ద్వితీయ విశ్లేషణ కోసం డేటాను 2023 బీహార్ కులాధారిత గణన నివేదిక నుంచి తీసుకోవడం జరిగింది.
బీసీలు, ఈబీసీలకు సంబంధించిన అంకెలను నివేదికలో ఉన్న విధంగా వారి జనాభాకు ఎదురుగా సంచితం చేయడం జరిగింది.
విభజిత విశ్లేషణ కోసం బీహార్‌లోని బీసీ, ఈబీసీ, ఓబీసీల నెలవారీ కుటుంబ ఆదాయ పట్టికలలో కుటుంబ వాటాలు; అన్ని పట్టికలలో బీసీ, ఈబీసీ, ఓబీసీల మధ్య వాటాలను సాధారణ అంకగణితాన్ని ఉపయోగించి లెక్కించారు.
ఈ పట్టికలను జనాభా అవరోహణా క్రమం లేదా నెలవారీ కుటుంబ ఆదాయం విషయంలో, కుటుంబాల సంఖ్య ఆధారంగా రూపొందించడం జరిగింది.
ప్రతి కాలంలో విలువలను రెండు దశాంశ బిందులకు పరిమితం చేయడం జరిగింది.
దీని వలన, పట్టికలలో కొన్ని కులాల ప్రాతినిధ్యం సున్నా లేదా సున్నాకు దగ్గరగా ఉన్నాయి.
అయితే, నాలుగు దశాంశ బిందువుల వరకు విలువలు లెక్కిస్తే, వాటి వాస్తవ ఉనికిని వెల్లడిస్తాయి.
కొన్ని కులాల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి వాటి జనాభా పరిమాణం తక్కువగా ఉండటమే ప్రధాన కారణం
విద్య..
బీహార్‌లో వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులలో విద్యా స్థాయి గురించి పట్టిక- 1 సూక్ష్మ అవగాహనను అందిస్తుంది.
ప్రారంభ స్థాయి పాఠశాల నమోదు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఉన్నత విద్యకు వెళ్లే కొద్దీ నమోదు తగ్గుతూ ఉంది. ఈబీసీలలో చాలా ఎక్కువగా ఉంది.
ప్రాథమిక స్థాయి విద్యలో భాగస్వామ్య రేటు బీసీలు(21.69 శాతం), ఈబీసీలు(24.65 శాతం)ఇద్దరిలోనూ భాగస్వామ్య రేట్లు సాపేక్షంగా ఎక్కువగానే ఉన్నాయి, బీహార్ రాష్ట్ర సగటు 22.67 శాతంగా ఉంది.
ప్రాథమిక స్థాయిలో ఉన్న ఈ ధోరణి విద్యార్థులు విద్యలో నిచ్చెన మెట్లు పైకి ఎక్కుతున్న కొద్దీ వేగంగా తగ్గుతోంది.
మాధ్యమిక పాఠశాలకు వెళ్లే సరికి బీసీలు 14.4 శాతం, ఈబీసీల విషయంలో 15.3శాతానికి వేగంగా పడిపోవడం జరిగింది.
మాధ్యమిక స్థాయిలో ఈ రెండు గ్రూపుల మధ్య వ్యత్యాసాలు మొదలయ్యాయి. ఈబీసీల కంటే బీసీలు కొంచెం మెరుగ్గా ఉన్నారు.

ఉన్నత మాధ్యమిక స్థాయిలో ఈ క్షీణత మరింతగా కొనసాగింది. బీసీలలో భాగస్వామ్యం 10.69 శాతానికి, ఈబీసీలలో మరింత తక్కువగా 7.95 శాతానికి తగ్గింది.
పోస్ట్ హయ్యర్ సెకండరీ, ప్రొఫెషనల్ విద్యలో భాగస్వామ్యం మరింత తక్కువగా ఉంది.
నైపుణ్య, సాంకేతిక, ఉన్నత విద్యలో రాష్ట్ర ధోరణిని తెలియజేస్తూ- బీసీ, ఈబీసీల భాగస్వామ్యం అతి స్వల్పంగా ఉంది.
అయితే, ఈ విషయంలో కూడా ఈబీసీల కంటే బీసీలు కొంచెం మెరుగ్గా ఉన్నారు. సాధారణ విద్యలో మాత్రమే వారు కొంత పురోగతి సాధించారు.
ఇందులో “ఇతర” కేటగిరీకి సంబంధించిన గణాంకాల గురంచి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఈ కేటగిరీ వారు బీసీలలో ఈబీసీల 28.59 శాతం, ఈబీసీలలో 32.89 శాతం ఉన్నారు.
