వెబ్సైట్ వ్యాఖ్యానం ప్రకారం, సుదీర్ఘకాలం ఖైదీగా ఉంచడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి విరుద్ధమని జస్టిస్ కుమార్ అన్నారు. సత్వర న్యాయం, విచారణ ఆర్టికల్ 21లో భాగమేనని కూడా గుర్తుచేశారు. విచారణలో ఆలస్యం జరిగితే లోతైనా పరిశీలన కూడా జరుగుతుందన్నారు. తీవ్రత, చట్టం స్వభావం, ఆరోపిత పాత్రలు, ప్రాథమిక సాక్ష్యాల తీవ్రత, విస్తృతిలపై ఆధారపడి ఎవరినీ ఎంతకాలం జైలులో ఉంచవచ్చో నిర్ధారితమవుతుందని జస్టిస్ కుమార్ అన్నారు.
చట్ట విరుద్ధ కార్యకలాపాల నియంత్రణా చట్టం(ఉపా) గురించి కూడా జస్టిస్ కుమార్ మాట్లాడారు. హింసకు మందు జరిగిన కార్యకలాపాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈ చట్టం ఆదేశిస్తుంది. ఈ చట్టంలో సాంప్రదాయంగా పాటించే బెయిల్ నిబంధనలకు భిన్నమైన నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే సెక్షన్ 45డీ(5)లో పొందుపరచారని ఆయన గుర్తు చేశారు. అయితే, ఈ సెక్షన్ అమలు న్యాయవ్యవస్థ సమీక్షకు అతీతం కాదని ఆయన గుర్తు చేశారు.
ఒక కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయా లేదా అన్నది కోర్టులు జాగ్రత్తగా పరిశీలించాలని; ఘటనలకు వ్యక్తులకు నిజమైన సంబంధం ఉందా లేదా, నిందితులు చట్టం పరిధిలోకి వస్తారా రారా అన్నది కూడా లోతుగా పరిశీలించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
రాజ్యాంగంలో ఆర్టికల్ 21 విశిష్టమైన స్థానముందని, విచారణలో భాగంగా గడిపే జైలు జీవితాన్ని శిక్షగా పరిగణించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించినట్టు బార్ అండ్ బెంచ్ కథనం ప్రస్థావించింది.
విచక్షణారహితంగా స్వేచ్ఛను హరించరాదని వ్యాఖ్యానిస్తూ, “ఉపా ఓ ప్రత్యేకమైన చట్టం. కేసు విచారణలో ఉన్నప్పుడు ఎప్పుడు బెయిల్ ఇవ్వాలి, ఎప్పటి వరకు ఇవ్వకూడదనే విషయాలను పార్లమెంట్ సుదీర్ఘంగా చర్చించి వ్యాఖ్యానించింది”అని ధర్మాసనం తెలియజేసింది.
బెయిల్ కోసం వచ్చిన ప్రతి అపీల్‌ను దేనికదే స్వతంత్ర అపీలుగా పరిగణించాలని, అన్ని అపీళ్లను ఒక గాటిన కట్టలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
