డిసెంబర్ 19న విడుదలైన “అవతార్ 3: ఫైర్ అండ్ యాష్” చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను పొందుతుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూడవ భాగం, మొదటి రెండు భాగాలలాగానే అద్భుతమైన టెక్నాలజీ- విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ చిత్రం లోతైన సామాజిక అంశాలను కూడా కలిగి ఉంది. ముఖ్యంగా సామ్రాజ్యవాదం, వలసవాదం వంటి థీమ్‌లను పండోరా గ్రహ నేపథ్యంలో చూపించడమనేది భూమి మీద జరిగిన చారిత్రక దోపిడీలను ప్రతిబింబిస్తుంది.
అవతార్ సిరీస్‌లో మొదటి రెండు భాగాలు ఎలా దోపిడీని ఇతర ప్రాంతాలకు పెట్టుబడిదారీ విధానం విస్తరిస్తుందో చూపించాయి. ఖనిజాల కోసం పండోరా గ్రహాన్ని మనుషులు ఆక్రమించడం, అక్కడి స్థానికులను బలవంతంగా ఖాళీ చేయించడం వంటివి వలసవాద చరిత్రను గుర్తుచేస్తాయి. అలాగే, ఆక్రమణదారులు మొదట శాంతియుతంగా ప్రయత్నించి; కుదరకపోతే బలప్రయోగం చేయడం ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాలలో యూరోపియన్ వలసవాదులు చేసినట్టుగా ఉంటుంది.
పోరాటమే దోపిడీని అంతం చేస్తుందని, సామ్రాజ్యవాదులు లాభాల కోసం ఎంతకైనా తెగిస్తారని చిత్రం తెలియజేస్తుంది.
“అవతార్ 3: ఫైర్ అండ్ యాష్”లో ఈ అంశాలను మరింత లోతుగా విస్తరిస్తాయి.
అవతార్ 2 ఘటనల తర్వాత చిత్రం ప్రారంభమవుతుంది. జేక్ సల్లి, నెయ్తిరి కుటుంబం తమ కుమారుడు నెటేయం మరణం తర్వాత దుఃఖంలో మునిగి ఉంటుంది. కానీ వారు ముందులా పారిపోవటానికి లేదా అజ్ఞాతానికి కాకుండా పోరాడటానికి సిద్ధమయి ఉంటారు. వారు కొత్తగా ఆష్ పీపుల్(అగ్ని జాతి) అనే ఆక్రమణాత్మక జాతిని ఎదుర్కొంటారు.
భూమి నుంచి వచ్చిన మనుషులతో(ఆకాశవాసులు) ఆష్ పీపుల్ నాయకురాలు వరాంగ్ సహకరిస్తూ పండోరా గ్రహం లోపలి విభేదాలను పెంచుతుంది. ఇది వలసవాదంలో జరిగిన “డివైడ్ అండ్ రూల్” విధానాన్ని పోలి ఉంటుంది – బ్రిటిష్ వలసవాదులు భారతదేశంలో హిందూ- ముస్లిం విభేదాలను పెంచినట్టుగా; లేదా అమెరికాలో స్థానిక అమెరికన్ జాతుల మధ్య శత్రుత్వాలను ఉపయోగించినట్టుగా, ఎలా స్థానికులను తమలో తాము పోరాడుకునేలా సామ్రాజ్యవాదం చేస్తుందో ఈ చిత్రం వివరిస్తుంది.
ఆష్ పీపుల్ అగ్ని ఆధారిత సంస్కృతిని కలిగి ఉండి, మిగతా జాతులపై ఆధిపత్యం చూపాలని కోరుకుంటారు. ఇది ఆఫ్రికా ఖండంలో యూరోపియన్ సామ్రాజ్యవాదులు స్థానిక రాజులను ఉపయోగించి ఇతర జాతులను దోపిడీ చేసిన చరిత్రను గుర్తుచేస్తుంది. జేక్ సల్లి కుటుంబం ఈ విభేదాల మధ్య చిక్కుకొని, పండోరా గురించి కొత్త రహస్యాలను కనుగొంటుంది.
చిత్రంలో ఆక్రమణదారులు మళ్లీ ఆయుధాలు, టెక్నాలజీతో వచ్చి దోపిడీ చేయాలనుకుంటారు. కానీ ఈసారి పండోరా లోపలి శత్రువులతో సహకరించడం– ఇది సామ్రాజ్యవాదం ఎలా స్థానికులను తమ సాధనాలుగా మార్చుకుంటుందో చూపిస్తుంది.