జనగణన నివేదిక ‘ఇతర’అంటే ఏమిటో నిర్వచించలేదు. అయితే వారు నిరక్షరాస్యులైనా కావచ్చు; నియత విద్యా వ్యవస్థ నుంచి త్వరగా నిష్క్రమించిన వారై ఉండవచ్చు లేదా అనియత విద్యను పొందిన వారైనా కావచ్చు.

కులాల వారీగా విశ్లేషణ..
పట్టిక- 2లో ఉన్న కులాలలో యాదవులు మినహాయించి, అన్ని కులాలు గ్రాడ్యుయేషన్ విద్యా శాతాలను తమ జనాభా వాటాల కంటే ఎక్కువగా నమోదు చేసుకున్నాయి.
ప్రత్యేకంగా ఈ ధోరణి క్రైస్తవులు(ఇతర వెనుకబడిన కులాలు), కోస్తాలు వంటి చిన్న కులాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఇతర చిన్న కులాలైన భట్, ట్రాన్స్జెండర్లు, రౌత్రియాలు, సూత్రధారులు కూడా చెప్ప్పుకోదగ్గ స్థానం సంపాదించాయి.
పెద్ద కులాలలో కుర్మీలు, బనియాలలో పెద్ద సంఖ్య గ్రాడ్యుయేట్లు నమోదయ్యారు.
కుషావాహాలు కూడా ప్రభావిత స్థాయిలో గ్రాడ్యుయేషన్‌ను సాధించగా, దీనికి భిన్నంగా యాదవులు తమ జనాభా నిష్పత్తి కంటే తక్కువ గ్రాడ్యుయేట్ల వాటాను దక్కించుకున్నారు.
బీసీ గ్రాడ్యుయేట్లలో యాదవుల వాటా 42.43 శాతంగా తేలింది. ఇది వారి జనాభా వాటా కంటే తక్కువగా ఉంది.
మరోవైపు కుర్మీలు, కుషాహాలు, బనియాలు బీసీలలో గుర్తించదగ్గ పురోగతి సాధించారు. బీసీ జనాభాలో కుర్మీలు 10.61 శాతం ఉండగా; బీసీ గ్రాడ్యుయేట్లలో 14.95 శాతం ఉన్నారు.
అదేవిధంగా, బీసీలలో 8.53 శాతం జనాభా వాటాతో బనియాలు బీసీ గ్రాడ్యుయేట్లలో 15.1 శాతం ఉన్నారు.
బీసీ జనాభాలో 15.52 శాతం ఉన్న కుషాహలు తమ జనాభా వాటా కంటే అధికంగా గ్రాడ్యుయేట్లలో 20.17 శాతం వాటాను పొందారు.
దీనికి విరుద్ధంగా విడివిడిగా గ్రాడ్యుయేట్ల శాతం బలంగా ఉన్నప్పటికీ బీసీ గ్రాడ్యుయేట్లలో అనేక చిన్న కులాల ఉనికి నామమాత్రంగానే ఉంది.
విస్తారమైన ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) కేటగిరీలో కూడా ఇదే విధమైన తీరును గమనించవచ్చు. కుర్మీలు, కుషాహాలు, బనియాలు మరొకసారి తమ వాటా కంటే మెరుగైన ఫలితాలను చూపించారు.
యాదవులు కూడా తమ జనాభా వాటా 22.59 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఓబీసీ గ్రాడ్యుయేట్లలో 23.1 శాతం వాటాను సాధించారు.
మరోవైపు చిన్న కులాలు ఈ కేటగిరీలో కూడా వెనుకబడిపోయాయి.
ఉన్నత విద్య, ప్రత్యేకించి నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లభ్యత కూడా ఈ కులాల మధ్య అసమానంగా ఉందని ఈ వర్గీకృత డేటా స్పష్టంగా వెల్లడిస్తోంది.
కొన్ని చిన్న కులాలు తమ జనాభాతో పోల్చుకుంటే గ్రాడ్యుయేషన్‌లో అధిక వాటాను సాధించాయి. కానీ బీసీ, ఓబీసీ కేటగిరీల స్థాయిల్లో సంచితం చేసినప్ప్పుడు ఈ నమూనా మారుతుంది.
విద్యార్జనలో పెద్ద కులాల ఆధిపత్యం సాధిస్తుండగా, చిన్న కులాలకు తక్కువ ప్రాతినిధ్యం లభిస్తోంది.
