2025 సెప్టెంబర్ 4న నేనూ- నా భార్య లక్ష్మీ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అట్లాంటా కమ్మింగ్ సిటీ చేరుకున్నాము. మా అమ్మాయి ప్రత్యూష- అల్లుడు రాహుల్(సాఫ్ట్వేర్ ఉద్యోగి) ఇంటికి వెళ్లాము. విక్కి క్రిక్ ఎలిమెంటరీ స్కూళ్లో(ఫోర్సిత్ కౌంటీ) మనుమరాలు ఆద్య 4వ గ్రేడ్ చదువుతుంది. తన పాఠశాలను సందర్శించాము. నవంబర్ 10న భారతదేశానికి తిరుగు ప్రయాణమైయ్యాము.
అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా విద్యా విధానం గురించి ఆ నోట ఈ నోట విన్నాను, తెలుసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వచ్చి- టీచరు అర్హతలతో పాటు, అమెరికాలో టీచరు అర్హతకు అవసరమైన సర్టిఫికెట్స్ కోర్సు చదివి టీచరు ఉద్యోగానికి ఎంపిక కాబడిన టీచర్ నుంచి ఈ సమాచారం సేకరించాను.
తన ఒరిజినల్ సర్టిఫికెట్స్‌ను అమెరికన్ పాఠశాలలో సమర్పించగా; అమెరికన్ యంత్రాంగం ద్వారా ఆ పాఠశాల మేనేజిమెంట్ ఇండియాలో భౌతికంగా పరిశీలించింది. అమెరికాలో సమానమైన అర్హతలు సంపాదించిన తర్వాతనే ఉద్యోగంలో చేరినట్టుగా ఆమె చెప్పారు.
ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు విద్యా వ్యవస్థకు సంబంధించి తేడాలు ఉండకపోవచ్చు. అయితే ఒక ఏరియా పాఠశాల నుంచి, ఒకరి నుంచి సేకరించిన సమాచారమే సంపూర్ణం కాకపోవచ్చు. మొత్తం అమెరికాలో అన్ని ప్రాంతాలలో, అన్ని పాఠశాలలు ఎలా ఉన్నాయో తెలుసుకోవలసిన విషయాలు ఉండవచ్చు. ఇదే సంపూర్ణం, సమగ్రమని చెప్పడం లేదు. అయితే ఈ సమాచారం ఒక అవగాహనను కల్పిస్తుంది.
పాఠశాల నిర్మాణం..
ప్రాథమిక పాఠశాలల్లో కిండర్ గార్డెన్(ఎల్కేజీంయూకేజీ), 1 నుంచి 5 గ్రేడ్(తరగతులు) ఉంటాయి. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో 6, 7, 8 గ్రేడ్లు కూడా కలసి ఉన్నాయి. మిడిల్ స్కూళ్లో 6, 7, 8 గ్రేడ్లు ఉంటాయి. హయ్యర్ సెకండరీలో 9, 10, 11, 12 గ్రేడ్లు ఉంటాయి. ఇవన్నీ పబ్లిక్ స్కూళ్లు(నైబర్ హుడ్). 4,5 నైబర్ హుడ్లను కలిపి ఒక జోన్‌గా మార్చుతారు.
ఎలిమెంటరీ, మిడిల్ పబ్లిక్ స్కూళ్లలో అడ్మిషన్లు తిరస్కరించరాదు. వేరే జోన్ పాఠశాలకు వెళ్ళి చదవడానికి వీలులేదు. ఏ కౌంటీలో ఉన్నవారు ఆ కౌంటీలో ఉన్న పాఠశాలకు మాత్రమే వెళ్ళి చదువుకోవాలి. ఉచిత విద్య, రవాణా సౌకర్యం ఉంటుంది. హయ్యరు సెకండరీ స్కూళ్లకి సంబంధించి అదే జోన్‌తోపాటు వేరే జోన్లో ఏ పాఠశాలకైనా వెళ్ళవచ్చు. వేరే జోన్లో పాఠశాలలో చేరితే ఉచిత బస్ సౌకర్యం ఉండదు. తల్లిదండ్రులే పాఠశాలకు తీసుకెళ్ళాలి. భయం, అనారోగ్యం, సమూహంలో కలువలేనితనం ఉన్న విద్యార్థులకు ఆన్లైన్లో పాఠశాల సమయంలోనే హెూం స్కూలింగ్ సదుపాయం ఉన్నది. ఈ సదుపాయం ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్ విద్యార్థులకు కూడా ఉంది.