ఈ చిత్రంలో సామ్రాజ్యవాదులు(ఆకాశవాసులు) ఎంతకైనా తెగిస్తారని మరోసారి స్పష్టమవుతుంది. వారు తమ లాభాల కోసం, పండోరా గ్రహంలోని దుష్టశక్తులకు(ఆష్ పీపుల్ వంటి ఆక్రమణాత్మక జాతులకు) ప్రాణాంతక మారణాయుధాలను సరఫరా చేస్తారు.
ఆష్ పీపుల్‌కు అధునాతన టెక్నాలజీ, ఆయుధాలు ఇవ్వడం ద్వారా- వారు ఇతర నావి జాతులపై దాడులు చేసేలా ప్రోత్సహిస్తారు. ఇది చారిత్రకంగా సామ్రాజ్యవాదులు ఎలా దుష్టశక్తులకు ఆయుధాలు సరఫరా చేసి, స్థానికుల మధ్య విభేదాలను పెంచారో గుర్తుచేస్తుంది– ఆఫ్రికాలో యూరోపియన్ దేశాలు స్థానిక యుద్ధనాయకులకు ఆయుధాలు ఇచ్చి, జాతుల మధ్య యుద్ధాలను రెచ్చగొట్టినట్టుగా, లేదా మధ్యప్రాచ్యంలో ఆధునిక సామ్రాజ్యవాదులు తీవ్రవాద సమూహాలకు ఆయుధాలు సరఫరా చేసినట్టుగా ఉంటుంది.
ఈ విధంగా, సామ్రాజ్యవాదులు తమ దోపిడీని కొనసాగించడానికి ఎంతటి నీచమైన చర్యలకైనా సిద్ధపడతారని చిత్రం వివరిస్తుంది.
పెట్టుబడిదారీ విధాన దోపిడీ, విస్తరణవాదాన్ని ఎందుర్కోవాలంటే పోరాటమే మార్గమని అవతార్ 3లో మరింత స్పష్టమవుతుంది. జాక్ సల్లి కుటుంబం ఆష్ పీపుల్ని ఎదుర్కొని, పండోరా గ్రహంలోని మిగిలిన జాతులను ఐక్యం చేసి పోరాడేలా చేస్తుంది. ఇది భూ వలసవాద చరిత్రలో స్థానిక ప్రజలు ఐక్యమై పోరాడిన సందర్భాలను– భారత స్వాతంత్ర్య సమరం లేదా వియత్నాం యుద్ధం వంటివాటని ప్రతిబింబిస్తుంది.
స్థానిక సమాజాల ఐక్యత ఎలా సామ్రాజ్యవాదులను ఓడించగలదో చిత్రం ఉదాహరణలతో చూపిస్తుంది: జేక్ సల్లీ వివిధ నావి జాతులను, టుల్కున్(సముద్ర జీవులు) సమూహాలను ఒక్కటి చేసి, ఆక్రమణదారులపై పోరాడుతాడు. ఈ ఐక్యత ద్వారా, వారు ఆయుధాలు, టెక్నాలజీలో బలవంతులైన సామ్రాజ్యవాదులను ఓడించగలరు. చారిత్రకంగా, భారతదేశంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో వివిధ సమాజాలు ఐక్యమై బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఓడించినట్టుగా, లేదా వియత్నాంలో స్థానికులు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఓడించినట్టుగా, ఐక్య పోరాటం ద్వారా స్వేచ్ఛ సాధించవచ్చని చిత్రం సందేశమిస్తుంది.
దుఃఖం, కోపం, ప్రతీకారం వంటి భావోద్వేగాలను చిత్రం చూపిస్తూ- సామ్రాజ్యవాదం ఎలా సమాజాలను విచ్ఛిన్నం చేస్తుందో వివరిస్తుంది. అయితే, చివరికి పోరాటం ద్వారా ఐక్యత- స్వేచ్ఛను సాధించడం ద్వారా దర్శకుడు ఆశావాద సందేశమిస్తాడు.
ప్రేక్షకులు ఈ చిత్రంలో కూడా పండోరా గ్రహవాసులు గెలవాలని కోరుకుంటారు, ఎందుకంటే మనిషి స్వభావం చెడ్డది కాదు, సామ్రాజ్యవాదమే సమస్యని మనకు అర్థమవుతుంది. అవతార్ 3 టెక్నాలజీ గురించి మాట్లాడటం కంటే, దాని సామాజిక సందేశం గురించి చర్చించాలి. పెట్టుబడిదారీ విధానం భూమిని సర్వనాశనం చేస్తుందని, ఐక్య పోరాటాలు అవసరమని ఈ చిత్రం మరోసారి గుర్తుచేస్తుంది.
ఆంజనేయ రాజు
వ్యాసకర్త డివై ఎఫ్ ఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
