అన్ని కేటగిరీలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కుటుంబాలు ఆర్థిక నిచ్చెనలో అట్టడుగు మెట్టు అయిన పేదల కేటగిరీలో ఉన్నారు. తదుపరి ఆదాయ కేటగిరీ(రూ 6,000- రూ 10,000 మధ్య)లో అంతరం స్వల్పంగా మరింత పెరగడాన్ని చూడవచ్చు.
ఈ కేటగిరీలో రాష్ట్ర సగటు 29.61 శాతం కాగా- బీసీలు 32.26 శాతం, బీసీలు 29.35 శాతం ఉన్నారు. ఈబీసీలు దుర్భర దారిద్య్రం నుంచి తప్పించుకున్నప్పటికీ, నిలకడైన ఆదాయ పెరుగుదలకు సరైన మార్గాలు కొరవడి; చిన్నచిన్న జీవనోపాధి పనులకు పరిమితమయ్యారని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
రాష్ట్రంలోని జనాభాలో దాదాపు 18- 19 శాతం రూ 10,000 నుంచి రూ 20,000 ఆదాయ కేటగిరీలో ఉండగా; బీసీలలో 18.42 శాతం, ఈబీసీలు 18.06 శాతం ఈ కేటగిరీ పరిధిలో ఉన్నారు.
కులాల వర్గీకరణతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అనేక కుటుంబాలు ఈ ఆదాయ స్థాయిని అధిగమించలేకపోతున్నాయనే వాస్తవాన్ని కులాల మధ్య ఈ ఏకరూపత తెలియజేస్తుంది.
నిజానికి బీసీ కుటుంబాలలో సుమారు 80 శాతం, ఈబీసీ కుటుంబాలలో 85 శాతం, బీహార్‌లోని అన్ని కుటుంబాలలో 81 శాతంపై మూడు ఆదాయ కేటగిరీల(రూ 20,000 వరకు) పరిధిలో ఉన్నాయి.
రూ 20,000 నుంచి రూ 50,000 కేటగిరీలో అంతరాలు మరింతగా స్పష్టమయ్యాయి. 10.67% బీసీ కుటుంబాలు ఈ కేటగిరీ పరిధిలోకి రాగా; ఈబీసీలు 8.32% మాత్రమే ఉన్నారు. నెలవారీ కుటుంబ ఆదాయం రూ 50,000 కంటే ఎక్కువ ఉన్న కేటగిరీలో కూడా ఈ అంతరం కొనసాగింది.
4.22% బీసీ కుటుంబాలు ఈ కేటగిరీ పరిధిలో ఉండగా; ఈబీసీ కుటుంబాలలో 2.28% మాత్రమే ఈ పరిధి కిందకు వచ్చాయి. బీహార్ రాష్ట్ర సగటు ఈ రెండింటికి మధ్య(3.9%) ఉంది. సమాచారం వెల్లడించని కుటుంబాలు బీసీలలో 4.18%, ఈబీసీలలో 4.44% ఉండగా, రాష్ట్ర సగటు 4.47 శాతం ఉంది.
ఇది తమ ఆదాయం వెల్లడించడానికి ఇష్టపడిన కుటుంబాల గురించి తెలియజేస్తుంది.
బీహార్‌లో గణనీయమైన జనాభా పేదరికంలో బతుకుతున్నప్పటికీ, ఆర్థిక దుర్బలత్వం కూడా సమానంగా పంపిణీ చేయబడలేదని ఈ డేటా స్పష్టం చేసింది. ఈబీసీలు అత్యల్ప ఆదాయ కేటగిరీలో అత్యధికంగా ఉండటం, అధిక ఆదాయ కేటగిరీలలో తక్కువగా ఉండటం వారిలోని తీవ్రమైన, తరాలుగా కొనసాగుతున్న ప్రతికూలతలను తెలియజేస్తుంది.
ఆర్థికంగా బీసీలు ఇప్పటికీ అణచివేతలో ఉన్నప్పటికీ, సాపేక్షంగా మెరుగైన ఆదాయ పంపిణీని కలిగి ఉన్నారు. వారిలో ఆర్థిక చలనశీలత సంకేతాలు కనిపిస్తున్నాయి.