అత్యంత వెనుకబడిన తరగతుల(ఈబీసీ) క్రింద వర్గీకరించబడిన కులాలలో విద్యాపరమైన అంతరాలు గణనీయంగా ఉన్నాయనే విషయాన్ని తప్పకుండా ప్రస్తావించాలి.
కొన్ని ఈబీసీ కులాలలో పురోగతి ఉన్నప్పటికీ, మొత్తంగా అసమానత మాత్రం ఉందని గ్రాడ్యుయేషన్ స్థాయి డేటా సూచిస్తోంది.
విద్యాపరంగా కులాల వారీగా ఉన్న అంతరాలను ఈ డేటా వెల్లడిస్తుంది. ఓబీసీ విద్యాస్థాయి పరిధిలో కూడా ఈబీసీల ఉనికి పరిమితంగా ఉండగా; ఈబీసీలలో కూడా విద్యా ఫలాలు కొన్ని కులాలలో మాత్రమే కేంద్రీకృతమయ్యాయి.

ఉపాధి..
ప్రభుత్వ ఉద్యోగం సాంప్రదాయకంగా ప్రతిష్టాత్మకమైన, సురక్షితమైన జీవనోపాధిగా పరిగణించబడుతుంది.
ప్రభుత్వ ఉపాధి సామాజిక- ఆర్థిక సమ్మిళితత్వానికి, అభ్యున్నతికి కీలకమైన సూచిక కూడా. ఈ తరహా ఉపాధి బీహార్ మొత్తం 1.57 శాతం(పట్టిక 3) ఉంటే, బీసీలలో కొంచెం ఎక్కువ(1.75 శాతం) ఉండగా; ఈబీసీలలో చాలా తక్కువ(0.98 శాతం)గా ఉంది.
రాష్ట్ర సగటు ఈ విధంగా చాలా తక్కువగా ఉండటం బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో ఉన్న లోపాన్ని ఎత్తిచూపుతుంది. వారికి ప్రత్యేక కోటా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలలో ఈబీసీల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం, చారిత్రక అసమానతలను తొలగించడంలో రిజర్వేషన్ విధానం విఫలమయిందని తెలియజేస్తుంది.
ప్రైవేటు సంఘటిత రంగంలో ఉపాధి కూడా పరిమితంగానే ఉంది. రాష్ట్ర సగటు 1.22 శాతం ఉండగా, బీసీలు (1.13 శాతం) కొంచెం వెనుకబడగా; ఈబీసీలు(0.73 శాతం) చాలా వెనుకబడి ఉన్నారు.
నియత విద్య, నైపుణ్య శిక్షణపై ఆధారపడి ఉన్న సంఘటిత ప్రైవేటు రంగం ఈబీసీలకు అందనంత దూరంలో ఉండిపోయింది. ప్రైవేటు అసంఘటిత రంగం బీహార్ జనాభాలో 2.14 శాతానికి ఉపాధి కల్పిస్తుండగా; అందులో బీసీలు 2.15 శాతం, ఈబీసీలు 1.73 శాతం ఉన్నారు.
బీసీలు కనీసం రాష్ట్ర సగటుతో సమానంగా ఉపాధి పొందగలుగుతున్నప్పటికీ, ఈబీసీలు తమకున్న చారిత్ర వెనుకబాటుతో అనధికారిక రంగంలో కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారనే విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది.
స్వయం ఉపాధిలో మాత్రం రాష్ట్ర సగటు(3.05 శాతం)తో పోల్చుకుంటే బీసీలు (3.34 శాతం), ఈబీసీలు(3.58) కొంచెం మెరుగ్గా ఉండటం ఆసక్తికరం.
వ్యవసాయ పనులలో కులాధారిత విభజన స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు లేదా సాగుదారులుగా పని చేస్తున్న బీసీల వాటా రాష్ట్ర సగటు(7.70 శాతం) కంటే చాలా ఎక్కువగా(9.97 శాతం) ఉండగా, ఈబీసీల వాటా చాలా తక్కువగా (6.13) ఉంది.
ఈ వ్యత్యాసం భూయాజమాన్యం/నిర్వహణ తీరుకు అద్దంపడుతుంది. ఈబీసీలతో పోల్చినప్ప్పుడు బీసీలు సామాజికంగా ఆర్థికంగా మరింత సంఘటితంగా ఉండటంతో పాటు, చారిత్రకంగా వారికి భూమి ఎక్కువగా అందుబాటులో ఉండటం వలన, వారు సాగుదారులు/రైతులుగా ఉండటానికి వీలు కల్పించింది.
దీనికి భిన్నంగా, చారిత్రకంగా ఈబీసీలు భూమిలేని కూలీలు లేదా సన్నకారు రైతులుగా ఉండిపోవడం కులం- భూమి- శ్రమ మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది.