చార్టెర్- ప్రైవేట్ స్కూళ్లు ..
ఇవి కూడా పబ్లిక్ స్కూళ్లే. అయితే అందరికీ ఫ్రీ ఎంట్రీ ఉండదు. అప్లె చేసిన వారందరినీ ఖచ్చితంగా చేర్చుకోవాలనే రూలు లేదు. లాటరీలో అడ్మిషన్స్ తీసుకుంటారు. స్టాండర్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలను అక్కరలేదని చెప్పి స్కూలు నుంచి పంపించివేయవచ్చు. ఎలిమెంటరీ, మిడిల్ స్కూళ్లో కూడా అక్కడక్కడా ఈ చార్టెర్ స్కూల్స్ ఉన్నాయి.
అధికాదాయ కుటుంబాల పిల్లలు, నైబర్ హుడ్ కామన్ స్కూల్స్‌లో చదవడం ఇష్టం లేనివాళ్లు, లోయర్ క్లాసు పిల్లలతో కలిపి చదివించడం ఇష్టంలేనివాళ్లు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతారు. ప్రైవేటు స్కూళ్లు కూడా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. క్రైస్తవ మేనేజిమెంట్‌తో నడిచే ప్రైవేటు పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ పాఠశాలలలో మాత్రమే మతాధార బోధన ఉంటుంది.
ఉచిత విద్య- మధ్యాహ్న భోజన పథకం..
కిండర్ గార్డెన్, ఎలిమెంటరీ, హైస్కూల్ (12వ తరగతి) వరకు ఏ విధమైన ఫీజులు ఉండవు. పిల్లలకు ఉచిత రవాణా సదుపాయం ఉంటుంది. కౌంటీ(జిల్లా) నుంచి పాఠశాలలకు నిధులు కేటాయిస్తారు. అయితే కౌంటీకి తల్లిదండ్రులు పన్నులు కడతారు. స్కూలు పన్నులు, కౌంటీ పన్నులు పేరుతో చెల్లిస్తారు. తల్లిదండ్రులు తమ ఇంటి వాల్యూని బట్టి కౌంటీకి ఆ పన్నులు ఉంటాయి. ఉదాహరణకు మా అల్లుడు సంవత్సరానికి 7,735 డాలర్లు(రూ. 6,86,800/- పన్నులు చెల్లిస్తున్నారు.
ఆదాయ పన్ను, ఇతర పన్నులు కేంద్ర(ఫెడరల్), రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తారు. రోడ్లు, కరెంట్, వాటర్, గ్యాసు ఇతర పన్నులు చార్జీలు ఉంటాయి. అందువల్ల స్కూలు, కౌంటీ పన్ను పేరుతో వసూలు చేసే సొమ్ముల నుంచే ఉచిత విద్య అందుతుంది.
అందరి పిల్లలకు మధ్యాహ్న భోజనం ఉండదు. ఎవరి లంచ్ బాక్సు వారే తీసుకెళ్తారు. అయితే ఆదాయాన్ని బట్టి తక్కువ ఆదాయం గల కుటుంబాల పిల్లలకు మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఈ పిల్లలు స్కూలుకు వెళ్ళకపోయినా మధ్యాహ్న భోజనం వెళ్లి తినొచ్చు.
పిల్లలు – పుస్తకాలు – వారి హాలు..
పిల్లలు బడికి వారి లంచ్ బాక్స్, అల్పాహారంతో కూడిన బ్యాగ్ మాత్రమే తీసుకెళ్తారు. పుస్తకాలు తీసుకెళ్ళడం,
తీసుకురావడం ఉండదు. బడిలోనే వారికి కేటాయించిన అరలలో వారి పుస్తకాలు పెట్టి తీసుకుంటారు. ఏ విధమైన హెూంవర్క్ ఇవ్వరు. ఇవ్వకూడదనేది వారి కౌంటీ నిబంధన. స్కూలులో చేయించిన వర్కు పూర్తికాకపోతే ఇంటి వద్ద చేసుకుని వెళ్తారు. పిల్లలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గైడెన్సుగా ఉంటారు.