బీసీలలో కులాల వారీ విశ్లేషణ
కుటుంబ ఆదాయం రూ 50,000 కంటే ఎక్కువ ఉన్న కేటగిరీకి సంబంధించిన ఈ కులాల వారీ డేటా వేర్వేరు కులాల ఆదాయంపై సమగ్ర అవలోకాన్ని అందిస్తుంది.
పెద్ద, చిన్న కులాలు రెండూ ఆదాయ స్థాయిల్లో తీవ్రమైన అంతరాయాలు చూపిస్తున్నాయి.
పెద్ద కులాల్లో యాదవ కమ్యూనిటీ పరిమితైన ఆర్థిక పురోగతిని చూపుతోంది. దీనికి భిన్నంగా, కుర్మీలు, బనియాలు సంపన్న కుటుంబాలలో ఎక్కువ వాటాను కలిగి ఉన్నారు. కుషావాహాలు వాటా వారి దామాషాకు అనుగుణంగా ఉంది.
అయితే, అనేక చిన్న కులాలు చెప్పుకోదగ్గ విధంగా ప్రగతిని చూపించాయి. ఉదాహరణకు, మొత్తం కుటుంబాలలో 0.08 శాతం మాత్రమే వాటా ఉన్న భట్లు, రూ 50,000 కంటే ఎక్కువ ఆదాయ కేటగిరీలో 11.99 శాతం ఉన్నారు.
కోస్తాలు 25.33 శాతం అత్యధిక ఆదాయ రేటును నమోదు చేసుకున్నారు. మాలిక్(ముస్లిం), పరాత, క్రైస్తవ(ఇతర వెనుకబడిన కులం), ట్రాన్స్జెండర్లు కూడా చెప్ప్పుకోదగ్గ అధిక ఆదాయ దామాషాలను ప్రదర్శించారు.
బీసీ గ్రూపులో, కుర్మీలు, బనియాలలోని అధిక ఆదాయ కుటుంబాల వాటా రాష్ట్రంలోని మొత్తం కుటుంబాలలోని వారి కుటుంబాల వాటాకు దాదాపు రెట్టింపు ఉంది. యాదవులు తమ నిష్పత్తి కంటే తక్కువ వాటాను కలిగి ఉన్నారు.
కుషావాహాలు తమ జనాభా నిష్పత్తితో సమానమైన వాటాను పొందగా, అత్యధిక శాతం చిన్న కులాలు ఈ కేటగిరీలో తమ ఉనికి స్వల్పంగానే చాటుకున్నాయి. ఇది అంతర్గత అసమానతలను స్పష్టంగా వెల్లడిస్తుంది.
ఓబీసీలో పరిధిలో కూడా ఇదే విధమైన ధోరణి కనబడుతుంది. కుర్మీలు, బనియాలు మరొకసారి తమ కుటుంబ వాటాల కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నారు. ఓబీసీ కుటుంబాలలో 6.81% ఉన్న కుషావాహాలు ఓబీసీ ఆదాయ సముదాయంలో 9.39% ఉన్నారు. ఓబీసీ పరిధిలో యాదవులు చాలా మెరుగైన స్థితిలో ఉన్నారు.
ఓబీసీ కుటుంబాలలో 22.22% వాటాతో- రూ 50,000 కంటే అధిక ఆదాయ సముదాయంలో 22.81 శాతం ఉన్నారు. ఓబీసీ పరిధిలో కూడా చిన్న కులాల అల్ప ప్రాతినిధ్యం కొనసాగింది. భట్, క్రైస్తవ(ఇతర వెనుకబడిన కులం) వంటి కులాలు స్వల్ప స్థానం కలిగి ఉన్నప్పటికీ; మెజారీటీ కులాల ఈ కేటగిరీలో పూర్తిగా విస్మరణకు గురయ్యాయి.
ఈబీసీల పరిధిలో ఆదాయ పంపిణీ ఆర్థిక అసమానత కేవలం గ్రూపుల మధ్యనే కాకుండా, గ్రూపులో కూడా కొనసాగుతోందని వెల్లడిస్తుంది. చాలా కొద్ది కులాలు కొంత ఆర్థిక పునాదిని పొందతుండగా, అత్యధిక ఈబీసీలు పోరాటం కొనసాగిస్తున్నాయి.