అయితే, ఇటీవల కాలంలో, బీహార్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈబీసీలకు కూడా భూమి లభ్యతలో కొంత మెరుగుదల కనిపించింది.
రోజువారీ లేదా అర్థ నైపుణ్య శారీరక శ్రమకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వహించే “చేతివృత్తులు(మేస్త్రి), కూలీలు; ఇతరులు” కేటగిరీ కులాధారిత వృత్తిపరమైన అసమానతలను స్పష్టంగా తెలియజేస్తుంది.
బీసీలు(13.74 శాతం), రాష్ట్ర సగటు(16.73 శాతం)తో పోల్చుకుంటే ఈబీసీలు (18.62) ఈ కేటగిరీలో అధికంగా ఉండటం, వారు కఠినమైన శారీరక, అభద్రతతో కూడుకున్న, తక్కువ విలువ ఉన్న శ్రమను అట్టిపెట్టుకుని ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
అన్ని గ్రూపులలో అత్యధికంగా ఉన్న కేటగిరీ గృహిణి, విద్యార్థి, మొదలైనవారు కేటగిరీ: బీసీలు(67.89 శాతం), ఈబీసీలు (68.18 శాతం), రాష్ట్ర సగటు (67.54 శాతం). ఈ కేటగిరీ విస్తృతంగా ఉండటం, ముఖ్యంగా మహిళలు, యువతలో అధిక ఆధారిత నిష్పత్తులు, కార్మిక శక్తిలో భాగస్వామ్యం లేకపోవడాన్ని తెలియజేస్తుంది.
బీహార్‌లో ఆర్థిక అణచివేత పూర్తిగా కులాల ఆధారంగానే జరిగిందని తులనాత్మక డేటా స్పష్టం చేస్తోంది. రాష్ట్రం మొత్తం అధికారిక ఉపాధి లేమి, తీవ్ర నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుండగా, బీసీలు, ముఖ్యంగా ఈబీసీలు జనాభాలో తమ వాటా కంటే ఎక్కువ భారాన్ని భరిస్తున్నారు.
ముఖ్యంగా, ఈబీసీలు ప్రతి ఉపాధి కేటగిరీలో అట్టడుగు స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యల్ప వాటాను, శారీరక శ్రమలో అత్యధిక వాటాను కలిగి ఉన్నారు.

బీసీలలో వర్గాల వారీగా విశ్లేషణ..
వెనుకబడిన తరగతు(బీసీ)లలో ప్రభుత్వ రంగ ఉపాధి(పట్టిక- 4)పై జరిపిన విశ్లేషణ వారిలో ఉన్న గణనీయమైన అంతరాలను వెల్లడించాయి.
ఉపాధి పరంగా ఏ కులానికి ఆ కులాన్ని పరిశీలించినప్ప్పుడు, కొన్ని కులాలు తమ జనాభా పరిమాణం కంటే ఎక్కువ ప్రాతినిధ్యం సాధించాయి. కొన్ని చిన్న కులాలు తమ దామాషా కంటే చెప్ప్పుకోదగ్గ విధంగా అధిక వాటాను పొందాయి.
ఉదాహరణకు, బీహార్ జనాభాలో కేవలం 0.09 శాతం ఉన్న భట్ కమ్యూనిటీ, 4.21 శాతం ఉపాధి రేటును నమోదు చేసింది. క్రైస్తవ(ఇతర వెనుకబడిన తరగతులు), రౌటియా, పరాథ, కోస్తా, జాదుపాటియావంటి ఇతర కులాలు అదేవిధంగా అధిక ఉపాధి రేట్లను పొందాయి.
మరో వైపు, కౌషాహాలు, బనియాలు వంటి పెద్ద కులాలు, ముఖ్యంగా, యాదవులు తక్కువ ప్రాతినిధ్యం పొందాయి.
2.87 శాతం జనాభా వాటా కలిగి ఉన్న కుర్మీలు మాత్రం కొంత మెరుగ్గా 3.11 శాతం ఉపాధి వాటాను దక్కించుకున్నారు.
అయితే, బీసీ జనాభాలో 10.61 శాతం వాటా ఉన్న కుర్మీలు బీసీ ఉద్యోగులలో దాదాపు రెండింతలు(18.85 శాతం) ప్రాతినిధ్యం పొందారు.
అదేవిధంగా, బీసీ జనాభాలో 15.52 శాతం వాటా ఉన్న కుషావాహాలు బీసీ ఉద్యోగులలో 18.03 శాతం ఉన్నారు. బనియాలు కూడా కొంత మెరుగైన స్థానంలో ఉన్నారు.