చట్టమంతా పిల్లలవైపే ఉంటుంది. ఉపాధ్యాయుడు వాయిస్ పెంచి మాట్లాడకోడదు. చిరాకు, కోపం, ద్వేషభావాన్ని చూపకూడదు. దూషించకూడదు. ఉదాహరణకు పిల్లలు అల్లరి చేస్తూంటే ‘కీప్
క్వయిట్’ అని సౌమ్యంగా చెప్పాలి తప్ప గట్టిగా చెప్పొద్దు. పిల్లలు ఎంత అల్లరి చేసినా, వినకపోయినా ఏమీ చేయకూడదు. తల్లిదండ్రులకు తెలియజేయడం, రికార్డులలో నమోదు చేయడం తప్ప ఉపాధ్యాయునికి దండించే అధికారం లేదు.
వాటర్ బాటిల్స్‌లో వైన్‌ను తీసుకువచ్చినా; గుట్కా, డ్రగ్స్, గన్ వంటివి తీసుకువచ్చినట్టుగా యాజమాన్యానికి తెలిస్తే పాఠశాల నుంచి తీసివేస్తారు. ఇతర పిల్లలను భౌతికంగా కొట్టినా బడి నుంచి పంపించేస్తారు. ప్రవర్తన సరిగాలేకపోతే ఆ విద్యార్థి వ్యక్తిగత హిస్టరీలోకి వెళ్లిపోతుంది. ప్రవర్తనకు సంబంధించి ప్రతి స్కూల్లో కౌన్సిలింగ్ టీమ్ ఉంటుంది. ఇంటి వద్ద తల్లిదండ్రులకు కూడా ఇదే వర్తిస్తుంది.
ప్రతి విషయానికి తల్లిదండ్రులు లీగల్‌గా వెళ్తుంటారు. దీన్ని ఉపాధ్యాయులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పేరెంట్- టీచరు సమావేశంలో తల్లిదండ్రులు అడిగే వాటికి ఓరల్‌గా చెబితే కుదరదు. ప్రతి పిల్లవాడికి సంబంధించి చదవడం లేదని కానీ, ఇతర ప్రవర్తనకు సంబంధించి కానీ రికార్డు డాక్యుమెంట్ తయారుచేసి చూపించాల్సి ఉంటుంది. విద్యార్థులకు వ్రాత నైపుణ్యం దాదాపుగా నామమాత్రమేనని చెప్పాల్సి ఉంది. మొత్తం అంతా ట్యాబ్ మీద వేళ్ళతో చేసే పనే.
తల్లిదండ్రుల క్రమశిక్షణా చర్యలు కూడా తమపిల్లలపై సున్నితంగానూ, ప్రేమగానూ ఉండాలి. ద్వేషభావంతో కఠినంగా ఉండరాదు. భౌతికంగా గాయపరిస్తే విద్యార్థి తన తల్లిదండ్రులపై స్కూళ్లో ఫిర్యాదు చేస్తే ఆ స్కూల్లో ఉండే కౌన్సిలర్ ద్వారా వెంటనే పోలీసులు ఇంటికి వెళ్తారు. తల్లిదండ్రుల నుంచి విద్యార్ధులకు భద్రత లేకపోతే ఆ పిల్లలను శరణాలయానికి తరలిస్తారు. అక్కడే ఉండి పిల్లలు చదువుకుంటారు. ఈ శరణాలయాల ఖర్చులు కౌంటీనే భరిస్తుంది.
పాఠ్య పుస్తకాలు..