దామాషా పరంగా కొన్ని అతి చిన్న కులాల అసాధారణ ఆదాయ పనితీరు మొత్తం ఈబీసీల విస్తృతమైన ఆర్థిక ఉపాంతీకరణను భర్తీ చేయడానికి పెద్దగా సహాయపడదు.
జనగణన నివేదిక తరువాత ఈబీసీల సమీకరణ
అత్యంత వెనుకబడిన తరగతుల(ఈబీసీ)వారు బీహార్ జనాభాలో దాదాపు 36% ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తూ- 2023 జనగణన నివేదిక ప్రచురించబడిన తరువాత, ఈబీసీ కమ్యూనిటీలలో రాజకీయ సమీకరణ గణనీయంగా పెరిగింది.
ఈబీసీ రాజకీయ సమ్మేళనం, ప్రాతినిధ్య డిమాండ్‌పై ప్రతి పెద్ద రాజకీయ పార్టీ ప్రదర్శనలు, సభలు నిర్వహించింది.
ఎన్నికల ఫలితాలతో పాటు- ఇతర అంశాలపై కూడా వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కావున, జనాభాలో పెద్ద సెక్షన్ ఈబీసీల సమీకరణలో ఇదొక కొత్త దశకు నాంది పలికింది.
ప్రధాన రాజకీయ పార్టీలు నిర్వహించిన ర్యాలీలు/సభలు
జనగణన నివేదిక ప్రచురించిన ఎనిమిది రోజుల తరువాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2023 అక్టోబర్ 10న పాట్నా నుంచి పెద్ద ఎత్తున “భీమ్ సంసద్ రథాలు”ను జండా ఊపి ప్రారంభించారు. ఆ విధంగా జనతాదళ్ యునైటెడ్ పార్టీ “భీమ్ సంసద” కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దళితులు, ఈబీసీ కమ్యూనిటీలను ఏకం చేయడం కోసం 2023 నవంబర్ 5న నిర్వహించిన “భీమ్ సంసద”కు మద్దతు కూడా కట్టడానికి ఈ రథాలు బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించాయి.
షెడ్యూల్డు కులాలు(ఎస్సీలు), ఈబీసీలు కలసి రాష్ట్ర జనాభాలో దాదాపు 56% ఉన్నాయని వెల్లడించిన బీహార్ కుల గణన నివేదికలోని అంశాలపై ఆధారపడి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఇదే సంవత్సరంలో, ఈబీసీల హక్కుల కోసం ముందుండి పోరాడిన కర్పూరి ఠాకూర్ శతజయంతిని పురస్కరించుకుని జెడియు “కర్పూరి చర్చ”ను కూడా ప్రారంభించింది.
రాష్ట్ర కుల గణన ప్రాధాన్యతను నొక్కిచెప్పడం, ఈబీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌ను సమర్థిస్తూ ఈ క్యాంపెయిన్ బీహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలలోని ఓటర్లను కలవడం లక్ష్యంగా కొనసాగింది.
మరోవైపు, భారతీయ జనతా పార్టీ(బీజేపీ), ఈబీసీ ఓటర్లకు చేరువ కావడానికి తన సొంత కార్యక్రమాలను ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాజకీయ లక్ష్యానికి అనుగుణంగా ఆయన చరిత్రను ఉపయోగించుకోవడం కోసం కర్పూరి ఠాకూర్‌కు మరణనాంతరం భారతరత్న ప్రకటించింది.
ఇంకా, 2025 మార్చి 9న పాట్నాలో “అత్యంత్ పిచ్డా వర్గ్ హూంకార్ సమ్మేళన”ను బీజేపీ నిర్వహించింది. ఈబీసీల 15 సూత్రాల డిమాండ్లను బీజేపీ మాత్రమే నెరవేర్చగలదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సభలో ఉద్ఘాటించారు.