ఈ కేటగిరీలో కూడా యాదవులు వెనుకబడి ఉన్నారు. ఇందుకు విరుద్ధంగా బీసీ ఉద్యోగులలో చిన్న కులాల ప్రాతినిధ్యం నామమాత్రంగా లేదా శూన్యంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.
ఓబీసీ కేటగిరీ పరిధిలో, ఇదేవిధమైన తీరు కనిపించింది. ఓబీసీ జనాభాలో కేవలం 4.55 శాతం ఉన్న కుర్మీలు, ఓబీసీ ఉద్యోగులలో 10.81 శాతం ఉన్నారు. ఓబీసీ జనాభాలో 6.67 శాతం ఉన్న కుషావాహాలు ఓబీసీ ఉద్యోగులలో 10.34 శాతం ఉన్నారు.
ఓబీసీలో 3.66 శాతం వాటా కలిగి ఉన్న బనియాలు ఉద్యోగులలో 5.47 శాతం ఉన్నారు. ఓబీసీ జనాభాలో 22.59 శాతం ఉన్న యాదవులు, ఉద్యోగాలలో 26.72 శాతంతో తమ జనాభా వాటా కంటే ఎక్కువ భాగాన్ని పొందారు. ఆ విధంగా, దామాషాపరంగా యాదవులు ప్రభుత్వ ఉద్యోగాలలో తక్కువ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఓబీసీ గ్రూపులో ఎక్కువ వాటాను పొందటం, వారి జనాభా వాటాను పరిగణనలోకి తీసుకున్నప్ప్పుడు, ప్రభుత్వ ఉద్యోగాలలో వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తుంది.
ఈబీసీలలో కులాల వారి విశ్లేషణ..
ఈబీసీలలో పెద్ద కులాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. వారి జనాభా దామాషాతో సమానంగా లేదా కొంచెం ఎక్కువ స్థాయిలో కానీ ఉద్యోగాలు పొందారు.
ఉదాహరణకు, ఈబీసీలలో తేలి కులం జనాభా వాటా 7.81 శాతం ఉండగా; ఈబీసీ ఉద్యోగులలో 11.49 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ కేటగిరీలో పరిమాణం పరంగా మధ్యస్థ స్థాయిలో ఉన్న కులాలు కూడా మెరుగైన స్థితిలో ఉన్నాయి. దంగీ కులస్తులను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
అయితే, చిన్న కులాలలో అత్యధిక కులాలు ప్రభుత్వ ఉద్యోగం నుంచి దాదాపు విస్మరించబడ్డాయి. భైయార్, ధీమార్, సౌత, భాస్కర్ వంటి అధిక ఉపాధి రేట్లను కలిగి ఉన్న కులాలు కూడా ఈబీసీ ఉద్యోగులలో సున్నా వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి.
ఓబీసీ కేటగిరీలో ఈబీసీలు తమ దామాషా కంటే తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నాయి.
తేలి, చంద్రవంశీ, నాయి వంటి కొన్ని కులాలు తమ జనాభా వాటా కంటే స్వల్పంగా మెరుగైన వాటాను కలిగి ఉండగా, చాలా కులాలు వెనుకబడి ఉన్నాయి. ఓబీసీ ఉద్యోగుల సమూహంలో చిన్న కులాల ప్రాతినిధ్యం తగినంతగా లేకపోవడం గమనార్హం.

కుటుంబ ఆదాయం..
వెనుకబడిన తరగతులు(బీసీలు), అత్యంత వెనుకబడిన తరగతులు(ఈబీసీలు), మొత్తం బీహార్ జనాభాకు సంబంధించిన ఆదాయ పంపిణీ డేటా(పట్టిక 5) అట్టడగు వర్గాలలో పాతుకుపోయిన ఆర్థిక అణచివేతను, సూక్ష్మస్థాయిలకు సంబంధించిన అంతర్గత అంశాలను వెల్లడించింది.
సామాజిక ఆర్థిక సంక్షేమాన్ని తెలియజేసే కుటుంబ ఆదాయ సూచికలో బీసీలు; ఈబీసీలు అత్యల్ప ఆదాయ కేటగిరీలలో ఉండిపోయారు.
ఈబీసీలు అత్యధిక కేటగిరీలలో తీవ్రంగా వెనుకబడి ఉండటం, నిర్మాణాత్మకంగా వారికున్న ప్రతికూలతలను వెల్లడిస్తుంది.
అనువాదం: పి నరసింహారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