పాఠ్యపుస్తకాలు, సిలబస్ ప్రభుత్వం ముద్రించినవే ఉంటాయి. అయితే చదువుకోవడం పాఠ్య పుస్తకానికే పరిమితమై
ఉండదు. పాఠ్య పుస్తకమనే బౌండరీ లేదు. టాపిక్ మాత్రమే. ఆ టాపిక్‌లో ఎక్కడ నుంచయినా ప్రశ్నలు అడగవచ్చు. ఈ ప్రశ్నలు పుస్తకానికి సిలబస్‌కు లోబడి ఉండవు. కాబట్టి టాపిక్కు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థి సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ టాపిక్కు సంబంధించి ఆన్లైన్ సమాచారం, గ్రంథాలయాలు, వెబ్‌సైట్స్ నుంచి పిల్లలు సేకరించుకోవాలి. దీనికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మార్గదర్శకత్వం వహించాలి. అందుకే అక్కడ తరచుగా పుస్తకాలు, సిలబస్‌లు మార్పుచేసి తరచుగా పుస్తకాలు ముంద్రించడం ఉండదు. మార్కులకోసం బట్టీ చదువులు, గైడ్స్, టెస్ట్ పేపర్లు, ప్రశ్నలు- సమాధానాల పుస్తకాలు ఉండవు. సబ్జెక్టు టాపిక్ మీద సంపూర్ణ అవగాహన ఉంటేనే పిల్లలు పరీక్షలు వ్రాయగలరు.
భాషలు – సబ్జెక్టు – బోధన..
7వ గ్రేడ్ వరకు మాతృభాష(ఇంగ్లీషు)లోనే బోధన ఉంటుంది. 8వ గ్రేడ్ నుంచి రెండవ భాష స్పానిష్ లేదా ఫ్రెంచ్ ఉంటుంది. ఎక్కువమంది రెండవ భాషగా స్పానిష్ చదువుతారు. ఇంగ్లీషు, గణితం, సైన్స్, సోషల్ ఉంటాయి.
గణితం, సైన్సులో చాలా విభాగాలు ఉంటాయి. హైస్కూల్ స్థాయిలో విద్యార్ధి భవిష్యత్‌లో ఏం చదవాలనుకుంటారో దానిని బట్టి సబ్జెక్టును ఎంపిక చేసుకుంటారు. విద్యార్ధుల అభిరుచిని బట్టి ఎంకరేజ్ చేస్తారు.
ఉదాహరణకు ఇంజనీరింగ్, మెడిసిన్, లా, కుక్కింగ్లో ఏది చదవాలనుకుంటే దాన్నిబట్టి ఆ కోర్సులు ఉండే హైస్కూళ్లకు వెళతారు. అయితే వేరే జోన్లలో హైస్కూల్‌కు వెళితే ఉచిత బస్ సౌకర్యం ఉండదు. సైన్సు, సోషల్ సబ్జెక్టులు రోజు విడిచి రోజు ఉంటాయి. పబ్లిక్ బడిలో దేవుని ప్రస్తావన ఉండదు. నమ్మకాలను బట్టి బోధన ఉండదు. సైంటిఫిక్గానే సిలబస్ ఉంటుంది. బైబిల్ ప్రస్తావన చేయరు.
బోధనా సమయం 55 నిమిషాలు ఉంటుంది. పిల్లలందరు ఒకే క్లాసులో రోజంతా ఉండరు. స్కూల్‌కు వెళ్ళిన వెంటనే హెూంరూమ్కు వెళ్తారు. అసెంబ్లీ ఉండదు. హెూంరూమ్లోనే ప్రతిజ్ఞ చేస్తారు. ప్రకటనలేమైనా ఉన్నట్లయితే అప్పుడే ప్రిన్సిపల్ తెలియజేస్తారు.
హెూంరూమ్లో హాజరు తీసుకున్న తర్వాత విద్యార్థులు వారి సబ్జెక్టు టీచరు క్లాసులకు వెళ్తారు. టీచర్లు తమ క్లాసులోనే ఉంటారు. పిల్లలు, టీచర్లకు షెడ్యూల్ ఉంటుంది. దాన్నిబట్టి పిల్లలు కదులుతుంటారు.
ఒక స్కూల్లో 6, 7, 8 గ్రేడ్ చదివే వారు 1500మంది విద్యార్థులు ఉంటే; ఒక సబ్జెక్టుకు వేరువేరు టీచర్ల దగ్గరకు వెళతారు. టీచరుకు క్లాసులో 27మంది పిల్లలకు మించి ఉండరు.
తక్కువ స్థాయి, మధ్య స్థాయి, మెరుగైన స్థాయిలు ఉంటాయి. ఇందులో విద్యార్థుల స్థాయిని బట్టి బోధన విధానం, పరీక్షల విధానం ఉంటుంది. రోజుకు ఐదు పీరియడ్లు క్లాసు తీసుకుంటే, 3 పీరియడ్లు ఉపాధ్యాయులు బోధనకు సంబంధించిన ప్లానింగ్, పేపర్లు తయారు చేయడం, గ్రేడ్లు ఇవ్వడం వంటి పనులు స్కూలు సమయంలోనూ, అనంతరం ఇంటివద్ద ఉపాధ్యాయులకు పని ఉంటుంది.