వెనుకబడిన కులాల జాతీయ కమీషన్‌కు రాజ్యాంగ హోదాను కల్పించడంలో తమ పార్టీ పాత్రను కూడా ఆయన గుర్తు చేశారు.
ఆ తరువాత, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూడా ఈబీసీ రాజకీయ యవనికపై తన పాత్రను చాటుకుంది. ఈబీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచవలసిన అవసరాన్ని నొక్కి చెబుతు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్ 2025 మే 3న పాట్నాలో “అతి పిచ్డా జగావో ర్యాలీ” నిర్వహించారు.
తాము గెలిస్తే, మహా ఘట్బంధన్ ఈబీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుతుందని, వారి గౌరవాన్ని కాపాడుతుందని వాగ్దానం చేశారు. ఈ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులకు ఎన్నడూ లేనివిధంగా ఎక్కువ సంఖ్యలో టికెట్లు ఇస్తామని కూడా వాగ్దానం చేశారు.
జేడీయూ, బీజేపీ, ఆర్జేడీలు చేపట్టిన ఈ వరుస రాజకీయ కార్యక్రమాలు బీహార్ కులగణన రాష్ట్ర ఎన్నికల చిత్రాన్ని ఏ విధంగా మార్చిందో తెలియజేశాయి. ఈబీసీలతో పాటు వివిధ కులాల సంఖ్యా బలాన్ని లెక్కించడం ద్వారా ఈ నివేదిక రాజకీయ పార్టీలు ఈ వర్గాలకు చేరువ కావడానికి ఒక నిర్దిష్టమైన ప్రాతిపదికను అందించింది.
నితీష్ కుమార్ నిర్వహించిన “భీమ్ సంసద”, “కర్పూరి చర్చ” తమ పార్టీని సామాజిక న్యాయ పార్టీగా పునరుద్ఘాటిస్తూనే, తన సాంప్రదాయ పునాదిని ఏకం చేయడానికి జేడీయూ చేసిన ప్రయత్నాన్ని తెలియజేస్తుంది.
కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రదానం చేయడం, ర్యాలీలు నిర్వహించడం ద్వారా బీజేపీ, జేడీయూ కుల కేంద్రీకృత సమీకరణను ఎదుర్కోవడానికి; జాతీయ స్థాయిలో ఈబీసీ ఆకాంక్షలకు మద్దతుదారుగా ప్రకటించుకోవడానికి ప్రయత్నించింది.
తేజస్వి యాదవ్ ‘అతి పిచ్డా జగావో ర్యాలీ’ద్వారా, ఈబీసీలకు మెరుగైన రాజకీయ ప్రాతినిధ్యానికి హామీ ఇవ్వడం ద్వారా ఆర్జేడీ సామాజిక న్యాయ రాజకీయాల వారసత్వాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించారు.
మొత్తం మీద ఈ కార్యక్రమాలు బీహార్ రాజకీయ రణరంగం సంఖ్యాపరంగా కీలకమైన, రాజకీయంగా అస్థిరమైన ఈబీసీలను సమీకరించే దిశగా నిర్ణయాత్మకంగా మారిందని సూచిస్తున్నాయి. రాబోయే ఎన్నికలు కర్పూరి ఠాకూర్ వారసత్వానికి నిజమైన వారసులుగా, ఈబీసీల నిజమైన గొంతుకగా తమను తాము నిరూపించుకోవాలనే పార్టీల మధ్య తీవ్రమైన పోటీకి అద్దంపట్టే అవకాశం ఉంది.
ముగింపు
పైన చర్చించిన విధంగా వెనుకబడిన కులాల సమీకరణకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్నప్పటికీ, 1980ల నుండి వేగంపుంజుకుంది.
1980లు బీహార్‌లోని కుల రాజకీయాలు కీలక ములపు తిరిగాయి. ఆ తరువాత దశాబ్దాలలో కుల సోపానంలో అట్టడుగున ఉన్న ఈబీసీలపై పెద్ద ఎత్తున కేంద్రీకరించడం వంటి కొత్త మార్పులను సంతరించుకుంది.
ముఖ్యంగా, గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలు కులం అనే మూలాధారం చుట్టూ తిరుగుతూ- మరింత తీవ్రతరం కావడం జరిగింది. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే కొనసాగుతుంది.