లెసన్ ప్లాన్- పర్యవేక్షణాధికారులు..
ఉపాధ్యాయుడు ప్రతి వారానికి వారి సబ్జెక్టుకు సంబంధించిన లెసన్ ప్లాన్స్, సబ్మిట్ చేసే పేపర్లు సోమవారం నాడే ప్రిన్సిపాల్‌కు/ వైస్ ప్రిన్సిపాల్‌కు అందజేయాలి. వేరువేరు స్థాయిల పిల్లలకు ఏమి చెబుతామో, ఏమి చేయిస్తామో తెలియజేయాల్సి ఉంటుంది. టీచరు సెలవు పెడితే ఆ స్థానంలో వచ్చే సబ్సిట్యూట్ టీచరుకు పిల్లలకు ఏమి చెబుతున్నారో, ఏమి చేయిస్తున్నారో అర్ధం కావడం కోసం ఈ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
స్కూల్లో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ క్లాసులు పరిశీలిస్తారు. ఉపాధ్యాయుల బోధన, పిల్లలతో వ్యవహరించే తీరు సలహాలు, వార్నింగ్‌లు ఇస్తుంటారు. టీచర్ల క్లాసులను ప్రతి క్వార్టర్‌కు పర్యవేక్షణాధికారుల బృందం ముందుగా తెలియజేసిగాని, కొన్నిసార్లు అకస్మికంగా గానీ తనిఖీ చేస్తారు. క్లాసులో ప్రవేశించగానే ఉపాధ్యాయుల బోధన, పిల్లలతో వ్యవహరించే తీరు పరిశీలిస్తారు. పిల్లలను ప్రశ్నలు అడుగుతారు.
ఉపాధ్యాయుల శిక్షణ- బోధన..
ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం, నిరంతరం ఆన్లైన్లోను, భౌతికంగాను శిక్షణ ఇస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోను, ఆ తర్వాత సెలవు దినాలలో మాత్రమే ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తారు.
పీరియడ్‌ను నాలుగు భాగాలు చేసుకోవాలి. పీరియడ్ 55 నిమిషాలయితే మొదటి 10 నిమిషాలు రివిజన్, రివ్యూ చేయాలి. ఆ రోజు టాపిక్కు సంబంధించి టీచరు పిల్లలకు పేపరు సబ్మిట్ చేయాలి. 15-20 నిమిషాలు మించి ఉపన్యసించకూడదు. 15 నిమిషాలు విద్యార్ధులచే ప్రాక్టికల్ వర్కు చేయిస్తారు. చివరగా రెండు, మూడు ప్రశ్నలు చేయిస్తారు. ప్రతి రోజు చేసే వాటికి గ్రేడ్లు ఉంటాయి.
టీచరుకు క్లాసుకు 25మంది పిల్లలు ఉంటే, రోజుకు 5 క్లాసులు అయితే, 125 మంది పిల్లలకు ప్రతిరోజూ పేపరు సబ్మిట్ చేసి బోధించడం, పరీక్ష పెట్టడం ఆ రోజు గ్రేడ్లు ఇవ్వడం చేయాలి. వారి స్థాయిని బట్టి బోధించడం, పేపరు ఇవ్వడం, గ్రేడ్లు ఇవ్వడం చేయాలి. అందరి పిల్లల పరిస్థితులు అంటే ఇల్లు, వనరులు, సదుపాయాలు, తెలివి తేటలు ఒకేలా ఉండవు కాబట్టి ఎవరి స్థాయిని బట్టి వారికి బోధన, పరీక్షలు పెట్టి గ్రేడ్లు, రికార్డులు తయారు చేయాలి. అంటే 25మంది పిల్లలకూ ఒకే పరీక్ష పెట్టి గ్రేడ్లు ఇవ్వడం ఉండదు. వారు ఏ లెవల్లో ఉన్నారో ఆ లెవల్లో పరీక్షలు, గ్రేడ్లు ఇస్తారు. పిల్లలు వాళ్ళంత వారు నేర్చుకోవడానికి తయారు కావడం, అలవాటు పడటం ఉంటుంది. టాపిక్కు సంబంధించి టీచరు, టీచరు సబ్మిట్ చేసే పేపర్లు, బోధన ఆన్లైన్ సమాచారం, గ్రంధాలయాలు, వెబ్సైట్లో విస్తారంగా ఉండే సమాచారాన్ని విద్యార్థులు అప్డేట్ చేసుకోవలసి ఉటుంది.
మూల్యాంకనం..
విద్యార్ధికి ప్రతిరోజు పెట్టే టెస్ట్‌లకు గ్రేడ్లు ఇస్తారు. సంవత్సరం చివర పెట్టే పరీక్షలలో వచ్చి మార్కులను బట్టి గ్రేడ్లు ఉండవు. మనకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వచ్చే మార్కులే గ్రేడ్‌గా ఇస్తాము. అమెరికా విద్యా విధానంలో సంవత్సరం పొడవునా ప్రతి పరీక్షలో, మైలోన్ పరీక్షలలో వచ్చే మార్కులను సరాసరి చేసి విద్యార్థికి మైల్ స్టోన్ లెవల్లో గ్రేడ్ ఇస్తారు. 70% పాస్ మార్కులు.
సంవత్సరం చివర పెట్టే మైల్బోన్(పబ్లిక్) పరీక్షలలో వచ్చే మార్కులు బట్టి గ్రేడ్ ఉండదు. సంవత్సరం పొడవునా పెట్టే టెస్టులు, మైల్ స్టోన్ పరీక్షల మార్కుల ఆధారంగా పిల్లలకు గ్రేడ్లు ఇస్తారు. అయితే మైల్ స్టోన్ పరీక్షలలో వచ్చే ఫలితాలను బట్టి స్కూలుకు ర్యాంకులు ఇస్తారు. విద్యార్థులకు కాదు. పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ ఉండదు. పరీక్షలు వ్రాయడంలోగాని వాల్యూయేషన్‌లో గాని విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి గానీ ఈ ప్రాక్టీస్ ఉండదు. (మనకు పాలకుల దగ్గర నుంచి అన్ని స్థాయిలలోనూ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాంకులకోసం, మార్కుల కోసం, శాతాల కోసం ఎన్ని వ్యవహారాలు నడుస్తున్నాయో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే).
డిటెన్షన్ పద్ధతి- నాన్ టీచింగ్ సిబ్బంది ప్యాట్రన్..
పిల్లలకు తరగతికి తగిన ప్రమాణాలు లేకపోతే ఉపాధ్యాయుని సూచనపై అదే తరగతిలో ఉంచుతారు. విద్యార్ధి ప్రగతి మరీ బాగుంటే మధ్యలో తరగతిని స్కిప్ చేసి ఆ పై తరగతులకు పంపించే పద్ధతి కూడా ఉంది.
ప్రతి పాఠశాలకు నాన్ టీచింగ్ సిబ్బంది ఉంది. అడ్మిషన్స్, నిధులు, ఇతర సమాచారం, సర్టిఫికెట్స్ అప్లోడ్ అయినవా లేవా చూడడానికి- చేయడానికి, ఇతరపనులను సిబ్బంది చూసుకుంటుంది. ప్రతి పాఠశాలకు శానిటరీ సిబ్బంది ఉంటుంది. పిల్లలు ఏమైనా వాంతులు, ఇతరత్రా ఏమి జరిగినా వెంటనే క్లీన్ చేస్తారు. ప్రతి 2 గంటలకు రెస్ట్ రూమ్స్ క్లీన్ చేస్తారు. వీటిని చాలా శుభ్రంగా ఉంచుతారు . పిల్లల సమస్యలకు సంబంధించి కౌన్సిలింగ్ టీం ఉంటుంది. పగలు పనివేళల్లో ఒక పోలీసు ఉంటారు. పాఠశాలకు ప్రహారీగోడ రక్షణలు ఏమీ ఉండవు . సీసీ కెమెరాలు ఉంటాయి. నైట్ వాచ్మెన్లు ఉండరు. ఇతరులు ప్రవేశించి దొంగతనాలు ఏమైనా జరిగితే అలార్మింగ్ సిస్టమ్ ఉంటుంది. వెంటనే పోలీసులు వస్తారు. అలాంటి పరిస్థితి దాదాపుగా రాదు. స్కూల్‌ను మోస్ట్ సెక్యూరిటి ప్లేస్‌గా పరిగణిస్తారు.