మొదటి రెండు దశాబ్దాలలో, సామాజిక ఆర్థిక విషయాలలో సమీకరణ ఫలాలు ఓబీసీలలోని ఎగువ- మధ్య స్థాయిలలో ఉన్న వారికి దక్కగా; కొన్ని కులాలు తమ సంఖ్య కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందడంలో విజయవంతం కాగా; ఎక్కువ కులాలకు ఫలితాలు దక్కలేదు.
పెద్ద సెక్షన్లు, ముఖ్యంగా ఈబీసీలు, ఈ సమీకరణ ఫలితాలను దక్కించుకోలేకపోయాయి. విస్మరించబడిన కులాలు సంఘటితం కావడం మొదలైంది. 2023 కులగణన ఈ దృగ్విషయాన్ని అంచనా వేయడంతో పాటు, కొత్త ఊపిరి ఇచ్చింది.
ఈ సమీకరణ రానున్న రాజకీయ ఫలితాలను నిర్దేశించడంలో పెరుగుతున్న ఈబీసీల రాజకీయ ప్రాముఖ్యతను నొక్కిచెప్పడంతో పాటు; మారుతున్న బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని కూడా తెలియజేసింది.
జనగణన నివేదిక ఈబీసీ కమ్యూనిటీల పెరుగుతున్న రాజకీయ ప్రాధాన్యతను, దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కోసం పెరుగుతున్న డిమాండ్‌కు బలం చేకూర్చింది.
బీసీ, ఈబీసీ కేటగిరీలలో జనాభాలో వాటా; సమీకరణతో చేకూరిన ప్రయోజనాల మధ్య ఒక రకమైన దామాషా సంబంధం ఉందని ఈ వ్యాస్తం స్పష్టం చేస్తుంది.
అయితే విస్తారమైన ఓబీసీ వర్గీకరణలో, జనాభాలో తమ వాటాపరమైన బలం ఉన్న కొన్ని రాజకీయంగా బలమైన కులాలు, సమీకరణ మొత్తం ప్రక్రియతో పాటు దాని నుంచి దక్కిన ఫలాలలో కూడా తమ పట్టును నిలబెట్టుకుంటున్నాయి.
మరోవైపు, దామాషా రీత్యా ఎక్కువ శాతం ఉన్నప్పటికీ చిన్న కులాలకు దక్కిన ఫలితాలు పరిమితంగా ఉన్నాయి. ఇది ఓబీసీ వర్గంలో వనరుల అసమాన పంపిణీ వెల్లడిస్తుంది.
ఎక్కువగా సమీకరించబడిన కులాలు తమ సామాజిక- రాజకీయ అనుకూలతను మరింత పెంచుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఓబీసీల ఉప వర్గీకరణ డిమాండ్ ఇటీవల దేశవ్యాప్తంగా పుంజుకుంటోంది.
అయితే, అసమానతలు పెద్దగా పరిష్కరించబడని అటువంటి వ్యవస్థ ఉన్న బీహార్‌లో ఈ డిమాండ్ ప్రభావం పరిమితంగానే కనిపిస్తుంది.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పెరిగిన ఈబీసీల ప్రాతినిధ్యం
ఈ వ్యాసంలో చర్చించినట్లుగా 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఈబీసీల ప్రాతినిధ్యం పెరిగింది. మొత్తం 243 స్థానాలకు గాను 40 మంది ఈబీసీలు విజయం సాధించారు. బీసీలు 85 స్థానాలు దక్కించుకున్నారు.
బీసీలు, ఈబీసీలు కలసి 125 స్థానాల్లో గెలిచారు. కులాల వారీగా పరిశీలిస్తే, కుషావాహాలు 26, యాదవులు 25, కుర్మీలు 14, కల్వారులు 6, సూరిలు 4 ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకున్నారు. ఈబీసీలలో అత్యధికంగా ధనుకు కులం 9, తేలి కులం వారు 6, కాను కులస్తులు 5, మల్లాహ్ కులం వారు 3 స్థానాల్లో గెలిచారు.
అనువాదం: పి నరసింహారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