ఉపాధ్యాయులు- పని దినాలు సెలవులు..
సంవత్సరానికి 160- 170 పని దినాలు ఉంటాయి. వారానికి ఐదు రోజుల పని దినాలు, సెప్టెంబరులో 5 రోజులు
పాల్ బ్రేక్ సెలవులు, నవంబరులో 5 రోజులు థ్యాంక్స్ గివింగ్ సెలవులు, 5 రోజులు స్ప్రింగ్ హాలిడేస్, డిసెంబర్ 20 నుంచి జనవరి 5 వరకు క్రిస్మస్- న్యూఇయర్ సెలవులు, మార్చి- ఏప్రిల్ రెండు నెలలు వేసవి సెలువులు ఉంటాయి.
సంవత్సరానికి 8 రోజులు ఉపాధ్యాయులకు సెలవులు ఉంటాయి. 8 సెలవులు మించితే జీతం కట్ చేస్తారు. పాఠశాల టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి.
ఉదయం 7 గంటలకు పాఠశాల అయితే 2 నిమిషాలు లేట్ అయినా లేట్‌గా పరిగణిస్తారు. 4 లేట్స్కు ఒక సెలవు కట్ అవుతుంది. ఇదే కొనసాగితే వార్నింగ్, ఆ తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తారు. ప్రసూతి సెలవు 8 వారాలు ఉంటుంది. ఆనారోగ్యం, ఇతర వ్యక్తిగత కారణాలపై సంవత్సరానికి 8 రోజులు మాత్రమే జీతంతో కూడిన సెలవులు ఉంటాయి. ఆపై జీతం నష్టం సెలవు పెట్టుకోవాలి. సాధారణంగా సెలవులు తిరస్కరించరు. అయితే ముందుగా తెలియజేయాలి.
సెప్టెంబరు/ అక్టోబరు నెలలో అట్లాంటాలో ఉదయం 7 గంటలకు గాని వెలుతురు రాలేదు. ప్రైమరీ తరగతుల పిల్లలను 5 గంటలకు లేపి తయారు చేసి బస్ పాయింట్‌కు పంపించాలి. పిల్లలు అయినా ఉపాధ్యాయులు అయినా ఎలిమెంటరీ పాఠశాలను ఉదయం 7 గంటలకు, మిడిల్- హైస్కూల్స్‌ను ఉదయం 9 గంటలకు చేరుకోవాలి. ఉపాధ్యాయుడు ట్రాఫిక్‌లో ఆలస్యమయినా ‘లేట్’ గానే పరిగణిస్తారు. లేట్ అవుతుందంటే ఉపాధ్యాయుడు రాలేనని రిపోర్టు చేయాలి.
ఉపాధ్యాయులకు సెలవు దినాలలోనే ఆన్లైన్లో, భౌతికంగా శిక్షణా తరగతులు ఉంటాయి. పిల్లల అకడమిక్ విషయాలకు సంబంధించిన అనేక రికార్డులు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పని దినాలలో ఏ విధమైన శిక్షణ తరగతులు నిర్వహించరు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఏమీ ఉండవు.
బదిలీలు- పదవీ విరమణ..
ఉపాధ్యాయులకు బదిలీలు ఉండవు. ఓపిక ఉన్నంతవరకు ఎంత కాలమయినా ఓకే చోట పనిచేయవచ్చును. బదిలీ
కావాలనుకుని, వేరోచోటకు వెళ్ళాలనుకుంటే అక్కడ రాజీనామా చేసి, చేరాలనుకొన్న చోట కొత్తగా రిక్రూట్ కావాలి. మళ్ళీ తన అర్హతలు బట్టి ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. ఆ కౌంటీలో ఏ టీచరు అయినా కదులుతుంటే వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి నియామకం చేస్తారు. వేరే కౌంటీ నుంచి కదిలేవారికి తదుపరి ప్రాధాన్యతనిచ్చి నియామకం చేసుకుంటారు.
వయస్సు ఆధారంగా పదవీ విరమణ ఉండదు. ఇష్టమున్నంత వరకు ఓపికున్నంతవరకు పనిచేయవచ్చును. పదవీ
విరమణ తర్వాత పెన్షన్ నామ మాత్రంగా ఉంటుంది. ఉపాధ్యాయులుగా పనిచేస్తూ మిగిలిన సమయంలో ఇతర ఉద్యోగాలు చేసుకోవచ్చును. 80 సంవత్సరాలు దగ్గరగా ఉన్నవారు కూడా టీచింగ్‌లో పనిచేస్తున్నారు. వద్దనుకుంటనే పదవీ విరమణ.
ఉపాధ్యాయుల నియామకం- ఉపాధ్యాయుల జీతాలు..
నియామకాలకు ప్రత్యేకంగా డీఎస్సీలు ఉండవు. కంటెంట్ పరీక్షలు ఉండవు. ఖాళీలను బట్టి ఏ గ్రేడ్ ఉపాధ్యాయులు ఎంతమంది కావాలో వాళ్ళ అర్హతలను బట్టి సెలక్టు చేసుకుంటారు. అంగీకరించిన ఉపాధ్యాయులకు ఇంటర్యూలు నిర్వహిస్తారు. ఇంటర్యూతో పాటు డెమో క్లాసు చెప్పాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే టీచరు పోస్టులు ఖాళీ లేకుండా చూసుకుంటారు. నిరంతర ప్రక్రియగా ఈ నియామకాలు ఉంటాయి. ఆ సబ్జెక్టు, గ్రేడ్ ఉపాధ్యాయులు కొద్దిరోజులు సెలవులు పెట్టినా, దీర్ఘకాలిక సెలవులు పెట్టినా, ఆ రోజు సెలవు పెట్టినా ప్రత్యామ్నాయ టీచర్ల వ్యవస్థ ఏర్పాటు ఉంటుంది. ప్రతి స్కూల్‌కు ఈ ప్రత్నామ్నాయ టీచరు వ్యవస్థ ఉంటుంది. ఉపాధ్యాయులు అకస్మికంగా సెలవు పెడితే ఆ స్థానంలో బోధన చేసేదానికి ‘ఆన్ కాల్ టీచర్స్’ వ్యవస్థ ఏర్పాటు ఉంది
ఎలిమెంటరీ, మిడిల్ క్లాసులు, హయ్యరు సెకండరీ ఏ పాఠశాలలో బోధించినా వారి విద్యార్హతలు బట్టి జీతాలు ఉంటాయి. డిప్లమో, బ్యాచులర్ డిగ్రీ, పీహెచ్డ్, ఐటీ విద్యార్హతలను బట్టి వేతనాలు ఉంటాయి.
మొత్తం జీతం చూస్తే ఐటీ అర్హతలు ఉన్నవారికి సంవత్సరానికి 1,25,000 డాలర్లు, పీహెచ్డీ వారికి 75,000 డాలర్లు, ఇతర అర్హతలు ఉన్న వారికి 65,000 డాలర్లు ఉండవచ్చు. అయితే వీరిమద్య తేడా 65- 68-72-75-125 వేల డాలర్లుగా ఉంటుంది. తేడా మరీ ఎక్కువగా ఉండదు. ప్రైవేటు స్కూళ్ళలో పనిచేసేవారికి ఇంచుమించు ఇవే జీతాలు ఉంటాయి. ఈ జీతాలపై ఇన్-కం-టాక్స్ ఉంటుంది. జీతాలు ఏ నెలకు ఆ నెల గాని, 15 రోజులకు ఒకసారిగాని చెల్లిస్తారు.
ప్రమోషన్లు..
సర్వీసులో చేరిన తర్వాత ప్రమోషన్లు ఉండవు. విద్యార్హత పెంచుకుంటూ గ్రేడ్లు మార్చుకొంటే అదే ప్రమోషన్. జీతం
పెరుగుతుంది. స్కేలు మారినప్పుడు ఇంక్రిమెంట్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం 2% ఇంక్రిమెంటు పెరుగుదల ఉంటుంది. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వంటి ప్రమోషన్లు డిపార్టుమెంట్స్ మారడం ద్వారా వచ్చేవే తప్ప సీనియారిటీ ద్వారా రావు.
(వ్యాస రచయిత ఏపీయూటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
